కామారెడ్డి జిల్లాలో మొత్తం సాగు భూములు : 5.26లక్షల ఎకరాలు
సాగుభూముల్లో రాతి నేలలు : 40వేల ఎకరాలు
రాతి నేలల్లో ఆరుతడి పంటల సాగు
అక్కడక్కడా వరిపంట
రాతి నేలల్లో ఎకరానికి గరిష్ఠ దిగుబడి : 40 క్వింటాళ్లు
రాతి నేలల్లో సిరుల పంటలు పండుతున్నాయి. నాగళ్లకు ఎదురుతిరిగే రాతి నేలలవి. అలాంటి నేలల్లో సాగు చేయడం అంత తేలిక పని కాదు. రాతి నేలలకు పచ్చదనం అద్దిన రైతులు పడినది మామూలు కష్టం కాదు. మూడు తరాల రైతుల అవిరళ కృషి ఫలితంగా ఒకప్పుడు బోసిగా కనిపించిన రాతినేలలు ఇప్పుడు పచ్చగా కళకళలాడుతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రైతులు కొండ ప్రాంతాల్లోని రాతినేలల్లో వర్షాధార పంటలను సాగు చేస్తున్నారు. రాతినేలల్లో చెమటను, నెత్తుటిని చిందించి మరీ వారు చేస్తున్న ఆదర్శ వ్యవసాయం గురించి తెలుసుకుందాం...
విత్తనాలు వేసేటప్పుడు రాళ్లల్లో నడుస్తుంటే, అరికాళ్లకు రాళ్లు గుచ్చుకుంటాయి. రాళ్లల్లో మొలకెత్తిన కలుపు తీస్తుంటే, చేతులు చీరుకుపోయి నెత్తురు చిమ్ముతుంది. అయినా, వారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సాగు చేస్తారు. తాతల కాలం నుంచి వారు ఇదే పని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి, లింగంపేట, తాడ్వాయి, జుక్కల్, పెద్దకొడప్‌గల్, రాజంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది.
ఈ జిల్లాలో 5.26 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉంటే, వాటిలో దాదాపు పదిశాతం రాతినేలలే! వీటినే నమ్ముకుని వేలాది రైతులు మూడు తరాలుగా సాగు చేస్తున్నారు. ఇదివరకటి కాలంలో నాగళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నాగళ్లతో దున్నేటప్పుడు ఎడ్ల కాళ్లకు గాయాలయ్యేవి. ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాక, పని కొంచెం సులువైనా, ఖర్చులు బాగా పెరిగాయని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఏటా రాళ్లు తీసి కుప్పలుగా పోస్తున్నా, తవ్వే కొద్ది రాళ్లు వస్తూనే ఉంటాయని, రాళ్ల మధ్యనే సేద్యం చేయడం తమకు అలవాటైపోయిందని ఈ రైతులు చెబుతారు.
వర్షాధార వ్యవసాయం..
ఈ రాతినేలల్లో వేసే పంటలకు వర్షాలే ఆధారం. మంచి వర్షాలు కురిసినప్పుడు అధిక దిగుబడులు వస్తాయి. వర్షాలు సరిగా కురవకపోయినా, అకాల వర్షాలు కురిసినా రైతులకు నష్టాలు తప్పవు. వర్షాధార పరిస్థితుల వల్ల ఇక్కడి రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలనే సాగు చేస్తుంటారు. ఈ రాతి నేలల్లో పత్తి, మొక్కజొన్న, సోయా పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అక్కడక్కడా వరి కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటలను అడవి జంతువుల దాడి నుంచి కాపాడుకోవడం రైతులకు పెనుసవాలు.
పొలాల్లోకి అడవి జంతువులు చొరబడకుండా ఉండేందుకు కొందరు రైతులు సోలార్ ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసుకుంటే, మరికొందరు పొలాల చుట్టూ ఇనుప తీగెలు కట్టి, రాత్రివేళల్లో పొలాలకు కాపలా ఉంటున్నారు. రాళ్లతో కూడుకున్నవన్నీ నల్లరేగడి నేలలు కావడంతో ఇక్కడ పంటల దిగుబడి ఆశాజనకంగానే ఉంటుంది. రాళ్ల మధ్య తేమ వారం రోజుల వరకు అలాగే ఉంటుంది. వారం రోజుల తర్వాత వర్షం కురిస్తే పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని రైతులు చెబుతున్నారు. రాతినేలలు ఉన్న ప్రాంతాలు సాధారణంగా వర్షాలకు అనుకూలంగానే ఉంటాయి. తగిన వానలు కురవకపోవడం వల్ల పంటల దిగుబడులు తగ్గిన సందర్భాలు ఈ ప్రాంతంలో అరుదుగానే ఉంటాయి.
మూడు తరాల వాళ్లం కష్టపడ్డాం..
మా తాత మందిరానాయక్, మా నాయిన నంగరాజ్, తరువాత నేను మూడు తరాల వాళ్లం రాళ్లను ఏరి చుట్టూ కంచె వేశాం. మూడెకరాల భూమిని రాళ్లు లేని భూమిగా తయారు చేసి, వరి పంట పండిస్తున్నం. వర్షాకాలంలో ఏ ఇబ్బంది లేకుండా బావినీళ్లతో పంట పండుతుంది. ఇక్కడ బోర్లు వేస్తే పడవు. మూడు తరాల కష్టానికి మూడెకరాల వరి పొలం తయారైంది. – దేవిసింగ్, చద్మల్ తండా
చేతులు పగిలి మంట పెడుతుంది..
కలుపు తీస్తుంటే అరచేతికి, వేళ్లకు రాళ్లు గుచ్చుకుని రక్తం కారుతది. మంట పెడుతున్నా కష్టపడుతున్నం. రాళ్లు ఎంత ఏరినా తగ్గిపోవు. అందుకే ఉన్న రాళ్లల్లోనే పంట వేస్తున్నం. కాలం మంచిగ అయితే పంట దిగుబడి వస్తుంది. ఇప్పటికైతే మా దిక్కు వానలు మంచిగనే పడ్డయి. ముందు ఇట్లనే ఉంటే బాగుంటుంది. – సురేఖ, బూర్గుల్ తండా
అరికాళ్లకు అన్నీ గాయాలే..
మాకు నాలుగెకరాల భూమి ఉంది. ట్రాక్టర్‌తో దున్నించి మొక్కజొన్న పంట వేస్తుంటం. విత్తనం వేసినపుడు, కలుపు తీసినపుడు రాళ్లు గుచ్చుకుని అరికాళ్లు నొప్పిగా తయారై ఇబ్బంది పడుతుంటం. వాన పడితే పంట మంచిగనే వస్తది. వానలు కింద మీద అయితే రెక్కల కష్టం పోతది. దేవుని మీద భారం వేసి పంటలు వేస్తున్నం. – పారిబాయి, గుర్జాల్ తండా
తాతల కాలం నుంచి ఇదే కష్టం..
మాకు 1957లో పట్టాలు వచ్చినయి. అప్పటి నుంచి మా తాతలు, తరువాత మా తండ్రులు, ఇప్పుడు మేం రాళ్లల్లనే పంటలు వేస్తున్నం. మూడు ఎకరాల్లో పత్తి వేసినం. విత్తనం వేసిన నుంచి పంట చేతికి వచ్చేదాకా అవస్థలు పడాల్సిందే! సమయానికి వాన పడితే పంటకు ఇబ్బంది ఉండదు. రోగాలు వచ్చినపుడు మందులు కొడుతుంటం. – ప్రేమ్‌సింగ్, గుర్జాల్ తండా
ఐదెకరాలూ రాళ్ల భూమే!
నేను ఇంజినీరింగ్ చదివి ఇంటి వద్దే వ్యవసాయం చూసుకుంటున్నాను. మాకు ఐదెకరాల భూమి ఉంది. అది కూడా రాళ్ల భూమే! వర్షంపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు వేశాం. కొద్దిగా వరి కూడా పండిస్తున్నాం. మా ఊరి శివారే కాదు చుట్టుపక్కల ఊళ్లన్నీ రాళ్లు, రప్పలతో కూడుకున్న భూములే ఉన్నయి. రాళ్ల భూములే అయినా కష్టపడుతున్నం. – ధన్‌రాజ్, గుర్జాల్ తండా
ఖర్చు ఎక్కువ..
రాళ్ల భూములల్ల దున్నడానికి ట్రాక్టర్‌కు ఎక్కువ టైం తీసుకుంటది. అట్లనే కిరాయ కూడా ఎక్కువ అడుగుతరు. గంటలకు రూ.8 వందల నుంచి రూ.9 వందలు తీసుకుంటరు. దున్నడానికి ఎక్కువ సమయం పట్టడంతో ఖర్చు ఎక్కువవుతుంది. కలుపు ఇంటోళ్లమే తీసుకుంటున్నం. రాళ్లు తగిలి కాళ్లకు గాయాలైతున్నా భరిస్తం. – రవి, బూర్గుల్ తండా
కాలం కలిసొస్తే మంచి దిగుబడులు..
పంటకు అనుకూలంగా మంచి వర్షాలు కురిస్తే చాలు, మంచి దిగుబడులు వస్తాయి. రైతుల రెక్కల కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొన్నిచోట్ల ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు. రాతినేలల్లో ఈ స్థాయి దిగుబడులు రావడం విశేషమే! సరైన పంట యాజమాన్య పద్ధతులు పాటించకుంటే, ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడులు మాత్రమే వస్తాయి. అయితే, ఈ రాతి నేలలను దున్నడంలో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేలలను దున్నడానికి ట్రాక్టర్ యజమానులు ఆసక్తి చూపరు. సాధారణమైన సాగునేలలను దున్నడానికి గంటకు ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు.
ఈ రాతినేలలను దున్నడానికి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు. సాధారణ పొలాల్లో ఎకరం దున్నడానికి గంట నుంచి గంటన్నర సమయం సరిపోతుంది. రాతి నేలలు దున్నడానికి రెట్టింపు సమయం పడుతుంది. ఈ పరిస్థితి వల్ల దుక్కి దున్నడానికే రైతులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేలల్లో కలుపు తీయడానికి కూలీలు దొరకరు. ఇక్కడ కలుపు తీస్తే చేతులకు గాయాలు తప్పవు. కూలీల కొరత వల్ల చాలా పొలాల్లో రైతుల కుటుంబ సభ్యులే కలుపు తీస్తుంటారు. ఇంతటి కఠోర శ్రమకు ఓరుస్తూనే ఈ రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. – ఎస్.వేణుగోపాల చారి, సాక్షిప్రతినిధి, కామారెడ్డి
ఇవి చదవండి: కాలనీలో థ్రిల్
Comments
Please login to add a commentAdd a comment