స్క్రీన్‌ మారలేదు, సీనే మారింది! | Funday Special Cover Story On Movie Screen Effects, Impacts, VFX | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ మారలేదు, సీనే మారింది!

Published Sun, Jul 14 2024 12:25 AM | Last Updated on Sun, Jul 14 2024 12:25 AM

Funday Special Cover Story On Movie Screen Effects, Impacts, VFX

కథ చదవడం, వినడం పాత ప్రక్రియ! చూడటం వన్నె తగ్గని వెండితెర పంచే వింత వినోదం! కథను ఆడించే ఆ వెండితెర ఇంద్రజాలం నేర్చుకుంటే?  మెదడు ఊహించని లోకాలకు తీసుకెళ్తుంది, నిజమే నమ్మలేని దృశ్యాలను చూపిస్తుంది. అదొక నయనానందం, అదొక మనోల్లాసం! మొత్తంగా మనిషిని మునివేళ్ల మీద నిలబట్టే సరికొత్త ప్రక్రియ! స్క్రీన్‌ మారలేదు, సీనే మారింది! బిహైండ్‌ ద స్క్రీన్‌ టోటల్‌గా చేంజ్‌ అయింది!

కెమెరా కంటే ఎఫెక్ట్స్‌ ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఔట్‌ డోర్‌ కంటే గ్రీన్‌ మ్యాట్, బ్లూ మ్యాట్‌ ఇంపాక్ట్‌ చూపిస్తున్నాయి. ఎడిట్‌ సూట్స్‌ కంటే వీఎఫ్‌ఎక్స్‌ పవర్‌ ప్రదర్శిస్తున్నాయి. అవే మొన్న బాహుబలిని ప్రెజెంట్‌ చేశాయి. ఈరోజు కల్కిని క్రియేట్‌ చేశాయి. టాక్‌ ఆఫ్‌ ద కంట్రీ అయ్యాయి. ఆ ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్‌ఎక్స్‌ను కంపాక్ట్‌గా చూద్దాం..

అనాథ అయిన హీరో– అంతరిక్షం నుంచి భూమ్మీదకు పడే వస్తువులను అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. ఒక రోజు విజిటింగ్‌ వీసా మీద వేరే గ్రహం నుంచి వచ్చిన హీరోయిన్‌ను చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని సుదూరంలో ఉన్న ఆమె గ్రహానికి వెళ్తాడు. అక్కడ ఆమె తండ్రి మొదట వాళ్ల ప్రేమను కాదంటాడు. అక్కడికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే బ్లాక్‌ హోల్‌ దగ్గర ఉన్న తమ వారసత్వ సంపద టెక్నాలజీని తెస్తే పెళ్లికి ఒప్పుకుంటానని కండిషన్‌ పెడతాడు. దీంతో హీరో స్పేస్‌లో సాహసాలు చేయాల్సి వస్తుంది.

ఆ ప్రయత్నంలో తన తల్లిదండ్రులు మరో గ్రహంపై బందీలుగా ఉన్నారనే షాకింగ్‌ విషయం హీరోకి తెలుస్తుంది. వెంటనే అక్కడకు చేరుకుని విలన్ల భరతం పడతాడు. వాళ్లను విడిపించుకుని, చాలెంజ్‌లో నెగ్గి హీరోయిన్‌ను దక్కించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ప్రేమ, ప్రతీకారం, లోక కల్యాణం కోసం విలన్‌ను హీరో అంతం చేయడం అనాదిగా తెలుగు సినిమాలో వస్తున్న స్టోరీ లైన్‌. కాకపోతే మారింది సినిమా పరిధి. నాటి ‘పాతాళ భైరవి’ నుంచి నేటి ‘కల్కి’ దాకా సినిమా అంటే కళ్లు చెదిరేలా ఉండాల్సిందే!

ఎక్కడి మహాభారతం? ఎక్కడి 2898 సంవత్సరం? ఇతిహాసాన్ని ఆరువేల సంవత్సరాల భవిష్యత్తుకు ముడిపెట్టి తీసిన కల్పితగాథ ‘కల్కి’కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. హాలీవుడ్‌ క్రిటిక్స్‌ సైతం మార్వెలస్‌గా ఉందని, మరో ప్రపంచంలో విహరింపజేశాడంటూ దర్శకుడిని పొగుడుతున్నారు. ఇక్కడ కథ కంటే భవిష్యత్తులో దర్శకుడి ఊహకు, అందులోని యాక్షన్‌ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

నాటి  కేవీరెడ్డి ‘మాయాబజార్‌’ నుంచి నేటి నాగ అశ్విన్‌ ‘కల్కి’ దాకా సినిమాలో కథ ఉంటుంది. కానీ, కథ కంటే దాని బ్యాక్‌గ్రౌండ్‌కి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. దానికి  కారణం గ్రాఫిక్స్‌ మాయాజాలం. ఒక హీరో క్లైమాక్స్‌లో విలన్‌ తో భూమ్మీదే ఎందుకు పోరాడాలి? ఆ పోరాటం వినీలాకాశంలోనో, సాగర గర్భాంలోనో ఉంటే ఎలా ఉంటుందనే ప్రేక్షకుడి ఊహకు కూడా అందని ఆలోచన ఇప్పుడు తెర మీదకు వస్తోంది. మొత్తంగా ఒక సినిమా ద్వారా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే ప్రేక్షకుడి కోరికను దర్శకులు తీర్చేస్తున్నారు.

కథ కొంచెం.. గ్రాఫిక్స్‌ ఘనం..
సినిమాలో కథ ఉంటుంది. కథకు తగ్గట్లు పాత్రలు కదులుతుంటాయి. కానీ, తెర వెనుక జరిగేదంతా వేరే ఉంటుంది. మొత్తం కంప్యూటర్‌ మీదనే మాయచేస్తారు నిపుణులు. సీన్లను నార్మల్‌గా తీసి దానికి కంప్యూటర్‌లో మెరుగులు అద్ది నిజంగా ఫలానా చోట తీశారా అనే భ్రమను కలిగిస్తారు. అలా కథ కంటే గ్రాఫిక్స్‌ ఘనంగా మారిపోతున్నాయిప్పుడు. గ్రీన్‌ మ్యాట్‌ మీద తీసిన సీన్లకు సినిమాలో చూసిన సీన్లకు తేడా గమనిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు.

పాత్రధారి లేకున్నా..
తెరపై కనిపించకున్నా, నటీనటులు తమ గొంతుతో సినిమాను నడిపించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే టెక్నాలజీకి ముడిపెట్టి వాయిస్‌ ఓవర్‌తో మ్యాజిక్‌ చేయడం ఇప్పుడు చూస్తున్నాం. అమెజాన్, అలెక్సా, యాపిల్‌ సిరి, గూగుల్‌ నౌలను ఎలా ఉపయోగించుకుంటున్నామో అలాగన్నమాట! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌ ్సతో ఆలోచించే అడ్వాన్‌్సడ్‌  వెహికిల్‌గా ‘బుజ్జి’ కల్కి చిత్రంలో అదనపు ఆకర్షణ. నటి కీర్తి సురేష్‌ ఆ ఆకర్షణకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చింది. తెరపై కనిపించకున్నా, ఈ సినిమా సక్సెస్‌లో తన వంతు పాత్రను పోషించింది.

అయితే 2013లోనే ఆ తరహా ప్రయోగం ఒకటి జరిగింది. హాకిన్‌ ఫీనిక్స్‌ లీడ్‌ రోల్‌లో ‘హర్‌’ అనే చిత్రం వచ్చింది. అందులో సమాంత అనే వాయిస్‌ టెక్నాలజీతో భావోద్వేగమైన బంధంలో మునిగిపోతాడు హీరో! నటి స్కార్లెట్‌ జాన్సన్‌ ఆ టెక్‌ వాయిస్‌ ఇవ్వడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. విశేషం ఏమిటంటే  ఏఐ అనే ప్రస్తావన లేకుండా సాగుతుందీ పాత్ర. ఇలా తెర మీద కనిపించకున్నా, ఆర్టిస్టులు ప్రభావం చూపిస్తున్నారు.

కేరాఫ్‌ హాలీవుడ్‌..
ఎలాంటి సాంకేతికతనైనా త్వరగా అందిపుచ్చుకోవడంలో హాలీవుడ్‌ ఎప్పుడూ ముందుంటుంది. గ్రాఫిక్స్‌ మాయాజాలానికి పుట్టినిల్లు అది. మన సినిమాల్లో టెక్నాలజీ వాడకం కొంత మేర ఉంటే, వాళ్లు పూర్తిగా సినిమానే దాంతో నింపేస్తున్నారు. ప్రారంభం నుంచి చివరి దాకా పూర్తిగా గ్రాఫిక్స్‌ మాయాజాలంతో బోలెడు సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి.

అవతార్, మ్యాట్రిక్స్, ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్, జురాసిక్‌ పార్క్, 2012, కింగ్‌ కాంగ్, ది అవెంజర్స్, గ్రావిటీ, ది డార్క్‌ నైట్, పైరెట్స్‌ ఆఫ్‌ ద కరేబియన్, ఇన్‌సెప్షన్, ఏలియన్, టెర్మినేటర్, మమ్మీ, గాడ్జిల్లా, అనకొండ, ది జంగిల్‌ బుక్, లయన్‌ కింగ్‌–  చెబుతూ పోతే కోకొల్లలు. అందుకే మన దర్శకులు అక్కడి టెక్నీషియన్ల సపోర్ట్‌ తీసుకుంటుంటారు. అయితే, వాటికి పనిచేసే టెక్నీషియన్లలో ఎక్కువ మంది అక్కడున్న భారతీయులే. అయితే ఇప్పుడిప్పుడే ఇక్కడి గ్రాఫిక్స్‌ సంస్థలనూ నిర్మాతలు సంప్రదిస్తుండడంతో ఇక్కడి మనవాళ్లకూ తమ ప్రతిభను చూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి.

కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ మొదలు..
చలనచిత్ర రంగంలో గ్రాఫిక్స్‌ పాత్ర క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట్లో సెట్టింగుల కోసం, లొకేషన్ల కోసం హ్యాండ్‌ ప్రింటెడ్‌ బ్యాక్‌ డ్రాప్స్‌ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఆ తర్వాత ఆప్టికల్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయి. 80, 90వ దశకంలో కంప్యూటర్‌ గ్రాఫిక్స్, 2000లో వీఎఫ్‌ఎక్స్‌.. వాటికి సంబంధించి స్టూడియోలే ఏర్పడటం మొదలైంది. సీజీఐ, విజువల్‌ ఎఫెక్ట్స్‌ (వీఎఫ్‌ఎక్స్‌) భూమిక ప్రధానమవుతోంది. భారీ బడ్జెట్‌ సినిమాలంటే ఇప్పుడు కచ్చితంగా వీఎఫ్‌ఎక్స్‌ ఉండాల్సిందే! ఇప్పుడు విజువల్స్‌ అంటే దృశ్య విన్యాసమే కాదు, కథలో అంతర్భాగం కూడా.

ఇలా వచ్చిన రోబో, బాహుబలి చిత్రాలు భారతీయ చిత్రాల సత్తాను అంతర్జాతీయంగా చాటాయి. అయితే సాంకేతికంగా ఇంత అడ్వాన్స్‌మెంట్‌ లేని కాలంలో కూడా  కేవి రెడ్డి, సింగీతం శ్రీనివాస్, శంకర్‌ షణ్ముగంలాంటి సినీ ఉద్దండులు ఈ తరహా ప్రయోగాలకు ఏడు దశాబ్దాల కిందటే క్లాప్‌ కొట్టారు ‘మాయాజబార్‌’తో!  తర్వాత కాలంలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘జీన్‌ ్స’, అమ్మోరు’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘దేవి’, ‘ఇండియన్‌’ మొదలు ‘రోబో’, నిన్నటి ‘బాహుబలి’, నేటి ‘కల్కి 2898 ఏడీ’ వరకు అలాంటి ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచారు. అలా టెక్నాలజీ ఏదోరకంగా తన విజువల్‌ గ్రాండ్యూర్‌తో దేశీ వెండితెర మీద సందడి చేస్తూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ తరహా చిత్రాలే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాయి.

సజీవంగా లేకున్నా..
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా దక్షిణాది హాలీవుడ్‌తో పోటీపడుతోంది. ఏఐని విరివిగా వినియోగిస్తోంది. ఏఐ సాయంతో దివంగత గాయనీ గాయకుల గాత్రాలను వినిపిస్తోంది. నటీనటుల అభినయాన్ని చూపిస్తోంది. గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హాయ్‌ నాన్న’లో ఓ సీన్‌ కోసం ఫారిన్‌ లేడీ వాయిస్‌ను ఏఐ ద్వారానే క్రియేట్‌ చేశారు. ‘లాల్‌ సలామ్‌’ మూవీ కోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ ఆర్‌ రెహమాన్‌ కూడా అలాంటి ప్రయోగమే చేశారు.

2022లో వచ్చిన ‘టాప్‌ గన్‌: మావెరిక్‌’ సినిమాలో లెఫ్టినెంట్‌ టామ్‌ ఐస్‌ మ్యాన్‌ కజన్‌ స్కై పాత్రధారి వల్‌ కిల్మర్‌ కోసం ఏఐ వాయిస్‌ను సృష్టించారు.  2014లో గొంతు కేన్సర్‌ బారినపడి మాట పడిపోయింది ఆయనకు. అయితే ఏఐ సాయంతో అచ్చం ఆయన గొంతునే క్రియేట్‌ చేశారు. అలా దివంగత నటులనూ తెరపై చూపిస్తోంది ఏఐ. కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ తను నటిస్తున్న ‘జేమ్స్‌’ సినిమా సెట్స్‌ మీద ఉండగా గుండెపోటుతో చనిపోయారు. ఆయన నటించాల్సిన మిగిలిన సన్నివేశాలను గ్రాఫిక్స్‌ ద్వారా క్రియేట్‌ చేసి చిత్రాన్ని పూర్తిచేశారు.

మాయల బజార్‌..
ఏఐతో అప్‌డేట్‌ అయిన సినిమాల యుగంలో కూడా మరువకుండా మరీ మరీ ప్రస్తావించుకోవాల్సిన మూవీ ‘మాయాబజార్‌.’ తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని విజువల్‌ వండర్స్‌ వచ్చినా.. ఆ చిత్ర సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకూంటూనే ఉంటారు. గ్రాఫిక్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఊహే లేని .. అంతెందుకు కంప్యూటర్‌ ఉనికే లేని కాలంలో లాప్‌టాప్‌ని పోలిన ప్రియదర్శిని అనే పేటికను, స్కైప్‌ కాల్‌ని తలపించేలా  అభిమన్యుడు–శశిరేఖల వీడియో కాలింగ్‌ని ఎవరైనా ఊహించగలరా? కానీ దర్శకుడు కేవీ రెడ్డి ఆ ఊహకు వెండితెర రూపమిచ్చారు.

అందమైన చందమామను చూస్తూ.. లాహిరి లాహిరిలో అంటూ సాగే అందులోని పాటను వాస్తవానికి ఓ ఎర్రటి ఎండలో తీశారంటే నమ్మగలమా? ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్‌ మాయా విన్యాసాలను ఇమాజిన్‌ చేయగలమా? ఆశ్చర్యం! రెట్రో రీల్, ఆంగ్లో–ఇండియన్‌  కెమెరామన్‌  మార్కస్‌ బార్టే› కెమెరా అద్భుతం అది! వివాహ భోజనంబు పాటనైతేతే నాలుగు రోజులపాటు శ్రమించి..  కెమెరా టెక్నిక్స్, స్టాప్‌ మోషన్‌  యానిమేషన్‌  టెక్నాలజీతో దాన్ని చిత్రీకరించారట.

ఎంత ఎక్కువ టైమ్‌ తీసుకుంటే.. 
విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధానాంశంగా ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు వస్తున్నాయి.  అయితే భారీ బడ్జెట్‌.. విజువల్స్‌ బేస్‌ చేసుకుని సినిమా తీస్తున్నప్పుడు దానికి తగినంత సమయం ఇవ్వకపోతే ఆశించినంత రిజల్ట్‌ రాదు. గత ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఒక మైథలాజికల్‌ పాన్‌ ఇండియా మూవీ విషయంలో ఇదే జరిగింది. ప్రీ–ప్రొడక్షన్‌ కి సరైన సమయం ఇవ్వకుండా మేకర్స్‌ చాలా తొందరపడ్డారు.

ఫలితంగా ఆ చిత్రం  విజువల్స్‌ నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరిగింది. అలాగే టైమ్‌ తీసుకున్న చిత్రాలు మంచి అవుట్‌ ఫుట్‌ను ఇచ్చాయి. కాబట్టే ఆ సినిమాల కంటెంట్‌కి, విజువల్స్‌కి మ్యాచ్‌ అయింది. ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసి బాక్సాఫీస్‌ సక్సెస్‌నూ సాధించాయి. ఫిల్మ్‌ మేకింగ్‌ అనేది క్రియేటివ్‌ ప్రాసెస్‌. అలాగని వీఎఫ్‌ఎక్స్‌తో ప్రయోగాలు చేసినా.. తొందర పెట్టినా.. బడ్జెట్‌ అంతకంతకూ పెరగడంతో పాటు అవుట్‌ ఫుట్‌ కూడా దెబ్బ తింటుంది. – పి. లక్ష్మీనారాయణ, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు

ఇదీ చిత్రమే..
‘అపూర్వ సహోదరులు’లో మరుగుజ్జుగా  కమల్‌ హాసన్‌  నటన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కమల్‌ను అలా ఎలా చూపించారనే ఆసక్తికరమైన చర్చ నడిచింది అప్పట్లో. ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం తొలిసారి డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది.. విజువల్‌ ఎఫెక్ట్‌ డిజైనర్‌ ఎస్టీ వెంకీకి తొలి చిత్రం.

అందులోని పాటలు, సర్కస్‌ పోర్షన్‌కి ఈ టెక్నాలజీని వాడారు. అయితే పొట్టి కమల్‌ హాసన్‌  కోసం ప్రత్యేకించి గ్రాఫిక్స్‌ ఉపయోగించకపోవడం గమనార్హం. డిఫరెంట్‌ టెక్నిక్స్‌.. డిఫరెంట్‌ కెమెరా యాంగిల్స్‌లో చిత్రీకరించారు. ఇందుకోసం మోకాళ్లకు ప్రత్యేకంగా తయారు చేసిన షూ వాడడం, స్టడీ షాట్‌లో గుంతలు తీసి  మోకాళ్ల దాకా కమల్‌ హాసన్‌ను అందులో పాతిపెట్టడం వంటివి చేశారట.

డీ–ఏజ్‌ క్లిక్కు.. లుక్కుతో కిక్కు..
మేకప్‌ విషయానికి వస్తే.. స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కోసం మేకప్‌ అనే మాట ఏనాడో పాతదైపోయింది. ప్రోస్తటిక్, త్రీడీ మేకప్‌లతో అది కథలో భాగమైంది. ఇదింత మేకప్‌ అయి వచ్చినా టెక్నాలజీ ఎఫెక్ట్‌కి ఫేడ్‌కాక తప్పట్లేదు. దాన్నలా ఫేడ్‌ అవుట్‌ చేస్తోంది డీ–ఏజింగ్‌ డిజిటల్‌ మేకప్‌. ఇది సిల్వర్‌ స్క్రీన్‌ ౖపై చేస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. వయసు పైబడిన హీరో, హీరోయిన్లను యంగ్‌గా చూపించేందుకు విజువల్‌ ఎఫెక్ట్‌ ఆర్టిస్టులు ‘డీ–ఏజింగ్‌’ టెక్నిక్‌ను వాడుతున్నారు. దీనిద్వారా ఆర్టిస్ట్‌ ముఖంతో పాటు బాడీ షేపుల్లోనూ మార్పులు చేసుకునే వీలుంటుంది.

2006లో ‘ఎక్స్‌మెన్‌ : ది లాస్ట్‌ స్టాండ్‌’లో ప్యాట్రిక్‌ స్టీవార్ట్, ఇయాన్‌  మెకెల్లెన్‌ ల కోసం ‘డీ–ఏజింగ్‌’ టెక్నిక్‌ని ఫస్ట్‌ టైమ్‌ పక్కాగా వాడారు. హెచ్‌బీవో నిర్మించిన ‘ది రైటస్‌ జెమ్‌స్టోన్‌ ్స’ టీవీ సిరీస్‌లో నటుడు జాన్‌  గుడ్‌మన్‌  కోసం ఒక ఎపిసోడ్‌ మొత్తం డిజిటల్లీ డీ–ఏజ్డ్‌ టెక్నాలజీనే ఉపయోగించారు. ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’లో క్రియేటర్‌ సాన్లీ గెస్ట్‌ అపియరెన్‌ ్స కోసం రెండు వందల షాట్స్‌తో ఒక సీన్‌  రూపొందించారు.

‘టెర్మినేటర్‌:  డార్క్‌ ఫేట్, ఇట్‌– చాప్టర్‌2’లో ఈ టెక్నిక్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ‘కెప్టెన్‌  మార్వెల్‌’, ‘జెమినీ మ్యాన్‌ ’, ‘ది ఐరిష్‌మ్యాన్‌ ’– ఈ మూడు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్‌ అయ్యాయి. ‘కెప్టెన్‌  మార్వెల్‌’లో నిక్‌ ఫ్యూరీ క్యారెక్టర్‌ కోసం శామ్యూల్‌ జాక్సన్‌ ని కొద్దిసేపు యంగ్‌స్టర్‌గా చూపించారు. ‘జెమినీ మ్యాన్‌ ’ కోసం విల్‌ స్మిత్‌ను ఏకంగా ఇరవై మూడేళ్ల యువకుడిగా చూపించారు. మార్టిన్‌ స్కార్సిస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మాణంలో ‘ది ఐరిష్‌ మ్యాన్‌ ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఇందులో డెబ్బైతొమ్మిదేళ్ల రాబర్ట్‌ డి నీరో.. నలభై తొమ్మిదేళ్ల క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. ఈ మూడు సినిమాలూ ఆస్కార్‌ 2020 బరిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కేటగిరీలో ఎంపికయ్యాయి. ఇంతకాలం హాలీవుడ్‌కే పరిమితం అనుకున్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మన చిత్రాల కోసం కూడా వినియోగిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో ఐశ్వర్య రాయ్‌ని అలాగే తీర్చిదిద్దారు. అందులో ఆమె గుండ్రటి మొహం కాస్త కోలగా మారి ఆ సినిమాలో ఆమె వయసు తగ్గినట్టు కనిపిస్తుంది.

ధైర్యంగా ముందుకు..
కథాంశాన్ని బట్టి బడ్జెట్‌ మారుతుంది. కానీ, భారీ హంగులే ప్రధానాంశమైతే సినిమా బడ్జెట్‌ బరువు పెరుగుతుంది. ఒకప్పుడు స్టార్‌ యాక్టర్స్, భారీ సెట్లు, ఫారిన్‌ లొకేషన్ల కోసం బడ్జెట్‌ భారీగా మారేది. ఇప్పుడు ఆ జాబితాలో  తారాగణం పారితోషికాలను మినహాయిస్తే మిగిలిన వాటి స్థానాలను ఒక్క గ్రాఫిక్సే భర్తీ చేస్తున్నాయి భారీగా. దీనివల్ల ఒక సినిమాకు ఐదారుగురు నిర్మాతలనే హాలీవుడ్‌ తీరూ మనకూ అనివార్యమైంది. ఇప్పుడు మన సినిమాలకు ఒకరి కన్నా ఎక్కువ మంది నిర్మాతలు ఉండటం, అంతర్జాతీయ సంస్థలూ భాగస్వాములుగా చేరుతుండటం సాధారణమైంది.

దీనివల్ల విజువల్‌ వండర్స్‌ క్రియేట్‌ అవుతున్నాయి కదా అంటాయి సినీ వర్గాలు. కావచ్చు. ఈ బడ్జెట్‌తోనే వీఎఫ్‌ఎక్స్‌ సామాజిక అంశాలతో పాటు చరిత్ర, పురాణేతిహాసాలు, టైమ్‌ ట్రావెల్, కృష్ణ బిలాలు, సాపేక్ష సిద్ధాంతం లాంటి సంక్లిష్టమైన విషయాలను కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో కన్నులకు కడుతోంది. అందుకే కథను బట్టి గ్రాఫిక్స్‌ కాదు, గ్రాఫిక్స్‌ని బట్టే కథను రాసుకుంటున్నారు దర్శకులు. దాన్ని భరించే నిర్మాతలను వెదుక్కుంటున్నారు. దాంతో వీఎఫ్‌ఎక్స్‌ సినిమాకు కమర్షియల్‌ ఎలిమెంట్‌గా మారింది. దీనికి భాషతో సంబంధం లేకుండా పాన్‌ ఇండియా లెవెల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరిగింది.

గంటల నుంచి నెలలు..
సాధారణంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ (వీఎఫ్‌ఎక్స్‌)కు అయ్యే ఖర్చు ఎంతమంది నిపుణులు పని చేస్తారు, వాళ్ల అనుభవం, ఎన్ని వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ను ఉపయోగిస్తారు, వాటి నిడివి, అలాగే వాళ్లు ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లను బట్టి ఉంటుంది. ఆ అవసరాలకు తగ్గట్లు బడ్జెట్‌ కేటాయిస్తుంటారు నిర్మాతలు. కంపెనీ ప్రతినిధులను గంటల లెక్క నుంచి రోజులు, నెలల లెక్కన కేటాయిస్తాయి అవసరాలన్ని బట్టి. కేవలం కంపెనీలు మాత్రమే కాదు, ఫ్రీలాన్‌ ్సగా పని చేసే నిపుణులూ ఉన్నారు.

మన దేశంలో వీఎఫ్‌ఎక్స్‌ నాణ్యత, నిడివి ప్రాతిపదికన నిమిషానికి రూ.500 నుంచి రూ. 2000 దాకా తీసుకునే వీడియో ఎడిటర్లు ఉన్నారు.  వీఎఫ్‌ఎక్స్‌లో షాట్స్‌ను బట్టి పని లెక్క ఉంటుంది. పది కంటే తక్కువ వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉంటే దాన్ని మినిమమ్‌ వర్క్‌గా భావిస్తారు. 10–50, 50–100, వంద కంటే ఎక్కువ వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ను అవసరానికనుగుణంగా వినియోగిస్తుంటారు.

అయితే ఒక నిమిషం నిడివి ఉన్న వీఎఫ్‌ఎక్స్‌ వీడియో తీయాలంటే రూ. 80 వేల నుంచి లక్షన్నర రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇందులో.. ఇంటర్మీడియట్, అడ్వాన్‌ ్సడ్, హైలీ కాంప్లెక్స్‌ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ స్థాయిలు ఉంటాయి. ఒక్కొ లెవెల్‌ ముందుకు వెళ్లేకొద్దీ..  అంతకు మించే(రెట్టింపు) ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తోడయ్యాక ఇది మరింత ఖరీదుతో కూడిన వ్యవహారంగా మారింది. కానీ, ఇందులోనూ రకాలున్నాయి. తేలికగా అయ్యే వీఎఫ్‌ఎక్స్‌ కోసం ఖర్చు తక్కువగా ఉంటుంది. అదే షార్ట్‌ ఫిల్మ్, యానిమేషన్, షూటింగ్‌ లైవ్‌ యాక్షన్‌  లార్జ్‌ స్కేల్‌ వీఎఫ్‌ఎక్స్‌– ఇలా ఒక్కో కేటగరీలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చు పెరుగుతూ పోతుంది.

ఉదాహరణకు ‘అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌’ చిత్రం కోసం 4 వేల వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ను క్రియేట్‌ చేశారట! కానీ, అందులో 3,289 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ను మాత్రమే తీసుకున్నాడట దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ . ఆ ఒక్కో వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌ కోసం 62,500 డాలర్ల ఖర్చు అయ్యింది. ఆ సినిమా మొత్తం బడ్జెట్‌లో వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ కోసమే 250 మిలియన్‌ డాలర్లను ఖర్చుపెట్టారట! అయితే సినీ చరిత్రలో ఇప్పటి దాకా సీజీఐ కోసం అత్యధికంగా ఖర్చు పెట్టింది మాత్రం ‘ది అవెంజర్స్‌–ఎండ్‌గేమ్‌.’ వీటికోసం 356 మిలియన్ల డాలర్లను కుమ్మరించారంటే అతిశయోక్తికాదు. అలాగే, విజువల్స్‌ కోసం అత్యధికంగా బడ్జెట్‌ కేటాయించిన టాప్‌ 3 చిత్రాలు కూడా మార్వెల్‌ సినిమాలే కావడం మరో విశేషం! ఇదీ స్క్రీన్‌ మీద ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్‌ఎక్స్‌లు క్రియేట్‌ చేసే సీన్‌! – భాస్కర్‌ శ్రీపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement