సోషల్‌ మీడియా షోకేస్‌లో.. బాల్యం! | Processing Children'sD Ata In Cccordance With Their Best Interests Sunday Cover Story | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా షోకేస్‌లో.. బాల్యం!

Published Sun, Jul 28 2024 8:31 AM | Last Updated on Sun, Jul 28 2024 11:17 AM

Processing Children'sD Ata In Cccordance With Their Best Interests Sunday Cover Story

బాల్యం.. ఎవరికైనా అమూల్యం! ఎక్కడైనా అద్భుతం! పిచ్చుక గూళ్లు, దాగుడుమూతలు, కోతికొమ్మచ్చి ఆటలు పిల్లలందరికీ ప్రియం! పెద్దలు ఆ ఆనందంలోకి తొంగి చూడ్డంలో తప్పు లేదు .. ఆ తుళ్లింతలను కంటినిండా నింపుకోవడం పొరపాటు కాదు! ఆ పసితనాన్ని ఫ్రేమ్‌ చేసి ఆ మురిపాన్ని పంచుకోవడం నేరం అనిపించుకోదు! కానీ.. ఆ షేరింగ్‌లోనే బాల్యానికి సోషల్‌ మీడియా బురదంటుతోంది!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఆన్‌లైన్‌ బుల్లీయింగ్‌కి గురవుతున్నారు. యూరప్‌లో 33 శాతం మంది బాలికలు, 20 శాతం మందిబాలురు.. ఆన్‌లైన్లో వచ్చే కంటెంట్‌తో డిస్టర్బ్‌ అవుతున్నారు.  ఆఫ్రికా, ఆసియాలోని దేశాల్లో 20 శాతం మంది పిల్లలు ఆన్‌లైన్‌ అబ్యూజ్‌ లేదా లైంగిక దోపిడీకి గురవు తున్నారు. ఇవి రెండేళ్ల కిందటి లెక్కలు!

ఇదీ ‘రియాలిటీ..
తండ్రీకూతుళ్ల వీడియో మీద అబ్యూజివ్‌ కామెంట్లు చేసిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు ఉందంతం ఈ కథనానికి నేపథ్యం. ఇలాంటివారి వల్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ కమాడిటీస్‌గా మారుతున్న పిల్లల గురించి, పసిఛాయలు కోల్పోతున్న బాల్యం గురించి ఆలోచన అవసరం.  
పిల్లల్లోని ప్రతిభను మాత్రమే వినిపిస్తూ.. ప్రతి గడపలోని బాలలను ఆనందపరుస్తూ.. ప్రేరణనందించిన ∙రేడియో బాలానందం ఆత్మ ఇప్పుడేది? పిల్లలతో డాన్స్‌ చేయించే రియాలిటీ షోస్‌ వచ్చాయి. సర్కస్‌ ఫీట్లు, అసభ్యకరమైన స్టెప్పులతో పాపులర్‌ అయ్యాయి. క్రీడాస్ఫూర్తిని పెంపొందించాల్సిన ఈ పోటీలు గెలుపోటముల సెంటిమెంట్లను పండించే వేదికలుగా మారాయి. స్క్రిప్ట్‌ ఇచ్చి పిల్లల చేత డ్రామా చేయిస్తున్నాయి. అవి పెద్దలకు వినోదాన్ని పంచుతూ టీఆర్‌పీలను పెంచుతున్నాయి. దీనికున్న క్రేజ్‌ చూసి రియాలిటీ షోస్‌ కోసం డాన్స్‌ నేర్పే ఇన్‌స్టిట్యూట్లూ వెలిశాయి. ఈ డాన్స్‌ షోల స్క్రీన్‌ ప్లే వర్కవుట్‌ కావడంతో భార్యభర్తల పంచాయతీ సీన్‌లనూ చేర్చారు.. మరో రియాలిటీ షోగా! అందులోనూ పిల్లలు పావులే! కెమెరాల ముందు.. టీవీ జడ్జీల సమక్షంలో అమ్మ, నాన్న అలా తగవులాడుకుంటూంటే.. బెదిరిపోయి.. బిత్తర చూపులు చూస్తున్న ఆ పిల్లల మొహాలను జూమ్‌ చేసి ఆ పంచాయతీ కార్యక్రమాన్ని రక్తి కట్టించడం కనపడుతూనే ఉంది. ఇక్కడితో ఆగలేదు. కామెడీ షో పేరుతో అశ్లీల హాస్యాన్ని సేల్‌ చేసుకుంటున్న కార్యక్రమాల్లోనూ పిల్లలను భాగస్వాములు చేస్తున్నారు. ముద్దు ముద్దు మాటల చిన్నారులతో ముదురు, డబుల్‌ మీనింగ్‌ డైలాగులు పలికిస్తున్నారు. అంతేకాదు అంతులేకుండా కొనసాగే టీవీ సీరియళ్లలోనూ పిల్లల కోసం పాత్రలు క్రియేట్‌ అవుతున్నాయి వాళ్ల వయసుకు మించిన మాటలతో!

సోషల్‌ మీడియా.. వైరస్‌.. వ్యూస్‌
సోషల్‌ మీడియా ఆ రియాలిటీ షోస్‌ని రీల్స్‌గా, షాట్స్‌గా మార్చేసింది.  పురిట్లోని పిల్లల ఏడుపు.. ఫీడింగ్, ఫార్టింగ్, నిద్దట్లోని వాళ్ల హావభావాల వీడియోలు యూట్యూబ్, ఇన్‌స్టాలో కోకొల్లలు. డాన్సింగ్‌ కాక్టస్‌ను చూసి బెదిరిపోయే పిల్లలు, బొమ్మకు అన్నం తినిపిస్తూ అది తినకపోతే దాన్ని కొట్టి పిల్లలను భయపెట్టి అన్నం తినిపించే పెద్దలు, బుడిబుడి అడుగులతో నీళ్లల్లో జారిపడే పిల్లలు, ఇల్లు పీకి పందిరేసే పనిలో దెబ్బలు తగిలించుకునే పిల్లలు, తోబుట్టువులతో తగవులాడే పిల్లలు, పెంపుడు జంతువులు ముద్దు చేస్తుంటే ఇబ్బంది పడే పిల్లలు.. ఇలా వాళ్లకు సంబంధించి ఏదైనా రీలే.. షాట్సే! ఇవి వేలల్లో కనిపిస్తాయి సోషల్‌ మీడియా నిండా! దురదృష్టవశాత్తు అవి పెద్దలకు కాలక్షేపమవుతున్నాయి! 

ఊసుపోక కాదు.. వాటిని చూడ్డమే పనిగా పెట్టుకున్న వ్యూయర్స్‌ ఉంటారు. పిల్లల టాలెంట్‌ని కాకుండా పెద్దల పైత్యాన్ని ప్రదర్శించేవే అధికం వాటిల్లో! అందుకే పిల్లల మీద మీమ్స్‌ నుంచి పిల్లలే పాత్ర«లయ్యే రీల్స్, షాట్స్‌ వరకు అన్నీ సోషల్‌ మీడియాలో సేలబులే! ఇటీవల వచ్చిన జైలరు సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో ‘ఆ.. నువ్వు కావాలయ్య పాట’ సోషల్‌ మీడియాలో వైరల్‌! దేశీలు, ఎన్నారైలు ఆ పాట మీద స్టెప్‌లేస్తూ తీసుకున్న వీడియో పోస్ట్‌లతో ఇన్‌స్టా, యూట్యూబ్‌లు ఊగిపోయాయి. అంతటితో ఆగకుండా ఆ పిచ్చి పనిని పిల్లల చేతా చేయించి సోషల్‌ మీడియాలో ప్రదర్శించి లైక్స్, కామెంట్స్, షేర్స్‌ లెక్కలు చూసుకున్నారు. పిచ్చిపని అని ఎందుకు జడ్జిమెంట్‌ ఇవ్వాల్సి వస్తోందంటే.. అదొక లైంగిక చర్యను సూచించే స్టెప్‌. దాన్ని చిన్న పిల్లల చేత వేయించి.. ఇన్‌స్టాలో చూపించి ఆనందపడినందుకు! పిల్లల ముద్దుమురిపాలు, ప్రతిభాపాటవాలను పదిమందికీ చూపించి వాళ్ల దీవెనలు, ప్రశంసలు అందుకోవాలని ఆశపడని అమ్మానాన్నలుండరు.

కానీ వాళ్లను ఏ వేదిక మీద నిలబెడుతున్నామనే అవగాహన చాలా అవసరం. ఒకసారి వాళ్ల ఫొటోలో.. వీడియోలో ఆ ప్లాట్‌ఫామ్‌లోకి∙వెళ్లాక అవి ఫార్వర్డ్‌ అవడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోను వాటిని వెనక్కి తీసుకునే అవకాశం లేని వేదికలవి. అలాంటి వాటి మీద పిల్లలను ఆడించడం, పెద్దలే పిల్లల పేరు మీద ఇన్‌స్టా హ్యాండిళ్లు, యూట్యూబ్‌ చానళ్లు నిర్వహించడం, బూతు డైలాగులు, అసభ్యకరమైన, అమర్యాదకరమైన రీల్స్, షాట్స్‌ చేయిచండం సామాజిక ఉపద్రవం కాక మరింకేమిటి! ఆ చానళ్లకు లక్షల్లో వ్యూస్, సబ్‌స్క్రైబర్స్‌తో ఆదాయం తెచ్చుకుంటున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారుస్తున్నారు.

బాల్యం.. వినోద వస్తువు
సాంకేతిక ఊసు లేనప్పుడు కూడా వినోదం ఉంది. అందులోనూ పిల్లల భాగస్వామ్యం ఉంది. వాళ్ల మనోవికాసానికే అది ఉపయోగపడింది తప్ప వాళ్లను వినోద వస్తువులుగా మార్చలేదు. వాళ్ల ప్రతిభను మెరుగుపరచింది తప్ప పసితనాన్ని మరుగుపరచలేదు. ఇప్పుడు ఏం చేసైనా వినోదాన్ని పండించి .. డబ్బులు రాబట్టుకునే వేదికలు తయారయ్యాయి.  వ్యక్తిగత గుట్టు ఎంత గడప దాటితే అంత ఎంటర్‌టైన్‌మెంట్‌. దానికి పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేదు. సోషల్‌ మీడియా పుణ్యాన పురిటి నుంచి టీన్స్‌ దాకా పిల్లలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కమాడిటీస్‌ అయ్యారు.

అమ్మ, నాన్నలతో కలసి ఆడుకుంటున్న వీడియోలు పెట్టినా, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగాన్ని పోస్ట్‌ చేసినా.. ఫ్రెండ్స్‌తో ఉన్నా, పిల్లలు కూర్చున్నా.. నిలబడ్డా, నవ్వినా, ఏడ్చినా, వణికినా, ధైర్యంగా కనపించినా, బుంగమూతి పెట్టుకున్నా, చిలిపితనం చిందించినా, చురుకుదనం ఉరకలేసినా.. అంతెందుకు ఏం చేసినా.. చేయకపోయినా  వంకర వ్యాఖ్యానాలు, బెదిరింపులు, వేధింపులు, ట్రోలింగ్, రకరకాల పర్వర్షన్స్‌కి ఈజీ టార్గెట్స్‌గా మారారు. దీన్ని సమాజం నిర్లక్ష్యం చేసింది కనుకే ప్రణీత్‌ హనుమంతు తనలాంటి నలుగురితో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటూ నాన్న, కూతురి వీడియో పోస్ట్‌ని అంత రోస్ట్‌ చేయగలిగాడు.

పిల్లల హక్కులకు చట్టాలున్నాయి..!
రియాలిటీ షోల పేరుతో పిల్లలను వినోద పరిశ్రమలో కార్మికులుగా చేసే దశ నుంచి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పిల్లలను వినోద వస్తువులుగా మార్చే దశ వరకు.. ఎక్కడా.. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల మీద మనకెలాంటి హక్కు లేదు. సమాజానికే కాదు కన్న తల్లిదండ్రులకూ లేదు! పరిణతి చెందిన ్రçపపంచం పెద్దల హక్కులే పిల్లల హక్కులని గుర్తించింది. అందుకే దాదాపు అన్ని దేశాల్లో పిల్లల హక్కులను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాలున్నాయి. ఇంటర్నెట్‌ వచ్చాక పిల్లల భద్రత గురించే మొదట ఆలోచించాయి.

అందుకే దాదాపు ప్రపంచ దేశాలన్నీ పిల్లల వ్యక్తిగత సమాచార గోప్యత పాటించాల్సిందేనని చట్టాల ద్వారా కట్టుదిట్టం చేశాయి. సొంత తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చెందిన ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టొద్దు. పౌరసత్వ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం దగ్గర తప్ప ఇంకెక్కడా బహిర్గతపరచాల్సిన అవసరంలేదు. ప్రభుత్వం కూడా ఆ వివరాలను తన ఏజెన్సీలు సహా ఇంకే ఇతర ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వకూడదు.

మన దగ్గరా పిల్లల హక్కులు, రక్షణ, భద్రత, గోప్యతకు సంబంధించి ప్రత్యేక చట్టాలున్నాయి. డిజిటల్‌ డేటాకు సంబంధించీ చట్టం ఉంది. ఇదేం చెబుతోందంటేæ.. పిల్లలను వాళ్ల వయసుకు తగని సన్నివేశాల్లో చూపించకూడదు. దీని కిందకు కుటుంబ తగాదాలు, స్త్రీ, పురుష సంబంధాల అంశాలు, భయం, భీతిగొలిపేవంటివన్నీ వస్తాయి. అలాగే మైనర్లను అసభ్యంగా, అశ్లీలంగా చూపించకూడదు. వారిని అవమానించేలా, కించపరచేలా, వేధించేలా ఉన్న ఫొటోలు, వీడియోలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టకూడదు.

హింసాత్మకమైన, ప్రమాదకరమైన, హానికరమైన చర్యల్లో పిల్లలు పాలుపంచుకునేలా ఉన్న కంటెంట్, ఫొటోలు, వీడియోలు, వారిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసించడం, వారిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగించే దృశ్యాలను చూపించడం వంటివన్నీ నిషేధం. బాల్యాన్ని  పదిలంగా ఉంచుదాం!

‘ఎవరి పిల్లలైనా వాళ్లు పిల్లలు! బాల్యం పదిలంగా ఉంటేనే భవిష్యత్తు బంగారమవుతుంది. పిల్లలకు మనం ఏదిస్తే అదే తీసుకుంటారు. మనం ఏం చూపిస్తే అదే గ్రహిస్తారు. మనం ఏం చేస్తే దాన్నే అనుకరిస్తారు, అనుసరిస్తారు. అందుకే మనం జాగ్రత్త పడాలి’ అంటున్నారు చైల్డ్‌ సైకాలజిస్ట్‌లు. సాంకేతికత ముంచెత్తుతున్న సమాచారాన్ని ఫిల్టర్‌ చేయలేం. సముద్రాన్ని మధించి అమృతాన్ని అందివ్వలేం! అలాగని ఆ డిజిటల్‌ స్కూల్‌కి దూరంగా ఉంచి పిల్లలను డిజిటల్లీ చాలెంజ్డ్‌ చేయలేం!

ఈ పేరెంటింగ్‌ని ఒక్క తల్లిదండ్రుల నెత్తినే వేయకుండా సమష్టిగా పంచుకుందాం! తొలి అడుగు పేరెంట్స్‌ నుంచి రావాలి. పిల్లలు డిజిటల్‌ మీడియంలో ఎంతవరకు ఎక్స్‌పోజ్‌ కావాలి అనే విచక్షణతో మెదలాలి. ఆ ప్లాట్‌ఫామ్‌లో పిల్లలను ఎంటర్‌టైన్‌మెంట్‌ టూల్స్‌గా మలచకుండా పిల్లల మనోవికాసానికి దాన్నో టూల్‌గా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.

కరోనా ఎఫెక్ట్‌గా ఆన్‌లైన్‌ పాఠాలు అనివార్యమై పిల్లలకు ఇంటర్నెట్‌తో మరింత ఫ్రెండ్‌షిప్‌ పెరిగింది. ఆ స్నేహంలో వాళ్లకున్న పరిమితులు, వాళ్లుండాల్సిన పరిధిని చూపించడం, ఆ మేర జాగ్రత్తపడటం టీచర్ల పని. ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా పైన చెప్పిన రీతిలో పిల్లలు కనిపిస్తే వెంటనే దాన్ని రిపోర్ట్‌ చేసి.. సదరు పోస్ట్‌లకు లైఫ్‌ లేకుండా.. అర్కైవ్స్‌లో దాక్కోకుండా చూడాల్సిన బాధ్యత మనది.. డిజిటల్‌ సొసైటీలో భాగమైన మనందరిది. ఈ ప్రయాణంలో మద్దతివ్వడానికి చట్టాలున్నాయి. స్పందించడానికి పోలీస్‌ వ్యవస్థ ఉంది. దీని మీద అవగాహన కల్పించే కార్యక్రమాలను చూడాల్సింది ప్రభుత్వం. పిల్లలను వినోద వస్తువులుగా చూస్తూన్నాం! ఈ నేరం మనందరిదీ! ఆ తప్పును పేరెంటింగ్‌తో సరిదిద్దుకోవాలి. సమాజమంతా ఆ బాధ్యతను తీసుకోవాలి!

జాగ్రత్తగా ఉండాలి
పిల్లల ఫొటోలు పోస్ట్‌ చేయకండి అని భయపెట్టను. కానీ ఆ సమాచారం అంతటా వ్యాపించే చాన్స్‌ ఉంది కాబట్టి పిల్లల ఫొటోలు, వీడియోలు సహా ఎలాంటి వివరాలనైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్‌ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎందులో ఏం పోస్ట్‌ చేసినా మిస్‌యూజ్‌ అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.

ఆ వివరాలు ఫార్వర్డ్‌ అవడమే తప్ప డిలీట్‌ అయ్యే చాన్స్‌ ఉండదు. కనుక   జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాచింగ్‌ చైల్డ్‌ పోర్నోగ్రఫీ శిక్షార్హమైన నేరం. పిల్లల మీద అబ్యూజివ్‌ కామెంట్స్‌ అనేవి జీరో టాలరెన్స్‌ నేరం. ఇలాంటివేవైనా ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే 100కి గానీ 1930కి గానీ డయల్‌ చేయండి. ఇంకో విషయం.. ఇలాంటి అబ్యూజివ్‌ కామెంట్స్‌ని ట్వీట్, పోస్ట్‌ చేయడమే కాదు వాటిని రీ ట్వీట్, ఫార్వర్డ్‌ చేసినా నేరమే. – శిఖా గోయల్, ఏడీజీపీ సీఐడీ, డైరెక్టర్‌ తెలంగాణ సైబర్‌ సెక్యురిటీ బ్యూరో, డైరెక్టర్‌ టీఎస్‌ ఎఫ్‌ఎస్సెల్, ఏడీజీపీ విమెన్‌ సేఫ్టీ వింగ్‌

ఆలోచించాలి.. 
చిన్నపిల్లల ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ మీ స్నేహితులతో పంచుకోవాలి అనుకుంటే నిజ జీవితంలో మీకు పరిచయమైన వారిని మాత్రమే మీ సామాజిక మాధ్యమాలలో ఫ్రెండ్‌ లిస్ట్‌లో చేర్చుకోండి. అలా చేసినప్పటికీ ఫొటోలు, వీడియోల్లో వ్యక్తిగత సమాచారం, పిల్లల స్కూల్, స్పోర్ట్స్‌ లాంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ తెలిసే వీల్లేకుండా చూసుకుంటే కొంతవరకు సేఫ్‌. స్కూల్‌ బస్, మీ కారు, బైక్‌ నంబర్లు, ఇంటి పరిసరాల ఆనవాళ్లు మొదలైనవీ సోషల్‌ మీడియాలో తెలియనివ్వకుండా జాగ్రత్త పడితే మంచిది.

అంతేకాదు పిల్లలకు ఏం నేర్పిస్తున్నామనే స్పృహ కూడా ఉండాలి. పిల్లలతో వయసుకు మించిన చేష్టలు, మాటలు, పాటలతో రీల్స్, షాట్స్‌ చేయించడం పెద్దలకు సరదాగా ఉండొచ్చు. కానీ అవి పిల్లలపై చూపించే ప్రభావం గురించి ఆలోచించాలి. ఇలాంటివాటితో ఎన్నో తప్పులను నార్మలైజ్‌ చేస్తున్నారు. ‘మా పిల్లలు మా ఇష్టం’ అంటూ బాల్యాన్ని పాడుచేస్తున్న తల్లిదండ్రులూ లేకపోలేదు. ఇంతకుముందున్న చట్టాలు, ప్రస్తుతం వచ్చిన చట్టాల ప్రకారం కూడా పిల్లల గోప్యతకు భంగం వాటిల్లేలా ముఖ్యంగా ఇంటర్నెట్‌లో అలాంటి పనులకు పాల్పడినవారికి కఠిన శిక్షలున్నాయి. 
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్ట్‌ అడ్వకేట్‌

వీటినీ దృష్టిలో పెట్టుకోవాలి..
పోక్సో, జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ ప్రకారం..  పిల్లలు సురక్షితమైన వాతావరణంలో లేరని తెలిస్తే తల్లిదండ్రుల వద్దనుంచైనా సరే పిల్లలను తీసుకొని సేఫ్‌ హౌస్‌లో ఉంచవచ్చు. ద డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ , 2023లోని సెక్షన్‌ 9 ప్రకారం.. 
చిన్న పిల్లలకు సంబంధించిన వివరాల సేకరణ, గోప్యతపై మూడురకాల నిబంధనలున్నాయి. 
అవేంటంటే..

– పిల్లల సమాచారానికి సంబంధించి తల్లిదండ్రుల ధ్రువీకరణ, సమ్మతిని పొందడం
– పిల్లల శ్రేయస్సుకనుగుణంగా వారి డేటాను ప్రాసెస్‌ చేయడం
– పిల్లలను ట్రాకింగ్‌ లేదా వాళ్ల ప్రవర్తనపై పర్యవేక్షణ, పిల్లలను లక్ష్యంగా చేసుకున్న ప్రకటనలపై నిషేధం.

పిల్లల సమాచారం లేదా ఐడెంటిటీని తెలియపరచేవిధంగా ఆన్‌లైన్‌లో సమాచారాన్ని ఉంచే వారెవరికైనా వాళ్లు తల్లిదండ్రులైనా సరే  పై నిబంధనలు వర్తిస్తాయి. వాటిని ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ చట్టం కింద రూల్స్‌ని రూపొందించే ప్రక్రియలో ప్రభుత్వం ఉంది.

ఆన్‌లైన్‌లో పిల్లల రక్షణ, పిల్లలందరికీ డిజిటల్‌ లెర్నింగ్‌ని అందుబాటులోకి తేవడం.. యూనిసెఫ్‌ ప్రధాన లక్ష్యాలు . ఈ విషయమై అది అన్ని దేశాల్లో దృష్టిపెడుతోంది. 2022, అక్టోబర్‌లో బ్రసెల్స్‌లో పలు దేశాల పాలసీ మేకర్స్, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు,పేరెంట్స్, యువతతో కలసి ‘సేఫర్‌ ఇంటర్నెట్‌ ఫోరమ్‌’ పేరుతో ఒక సదస్సునూ నిర్వహించింది.

యురోపియన్‌ యూనియన్‌ తమ దేశాల్లో..  ఆన్‌లైన్‌లో మైనర్స్‌ భద్రత కోసం ‘డిజిటల్‌ సర్వీస్‌ యాక్ట్‌’ని రూపొందించింది. ఇది పిల్లలను టార్గెట్‌ చేసే ప్రకటనలు, ఆల్గరిథమ్స్‌ని నిషేధించి పిల్లలకు సురక్షితమైన డిజిటల్‌ స్పేస్‌ని క్రియేట్‌ చేసేందుకు తోడ్పడుతోంది. అంతేకాదు యూరోపియన్‌ యూనియన్‌ ‘స్ట్రాటజీ ఆన్‌ ద రైట్స్‌ ఆఫ్‌ ద చైల్డ్‌’కి డిజిటల్‌ వింగ్‌ అయిన ‘బెటర్‌ ఇంటర్నెట్‌ ఫర్‌ కిడ్స్‌ స్ట్రాటజీ’ తమ దేశాల్లోని ప్రతి చిన్నారి ఆన్‌లైన్‌లో భద్రంగా, గౌరవప్రదంగా సాధికారత సాధించేందుకు యూరప్‌ అంతటా సేఫ్‌ ఇంటర్నెట్‌ సెంటర్స్‌ని ఏర్పాటు చేసింది. ఈ స్ట్రాటజీ కిందే యురోపియన్‌ కమిషన్‌ .. పిల్లల వయసుకు అనుగుణంగా డిజిటల్‌ సేవలు, వాటి ఉత్పత్తుల రూపకల్పనకు కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ని తయారుచేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో పిల్లలనూ భాగస్వాములను చేయనుంది. ఆన్‌లైన్‌లో పిల్లల భద్రత కోసం మిగిలిన దేశాలూ ఈ బాటలో నడవాలని  యూనిసెఫ్‌ అభిప్రాయపడుతోంది.

మానసిక రుగ్మతలుగానే చూడాలి..
సామాజిక మాధ్యమాలలో చూస్తున్న వింతపోకడల వెనుక దిగ్భ్రాంతి కలిగించే మానసిక రుగ్మతులు దాగున్నాయి. పిల్లల సేఫ్టీ సైతం కాంప్రమైజ్‌ అయ్యేలా పిల్లలపై నేరపూరిత చర్యలకు, వ్యాఖ్యలకు పాల్పడటం అలాంటి రుగ్మతల్లో ఒకటి. మితిమీరిన స్వార్థం, చట్టం పట్ల గౌరవలేమి, ‘వాళ్లు వీడియోలు చేస్తే తప్పులేదు కాని మేము స్పందిస్తే తప్పొచ్చిందా’ అనే మతిలేని వాదనలతో వారిని వారు సమర్థించుకోవడం వంటివీ రుగ్మతలుగానే చూడాలి. వీళ్లిలా తయారవడానికి కారణం కుటుంబ వ్యవస్థలోని లోపాలతోపాటు సమాజంలోని లోపాలు, ప్రిజుడీస్‌ కూడా! దీన్ని సరిదిద్దుకునే బాధ్యతను తమ తమ స్థాయిల్లో అందరూ తీసుకోవాలి!

వీళ్లు సినిమా నుంచి  వైరలైన పోస్ట్‌ దాకా పిల్లలు, పెద్దలు తేడా లేకుండా, లింగభేదం చూపకుండా ఎవరినైనా కామెడీ, డార్క్‌ కామెడీ పేరుతో రివ్యూ చేస్తారు. ఏ మర్యాదా లేకుండా రోస్ట్‌ చేస్తారు.

– పిల్లలకు సంబంధించి ఏటా ఫిబ్రవరిని సురక్షితమైన, సానుకూలమైన ఇంటర్నెట్‌ అడ్వొకసీ నెలగా గుర్తిస్తున్నారు. 
– 2023లో ఛిౌఝp్చటజ్టీ్ఛఛిజి ఆన్‌లైన్‌లో పిల్లల డేటా భద్రతా చట్టాలకు సంబంధించి 50 దేశాల్లో సర్వే నిర్వహించింది.
– పిల్లల భద్రత, ప్రైవసీకి కట్టుదిట్టమైన చట్టాలున్న దేశాల్లో మొదటి స్థానంలో ఫ్రాన్స్, 2వ స్థానంలో స్వీడెన్, 3వ స్థానంలో ఫిన్లండ్, డెన్మార్క్, చెక్‌ రిపబ్లిక్, బెల్జియం, ఆస్ట్రియా, జర్మనీ, యూకే, 4వ స్థానంలో సౌది అరేబియా, 5వ స్థానంలో భారత్, 6,7,8,9,10 స్థానాల్లో బ్రెజిల్, చైనా, ఇండోనేషియా, ఈజిప్ట్, హాంకాంగ్‌ కనిపిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement