వసుధైక క్రీడోత్సవం: మరింత వేగంగా.. మరింత ఎత్తుకు.. మరింత బలంగా.. | Funday Cover Story On The Hosting Of The 2024 Paris International Olympics | Sakshi
Sakshi News home page

వసుధైక క్రీడోత్సవం: మరింత వేగంగా.. మరింత ఎత్తుకు.. మరింత బలంగా..

Published Sun, Jul 21 2024 1:22 AM | Last Updated on Sun, Jul 21 2024 8:25 AM

Funday Cover Story On The Hosting Of The 2024 Paris International Olympics

పారిస్‌ నగరం పగలు పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌లా, రాత్రి షాంపేన్‌ బాటిల్‌లా కనిపిస్తుందంటారు. ఇప్పుడు మాత్రం పగలు, రాత్రి తేడా లేకుండా ఒలింపిక్‌మయంగా మారిపోతోంది. ఫ్రెంచ్‌ వైన్‌ను మించిన స్పోర్ట్స్‌ మత్తులో నగరం మునిగిపోతోంది. 100 ఏళ్ల తర్వాత తమ ఇంట్లో జరగబోతున్న పండగతో సీన్‌ నదీ తీరమంతా క్రీడా సందడికి కేరాఫ్‌గా నిలుస్తోంది.

రాబోయే కొన్ని రోజుల పాటు అక్కడ కలలు రెక్కలు విప్పుకుంటాయి. ఆశలు, అంచనాలు ఈఫిల్‌ టవర్‌ను  తాకుతాయి. ఫ్యాషన్‌ స్ట్రీట్‌లో కూడా పతకాలు, పతాకాల గురించే చర్చ సాగుతుంది. గెలిచే మెడల్‌కు ఫ్రెంచ్‌ ముద్దుతోనే మురిపెం. ఒక్కసారి ఆడితే చాలు అదృష్టంగా భావించేవారు, ఒక్క పతకం గెలిస్తే చాలనుకునేవారు, కనకం కొడితే జన్మ ధన్యమైనట్లుగా సంబరపడేవారు, మళ్లీ మళ్లీ గెలిచి సగర్వంగా శిఖరాన నిలిచేవారు, అందరూ ఇక్కడే కలసిపోతారు. సంబరాలు, కన్నీళ్లు, ఆనందబాష్పాలు, భావోద్వేగాలు అన్నీ ఒక్కచోటే కనిపిస్తాయి.

జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు, జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు క్రీడాకారుల గుండె లోతుల్లో పొంగే భావనను లెక్కకట్టేందుకు ఎలాంటి కొలమానాలు సరిపోవు. ఔను! సమస్త క్రీడా జాతిని ఏకం చేసే మెగా  ఈవెంట్‌కు సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకే కాదు, అభిమానులకు కూడా ఆనందానుభూతి పంచేందుకు విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. ప్రఖ్యాత పారిస్‌ నగరంలో 2024 ఒలింపిక్స్‌కు ఈనెల 26న తెర లేవనుంది.

5 నగరాల నుంచి..
2024 ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వేర్వేరు నగరాల నుంచి 2015 సెప్టెంబర్‌లోనే బిడ్‌లను ఆహ్వానించింది. ఒలింపిక్స్‌ ప్రణాళికలు, భిన్నమైన రీతిలో నిర్వహణ, వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, వేదికకు కావాల్సిన ఆర్థిక పుష్టి, గతానుభవం, ఆ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు తదితర అంశాలను దృష్టిలోకి తీసుకుంటూ బిడ్‌లను కోరారు. పారిస్‌ (ఫ్రాన్స్‌), లాస్‌ ఏంజెలిస్‌ (అమెరికా), బుడాపెస్ట్‌ (హంగరీ), హాంబర్గ్‌ (జర్మనీ), రోమ్‌ (ఇటలీ) నగరాలు తుది జాబితాలో నిలిచాయి. 

అయితే ఆర్థిక కారణాలతో మూడు నగరాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రోమ్, హాంబర్గ్‌ నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగగా, ఎక్కువమంది ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా ఓటింగ్‌ చేశారు. బుడాపెస్ట్‌లో అయితే ఒలింపిక్స్‌ జరిగితే ఆర్థికంగా చితికిపోతామంటూ అన్ని ప్రతిపక్ష పార్టీలు ‘నో ఒలింపిక్స్‌’ పేరుతో ఉద్యమమే నడిపించాయి. దాంతో చివరకు పారిస్, లాస్‌ ఏంజెలిస్‌ మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో ఐఏసీ 2024కే కాకుండా 2028 కోసం కూడా బిడ్‌ను ఖాయం చేసేందుకు సిద్ధమైంది. దాంతో లాస్‌ ఏంజెలిస్‌ వెనక్కి తగ్గి తాము 2028లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తామంటూ స్పష్టం చేయడంతో 2017 జూలైలో పారిస్‌కు గేమ్స్‌ ఖాయమయ్యాయి.

రూ. 40 వేల కోట్లతో...
పారిస్‌ నగరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 1900 (రెండో ఒలింపిక్స్‌), 1924 (ఎనిమిదో ఒలింపిక్స్‌) కూడా ఇక్కడే జరిగాయి. ఒలింపిక్స్‌కు రెండుసార్లు నిర్వహించిన తొలి నగరంగా పారిస్‌ గుర్తింపు పొందింది. 2024 క్రీడల కోసం అక్షరాలా 4.38 బిలియన్‌ యూరోలు (సుమారు రూ. 40 వేల కోట్లు) కేటాయించారు. ఇదంతా 100 శాతం ప్రైవేట్‌ ఫండింగ్‌ కావడం విశేషం. ఇందులో టీవీ రైట్స్, టికెట్ల అమ్మకం, హాస్పిటాలిటీ, లైసెన్సింగ్, ఇతర భాగస్వామ్యపు ఒప్పందాలు కలసి ఉన్నాయి.

ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఎలాంటి సహకారం లేకుండా ఈ ఒలింపిక్స్‌ జరగనున్నాయి. అయితే సహజంగానే ఒలింపిక్స్‌ నిర్వహణ అంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, క్రీడల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, స్టేడియాలు ఆ తర్వాత పనికి రాకుండా పోయి వృథాగా పడి ఉండటం గత కొన్ని ఒలింపిక్స్‌లుగా చూస్తూనే ఉన్నాం. దాంతో ఆర్థిక భారం అంశంపై ఈసారి బాగా చర్చ జరిగింది. అయితే పారిస్‌లో ఈసారి ఒలింపిక్స్‌ నిర్వహణ నష్టదాయకం కాదని, ఆర్థిక సమస్యలను తట్టుకోగలిగే శక్తి ఉందని పలు తాజా నివేదికలు వెల్లడించాయి.

ముఖ్యంగా ఒలింపిక్స్‌ జరిగే సమయంలో పారిస్‌కు చాలా పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకుల కారణంగా నగరానికి మంచి ఆదాయం రానుందనేది అంచనా. పారిస్‌ ప్రాంతానికి కనీసం 6.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 56 వేల కోట్లు) వరకు ఆర్థిక ప్రయోజనాలు కలగవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఎలా చూసినా ఒలింపిక్స్‌ నిర్వహణ లాభదాయకమే తప్ప నష్టం లేదని నిర్వహణా కమిటీ ఘంటాపథంగా చెబుతోంది.

టార్చ్‌తో మొదలు..
క్రీడల్లో ఒలింపిక్‌ జ్యోతికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఒలింపిక్‌ ఉద్యమానికి ఇది సూచిక. ప్రాచీన గ్రీకురాజ్యంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దీనిని ఒలింపిక్స్‌ వరకు తీసుకొచ్చారు. ఏథెన్స్‌ సమీపంలోని ఒలింపియాలో సూర్యకిరణాల ద్వారా ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించడం ప్రతి ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు జరిగే ప్రక్రియ. అక్కడ వెలిగిన జ్యోతితో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ద్వారా టార్చ్‌ రిలే కొనసాగుతుంది. శాంతి, స్నేహ సంబంధాల సందేశం ఇవ్వడం ఈ ఒలింపిక్‌ టార్చ్‌ ప్రధాన ఉద్దేశం.

1936 బెర్లిన్‌ ఒలింపిక్స్‌లో మొదటిసారి దీనిని వాడారు. తర్వాతి రోజుల్లో ఆతిథ్య దేశం ఆలోచనలు, వారి సంస్కృతికి అనుగుణంగా టార్చ్‌ల నమూనాలను రూపొందించడం సంప్రదాయంగా మారింది. క్రీడలు జరిగినన్ని రోజులు ఒలింపిక్‌ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. మెగా ఈవెంట్‌ ముగిసిన తర్వాత దానిని ఆర్పేస్తారు. సాధారణంగా ఆయా దేశపు ప్రముఖ లేదా మాజీ క్రీడాకారులు ఒలింపిక్‌ టార్చ్‌ అందుకొని రిలేలో పాల్గొంటారు. పారిస్‌ ఒలింపిక్స్‌కు సంబంధించి 10 వేల మంది టార్చ్‌ బేరర్లతో 400 నగరాల గుండా ఈ జ్యోతి ప్రయాణించింది.

మస్కట్, లోగో..
పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం ‘ఫ్రీ జీ’ పేరుతో అధికారిక మస్కట్‌ను విడుదల చేశారు. ప్రాచీన ఫ్రెంచ్‌ సంప్రదాయ టోపీని ‘ఫ్రీజీ’గా వ్యవహరిస్తారు. ఆ దేశపు చరిత్ర ప్రకారం దీనిని ఒక టోపీగా మాత్రమే చూడరు. ఆ దేశపు స్వేచ్ఛకు సంకేతంగా భావిస్తారు. దీనికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఫ్రెంచ్‌ విప్లవం సమయంలో విప్లవకారులంతా ఇలాంటి టోపీలనే ధరించారు.

ఫ్రాన్స్‌ దేశపు రోజువారీ వ్యవహారాల్లో ఈ ‘ఫ్రీజీ’ టోపీ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రాన్స్‌ జాతీయ పతాకంలోని రంగులైన ఎరుపు, నీలం, తెలుపు ఇందులో కనిపిస్తాయి. ఒలింపిక్స్‌కు సంబంధించిన డిజైనింగ్‌ టీమ్‌ దీనిని రూపొందించింది. ఒలింపిక్‌ జ్యోతిని బంగారపు రంగులో ప్రదర్శిస్తూ పారిస్‌ 2024 లోగోను తయారుచేశారు. ‘విడిగా మనం వేగంగా వెళ్లవచ్చు. కానీ కలసికట్టుగా మరింత ముందుకు పోవచ్చు’ అనేది ఈ ఒలింపిక్స్‌ మోటోగా నిర్ణయించారు.

కొత్తగా ఆడుదాం..
ఒలింపిక్స్‌లో కొత్త క్రీడాంశాలను ప్రోత్సహించడం సంప్రదాయంగా వస్తోంది. అప్పటికే బాగా గుర్తింపు పొందిన ఆటలతో పాటు ఇలాంటి కొత్త క్రీడలు కొత్త తరం క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పనికొస్తాయని ఐఓసీ ఉద్దేశం. మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలకు కొత్త క్రీడల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పారిస్‌ ఒలింపిక్స్‌లో కొత్తగా ఒక క్రీడాంశాన్ని ప్రవేశపెట్టారు.

బ్రేకింగ్‌: 1970ల నుంచి అమెరికా సంస్కృతిలో భాగంగా ఉన్న డాన్స్‌లలో ఒక భాగం ఇది. సరిగ్గా చెప్పాలంటే మన దగ్గర సినిమాల ద్వారా బాగా పాపులర్‌ అయిన బ్రేక్‌ డాన్స్‌ రూపమిది. శారీరక కదలికలు, ఫుట్‌వర్క్‌లో స్టయిల్‌ తదితర అంశాలతో పాయింట్లు కేటాయిస్తారు. 1990 నుంచి ఇందులో పోటీలు జరుగుతున్నా ఒలింపిక్స్‌కు చేరేందుకు ఇంత సమయం పట్టింది. 2018 యూత్‌ ఒలింపిక్స్‌లో దీనికి మంచి స్పందన లభించడంతో ఇప్పుడు ఒలింపిక్స్‌లో చేర్చారు.

అమెరికాదే హవా... దీటుగా చైనా..
1061 స్వర్ణాలు, 830 రజత పతకాలు, 738 కాంస్యాలు... మొత్తం 2629 పతకాలు... ఒలింపిక్స్‌ చరిత్రలో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) అసాధారణ ఘనత ఇది. 1896లో తొలి ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా నాటి నుంచి ఇప్పటి వరకు తమ హవా కొనసాగిస్తూనే ఉంది. ఎన్నెన్నో అద్భుత ప్రదర్శనలు, ప్రపంచ రికార్డు ప్రదర్శనలు అన్నీ అలవోకగా అమెరికా ఆటగాళ్ల నుంచి వచ్చాయి.

ముఖ్యంగా అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్‌ వంటి క్రీడల్లోనైతే ఇతర దేశాల ఆటగాళ్లు రెండో స్థానం కోసం పోటీ పడేందుకే బరిలోకి దిగాల్సిన పరిస్థితి. ఇతర జట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడం అగ్ర రాజ్యానికే చెల్లింది. ఒలింపిక్స్‌లో నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థి జట్లను ఒక ఆటాడుకోవడం అమెరికా ఆటగాళ్లకు అలవాటైన విద్య.

ఎప్పుడో పుష్కరానికోసారి ఒక చిన్న సంచలనం, కాస్త ఏమరుపాటుతో కొన్నిసార్లు వెనుకబడినా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి మొత్తంగా అమెరికన్లకు తిరుగులేదు. అన్ని రకాలుగా క్రీడలకు ప్రోత్సాహం, సరైన వ్యవస్థ, ప్రొఫెషనల్‌ దృక్పథం, అభిమానుల మొదలు కార్పొరేట్‌ల వరకు అన్ని ఆటలకు అండగా నిలిచే తత్వం, సుదీర్ఘ కాలంగా క్రీడలు అక్కడి జీవితంలో ఒక భాగంగా మారిపోవడంవంటివి అమెరికా ముందంజకు ప్రధాన కారణాలు.

మరోవైపు చైనా కూడా అమెరికాకు దాదాపు సమఉజ్జీగా నిలుస్తోంది. పతకాల్లో పోటీ పడుతూ రెండో స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఇన్నేళ్ల ఒలింపిక్స్‌ ఓవరాల్‌ జాబితాలో 263 స్వర్ణాలు సహా 636 పతకాలతో చైనా ఐదో స్థానంలో కనిపిస్తోంది. అయితే 2004 ఒలింపిక్స్‌ వరకు చైనా ఖాతాలో పెద్దగా పతకాలు లేకపోవడమే ఐదో స్థానానికి కారణం.

2008లో చైనా సొంతగడ్డ బీజింగ్‌లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నాటి నుంచి ఆ దేశపు క్రీడా ముఖచిత్రమే మారిపోయింది. 2008–2020 మధ్య జరిగిన నాలుగు ఒలింపిక్‌ క్రీడల్లో చైనా 3 సార్లు రెండో స్థానంలో నిలిచి, ఒకసారి మూడో స్థానంతో ముగించింది. ఇది క్రీడా ప్రపంచంలో వచ్చిన మార్పునకు సంకేతం. కొత్త తరహా శిక్షణ, ప్రణాళికలతో 2008 కోసం ప్రత్యేక వ్యూహాలతో ఒలింపిక్స్‌కు సిద్ధమైన చైనా ఆ తర్వాత తమ జోరును కొనసాగిస్తూ వచ్చింది. భిన్న క్రీడాంశాల్లో అమెరికాతో సై అంటే సై అంటూ పోటీ పడుతోంది.

  • ఆధునిక ఒలింపిక్స్‌లో జేమ్స్‌ బ్రెండన్‌ బెనిట్‌ కొనలీ తొలి విజేతగా నిలిచాడు. అతడు ట్రిపుల్‌ జంప్‌లో ఈ విజయం సాధించాడు. హార్వర్డ్‌ విద్యార్థి అయిన కొనలీ సెలవు తీసుకుని ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అయితే, అనుమతి లేకుండా క్రీడా పోటీల్లో పాల్గొన్నందుకు హార్వర్డ్‌ వర్సిటీ అతడికి ఉద్వాసన పలికింది.

  • తొలిసారిగా 1900లో జరిగిన ఒలింపిక్‌ క్రీడల పోటీల్లో మహిళలకు అవకాశం లభించింది. ఆ ఒలింపిక్స్‌లో 22 మంది మహిళలు పాల్గొన్నారు. అప్పటికి ఇంకా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కూడా రాలేదు. నానా పోరాటాల తర్వాత అమెరికాలో మహిళలకు 1920లో ఓటు హక్కు దక్కింది.

  • ఆధునిక ఒలింపిక్స్‌లో 1896, 1900 సంవత్సరాల్లో పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు రజత, కాంస్య పతకాలను మాత్రమే బహూకరించేవారు. అప్పట్లో మూడో బహుమతి ఉండేది కాదు. అయితే, 1904 నుంచి ప్రతి పోటీలోనూ ముగ్గురు విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను బహూకరించే ఆనవాయితీ మొదలైంది.

  • ఒలింపిక్స్‌ సహా సమస్త క్రీడా కార్యక్రమాలను ఇప్పుడు టీవీల్లో చూడగలుగుతున్నాం. రోమ్‌లో 1960లో జరిగిన ఒలింపిక్స్‌ తొలిసారిగా టీవీలో ప్రసారమయ్యాయి. అప్పటి వరకు ఒలింపిక్స్‌ విశేషాలను తెలుసుకోవడానికి పత్రికలే ఆధారంగా ఉండేవి.

ఈఫిల్‌ టవర్‌ ఇనుముతో...
ఒలింపిక్స్‌లో అన్నింటికంటే ఉద్వేగభరిత క్షణం విజేతలకు పతక ప్రదానం. ఏళ్ల శ్రమకు గుర్తింపుగా దక్కే స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో నిర్వాహకులు ప్రతిసారీ తమదైన ప్రత్యేకతను, భిన్నత్వాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా స్వర్ణపతకంలో బంగారం చాలా చాలా తక్కువ. ఇందులో 92.5 శాతం వెండిని వాడతారు. కేవలం 1.34 శాతమే బంగారం ఉంటుంది. 

అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిబంధనల ప్రకారం కనీసం 6 గ్రాముల బంగారం ఇందులో ఉండాలి. రజత పతకంలో దాదాపు అంతా వెండి ఉంటుండగా, కంచు పతకంలో 95 శాతం రాగిని వాడతారు. ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత ఉంది. తమ దేశంలో జరిగే ఒలింపిక్స్‌ పతకాలను భిన్నంగా రూపొందించాలనే ఆలోచనతో నిర్వాహకులు కొత్తగా ఆలోచించారు.

ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ నిర్మాణంలో ఉపయోగించిన అసలైన ఇనుమును పతకాల్లో చేర్చాలని నిర్ణయించారు. ఇన్నేళ్లలో ఈఫిల్‌ టవర్‌ను ఎన్నోసార్లు ఆధునికీకరించారు. ఈ క్రమంలో కొంత ఇనుమును పక్కన పెడుతూ వచ్చారు. ఇప్పుడు అందులోనుంచే చిన్న చిన్న ముక్కలను తాజా పతకాలలో చేర్చారు. గుండ్రటి పతకం మధ్య భాగంలో ఈ ఇనుమును పారిస్‌ 2024 లోగోతో కలిపి షడ్భుజాకారంలో ఉంచారు. ఎప్పటిలాగే వెనుక భాగంలో గ్రీకు విజయదేవత ఏథెనా నైకీ, ఆక్రోపొలిస్‌ భవనంతో పాటు మరో చివర ఈఫిల్‌ టవర్‌ కనిపిస్తుంది.

10+9+16=35 ఒలింపిక్స్‌లో భారత పతకాల రికార్డు..
1900లో జరిగిన రెండో ఒలింపిక్స్‌ (పారిస్‌)లో భారత్‌ తొలిసారి బరిలోకి దిగింది. వ్యక్తిగత విభాగంలో ఏకైక అథ్లెట్‌ నార్మన్‌ ప్రిచర్డ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వేర్వేరు కారణాలతో తర్వాతి మూడు ఒలింపిక్స్‌కు భారత్‌ దూరంగా ఉండగా, 1920లో ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, రెజ్లింగ్‌లలో కలిపి ఐదుగురు క్రీడాకారులు బరిలోకి దిగగా, వ్యాపారవేత్త దొరాబ్జీ టాటా తదితరులు ఆర్థిక సహాయం అందించారు. అప్పటి నుంచి మన దేశం వరుసగా ప్రతీ ఒలింపిక్స్‌లో పాల్గొంటూ వచ్చింది.

  • ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీ అత్యధిక పతకాలు తెచ్చి పెట్టింది. జట్టు ఏకంగా 8 స్వర్ణాలు గెలిచింది. మన స్వర్ణయుగంగా సాగిన కాలంలో 1928–1956 మధ్య వరుసగా ఆరు స్వర్ణాలు సాధించిన టీమ్‌ 1960లో రజతం; 1968, 1972, 2020లలో కాంస్యం గెలుచుకుంది.

  • 1900 ఒలింపిక్స్‌లో నార్మన్‌ ప్రిచర్డ్‌ పురుషుల 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో 2 రజతాలు సాధించాడు. ప్రిచర్డ్‌ జాతీయతపై కాస్త వివాదం ఉండటంతో అతను గెలుచుకున్న పతకాలు భారత్‌ ఖాతాలో వస్తాయా రావా అనేదానిపై చర్చ జరిగింది. అతను పాత బ్రిటిష్‌ కుటుంబానికి చెందిన వాడు కాబట్టి తమవాడే అనేది బ్రిటన్‌ చరిత్రకారుల వాదన.

  • 1900 ఒలింపిక్స్‌కు ముందు లండన్‌లో జరిగిన ఏఏఏ చాంపియన్‌షిప్స్‌లో ప్రదర్శన ఆధారంగానే ఎంపికయ్యాడు కాబట్టి అతను ఇంగ్లిష్‌వాడే అనేది వారు చెప్పే మాట. అయితే ప్రిచర్డ్‌ కోల్‌కతాలో పుట్టడంతో పాటు సుదీర్ఘ కాలం భారత్‌లోనే గడిపాడు కాబట్టి భారతీయుడే అనేది మరో వాదన. అయితే 1900 క్రీడల్లో గ్రేట్‌ బ్రిటన్‌ టీమ్‌ కూడా బరిలోకి దిగింది. వారి తరఫున కాకుండా భారత్‌ తరఫున ఆడాడు కాబట్టి భారతీయుడే! చివరకు ఐఓసీ తమ పతకాల జాబితాలో ప్రిచర్డ్‌ రెండు రజతాలు భారత్‌ ఖాతాలోనే వేసి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.

  • స్వతంత్ర భారతంలో తొలి పతకం 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో ఖాషాబా దాదాసాహెబ్‌ జాదవ్‌ (రెజ్లింగ్‌) గెలుచుకున్నాడు. హాకీ కాకుండా వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.

ఒలింపిక్స్‌లో భారత పతక వీరులు...
హాకీ 12..
8 స్వర్ణాలు 
(1928 ఆమ్‌స్టర్‌డామ్, 
1932 లాస్‌ ఏంజెలిస్, 
1936 బెర్లిన్‌; 
1948 లండన్‌; 1952 హెల్సింకీ, 1956 మెల్‌బోర్న్‌; 1964 టోక్యో, 
1980 మాస్కో)
1 రజతం 
(1960 రోమ్‌)
3 కాంస్యాలు 
(1968 మెక్సికో, 1972 మ్యూనిక్, 2020 టోక్యో)

షూటింగ్‌ 4..
1 స్వర్ణం 
(అభినవ్‌ బింద్రా; 
2008 బీజింగ్‌)
2 రజతాలు 
(రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌; 2004 ఏథెన్స్‌... 
విజయ్‌కుమార్‌; 
2012 లండన్‌), 
1 కాంస్యం 
(గగన్‌ నారంగ్‌; 
2012 లండన్‌)

అథ్లెటిక్స్‌3..
1 స్వర్ణం 
(నీరజ్‌ చోప్రా; 2020 టోక్యో)
2 రజతాలు 
(నార్మన్‌ ప్రిచర్డ్‌; 1900 పారిస్‌)

రెజ్లింగ్‌ 7..
2 రజతాలు (సుశీల్‌ కుమార్‌; 2012 లండన్‌... రవి కుమార్‌ దహియా; 2020 టోక్యో)
5 కాంస్యాలు (ఖాషాబా జాదవ్‌; 1952 హెల్సింకీ... సుశీల్‌ కుమార్, యోగేశ్వర్‌ దత్‌; 2012 లండన్‌... సాక్షి మలిక్‌; 2016 రియో... బజరంగ్‌ పూనియా; 2020 టోక్యో)

బాక్సింగ్‌ 3..
3 కాంస్యాలు 
(విజేందర్‌; 2008 బీజింగ్‌... మేరీ కోమ్‌; 2012 లండన్‌... లవ్లీనా బొర్గోహైన్‌; 2020 టోక్యో)

బ్యాడ్మింటన్‌ 3..
1 రజతం (పీవీ సింధు; 2016 రియో)
2 కాంస్యాలు (సైనా నెహ్వాల్‌; 2012 లండన్, సింధు; 2020 టోక్యో)

వెయిట్‌ లిఫ్టింగ్‌ 2..
1 రజతం (మీరాబాయి చాను; 2020 టోక్యో)
1 కాంస్యం (కరణం మల్లీశ్వరి; 2000 సిడ్నీ)

టెన్నిస్‌ 1..
1 కాంస్యం (లియాండర్‌ పేస్‌; 1996 అట్లాంటా)

మనం ఎక్కడున్నాం?
71, 71, 65, 50, 55, 67, 48... అట్లాంటాలో జరిగిన 1996 ఒలింపిక్స్‌ నుంచి టోక్యోలో జరిగిన 2020 ఒలింపిక్స్‌ వరకు పతకాల పట్టికలో భారత్‌ స్థానమిది. గత పోటీల్లోనైతే నీరజ్‌ చోప్రా ప్రదర్శనతో ఒక స్వర్ణపతకం చేరిన తర్వాత కూడా మనం 48వ స్థానానికే పరిమితమయ్యాం. అగ్రరాజ్యాల సంగతి సరే; చెక్‌ రిపబ్లిక్, క్రొయేషియా, స్లొవేనియా, ఉజ్బెకిస్తాన్, జార్జియా, ఉగాండా, ఈక్వెడార్, బహామాస్, కొసవో, బెలారస్‌ దేశాలు కూడా పతకాల పట్టికలో మనకంటే ముందు నిలిచాయి. ఈ ప్రదర్శన చూసి నిరాశ చెందాలో, లేక 1996కు ముందు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా లేకుండా సున్నా చుట్టి అసలు ఏ స్థానమూ సాధించని స్థితి నుంచి మెరుగయ్యామో అర్థం కాని పరిస్థితి.

వ్యక్తిగత క్రీడాంశంలోనైతే 1956 నుంచి 1992 వరకు భారత్‌కు ఒక్క పతకమూ రాలేదంటే ఆటల్లో మన సత్తా ఏపాటిదో అర్థమవుతుంది. క్రికెట్‌లో విశ్వ విజేతలుగా నిలుస్తున్నా, ఇతర క్రీడాంశాలకు వచేసరికి భారత్‌ వెనుకబడిపోతూనే ఉంది. ఇక ఒలింపిక్స్‌ వచ్చే సమయానికి కాస్త హడావిడి పెరిగినా, చాలామంది క్రీడాకారులకు అది పాల్గొనాల్సిన లాంఛనమే తప్ప కచ్చితంగా పతకాలతో తిరిగి రాగలరనే నమ్మకం ఉండటం లేదు.

అభిమానుల కోణంలో చూసినా సరే మెగా పోటీలు మొదలైన తొలిరోజు నుంచి పతకాల జాబితాలో మన వంతు ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం అలవాటుగా మారిపోయింది. 1900 ఒలింపిక్స్‌లో ఒకే వ్యక్తిని పంపడం మినహాయిస్తే, 1920 నుంచి రెగ్యులర్‌గా మన ఆటగాళ్లు పోటీల్లో పాల్గొంటున్నారు. అంటే 2020 టోక్యో ఒలింపిక్స్‌తో భారత్‌ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్యాలతో భారత్‌ మొత్తం 35 పతకాలు గెలుచుకోగలిగింది. ఓవరాల్‌గా ఒలింపిక్స్‌ చరిత్రలో పతకాలు గెలిచిన జట్ల జాబితాను చూస్తే భారత్‌ 56వ స్థానంలో ఉంది.

ఒలింపిక్స్‌ సమయంలో మినహా...
‘నా దృష్టిలో ఇది 1000 స్వర్ణాలతో సమానం. ఇంకా చెప్పాలంటే అది కూడా తక్కువే!’– 2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ సాక్షి మలిక్‌ కాంస్యం గెలిచినప్పుడు భారత స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ చేసిన ట్వీట్‌ ఇది. నిజానికి ఇది ఆ ప్లేయర్‌ను అభినందించినట్లుగా ఉంది. కానీ దేశమంతా అభిమానించే ఒక నటుడు ఈ విజయాన్ని అంత గొప్పగా చెబుతున్నాడంటే మనం ఎంత అల్పసంతోషులమో చూపిస్తోంది. భారత ఆటగాళ్లు అప్పుడప్పుడూ సాధించే ఘనతలకు ఆకాశమంత గుర్తింపు దక్కుతుంది.

ఆ సమయంలో సాగే హంగామా చూస్తే భారత్‌ ప్రపంచ క్రీడా వేదికపై అద్భుతాలు చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఒలింపిక్స్‌ సమయంలో మినహా మిగతా రోజుల్లో ఆయా క్రీడలపై చాలా మందికి కనీస ఆసక్తి కూడా ఉండదు. ఇలాంటి వాతావరణమే క్రికెటేతర క్రీడల్లో భారత్‌ ఎదుగుదలకు అడ్డంకిగా నిలుస్తోంది. ఇటీవల భారత్‌ టి20 వరల్డ్‌ కప్‌ గెలిచినప్పుడు మహారాష్ట్రకు చెందిన నలుగురు ఆటగాళ్లకు అక్కడి ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు పురస్కారాన్ని అందించింది. కానీ అంతర్జాతీయ వేదికపై ఎన్నో విజయాలు సాధిస్తున్న తనను కనీసం పట్టించుకోలేదని భారత బ్యాడ్మింటన్‌ ఆటగాడు చిరాగ్‌ శెట్టి బహిరంగంగానే విమర్శించడం చూస్తే ప్రభుత్వాల ప్రాధాన్యం ఏమిటో స్పష్టమవుతుంది.

క్రీడా సంస్కృతి లేకపోవడం వల్లే...
ఆటల్లోనూ అగ్రరాజ్యంగా నిలిచే అమెరికాలో క్రీడా మంత్రిత్వశాఖ అనేదే లేదు. క్రీడలకు ఒక మంత్రి కూడా లేడు. ఆశ్చర్యం అనిపించే వాస్తవమిది. క్రీడాకారులను తయారు చేయడంలో అక్కడి ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు. మరి ఇంత గొప్ప అథ్లెట్లు ఎక్కడి నుంచి, ఎలా పుట్టుకొస్తున్నారని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.

స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు, కొందరు పెద్ద పారిశ్రామికవేత్తలు ఆటలను ప్రోత్సహించేందుకు అండగా నిలుస్తున్నారు. వారికి కొన్ని పన్ను రాయితీలు ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. అక్కడ స్కూల్స్, కాలేజీలు, స్థానిక పార్కుల్లోనే ఆటగాళ్లు తయారవుతారు. ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించేవారిలో 80 శాతం మంది తమ నేషనల్‌ కాలేజియేట్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ (ఎన్‌సీఏఏ) నుంచే వస్తారంటూ ఆ సంస్థ సగర్వంగా ప్రకటించింది.

అమెరికాలో ప్రతి పార్కుకూ అనుబంధంగా తప్పనిసరిగా అథ్లెటిక్‌ ఫీల్డ్‌లు ఉంటాయి. మన దగ్గర అసలు ఇలాంటివి ఊహించగలమా? ఎక్కడో దూరం వరకు ఎందుకు, స్థానికంగా మన పాఠశాలల్లో చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. పెద్ద సంఖ్యలో స్కూళ్లలో కనీసం గ్రౌండ్‌లు కూడా లేని పరిస్థితి ఉంది.

భవిష్యత్తుపై నమ్మకం లేక...
ఒలింపిక్స్‌లో సత్తా చాటి భారత్‌ తరఫున పతకం సాధించిన గుప్పెడు మందిని చూస్తే వారందరి విషయంలో ఒకే సారూప్యత కనిపిస్తుంది. దాదాపు అందరూ ఎన్నో ప్రతికూలతలను దాటి సొంతంగా పైకి ఎదిగినవారే! కెరీర్‌ ఆరంభంలో, వేర్వేరు వయో విభాగాలకు ఆడే దశల్లో ఎలాంటి సహకారం లభించలేకపోయినా, మొండిగా తమ ఆటను నమ్ముకొని వ్యక్తిగత ప్రతిభతో దూసుకొచ్చినవారే!

వ్యవస్థ తయారు చేసిన క్రీడాకారుడు అంటూ ఒక్కరి గురించి కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మన దగ్గర అలాంటి అవకాశమే లేదు. గెలిచాక అభినందనలు, పోటీగా బహుమతులు, కనకవర్షం కురిపించడం సాధారణమే అయినా, అసలు సమయంలో అవసరం ఉన్నప్పుడు ఎవరూ వారిని పట్టించుకోలేదు. ఏ కార్పొరేట్‌ కంపెనీ కూడా స్పాన్సర్‌షిప్‌ ఇచ్చి ఆదుకోలేదు. సరిగ్గా ఇదే అంశం తమ పిల్లలను క్రీడాకారులుగా మార్చడంలో సగటు భారతీయులను వెనక్కి నెడుతుంది.

క్రీడల్లో సఫలమై ఏ స్థాయి వరకు చేరతారనే దానిపై ఎలాంటి గ్యారంటీ లేదు. కోచింగ్, ప్రాక్టీస్, ఎక్విప్‌మెంట్‌– ఇలా చాలా అంశాలు భారీ ఖర్చుతో ముడిపడి ఉంటాయి. ఎంత కష్టపడినా ఫలితాలు దక్కకపోవచ్చు కూడా. ఈ అనిశ్చితి వల్ల క్రీడలను కెరీర్‌గా చూడటం కష్టంగా మారిపోయింది. అందుకే దాదాపు అందరూ తమ పిల్లలు బాగా చదువుకుంటే చాలనే ఆలోచనతో దానిపైనే దృష్టి పెడుతున్నారు. మనవాళ్ల ప్రాధాన్యాల జాబితాలో క్రీడలు ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉంటాయి. ఎదుటివారి విజయాలకు చప్పట్లు కొట్టి అభినందించడమే తప్ప తమ పిల్లలను క్రీడల్లోకి పంపే సాహసం చేయడం లేదు. ఆటలు ఆడితే లాభం లేదనే సంస్కృతి మన జీవితాల్లో ‘ఖేలోగే కూదోగే తో హోంగే ఖరాబ్‌. పఢోగే లిఖోగే తో బనోగే నవాబ్‌’లాంటి మాటలతో నిండిపోయింది.

సౌకర్యాలు కల్పించకుండా...
‘మేం ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కోసం ఎంత ఖర్చు చేశామో తెలుసా? అక్షరాలా 45 లక్షల పౌండ్లు’ 2012 లండన్‌ ఒలింపిక్స్‌ తర్వాత బ్రిటిష్‌ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్య ఇది. అంటే భారత కరెన్సీలో అప్పట్లోనే ఇది దాదాపు రూ. 38 కోట్లు. పతకమే లక్ష్యంగా ఆటగాళ్లకు కల్పించిన సౌకర్యాలు, అభివృద్ధి చేసిన క్రీడా సదుపాయాలు, డైట్, ఫిట్‌నెస్‌ వంటి అన్ని అంశాలూ ఇందులో కలసి ఉన్నాయి. అలా చూస్తే మన దేశంలో ఇలాంటిది సాధ్యమా? మన వద్ద గెలిచి వచ్చిన తర్వాత ఇంత మొత్తం ఆటగాళ్లకు ఇస్తారేమో గాని, గెలిచేందుకు కావాల్సిన వాతావరణాన్ని అందించే ప్రయత్నం మాత్రం చేయరు. భారతదేశ జనాభా దాదాపు 141.72 కోట్లు. ప్రపంచంలో మొదటి స్థానం.

టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత్‌ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 7 మాత్రమే. దేశ జనాభా, గెలుచుకున్న పతకాలను లెక్క గట్టి సగటు చూస్తే అన్ని దేశాల్లోకి అత్యంత చెత్త ప్రదర్శన మనదే! నిజానికి జనాభాను బట్టి పతకాలు గెలుచుకోవాలనే లెక్క ఏమీ లేదు గాని, సహజంగానే ఇది చర్చనీయాంశం. చాలా తక్కువ మంది మాత్రమే ఆటల వైపు వెళ్లుతున్నారనేది వాస్తవం. వీరిలో అన్ని దశలను దాటి ఒలింపిక్స్‌ వరకు వెళ్లగలిగేవారు చాలా తక్కువ మంది మాత్రమే! 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి మొత్తం 126 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. మనం గెలుచుకున్న 7 పతకాలే ఇన్నేళ్లలో మన అత్యుత్తమ ప్రదర్శన. అమెరికా తరహాలో కార్పొరేట్లు పెద్ద ఎత్తున అండగా నిలవడం ఇక్కడ సాధ్యం కావడం లేదు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచే క్రీడల అభివృద్ధికి తొలి అడుగు పడాలనేది వాస్తవం.

మన పేలవ ప్రదర్శనకు కారణాలను ఎంచడం చూస్తే వాటికి పరిమితి ఉండదు. ఒలింపిక్స్‌ స్థాయికి తగిన స్టేడియాలు, కనీస సౌకర్యాలు లేకపోవడం, బడ్జెట్‌లో క్రీడలకు అతి తక్కువ నిధులు కేటాయించడం, ప్రాథమిక స్థాయిలో ఆటలపై అసలు దృష్టి పెట్టకపోవడం, పరిపాలనా వ్యవస్థలోని లోటుపాట్లు క్రీడలకు అడ్డంకులుగా మారుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఏదోలా అక్కడక్కడా పైకి దూసుకొచ్చినవారిపైనే ఒలింపిక్స్‌లో మన ఆశలన్నీ ఉంటున్నాయి. ఇప్పటికీ ఫలానా క్రీడాంశంలో మనం పూర్తి ఆధిక్యం కనబరుస్తాం అని నమ్మకంగా చెప్పలేని పరిస్థితిలోనే మనం ఉన్నాం. అందుకే ఒకటీ, రెండు, మూడు అంటూ వేళ్లపై లెక్కించగలిగే పతకాలు వస్తున్న ప్రతిసారీ మనం వాటికి పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నాం.

ఈసారి రాత మారేనా?
ఒలింపిక్స్‌లో భారత్‌ పెద్ద సంఖ్యలో పతకాలు సాధించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదంటూ సుదీర్ఘకాలంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చింది. వెంటనే ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో ఎక్కువ మందిని ఆటల వైపు ప్రోత్సహించేందుకు ఇది ఉపకరిస్తుందని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా భావించింది. ఈ క్రమంలో టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014లో మొదటిసారి దీనిని తీసుకొచ్చినా, స్వల్ప మార్పులతో 2018లో ‘టాప్స్‌’ను అదనపు అంశాలు జోడించి రూపొందించారు.

ప్రభుత్వం దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించింది. అయితే దీనిని పూర్తి స్థాయిలో వ్యవస్థాగతంగా సౌకర్యాల కల్పన, మైదానాల ఏర్పాటువంటివాటితో చూడలేం. కానీ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చేందుకు ఇది పనికొస్తోంది. సన్నద్ధతలో భాగంగా ఆయా క్రీడాంశాలకు సంబంధించి స్థానికంగా శిక్షణ, అవసరమైతే విదేశాల్లో కోచింగ్, ఎక్విప్‌మెంట్, విదేశాల్లో పోటీలకు హాజరయ్యేందుకు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. వీటితో పాటు ఉద్యోగం లేని ప్లేయర్లకు ఊరటగా నెలకు రూ.50 వేల స్టైపెండ్‌ కూడా లభిస్తుంది.

దీని వల్ల ప్లేయర్లు ఆర్థిక సమస్యల గురించి ఆలోచించకుండా, ఏకాగ్రత చెదరకుండా పూర్తి స్థాయిలో తమ ఆటపైనే దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుంది.  దీని వల్ల సమూలంగా మార్పులు రాకపోయినా...గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుపు పడినట్లే. ప్రస్తుతం టాప్స్‌ స్కీమ్‌ కోర్‌ గ్రూప్‌లో మొత్తం 172 మంది ఆటగాళ్లు ఉన్నారు. నిజానికి టోక్యో ఒలింపిక్స్‌కు ముందే కొందరు ఆటగాళ్లు టాప్స్‌ ద్వారా శిక్షణ పొందారు. కానీ అప్పటికి తగినంత సమయం లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు పారిస్‌ లక్ష్యంగా క్రీడాకారులు సన్నద్ధమయ్యారు. మరి ఈసారి మన పతకాల సంఖ్య పెరిగి రెండంకెలకు చేరుతుందా అనేది చూడాలి.

  • రెండో ప్రపంచయుద్ధం వల్ల 1940, 1944 సంవత్సరాల్లో జరగాల్సిన ఒలింపిక్స్‌ రద్దయ్యాయి. నిజానికి 1940 ఒలింపిక్స్‌ టోక్యోలో జరగాల్సి ఉన్నా, జపాన్‌లో యుద్ధబీభత్సం కారణంగా ఆ ఏడాది ఒలింపిక్‌ వేదిక ఫిన్లండ్‌కు మారింది. అయినా, తర్వాత అది కూడా రద్దయింది. – మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది, కరణం నారాయణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement