కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. వారికి ఎప్పటికీ సంతానం కలగకపోవడంతో సుప్రతీకుడు చిత్రకూట పర్వతంపై ఆశ్రమం ఏర్పరచుకున్న ఆత్రేయ మహర్షిని ఆశ్రయించి, ఆయన అనుగ్రహంతో దుర్జయుడనే పుత్రుణ్ణి పొందాడు.
దుర్జయుడు అమిత బలవంతుడు. అపార సేనాసంపత్తితో దిగ్విజయయాత్రకు వెళ్లి, సమస్త భూమండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత అష్టదిక్పాలకులను జయించి, విజయగర్వంతో తన రాజ్యానికి తిరిగి బయలుదేరాడు. దారిలో గౌరముఖుడు అనే మహర్షి ఆశ్రమం కనిపించింది. దుర్జయుడు తన సేనలను వెలుపలే నిలిపి, తానొక్కడే ఆశ్రమంలోకి వెళ్లాడు. గౌరముఖుడికి నమస్కరించి, ఆశీర్వచనం కోరాడు. గౌరముఖుడు రాజైన దుర్జయుడికి ఆశీర్వచనం పలికి, అతడికి, అతడి సైన్యానికి ఆతిథ్యం ఇస్తానన్నాడు. దుర్జయుడు ఆశ్చర్యపోయాడు. తనకు, లక్షలాదిమంది తన సైనికులకు ఈ ఒంటరి ముని ఎలా ఆహారం పెట్టగలడా అని ఆలోచించాడు.
ఇంతలో గౌరముఖుడు సంధ్యావందనం ముగించుకుని వస్తానంటూ దగ్గరే ఉన్న గంగానదికి వెళ్లాడు. గంగలో నిలిచి ఆశువుగా శ్రీమన్నారాయణుడిని స్తుతిస్తూ స్తోత్రం పలికాడు. గౌరముఖుడి స్తోత్రం పూర్తి కాగానే, అతడి భక్తిప్రపత్తులకు అమిత ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదాధారిగా ప్రత్యక్షమయ్యాడు. పీతాంబరాలతో దేదీప్యమానంగా మెరిసిపోతున్న స్వామిని చూసి గౌరముఖుడు పులకించిపోయాడు.
‘వత్సా! ఏమి కోరిక’ అడిగాడు శ్రీమన్నారాయణుడు.
‘స్వామీ! నా ఆశ్రమానికి రాజు దుర్జయుడు, అతడి పరివారం వచ్చారు. వారికి ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చాను. వారందరికీ భోజనం పెట్టగలిగేలా నాకు వరమివ్వు చాలు’ అని కోరాడు గౌరముఖుడు. నారాయణుడు అతడికి ఒక దివ్యమణిని ప్రసాదించి, ‘ఈ మణి నువ్వు కోరినవన్నీ ఇస్తుంది’ అని పలికి అదృశ్యమయ్యాడు.
నారాయణుడు ప్రసాదించిన మణితో గౌరముఖుడు తన ఆశ్రమం ఎదుటనే ఇంద్రలోకాన్ని తలపించే మహానగరాన్ని సృష్టించాడు. అందులో రాజు దుర్జయుడికి, అతడి పరివారానికి విలాసవంతమైన విడిది ఏర్పాటు చేశాడు. వారంతా ఆనందంగా ఆ నగరంలోకి ప్రవేశించారు. వారికి సేవలందించడానికి దాసదాసీ జనాన్ని సృష్టించాడు. వారందరికీ షడ్రసోపేతమైన మృష్టాన్న భోజనాన్ని ఏర్పాటు చేశాడు. దుర్జయుడు, అతడి పరివారం సుష్టుగా భోజనం చేసి, వారికి ఏర్పాటు చేసిన విడిది మందిరాల్లో హాయిగా విశ్రమించారు.
మర్నాడు ఉదయం అందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానానికి గంగానదికి వెళ్లారు. వారంతా స్నానాలు చేసి తిరిగి వచ్చేసరికి, అంతకుముందు వరకు ఉన్న నగరం లేదు. అందులోని దాసదాసీ జనం ఎవరూ లేరు. కేవలం గౌరముఖుడి ఆశ్రమం మాత్రమే యథాతథంగా ఉంది. దుర్జయుడు, అతడి పరివారం గౌరముఖుడి దివ్యశక్తికి అమితాశ్చర్యం చెందారు.
రాజు దుర్జయుడు, అతడి పరివారం గౌరముఖుడి వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరారు. కొంత దూరం సాగాక దుర్జయుడు, అతడి పరివారం అటవీమార్గంలో కొద్దిసేపు విశ్రాంతి కోసం ఆగారు. అప్పుడు దుర్జయుడికి ఒక దురాలోచన వచ్చింది. ఆశ్రమంగా పర్ణశాల తప్ప మరేమీ లేని బడుగు ముని అయిన గౌరముఖుడు తనకు, తన సమస్త పరివారానికి రాజోచితమైన ఆతిథ్యం ఎలా ఇచ్చాడో అతడికి అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. వెంటనే వేగులను పిలిచి, ‘మనందరికీ ఆ ముని గౌరముఖుడు ఎలా ఆతిథ్యం ఇవ్వగలిగాడు? దీని వెనుకనున్న మర్మమేమిటి? ఇందులో ఏదైనా మంత్ర మహిమా ప్రభావం ఉందా? అసలు రహస్యాన్ని తెలుసుకుని రండి’ అని పురమాయించి పంపాడు.
రాజాజ్ఞ కావడంతో వేగులు హుటాహుటిన గౌరముఖుడి ఆశ్రమంవైపు బయలుదేరారు. వారు మాటు వేసి గౌరముఖుడి వద్ద ఉన్న మణి మహిమను తెలుసుకున్నారు. తిరిగి వచ్చి, రాజుకు అదే సంగతి చెప్పారు.
‘ఒంటరిగా తపస్సు చేసుకునే మునికి ఎందుకు అంతటి దివ్యమణి? అలాంటిది నావంటి రాజు వద్ద ఉండటమే సమంజసం. ఆ మణిని నాకు ఇవ్వగలడేమో కనుక్కుని రండి’ అంటూ దుర్జయుడు తన భటులను పంపాడు. వారు గౌరముఖుడి వద్దకు వెళ్లి, తమ రాజు ఆ మణిని కోరుతున్న సంగతి చెప్పాడు. గౌరముఖుడు ఆ మణిని ఇవ్వడానికి నిరాకరించాడు. భటులు వెనుదిరిగి, ఈ సంగతిని రాజుకు నివేదించారు.
గౌరముఖుడు తన కోరికను కాదనడంతో దుర్జయుడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే సైన్యాన్ని తీసుకుని గౌరముఖుడి ఆశ్రమాన్ని ముట్టడించాడు. దుర్జయుడు సైన్యంతో వస్తుండటం చూసి, గౌరముఖుడు మణిని చేతిలోకి తీసుకుని శ్రీమన్నారాయణుడిని స్మరించుకున్నాడు. రాజు వల్ల, అతడి సైన్యం వల్ల ఆపదను పోగొట్టాలని ప్రార్థించాడు. ఒక్కసారిగా మణి నుంచి వేలాదిగా సాయుధ సైనికులు ఉద్భవించారు.
వారు దుర్జయుడి సైన్యాన్ని ఎదుర్కొని, చంపిన వాళ్లను చంపి, మిగిలినవాళ్లను తరిమికొట్టారు. కొంత సమయం తర్వాత గౌరముఖుడు యుద్ధరంగానికి వెళ్లి, అక్కడే కూర్చుని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించాడు. ఆయన ప్రత్యక్షమవగానే, దుర్జయుడి ఆగడాన్ని నివారించమని కోరాడు. శ్రీమన్నారాయణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి, దుర్జయుడి శిరసును ఖండించాడు. – సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment