Kamalhasan
-
స్క్రీన్ మారలేదు, సీనే మారింది!
కథ చదవడం, వినడం పాత ప్రక్రియ! చూడటం వన్నె తగ్గని వెండితెర పంచే వింత వినోదం! కథను ఆడించే ఆ వెండితెర ఇంద్రజాలం నేర్చుకుంటే? మెదడు ఊహించని లోకాలకు తీసుకెళ్తుంది, నిజమే నమ్మలేని దృశ్యాలను చూపిస్తుంది. అదొక నయనానందం, అదొక మనోల్లాసం! మొత్తంగా మనిషిని మునివేళ్ల మీద నిలబట్టే సరికొత్త ప్రక్రియ! స్క్రీన్ మారలేదు, సీనే మారింది! బిహైండ్ ద స్క్రీన్ టోటల్‌గా చేంజ్ అయింది!కెమెరా కంటే ఎఫెక్ట్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఔట్ డోర్ కంటే గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎడిట్ సూట్స్ కంటే వీఎఫ్ఎక్స్ పవర్ ప్రదర్శిస్తున్నాయి. అవే మొన్న బాహుబలిని ప్రెజెంట్ చేశాయి. ఈరోజు కల్కిని క్రియేట్ చేశాయి. టాక్ ఆఫ్ ద కంట్రీ అయ్యాయి. ఆ ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్ఎక్స్ను కంపాక్ట్‌గా చూద్దాం..అనాథ అయిన హీరో– అంతరిక్షం నుంచి భూమ్మీదకు పడే వస్తువులను అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. ఒక రోజు విజిటింగ్ వీసా మీద వేరే గ్రహం నుంచి వచ్చిన హీరోయిన్ను చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని సుదూరంలో ఉన్న ఆమె గ్రహానికి వెళ్తాడు. అక్కడ ఆమె తండ్రి మొదట వాళ్ల ప్రేమను కాదంటాడు. అక్కడికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే బ్లాక్ హోల్ దగ్గర ఉన్న తమ వారసత్వ సంపద టెక్నాలజీని తెస్తే పెళ్లికి ఒప్పుకుంటానని కండిషన్ పెడతాడు. దీంతో హీరో స్పేస్‌లో సాహసాలు చేయాల్సి వస్తుంది.ఆ ప్రయత్నంలో తన తల్లిదండ్రులు మరో గ్రహంపై బందీలుగా ఉన్నారనే షాకింగ్ విషయం హీరోకి తెలుస్తుంది. వెంటనే అక్కడకు చేరుకుని విలన్ల భరతం పడతాడు. వాళ్లను విడిపించుకుని, చాలెంజ్‌లో నెగ్గి హీరోయిన్ను దక్కించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ప్రేమ, ప్రతీకారం, లోక కల్యాణం కోసం విలన్‌ను హీరో అంతం చేయడం అనాదిగా తెలుగు సినిమాలో వస్తున్న స్టోరీ లైన్. కాకపోతే మారింది సినిమా పరిధి. నాటి ‘పాతాళ భైరవి’ నుంచి నేటి ‘కల్కి’ దాకా సినిమా అంటే కళ్లు చెదిరేలా ఉండాల్సిందే!ఎక్కడి మహాభారతం? ఎక్కడి 2898 సంవత్సరం? ఇతిహాసాన్ని ఆరువేల సంవత్సరాల భవిష్యత్తుకు ముడిపెట్టి తీసిన కల్పితగాథ ‘కల్కి’కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం మార్వెలస్‌గా ఉందని, మరో ప్రపంచంలో విహరింపజేశాడంటూ దర్శకుడిని పొగుడుతున్నారు. ఇక్కడ కథ కంటే భవిష్యత్తులో దర్శకుడి ఊహకు, అందులోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.నాటి కేవీరెడ్డి ‘మాయాబజార్’ నుంచి నేటి నాగ అశ్విన్ ‘కల్కి’ దాకా సినిమాలో కథ ఉంటుంది. కానీ, కథ కంటే దాని బ్యాక్‌గ్రౌండ్‌కి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. దానికి కారణం గ్రాఫిక్స్ మాయాజాలం. ఒక హీరో క్లైమాక్స్‌లో విలన్ తో భూమ్మీదే ఎందుకు పోరాడాలి? ఆ పోరాటం వినీలాకాశంలోనో, సాగర గర్భాంలోనో ఉంటే ఎలా ఉంటుందనే ప్రేక్షకుడి ఊహకు కూడా అందని ఆలోచన ఇప్పుడు తెర మీదకు వస్తోంది. మొత్తంగా ఒక సినిమా ద్వారా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే ప్రేక్షకుడి కోరికను దర్శకులు తీర్చేస్తున్నారు.కథ కొంచెం.. గ్రాఫిక్స్ ఘనం..సినిమాలో కథ ఉంటుంది. కథకు తగ్గట్లు పాత్రలు కదులుతుంటాయి. కానీ, తెర వెనుక జరిగేదంతా వేరే ఉంటుంది. మొత్తం కంప్యూటర్ మీదనే మాయచేస్తారు నిపుణులు. సీన్లను నార్మల్‌గా తీసి దానికి కంప్యూటర్లో మెరుగులు అద్ది నిజంగా ఫలానా చోట తీశారా అనే భ్రమను కలిగిస్తారు. అలా కథ కంటే గ్రాఫిక్స్ ఘనంగా మారిపోతున్నాయిప్పుడు. గ్రీన్ మ్యాట్ మీద తీసిన సీన్లకు సినిమాలో చూసిన సీన్లకు తేడా గమనిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు.పాత్రధారి లేకున్నా..తెరపై కనిపించకున్నా, నటీనటులు తమ గొంతుతో సినిమాను నడిపించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే టెక్నాలజీకి ముడిపెట్టి వాయిస్ ఓవర్‌తో మ్యాజిక్ చేయడం ఇప్పుడు చూస్తున్నాం. అమెజాన్, అలెక్సా, యాపిల్ సిరి, గూగుల్ నౌలను ఎలా ఉపయోగించుకుంటున్నామో అలాగన్నమాట! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్సతో ఆలోచించే అడ్వాన్్సడ్ వెహికిల్‌గా ‘బుజ్జి’ కల్కి చిత్రంలో అదనపు ఆకర్షణ. నటి కీర్తి సురేష్ ఆ ఆకర్షణకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. తెరపై కనిపించకున్నా, ఈ సినిమా సక్సెస్‌లో తన వంతు పాత్రను పోషించింది.అయితే 2013లోనే ఆ తరహా ప్రయోగం ఒకటి జరిగింది. హాకిన్ ఫీనిక్స్ లీడ్ రోల్లో ‘హర్’ అనే చిత్రం వచ్చింది. అందులో సమాంత అనే వాయిస్ టెక్నాలజీతో భావోద్వేగమైన బంధంలో మునిగిపోతాడు హీరో! నటి స్కార్లెట్ జాన్సన్ ఆ టెక్ వాయిస్ ఇవ్వడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. విశేషం ఏమిటంటే ఏఐ అనే ప్రస్తావన లేకుండా సాగుతుందీ పాత్ర. ఇలా తెర మీద కనిపించకున్నా, ఆర్టిస్టులు ప్రభావం చూపిస్తున్నారు.కేరాఫ్ హాలీవుడ్..ఎలాంటి సాంకేతికతనైనా త్వరగా అందిపుచ్చుకోవడంలో హాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. గ్రాఫిక్స్ మాయాజాలానికి పుట్టినిల్లు అది. మన సినిమాల్లో టెక్నాలజీ వాడకం కొంత మేర ఉంటే, వాళ్లు పూర్తిగా సినిమానే దాంతో నింపేస్తున్నారు. ప్రారంభం నుంచి చివరి దాకా పూర్తిగా గ్రాఫిక్స్ మాయాజాలంతో బోలెడు సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి.అవతార్, మ్యాట్రిక్స్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, జురాసిక్ పార్క్, 2012, కింగ్ కాంగ్, ది అవెంజర్స్, గ్రావిటీ, ది డార్క్ నైట్, పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్, ఇన్సెప్షన్, ఏలియన్, టెర్మినేటర్, మమ్మీ, గాడ్జిల్లా, అనకొండ, ది జంగిల్ బుక్, లయన్ కింగ్– చెబుతూ పోతే కోకొల్లలు. అందుకే మన దర్శకులు అక్కడి టెక్నీషియన్ల సపోర్ట్ తీసుకుంటుంటారు. అయితే, వాటికి పనిచేసే టెక్నీషియన్లలో ఎక్కువ మంది అక్కడున్న భారతీయులే. అయితే ఇప్పుడిప్పుడే ఇక్కడి గ్రాఫిక్స్ సంస్థలనూ నిర్మాతలు సంప్రదిస్తుండడంతో ఇక్కడి మనవాళ్లకూ తమ ప్రతిభను చూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి.కంప్యూటర్ గ్రాఫిక్స్ మొదలు..చలనచిత్ర రంగంలో గ్రాఫిక్స్ పాత్ర క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట్లో సెట్టింగుల కోసం, లొకేషన్ల కోసం హ్యాండ్ ప్రింటెడ్ బ్యాక్ డ్రాప్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఆ తర్వాత ఆప్టికల్ ఎఫెక్ట్స్ వచ్చాయి. 80, 90వ దశకంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, 2000లో వీఎఫ్ఎక్స్.. వాటికి సంబంధించి స్టూడియోలే ఏర్పడటం మొదలైంది. సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) భూమిక ప్రధానమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలంటే ఇప్పుడు కచ్చితంగా వీఎఫ్ఎక్స్ ఉండాల్సిందే! ఇప్పుడు విజువల్స్ అంటే దృశ్య విన్యాసమే కాదు, కథలో అంతర్భాగం కూడా.ఇలా వచ్చిన రోబో, బాహుబలి చిత్రాలు భారతీయ చిత్రాల సత్తాను అంతర్జాతీయంగా చాటాయి. అయితే సాంకేతికంగా ఇంత అడ్వాన్స్మెంట్ లేని కాలంలో కూడా కేవి రెడ్డి, సింగీతం శ్రీనివాస్, శంకర్ షణ్ముగంలాంటి సినీ ఉద్దండులు ఈ తరహా ప్రయోగాలకు ఏడు దశాబ్దాల కిందటే క్లాప్ కొట్టారు ‘మాయాజబార్’తో! తర్వాత కాలంలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘జీన్ ్స’, అమ్మోరు’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘దేవి’, ‘ఇండియన్’ మొదలు ‘రోబో’, నిన్నటి ‘బాహుబలి’, నేటి ‘కల్కి 2898 ఏడీ’ వరకు అలాంటి ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచారు. అలా టెక్నాలజీ ఏదోరకంగా తన విజువల్ గ్రాండ్యూర్‌తో దేశీ వెండితెర మీద సందడి చేస్తూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ తరహా చిత్రాలే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాయి.సజీవంగా లేకున్నా..సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా దక్షిణాది హాలీవుడ్‌తో పోటీపడుతోంది. ఏఐని విరివిగా వినియోగిస్తోంది. ఏఐ సాయంతో దివంగత గాయనీ గాయకుల గాత్రాలను వినిపిస్తోంది. నటీనటుల అభినయాన్ని చూపిస్తోంది. గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’లో ఓ సీన్ కోసం ఫారిన్ లేడీ వాయిస్‌ను ఏఐ ద్వారానే క్రియేట్ చేశారు. ‘లాల్ సలామ్’ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కూడా అలాంటి ప్రయోగమే చేశారు.2022లో వచ్చిన ‘టాప్ గన్: మావెరిక్’ సినిమాలో లెఫ్టినెంట్ టామ్ ఐస్ మ్యాన్ కజన్ స్కై పాత్రధారి వల్ కిల్మర్ కోసం ఏఐ వాయిస్‌ను సృష్టించారు. 2014లో గొంతు కేన్సర్ బారినపడి మాట పడిపోయింది ఆయనకు. అయితే ఏఐ సాయంతో అచ్చం ఆయన గొంతునే క్రియేట్ చేశారు. అలా దివంగత నటులనూ తెరపై చూపిస్తోంది ఏఐ. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తను నటిస్తున్న ‘జేమ్స్’ సినిమా సెట్స్ మీద ఉండగా గుండెపోటుతో చనిపోయారు. ఆయన నటించాల్సిన మిగిలిన సన్నివేశాలను గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసి చిత్రాన్ని పూర్తిచేశారు.మాయల బజార్..ఏఐతో అప్డేట్ అయిన సినిమాల యుగంలో కూడా మరువకుండా మరీ మరీ ప్రస్తావించుకోవాల్సిన మూవీ ‘మాయాబజార్.’ తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని విజువల్ వండర్స్ వచ్చినా.. ఆ చిత్ర సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకూంటూనే ఉంటారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఊహే లేని .. అంతెందుకు కంప్యూటర్ ఉనికే లేని కాలంలో లాప్టాప్ని పోలిన ప్రియదర్శిని అనే పేటికను, స్కైప్ కాల్ని తలపించేలా అభిమన్యుడు–శశిరేఖల వీడియో కాలింగ్‌ని ఎవరైనా ఊహించగలరా? కానీ దర్శకుడు కేవీ రెడ్డి ఆ ఊహకు వెండితెర రూపమిచ్చారు.అందమైన చందమామను చూస్తూ.. లాహిరి లాహిరిలో అంటూ సాగే అందులోని పాటను వాస్తవానికి ఓ ఎర్రటి ఎండలో తీశారంటే నమ్మగలమా? ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్ మాయా విన్యాసాలను ఇమాజిన్ చేయగలమా? ఆశ్చర్యం! రెట్రో రీల్, ఆంగ్లో–ఇండియన్ కెమెరామన్ మార్కస్ బార్టే› కెమెరా అద్భుతం అది! వివాహ భోజనంబు పాటనైతేతే నాలుగు రోజులపాటు శ్రమించి.. కెమెరా టెక్నిక్స్, స్టాప్ మోషన్ యానిమేషన్ టెక్నాలజీతో దాన్ని చిత్రీకరించారట.ఎంత ఎక్కువ టైమ్ తీసుకుంటే.. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాంశంగా ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు వస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్.. విజువల్స్ బేస్ చేసుకుని సినిమా తీస్తున్నప్పుడు దానికి తగినంత సమయం ఇవ్వకపోతే ఆశించినంత రిజల్ట్ రాదు. గత ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఒక మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇదే జరిగింది. ప్రీ–ప్రొడక్షన్ కి సరైన సమయం ఇవ్వకుండా మేకర్స్ చాలా తొందరపడ్డారు.ఫలితంగా ఆ చిత్రం విజువల్స్ నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అలాగే టైమ్ తీసుకున్న చిత్రాలు మంచి అవుట్ ఫుట్‌ను ఇచ్చాయి. కాబట్టే ఆ సినిమాల కంటెంట్‌కి, విజువల్స్‌కి మ్యాచ్ అయింది. ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ సక్సెస్‌నూ సాధించాయి. ఫిల్మ్ మేకింగ్ అనేది క్రియేటివ్ ప్రాసెస్. అలాగని వీఎఫ్ఎక్స్తో ప్రయోగాలు చేసినా.. తొందర పెట్టినా.. బడ్జెట్ అంతకంతకూ పెరగడంతో పాటు అవుట్ ఫుట్ కూడా దెబ్బ తింటుంది. – పి. లక్ష్మీనారాయణ, వీఎఫ్ఎక్స్ నిపుణుడుఇదీ చిత్రమే..‘అపూర్వ సహోదరులు’లో మరుగుజ్జుగా కమల్ హాసన్ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కమల్‌ను అలా ఎలా చూపించారనే ఆసక్తికరమైన చర్చ నడిచింది అప్పట్లో. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం తొలిసారి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది.. విజువల్ ఎఫెక్ట్ డిజైనర్ ఎస్టీ వెంకీకి తొలి చిత్రం.అందులోని పాటలు, సర్కస్ పోర్షన్‌కి ఈ టెక్నాలజీని వాడారు. అయితే పొట్టి కమల్ హాసన్ కోసం ప్రత్యేకించి గ్రాఫిక్స్ ఉపయోగించకపోవడం గమనార్హం. డిఫరెంట్ టెక్నిక్స్.. డిఫరెంట్ కెమెరా యాంగిల్స్‌లో చిత్రీకరించారు. ఇందుకోసం మోకాళ్లకు ప్రత్యేకంగా తయారు చేసిన షూ వాడడం, స్టడీ షాట్లో గుంతలు తీసి మోకాళ్ల దాకా కమల్ హాసన్‌ను అందులో పాతిపెట్టడం వంటివి చేశారట.డీ–ఏజ్ క్లిక్కు.. లుక్కుతో కిక్కు..మేకప్ విషయానికి వస్తే.. స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మేకప్ అనే మాట ఏనాడో పాతదైపోయింది. ప్రోస్తటిక్, త్రీడీ మేకప్‌లతో అది కథలో భాగమైంది. ఇదింత మేకప్ అయి వచ్చినా టెక్నాలజీ ఎఫెక్ట్‌కి ఫేడ్కాక తప్పట్లేదు. దాన్నలా ఫేడ్ అవుట్ చేస్తోంది డీ–ఏజింగ్ డిజిటల్ మేకప్. ఇది సిల్వర్ స్క్రీన్ ౖపై చేస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. వయసు పైబడిన హీరో, హీరోయిన్లను యంగ్‌గా చూపించేందుకు విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్టులు ‘డీ–ఏజింగ్’ టెక్నిక్‌ను వాడుతున్నారు. దీనిద్వారా ఆర్టిస్ట్ ముఖంతో పాటు బాడీ షేపుల్లోనూ మార్పులు చేసుకునే వీలుంటుంది.2006లో ‘ఎక్స్‌మెన్ : ది లాస్ట్ స్టాండ్’లో ప్యాట్రిక్ స్టీవార్ట్, ఇయాన్ మెకెల్లెన్ ల కోసం ‘డీ–ఏజింగ్’ టెక్నిక్‌ని ఫస్ట్ టైమ్ పక్కాగా వాడారు. హెచ్‌బీవో నిర్మించిన ‘ది రైటస్ జెమ్‌స్టోన్ ్స’ టీవీ సిరీస్‌లో నటుడు జాన్ గుడ్మన్ కోసం ఒక ఎపిసోడ్ మొత్తం డిజిటల్లీ డీ–ఏజ్డ్ టెక్నాలజీనే ఉపయోగించారు. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’లో క్రియేటర్ సాన్లీ గెస్ట్ అపియరెన్ ్స కోసం రెండు వందల షాట్స్‌తో ఒక సీన్ రూపొందించారు.‘టెర్మినేటర్: డార్క్ ఫేట్, ఇట్– చాప్టర్2’లో ఈ టెక్నిక్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ‘కెప్టెన్ మార్వెల్’, ‘జెమినీ మ్యాన్ ’, ‘ది ఐరిష్‌మ్యాన్ ’– ఈ మూడు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయ్యాయి. ‘కెప్టెన్ మార్వెల్’లో నిక్ ఫ్యూరీ క్యారెక్టర్ కోసం శామ్యూల్ జాక్సన్ ని కొద్దిసేపు యంగ్‌స్టర్‌గా చూపించారు. ‘జెమినీ మ్యాన్ ’ కోసం విల్ స్మిత్‌ను ఏకంగా ఇరవై మూడేళ్ల యువకుడిగా చూపించారు. మార్టిన్ స్కార్సిస్.. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో ‘ది ఐరిష్ మ్యాన్ ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఇందులో డెబ్బైతొమ్మిదేళ్ల రాబర్ట్ డి నీరో.. నలభై తొమ్మిదేళ్ల క్యారెక్టర్లో కనిపిస్తాడు. ఈ మూడు సినిమాలూ ఆస్కార్ 2020 బరిలో విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఎంపికయ్యాయి. ఇంతకాలం హాలీవుడ్‌కే పరిమితం అనుకున్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మన చిత్రాల కోసం కూడా వినియోగిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్య రాయ్‌ని అలాగే తీర్చిదిద్దారు. అందులో ఆమె గుండ్రటి మొహం కాస్త కోలగా మారి ఆ సినిమాలో ఆమె వయసు తగ్గినట్టు కనిపిస్తుంది.ధైర్యంగా ముందుకు..కథాంశాన్ని బట్టి బడ్జెట్ మారుతుంది. కానీ, భారీ హంగులే ప్రధానాంశమైతే సినిమా బడ్జెట్ బరువు పెరుగుతుంది. ఒకప్పుడు స్టార్ యాక్టర్స్, భారీ సెట్లు, ఫారిన్ లొకేషన్ల కోసం బడ్జెట్ భారీగా మారేది. ఇప్పుడు ఆ జాబితాలో తారాగణం పారితోషికాలను మినహాయిస్తే మిగిలిన వాటి స్థానాలను ఒక్క గ్రాఫిక్సే భర్తీ చేస్తున్నాయి భారీగా. దీనివల్ల ఒక సినిమాకు ఐదారుగురు నిర్మాతలనే హాలీవుడ్ తీరూ మనకూ అనివార్యమైంది. ఇప్పుడు మన సినిమాలకు ఒకరి కన్నా ఎక్కువ మంది నిర్మాతలు ఉండటం, అంతర్జాతీయ సంస్థలూ భాగస్వాములుగా చేరుతుండటం సాధారణమైంది.దీనివల్ల విజువల్ వండర్స్ క్రియేట్ అవుతున్నాయి కదా అంటాయి సినీ వర్గాలు. కావచ్చు. ఈ బడ్జెట్‌తోనే వీఎఫ్ఎక్స్ సామాజిక అంశాలతో పాటు చరిత్ర, పురాణేతిహాసాలు, టైమ్ ట్రావెల్, కృష్ణ బిలాలు, సాపేక్ష సిద్ధాంతం లాంటి సంక్లిష్టమైన విషయాలను కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో కన్నులకు కడుతోంది. అందుకే కథను బట్టి గ్రాఫిక్స్ కాదు, గ్రాఫిక్స్‌ని బట్టే కథను రాసుకుంటున్నారు దర్శకులు. దాన్ని భరించే నిర్మాతలను వెదుక్కుంటున్నారు. దాంతో వీఎఫ్ఎక్స్ సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్‌గా మారింది. దీనికి భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవెల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరిగింది.గంటల నుంచి నెలలు..సాధారణంగా విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్)కు అయ్యే ఖర్చు ఎంతమంది నిపుణులు పని చేస్తారు, వాళ్ల అనుభవం, ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను ఉపయోగిస్తారు, వాటి నిడివి, అలాగే వాళ్లు ఉపయోగించే సాఫ్ట్వేర్లను బట్టి ఉంటుంది. ఆ అవసరాలకు తగ్గట్లు బడ్జెట్ కేటాయిస్తుంటారు నిర్మాతలు. కంపెనీ ప్రతినిధులను గంటల లెక్క నుంచి రోజులు, నెలల లెక్కన కేటాయిస్తాయి అవసరాలన్ని బట్టి. కేవలం కంపెనీలు మాత్రమే కాదు, ఫ్రీలాన్ ్సగా పని చేసే నిపుణులూ ఉన్నారు.మన దేశంలో వీఎఫ్ఎక్స్ నాణ్యత, నిడివి ప్రాతిపదికన నిమిషానికి రూ.500 నుంచి రూ. 2000 దాకా తీసుకునే వీడియో ఎడిటర్లు ఉన్నారు. వీఎఫ్ఎక్స్లో షాట్స్‌ను బట్టి పని లెక్క ఉంటుంది. పది కంటే తక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటే దాన్ని మినిమమ్ వర్క్‌గా భావిస్తారు. 10–50, 50–100, వంద కంటే ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను అవసరానికనుగుణంగా వినియోగిస్తుంటారు.అయితే ఒక నిమిషం నిడివి ఉన్న వీఎఫ్ఎక్స్ వీడియో తీయాలంటే రూ. 80 వేల నుంచి లక్షన్నర రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇందులో.. ఇంటర్మీడియట్, అడ్వాన్ ్సడ్, హైలీ కాంప్లెక్స్ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ స్థాయిలు ఉంటాయి. ఒక్కొ లెవెల్ ముందుకు వెళ్లేకొద్దీ.. అంతకు మించే(రెట్టింపు) ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడయ్యాక ఇది మరింత ఖరీదుతో కూడిన వ్యవహారంగా మారింది. కానీ, ఇందులోనూ రకాలున్నాయి. తేలికగా అయ్యే వీఎఫ్ఎక్స్ కోసం ఖర్చు తక్కువగా ఉంటుంది. అదే షార్ట్ ఫిల్మ్, యానిమేషన్, షూటింగ్ లైవ్ యాక్షన్ లార్జ్ స్కేల్ వీఎఫ్ఎక్స్– ఇలా ఒక్కో కేటగరీలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చు పెరుగుతూ పోతుంది.ఉదాహరణకు ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ చిత్రం కోసం 4 వేల వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను క్రియేట్ చేశారట! కానీ, అందులో 3,289 వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను మాత్రమే తీసుకున్నాడట దర్శకుడు జేమ్స్ కామెరూన్ . ఆ ఒక్కో వీఎఫ్ఎక్స్ షాట్ కోసం 62,500 డాలర్ల ఖర్చు అయ్యింది. ఆ సినిమా మొత్తం బడ్జెట్లో వీఎఫ్ఎక్స్ షాట్స్ కోసమే 250 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టారట! అయితే సినీ చరిత్రలో ఇప్పటి దాకా సీజీఐ కోసం అత్యధికంగా ఖర్చు పెట్టింది మాత్రం ‘ది అవెంజర్స్–ఎండ్‌గేమ్.’ వీటికోసం 356 మిలియన్ల డాలర్లను కుమ్మరించారంటే అతిశయోక్తికాదు. అలాగే, విజువల్స్ కోసం అత్యధికంగా బడ్జెట్ కేటాయించిన టాప్ 3 చిత్రాలు కూడా మార్వెల్ సినిమాలే కావడం మరో విశేషం! ఇదీ స్క్రీన్ మీద ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్ఎక్స్లు క్రియేట్ చేసే సీన్! – భాస్కర్ శ్రీపతి -
Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు
‘‘కల్కి 2898 ఏడీ’ సెట్స్‌లో తొలిసారి అమితాబ్ బచ్చన్గారిని కలిసినప్పుడు ఆయన కాళ్లను తాకాలనుకున్నాను. అమితాబ్‌గారు వద్దన్నారు. నువ్వు చేస్తే నేనూ చేయాల్సి ఉంటుందన్నారు. సార్... ప్లీజ్ అన్నాను. అప్పట్లో ఎవరైనా టాల్‌గా ఉంటే అమితాబ్ అనేవారు. అమితాబ్ బచ్చన్‌గారి హెయిర్ స్టయిల్ బాగా ఫేమస్. ఇక ‘సాగర సంగమం’ చూసి ఆ సినిమాలో కమల్గారిలా డ్రెస్ కావాలని మా అమ్మతో అన్నాను. ‘ఇంద్రుడు చంద్రుడు’లో ఆయన నటన చూసి ఎగ్జైట్ అయ్యాను. ఈ స్టార్స్, దీపికా పదుకోన్‌తో కలిసి యాక్ట్ చేయడం నాకో మంచి ఎక్స్పీరియన్స్’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకకు హీరో రానా హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సినిమా తొలి టికెట్‌ను అమితాబ్ బచ్చన్‌కు అశ్వినీదత్ అందించగా, ఆయన నగదు చెల్లించి తీసుకున్నారు. ఈ టికెట్‌ను ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? అని అమితాబ్‌ను రానా అడగ్గా, మై బద్రర్ కమల్‌హాసన్‌కి అని చె΄్పారు. ఆ తర్వాత ఈ టికెట్‌ను అమితాబ్ నుంచి కమల్ అందుకుని, ‘షోలే’ సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టికెట్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంకా ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నేనిప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు అతను ఏం తాగితే ఇలాంటి ఐడియా వచ్చిందా అనిపించింది. తన విజన్ అద్భుతం. అశ్వినీదత్‌గారు సింపుల్‌గా ఉంటారు. సెట్స్‌లో నాకు కోపరేటివ్‌గా ఉన్నారు’’ అన్నారు. కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’ సినిమా స్టార్ట్ చేసేప్పుడు ఆసక్తిగా అనిపించింది. సెట్స్‌లో పాల్గొన్న తర్వాత సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తోంది. సాధారణంగా కనిపించేవారు అసాధారణ పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ విషయంలో నాకు అదే అనిపించింది. బ్యాట్మేన్లాంటి కథలు చేయాలని నాకు ఉండేది. ఈ సినిమాలో చేశాను. ఈ సినిమాలో నేనొక పాత్ర చేయాలనుకున్నా.. ఈ పాత్రను అమిత్జీ చేస్తున్నారన్నారు. మరో పాత్ర ఎంచుకున్నా.. అది ప్రభాస్ చేస్తున్నారన్నారు. ఫైనల్‌గా సుప్రీమ్ యాస్కిన్ అనే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘కరోనా టైమ్‌లో జూమ్‌లో నాగ్ అశ్విన్ కథ చె΄్పారు. తన విజన్ క్లియర్‌గా ఉంటుంది. ఇందులో తల్లి పాత్ర చేశాను. ఈ సినిమా సెట్స్‌లో ప్రభాస్ ఈ రోజు ఎవరికి ఏం ఫుడ్ పెట్టారు అన్నదే హైలైట్ డిస్కషన్‌గా ఉండేది (సరదాగా)’’ అన్నారు దీపికా పదుకోన్. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ వేడుకకు హాజరు కాలేదు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడిన వీడియో బైట్‌ను ప్లే చేశారు. కాశీ, కాంప్లెక్స్, షంబాల అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని చెప్పి, ఈ ప్రపంచాల నేపథ్యాలను వివరించారు నాగ్ అశ్విన్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్వ΄్నాదత్, ప్రియాంకా దత్, అనిల్ తడానీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రెగ్నెంట్‌గా ఉన్న దీపికా పదుకోన్ స్టేజ్ నుంచి దిగేటప్పుడు ప్రభాస్, స్టేజ్ ఎక్కేటప్పుడు అమితాబ్ హెల్ప్ చేయడం ఈవెంట్లో హైలైట్‌గా నిలిచింది. -
Chennai: డీఎంకేతో కుదిరిన కమల్‌హాసన్ పార్టీ పొత్తు.. డీల్ ఇదే
చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(ఎమ్ఎన్ఎమ్), అధికార డీఎంకే మధ్య తమిళనాడులో పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా తమ పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కమల్ పార్టీ ఎమ్ఎన్ఎమ్ శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున ప్రచారం మాత్రమే చేస్తామని తెలిపింది. చెన్నైలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివలయంలో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్‌తో కమల్‌హాసన్ భేటీ తర్వాత ఎమ్ఎన్ఎమ్ పార్టీ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అయితే పొత్తులో భాగంగా 2025లో డీఎంకే, ఎమ్ఎన్ఎమ్కు ఒక రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పొత్తు ప్రకటన అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం తాము డీఎంకే కూటమిలో చేరామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక్క లోక్‌సభ స్థానాల్లో డీఎంకే తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. ఇదీ చదవండి.. హిమాచల్ సంక్షోభం మళ్లీ మొదటికి -
ఇండియా కూటమిలో చేరికపై కమల్ హాసన్ స్పందన
చెన్నై: స్వార్థరహితంగా ఆలోచించే ఏ కూటమితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడుకు చెందిన ఎమ్ఎన్ఎమ్ పార్టీ చీఫ్ కమల్‌హాసన్ తెలిపారు. ఇండియా కూటమిలో చేరతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పటివరకైతే ఇండియా కూటమిలో తాము భాగస్వాములం కాదని స్పష్టం చేశారు. ఏ కూటమిలో చేరినా స్థానిక ఫ్యూడల్ శక్తులతో కలిసి మాత్రం పనిచేయబోమని చెప్పారు. స్టాలిన్‌కు చెందిన డీఎంకే పార్టీతో కమల్‌హాసన్ కలిసి పనిచేయబోతున్నారన్న పుకార్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కమల్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది. స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్‌హాసన్ ఈ సందర్భంగా స్వాగతించారు. ఇదీ చదవండి.. గగన్‌యాన్‌పై ఇస్రో కీలక అప్డేట్ -
ఫీమేల్ గెటప్‌లో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్న హీరోలు
క్యారెక్టర్ డిమాండ్‌ని బట్టి గెటప్ మారుతుంది. ఒక్కోసారి మేల్ ‘ఫీమేల్’గా మారాల్సి వస్తుంది. ఫీమేల్ ‘మేల్’గా మారాల్సి వస్తుంది. అలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఇద్దరు హిందీ హీరోలు ఫీమేల్ గెటప్‌లోకి మారారు. ఇటు సౌత్‌లో ఇద్దరు హీరోలు లేడీ గెటప్స్‌లోకి మారనున్నారు. ఆ ఫీ‘మేల్’ విశేషాలు... ఆయుష్ఉమన్ ‘‘అయ్య బాబోయ్.. స్త్రీ పాత్ర చేయడం అంత ఈజీ కాదండోయ్’’ అంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. ‘డ్రీమ్ గర్ల్ 2’లో తను చేసిన పూజ పాత్ర గురించే ఆయన అలా అన్నారు. ‘అంధాధున్’లో అంధుడిగా, ‘బాలా’లో బట్టతల ఉన్న యువకుడిగా.. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆయుష్మాన్ ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రంలో కరణ్వీర్ అనే యువకుడిగా, పూజ అనే యువతిగా కనిపించనున్నారు. 2019లో ఆయుష్మాన్ హీరోగా నటించిన ‘డ్రీమ్ గర్ల్’కి ఇది సీక్వెల్. తొలి భాగాన్ని తెరకెక్కించిన రాజ్ షాండిల్యానే మలి భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఫస్ట్ పార్ట్‌లోనూ పూజ పాత్రలో కనిపించిన ఆయుష్మాన్ సెకండ్ పార్ట్‌లోనూ ఆ పాత్ర చేశారు. ఓ చిన్న పట్టణానికి చెందిన కరణ్ తన తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి కష్టాలుపడుతుంటాడు. అతని ప్రేయసి పరీ (అనన్యా పాండే). అయితే ఆమెను పెళ్లాడటానికి పరీ తండ్రి కరణ్‌కి కొన్ని నిబంధనలు పెడతాడు. తన ముందున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూజాగా మారతాడు కరణ్. ఇలా కష్టాల కరణ్‌గా, నవ్వులు పూయించే పూజాగా ఆయుష్మాన్ నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ ఈ నెల 25న విడుదల కానుంది. కాగా.. ‘‘స్త్రీ వేషం చాలా సవాల్‌గా అనిపించింది. ముఖ్యంగా ఎండల్లో విగ్ పెట్టుకుని నటించడం కష్టంగా అనిపించింది. ఈ ఆయుష్‘మాన్’ చేసిన ఆయుష్‘ఉమన్’ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు ఆయుష్. అమ్మాయిగా ఆలోచించాలి ‘‘ఫీమేల్ ఆర్టిస్టులు వ్యానిటీ వేన్ నుంచి బయటకు రావడానికి అన్నేసి గంటలు ఎందుకు పడుతుందో నాకిప్పుడు అర్థమైంది. మేల్ ఆర్టిస్ట్‌ల మేకప్‌తో పోల్చితే ఫీమేల్‌కి చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. నేను చేసిన స్త్రీ పాత్ర మేకప్‌కి మూడు గంటలు పట్టేది’’ అని నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటున్నారు. ‘హడ్డీ’ చిత్రంలో తాను చేసిన లేడీ క్యారెక్టర్ గురించే నవాజుద్దీన్ ఈ విధంగా అన్నారు. అక్షయ్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఓ చిన్న పట్టణానికి చెందిన హరి అనే యువకుడికి అమ్మాయిగా మారాలనే ఆకాంక్ష ఉంటుంది. లింగ మార్పిడి గురించి ఈ చిత్రంలో చూపించారు. ‘‘అమ్మాయి పాత్ర చేయడానికి అమ్మాయిలా మేకప్ వేసుకుంటే చాలదు.. అమ్మాయిలానే ఆలోచించాలి. నేను అలానే చేశాను’’ అంటూ ఈ పాత్రలో తానెంతగా లీనమయ్యారో చెప్పారు నవాజుద్దీన్. ఇదిలా ఉంటే... వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’లో ఆయన విలన్‌గా నటిస్తున్నారు. తెలుగులో నవాజుద్దీన్‌కి ఇది తొలి చిత్రం. పదిహేనేళ్ల తర్వాత... వైవిధ్యమైన పాత్రలకు చిరునామా కమల్‌హాసన్. ఫిజికల్లీ చాలెంజ్డ్, చిన్న వయసులో వృద్ధుడిగా, ఎత్తు పళ్లు, వృద్ధురాలిగా.. ఇలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు మౌల్డ్ అవుతారు కమల్‌హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’ (1996) చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో కమల్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నారని తెలిసిందే. కొన్ని సన్నివేశాల్లో స్త్రీగానూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే పదిహేనేళ్ల తర్వాత కమల్ స్త్రీ వేషంలో కనిపించినట్లు అవుతుంది. గతంలో కమల్‌హాసన్ ‘భామనే సత్యభామనే’ (1996), ‘దశావతారం’ (2008)లో లేడీ గెటప్‌లో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ‘ఇండియన్ 2’ విషయానికి వస్తే.. ఓ సమస్య పరిష్కారానికి కమల్ స్త్రీ వేషంలోకి మారతారని టాక్. లేడీ గెటప్ పై ఫోకస్ విశ్వక్ సేన్లో మంచి నటుడు–దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. ఆ తర్వాత ‘హిట్’, ‘పాగల్’... ఇలా హీరోగా ఒకదానికి ఒకటి పోలిక లేని చిత్రాలు చేస్తున్న విశ్వక్ ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ సమయంలో తాను ఒక సినిమాలో లేడీ గెటప్‌లో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే జస్ట్ కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించి మాయం కాకుండా సినిమా సెకండాఫ్ మొత్తం ఆ గెటప్‌లోనే కనిపించనున్నారని సమాచారం. అందుకే ఈ చిత్రానికి ‘లీల’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని భోగట్టా. ఈ చిత్రం గురించి, ఈ పాత్ర గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం విశ్వక్ ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు. మరి.. వీటిలో ఏదైనా సినిమాలో లేడీ గెటప్ ఉంటుందా? లేక వార్తల్లో ఉన్న ప్రకారం ‘లీల’ అనే సినిమా ఉంటుందా? అనే క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
కమల్, ప్రభాస్, చరణ్ డబుల్ ధమాకా.. సమంత, ఎన్టీఆర్ ట్రీట్ కూడా ఉందా?
హీరోలు స్క్రీన్‌పై సింగిల్‌గా కనిపించినా అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక డబుల్ రోల్స్‌లో కనబడితే పండగే పండగ. ఒకే సినిమాలో డ్యూయల్ రోల్ అంటే స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకానే. ఇలా ఫ్యాన్స్‌ను, ఆడియన్స్‌ను అలరించేందుకు రెండు పాత్రల్లో కనిపించే చిత్రాల్లో నటిస్తున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► కమల్‌హాసన్ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఇండియన్’ ఒకటి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సేనాపతిగా, ఆయన కొడుకు చంద్రబోస్‌గా రెండు పాత్రల్లో మెప్పించారు కమల్‌హాసన్. ప్రస్తుతం కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కూడా కమల్ రెండు పాత్రలు చేస్తున్నట్లుగా తెలిసింది. ‘ఇండియన్’లో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ తండ్రీకొడుకుగా కనిపించనున్నారని టాక్. ఈ సినిమా కథ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుందట. ► ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు లుక్స్ రిలీజయ్యాయి. దీంతో ‘సలార్’లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. ► శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ చేంజర్’ చిత్రంలో డబుల్ రోల్లో కనిపించనున్నారు హీరో రామ్‌చరణ్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఐఏఎస్ ఆఫీసర్ల బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ టచ్ ఉన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తండ్రీకొడుకుగా నటిస్తున్నారని తెలిసింది. 1920 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా, సమకాలీన పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్‌చరణ్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ ఖబర్. అలాగే రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ట్రీట్ ఉందా? అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ సినిమాలో ఎన్టీఆర్, ఒక హిందీ చిత్రంలో సమంత రెండు పాత్రల్లో కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మరి.. ఈ ఇద్దరి నుంచి డబుల్ ట్రీట్ ఉందా? అనేది త్వరలో తెలుస్తుంది. ► దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం విడుదలైన ‘ఆంధ్రావాలా’ సినిమాలో తండ్రీకొడుకుగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. మరోసారి తండ్రీకొడుకుగా ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లోనే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ► ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియన్స్‌లో క్రేజ్ దక్కించుకున్నారు సమంత. ఇప్పుడు ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారామె. ఇక సమంత నటించనున్న తొలి హిందీ చిత్రంపై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా హిందీ హిట్ ‘స్త్రీ ’(2018) ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఓ హారర్ ఫిల్మ్ తెరకెక్కనుందని, ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ టైటిల్‌తో తెరపైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తారని టాక్. ఈ ఏడాది చివర్లో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రంలో సమంత డ్యూయల్ రోల్ చేయనున్నారని సమాచారం. ఓ పాత్రలో సమంత ప్రేతాత్మగా కనిపిస్తారట. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. -
మేకప్ మాయ.. కొత్త లుక్‌లో సినీ తారలు
ముఖం మీద ముడతలు కావాలా? ఉందిగా మేకప్. తెల్లగా ఉన్నవాళ్లు నల్లగా కనబడాలా? మేకప్ ఉందిగా. వయసులో ఉన్నవాళ్లు వృద్ధులుగా కనబడాలా? మేకప్‌తో ఏదైనా సాధ్యమే. ప్రస్తుతం కొందరు తారలు వెరైటీగా కనబడే ప్రయత్నంలో ఉన్నారు. మేకప్ సహాయంతో నల్లబడుతున్నారు. ముసలివాళ్లవుతున్నారు. అంతా మేకప్ మాయ. అప్.. అప్.. మేకప్ అంటూ కొత్త లుక్‌లో కనపడబోతున్న తారల గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకూ కనిపించని లుక్‌లో వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలో కనిపించనున్నారు. తమిళ చిత్రం ‘అసురన్’కి రీమేక్‌గా రూపొందుతోంది ‘నారప్ప’. ఇందులో రైతు పాత్రలో కనిపించనున్నారు. మామూలు రైతు కాదు.. అన్యాయాన్ని సహించలేని రైతు. కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి, అక్రమార్కులను అంతం చేసే రైతు. ఈ పాత్రలో వెంకీ రఫ్‌గా కనిపిస్తారు. పైగా రైతు అంటే ఎండల్లో కష్టపడక తప్పదు కదా.. దానికి మ్యాచ్ అయ్యేట్లు ఆయన స్కిన్ టోన్‌ని కాస్త డల్ చేశారు. వెంకీ రైతు అయితే అల్లు అర్జున్ లారీ క్లీనర్. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ అనే లారీ క్లీనర్‌గా కమిలిపోయిన చర్మంతో కనబడతారు. సరిగ్గా దువ్వని జుట్టు, ట్యాన్ అయిన స్కిన్, ఆయిల్ మరకలతో బట్టలు.. అల్లు అర్జునేనా? అన్నంతగా మారిపోయారు. ఇక బాబాయ్ వెంకటేశ్లానే అబ్బాయ్ రానా కూడా ట్యాన్ అయ్యారు. ఒక్క సినిమా కోసం కాదు.. రెండు సినిమాలకు. ఒకటి ‘అరణ్య’, ఇంకోటి ‘విరాటపర్వం’. 25ఏళ్లుగా అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక వ్యక్తి కథ ‘అరణ్య’. పర్యావరణం, అడవుల నరికివేత వంటి అంశాలతో సాగే ఈ సినిమాలో అడవిలో నివసించేవాళ్లు ఎలా ఉంటారో అలా కనబడతారు రానా. అలాగే నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘విరాటపర్వం’లో రానా మాత్రమే కాదు కథానాయిక సాయిపల్లవి, కీలక పాత్రలు చేస్తున్న ప్రియమణి, నందితా దాస్ కూడా డల్ మేకప్‌లోనే కనబడతారు. అందరూ నిజమైన నక్సలైట్లను తలపించేలా మౌల్డ్ అయిపోయారు. ఇప్పటివరకూ మోడ్రన్ గాళ్లా కనిపించిన రకుల్ ప్రీత్‌సింగ్ అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ సరసన ఆమె ఓ సినిమాలో నటిస్తున్నారు. అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం బిగుతైన జడ, లంగా, ఓణీ, తక్కువ మేకప్‌తో విలేజ్ గాళ్లా మారిపోయారు రకుల్. సవాల్ అనిపించే పాత్రలు వస్తే సై అంటారు నటీనటులు. వీళ్లందరికీ అలాంటి పాత్రలు వచ్చాయి. వెరైటీ క్యారెక్టర్స్‌లో కనిపించాలనే ఆకలితో ఉన్న వీళ్లందరూ లుక్‌ని మార్చుకోవడమే కాదు.. నటనపరంగా కూడా విజృంభిస్తున్నారు. వీళ్లే కాదు.. ఇలాంటి చాలెంజింగ్ రోల్స్‌లో కనిపించనున్న తారలు ఇంకా చాలామందే ఉన్నారు. దర్శకుడితో జోడీ ‘మహానటి’తో తనలో ఉత్తమ నటి ఉందని నిరూపించుకున్నారు కీర్తీ సురేశ్. తమిళ సినిమా ‘సాని కాయిదమ్’లో ఆమె నటన వేరే లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. ‘7/జి బృందావన కాలనీ’ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రం ద్వారా నటుడిగా మారారు. సెల్వ, కీర్తీ జంటగా తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా ఫస్ట్ పోస్టర్లో సెల్వ, కీర్తిల లుక్ చూసి క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వృద్ధుని గానూ... ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కలవని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఏం జరుగుతుంది? అనే కాల్పనిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వృద్ధునిగానూ కనిపించనున్నారని సమాచారం. అయితే కొమురం భీమ్ చిన్న వయసులోనే మరణించారు. ఇది కాల్పనిక కథ కాబట్టి ఎన్టీఆర్‌కి ఓల్డ్ గెటప్ కూడా పెట్టి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రోస్థెటిక్ మేకప్ వాడుతున్నారని టాక్. 90 ఏళ్ల వృద్ధునిగా వెరైటీ గెటప్పులు వేయడంలో కమల్‌హాసన్‌కి సాటి ఎవరూ రారంటే అతిశయోక్తి కాదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ ‘భారతీయుడు’ (1996). అందులో యువకుడిగానే కాదు.. వృద్ధునిగానూ కమల్ కనిపించారు. తాజాగా ‘భారతీయుడు 2’ రూపొందుతోంది. ఇందులో 90 ఏళ్ల వృద్ధునిగా కమల్ కనిపిస్తారని తెలిసింది. హెవీ ప్రోస్థెటిక్ మేకప్‌తో కమల్ వృద్ధునిగా కనిపించనున్నారు. ఈ వృద్ధునికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఆమె 85 ఏళ్ల వృద్ధురాలిగా కనబడతారని టాక్. -
పండగ తర్వాత ప్రారంభం
కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ (1996) ఓ సంచలనం. 24 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ఆరంభించారు కమల్–శంకర్. గతేడాది మూడు షెడ్యూల్స్ కూడా ముగించారు. కానీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత కరోనా లాక్డౌన్ వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. అయితే బడ్జెట్ సమస్యల వల్ల సినిమా మళ్లీ ట్రాక్ ఎక్కదనే వార్త మొదలైంది. కానీ అది నిజం కాదు. త్వరలో నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. జనవరిలో సంక్రాంతి పండగ తర్వాత లేదా ఫిబ్రవరిలో చిత్రీకరణ ఆరంభించడానికి పకడ్బందీగా షెడ్యూల్ ప్లాన్ చేశారు. చెన్నైలో షెడ్యూల్ పూర్తి చేశాక, దేశంలో పలు లొకేషన్స్‌లో షూటింగ్ చేయాలనుకుంటున్నారు. అలాగే విదేశాల్లోనూ షెడ్యూల్స్ ఉంటాయని సమాచారం. ఈ కరోనా టైమ్‌లో దేశ, విదేశాల్లో ఎక్కువమందితో షూటింగ్ అంటే సవాల్ అనే చెప్పాలి. ఈ సవాల్‌ని అధిగమించేలా దర్శకుడు శంకర్ అండ్ టీమ్ వర్కవుట్ చేస్తోంది. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్నారు. -
విందా? విధ్వంసమా?
రుచికరమైన భోజనం తయారు చేస్తున్నారు కమల్‌హాసన్. ఓ భారీ విందుని ఏర్పాటు చేసినట్టున్నారు. అతిథులందరూ వచ్చే లోపల విస్తళ్లు సిద్ధం చేశారు. ఆహార పదార్థాలు ఉన్న గిన్నెలు కూడా. వాటితో పాటు కొన్ని కత్తులు, తుపాకులు కూడా. ఇంతకీ ఇది విందు భోజనమా? విధ్వంసం సృష్టించే ముందు విందు పెడతారా? అనేది సినిమాలో చూడాలి. ‘ఖైదీ, మాస్టర్’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. శనివారం కమల్‌హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను, టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘విక్రమ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టీజర్లో కమల్ రుచికరమైన విందు వండుతూనే, విలన్స్‌ను వేసేయడానికి స్కెచ్ వేస్తున్నట్లుగా కనబడుతోంది. -
భారతీయుడు ఆగలేదు
‘‘భారతీయుడు’ సినిమా ఆగిపోయింది’’ అనే వార్త కోలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. గతంలో పలు సార్లు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను లైకా ఖండించింది. తాజాగా మరోసారి కూడా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. లైకా నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ – ‘‘ఇండియన్ 2’ చిత్రం షూటింగ్ సుమారు 60 శాతం పూర్తయింది. ఇంత పూర్తి చేశాక సినిమాను ఎందుకు ఆపేస్తాం? లాక్ డౌన్ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెడతాం’’ అని పేర్కొన్నారు. -
ఇన్నుమ్ ఇరుక్కు!
ఏ ఇండస్ట్రీలో అయినా ప్రతి ఏడాది కొన్ని సీక్వెల్స్ వెండితెరపైకి వస్తూనే ఉంటాయి. కోలీవుడ్‌లో గత ఏడాది రజనీకాంత్ ‘2.0’, కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’, ధనుష్ ‘మారి 2’, విశాల్ ‘పందెంకోడి 2’ చిత్రాలతో పాటు ‘కలకలప్పు 2’, ‘గోలీ సోడా 2’, ‘తమిళ్ పడమ్ 2’ చిత్రాలు సీక్వెల్స్‌గా వచ్చి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశాయి. ‘ఇన్నుమ్ ఇరుక్కు’ (ఇంకా ఉంది) అంటూ తమిళంలో ఈ ఏడాది కూడా కొన్ని సీక్వెల్స్ వెండితెరపై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో వాంగ పాక్కలామ్.. అదేనండీ.. రండి చూద్దాం. లోకనాయకుడు కమల్‌హాసన్ సీక్వెల్స్‌పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది ‘విశ్వరూపం 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్ పనుల్లో ఉన్నారిప్పుడు. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. సేమ్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ ‘ఇండియన్ 2’ సినిమాలో కాజల్ అగర్వాల్ కథా నాయికగా నటిస్తున్నారు. అలాగే 1992లో భరతన్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘దేవర్‌మగన్’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కమల్‌హాసనే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా సీక్వెల్స్‌పై ఫుల్ కాన్సట్రేట్ చేశారు కమల్. యువహీరో ‘జయం’ రవి కూడా ఓ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్‌చరణ్ చేసిన హిట్ మూవీ ‘ధృవ(2016)’ తమిళంలో ‘జయం’ రవి హీరోగా నటించిన ‘తని ఒరువన్’ (2015)కు రీమేక్ అని తెలిసిందే. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘తని ఒరువన్’ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. సేమ్ మోహన్‌రాజా దర్శకత్వంలోనే ‘జయం’ రవి హీరోగా నటిస్తున్నారు. మొదటిపార్ట్ కన్నా మరింత మెరుగ్గా సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడతామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఇక తమన్నా, ప్రభుదేవా, సోనూ సూద్ ముఖ్య తారలుగా ఏఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ (తెలుగులో ‘అభినేత్రి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ చిత్రం రూపొందుతోంది. ఏఎల్. విజయ్ దర్శకత్వంలోనే తమన్నా, ప్రభుదేవా ముఖ్యతారలుగా నటిస్తున్నారు. నందితా శ్వేత, కోవై సరళ ముఖ్యపాత్రలు చేస్తున్నారీ సీక్వెల్లో. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలిసింది. తెలుగులో ‘అభినేత్రి 2’ పేరుతో విడుదల కావొచ్చు. మరోవైపు ఓ మల్టీస్టారర్ సీక్వెల్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇది ఇప్పటి చిత్రానికి సీక్వెల్ కాదు. దురై దర్శకత్వంలో కమల్‌హాసన్, శ్రీప్రియ నటించిన నీయా (1979) చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ వస్తోంది. మల్టీస్టారర్ మూవీగా జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్‌లక్ష్మీ, క్యాథరీన్లతో ఈ చిత్రం రూపొందింది. ఆల్రెడీ ఫస్ట్‌లుక్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ‘నాగకన్య’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నాలుగేళ్ల క్రితం హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చతురంగ వేటై్ట’. ఈ సినిమా ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో తెలుగులో ఈ ఏడాది విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటించారు. ఇప్పుడు త్రిష, అరవింద్ స్వామి హీరోహీరోయిన్లుగా ‘చతురంగ వేటై్ట 2’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రముఖ కమెడియన్ వడివేలు నటించిన ‘ఇమ్సై అరసన్ 23 ఆమ్ పులికేశి’ (తెలుగులో ‘హింసించే రాజు 23వ పులకేశి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇమ్సై అరసన్ 24 ఆమ్ పులికేశి’ చిత్రాన్ని మొదలుపెట్టారు. సీక్వెల్లో కూడా వడివేలునే తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి ఆ స్థానంలో యోగిబాబు నటిస్తారని టాక్. మరి.. హింసించే రాజు ఎవరో త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలే కాకుండా కొన్ని చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కొన్ని హిట్ సినిమాలకు సీక్వెల్స్‌ను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నారట కొంతమంది కోలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘తుపాకీ’ (2012) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మురుగదాస్ ఈ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఫస్ట్ పార్ట్‌లో విజయ్ నటించగా, సీక్వెల్లో మాత్రం అజిత్ హీరోగా నటిస్తారట. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘పుదుపేటై్ట’ (2006). ఈ సినిమా సీక్వెల్ ఆలోచన ఉన్నట్లు ఓ అభిమాని ప్రశ్నకు ధనుష్ సమాధానంగా చెప్పారు ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో. విశాల్,ధనుష్ అభివృద్ధి చెందిన నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఇరంబు దురై’ (2018). (తెలుగులో ‘అభిమన్యుడు’). పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు హింట్స్ ఇస్తున్నారు విశాల్. 2017లో వచ్చిన హారర్ మూవీ ‘గృహం’ సిద్ధార్థ్‌కు మంచి హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట. అలాగే నయనతార కలెక్టర్‌గా నటించిన ‘అరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’), సూర్య కెరీర్‌కు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చిన ‘కాక్క కాక్క’ (తెలుగులో ‘ఘర్షణ’) సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయని కోలీవుడ్‌లో కొత్తగా కథనాలు వస్తున్నాయి. ‘గోల్మాల్, రేస్, ధూమ్, క్రిష్’ చిత్రాల సీక్వెల్స్ ఫ్రాంచైజ్‌లుగా మారాయి బాలీవుడ్లో. ఈ ట్రెండ్ మెల్లిగా సౌత్‌కి వస్తున్నట్లు అర్థం అవుతోంది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో ఇప్పటికే ‘సింగం’ (తెలుగులో ‘యముడు’) సిరీస్‌లో మూడు సినిమాలు వచ్చాయి. మరో రెండేళ్లలోపు ‘సింగం 4’ అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సిరీస్ ఇలాంటిదే. ‘ముని’ పేరుతో మొదలైన ఈ హారర్ సిరీస్‌లో ఫోర్త్ పార్ట్‌గా ‘కాంచన 3’ ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాఘవ లారెన్స్ రాఘవ లారెన్స్‌తో పాటు, వేదిక, ఓవియా నటించారు. విశాల్ కెరీర్‌కు మాస్ ఇమేజ్ను తీసుకువచ్చిన చిత్రం ‘పందెం కోడి (2005)’. ఈ సినిమా సీక్వెల్ ‘పందెంకోడి 2’ గతేడాది విడుదల అయ్యింది. ‘పందెంకోడి 3’ సినిమా 2020లో సెట్స్‌పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు విశాల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఓ సిరీస్‌లా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట టీమ్. భవిష్యత్‌లో ఈ సిరీస్‌ల ట్రెండ్ మరింత ముందుకు వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. -
సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి
సంగీత జ్ఞాని ఇళయరాజా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇళయరాజా 75’ పేరుతో గత శని, ఆదివారాల్లో చెన్నైలో ఘనంగా వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకను తమిళ నిర్మాతల మండలి నిర్వహించింది. ఈ వేడుకలోని హైలెట్స్... ► ఇళయరాజాగారితో ఉన్న అనుబంధం గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నేను రాజాగారి దగ్గర పని చేసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ‘మూండ్రామ్ పిరై’ (వసంత కోకిల) సినిమాకు రాజాసార్ టీమ్‌లో జాయిన్ అయ్యాను. రాజాగారు రికార్డింగ్ స్టూడియోలోకి ప్రవేశిస్తుంటే ,హెడ్ మాస్టర్ క్లాస్‌రూమ్‌లోకి వస్తున్న భావన కలిగేది. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి’’ అన్నారు. ► ఈ కార్యక్రమానికి సీనియర్ నటి, మణిరత్నం భార్య సుహాసిని యాంకర్‌గా వ్యవహరించారు. ‘రెహమాన్ మిమ్మల్ని గురువు అన్నారు. దాని గురించి ఏదైనా పంచుకుంటారా? అని ఇళయరాజాని ఆమె అడగ్గా– ‘‘రెహమాన్ తన తండ్రి దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ ఉన్నాడు. కరెక్టే కదా (రెహమాన్ వైపు చూస్తూ). దానికి రెహమాన్ అవును అన్నారు. ‘ఈ విషయాలన్నీ నువ్వు (రెహమాన్) చెప్పాలి’ అని సరదాగా పేర్కొన్నారు. మరో యాంకర్‌గా వ్యవహరించిన నటి కస్తూరి.. రెహమాన్ కంపోజ్ చేసిన ఏదైనా పాటను పాడమని అడగ్గా ఇళయరాజా ‘మౌనరాగం’ చిత్రంలోని ‘మండ్రం వంద తెండ్రులుక్కు.’ అనే పాటను ఆలపించారు. అదే సమయంలో కీబోర్డ్ దగ్గర ట్యూన్ చేస్తున్న రెహమాన్.. సంగీతజ్ఞాని పాట వింటూ ఆగిపోయారు. ‘ఏమైంది? ట్యూన్ సరిగ్గా గుర్తులేదా? ’ అంటూ రాజా చమత్కరించారు. ► రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఇళయరాజా స్వయంభూలింగం. ధోతి ధరించకముందు వరకూ సార్ అని పిలిచేవాణ్ని. ఆ తర్వాత నుంచి స్వామి అంటున్నాను. రాజాగారు కూడా నన్ను అలానే పిలుస్తారు. నాకంటే కమల్‌కు మంచి సంగీతాన్ని అందించారు’’ అని రజనీ అంటుండగా, ఇళయరాజా అందుకుంటూ ‘కమల్‌హాసనేమో మీకు మంచి మ్యూజిక్ ఇచ్చాను అంటుంటారు. నాకు యాక్టర్ ఎవరన్నది కాదు. ఏ పాటకైనా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ► కమల్ హాసన్ ఆయన కుమార్తె శ్రుతీహాసన్ స్టేజ్ మీద మూడు పాటలు పాడి, ఇళయరాజాతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు రాజాగారు సలహాలిచ్చారు’’ అన్నారు కమల్. ► ‘‘సంగీతానికి ఒకరే రాజు. ఆయనే ఇళయరాజా. లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్తున్నప్పుడు బండిలో పెట్రోల్ ఉందా లేదా అని చూసుకోవడం కంటే ముందు ఇళయరాజా పాటలున్నాయా? లేదా ? అని చెక్ చేసుకుంటారు. ఇలాంటి లెజెండ్స్‌ను సన్మానించుకోవడం మా బాధ్యత. ఇండస్ట్రీలోని వాళ్లకోసం ఇండస్ట్రీ వాళ్లం ఈవెంట్స్ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాను. ఈ వేడుక చరిత్రలో మిగిలిపోతుంది. అలాగే దీన్ని వ్యతిరేకించినవాళ్లు కూడా చరిత్రలో ఉంటారు’’ అని పేర్కొన్నారు నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్. రెహమాన్, ఇళయరాజా శ్రుతీహాసన్, కమల్‌హాసన్ కమల్, రజనీ -
మరో భారతీయుడు
చేతివేళ్లు మెలితిప్పి అవినీతిని తుడిచేసే ప్రయత్నం చేశారు ‘భారతీయుడు’ సినిమాలో సైనాపతి. ఇప్పుడు మరో సమస్యను చర్చించడానికి వస్తున్నారాయన. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు). ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తం శుక్రవారం జరిగింది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ స్వరాలు అందిస్తారు. -
నేటి భారతీయుడు
ఆయుధాలు లేకుండా కేవలం రెండు వేళ్లతో ప్రత్యర్థులను ఎదుర్కోగలడు సేనాపతి. అవినీతిని ఆశ్రయించినవాళ్లకు సమాధానం చెబుతూ 1995లో శంకర్ సృష్టించిన పాత్ర ఇది. సేనాపతి పాత్రలో కమల్‌హాసన్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు శంకర్. మొదటి భాగంలో కమల్ వృద్ధ గెటప్‌లో ఎలా కనిపించారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు నేటి భారతీయుడిని చూడండి. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ కానుంది. సంక్రాంతి స్పెషల్‌గా ఈ సినిమాలో కమల్ లుక్‌ను కొద్దిగా శాంపిల్ చూపించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. కమల్‌హాసన్ మనవడిగా సిద్దార్థ్ నటించనున్నారని టాక్. అనిరు«ద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
క్వాలిటీ ముఖ్యం!
ఇండస్ట్రీలో పదేళ్లకుపైగా ఉంటూ అగ్రకథానాయికల లిస్ట్‌లో తన పేరు తప్పిపోకుండా కష్టపడుతూనే ఉన్నారు కాజల్ అగర్వాల్. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్లో స్పీడ్ పెంచారీ బ్యూటీ. మీ సక్సెస్ మంత్ర ఏంటి? అని కాజల్‌ని అడిగితే...‘‘నాకు సూట్ అయ్యే పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. సినిమా సినిమాకి నా పాత్రల మధ్య వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతా. నా పాత్రకు ఆడియన్స్ ఎంత కనెక్ట్ అవుతారనే విషయం కూడా మైండ్‌లో ఉంచుకుంటా. క్వాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ముఖ్యం. రోల్ మోడల్ అంటూ నాకు ప్రత్యేకంగా ఎవరూ లేరు. ప్రముఖ నటీనటుల నుంచి ఒక్కో డిఫరెంట్ క్వాలిటీని తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సీత’ అనే సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు కాజల్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తారు. తమిళంలో ఆమె నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. -
బుల్లితెర టైమ్ వచ్చింది!
కోలీవుడ్‌లో వెండితెరపై నటుడిగా సూపర్‌సక్సెస్ సాధించారు విజయ్ సేతుపతి. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన హోస్ట్‌గా ఓ ప్రముఖ చానల్లో ఓ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి అధికారికంగా వెల్లడించారు. ఈ షో త్వరలో మొదలుకానుంది. ఆల్రెడీ కమల్‌హాసన్ బిగ్‌బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. రీసెంట్గా శ్రుతీ హాసన్, విశాల్, వరలక్ష్మి బుల్లితెర కమిట్మెంట్కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు సేతుపతి వంతు వచ్చినట్లు ఉంది. ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే... రజనీకాంత్ నటించిన ‘పేట్టా’ చిత్రంలో జీతూ అనే కీలక పాత్ర చేశారు. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోగానూ కొన్ని తమిళ సినిమాలు చేస్తున్నారాయన. ఇటీవల విజయ్‌సేతుపతి, త్రిష జంటగా వచ్చిన ‘96’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. -
ఫుల్ జోష్
విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సౌత్‌లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ ఏడాది ‘కర్వాన్’ సినిమాతో బాలీవుడ్ గడప తొక్కిన దుల్కర్ ప్రస్తుతం ‘జోయా ఫ్యాక్టర్’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు. నార్త్, సౌత్ సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్న ఆయనకు తాజాగా ‘ఇండియన్ 2’ చిత్రంలో నటించే చాన్స్ వచ్చిందని కోలీవుడ్ టాక్. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ‘ఇండియన్ 2’ సీక్వెల్. శంకర్ –కమల్‌హాసన్ కాంబినేషన్లోనే తెరకెక్కనున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా ఎంపికయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్ పేరు తెరపైకి వచ్చింది. ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. -
జస్ట్ మిస్
రజనీకాంత్, కమల్‌హాసన్... తమిళ సినిమాకు రెండు పిల్లర్స్ లాంటి యాక్టర్స్. ఎప్పుడో కెరీర్ తొలినాళ్లలో ఈ ఇద్దరు హీరోలు ‘అంతులేని కథ’, 16 వయదినిలే’ వంటి పలు బ్లాక్బాస్టర్ చిత్రాల్లో కలసి యాక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు ఈ సూపర్ స్టార్స్. రీసెంట్గా ఈ స్టార్స్ ఇద్దరూ కలసి నటించే చాన్స్ జస్ట్ మిస్ అయింది అంటున్నారు శంకర్. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘2.ఓ’. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. కానీ తొలుత ఈ పాత్రకు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్, ఆ తర్వాత బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ పేర్లను పరిశీలించారనే టాక్ వినిపించింది. అయితే విలన్ పాత్రకు కమల్‌హాసన్ పేరును కూడా అనుకున్నారట దర్శకుడు శంకర్. ఆ పాత్ర కోసం కమల్‌ను సంప్రదించారని కూడా చెప్పుకొచ్చారు శంకర్. ఈ విషయాన్ని తెలియజేస్తూ– ‘‘2.ఓ’ కంటే ‘భారతీయుడు’ సీక్వెల్ మీద కమల్‌సార్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో కమల్‌సార్‌ని నటింపజేయాలనుకునే ఆలోచన విరమించుకున్నాను’’ అని అన్నారు శంకర్. -
ఉప ఎన్నికల బరిలో కమల్ పార్టీ
చెన్నై: తమిళనాడులో త్వరలో 20 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనుందని నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ వెల్లడించారు. ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న కమల్ హాసన్ విలేకరులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. టీటీవీ దినకరన్ వర్గంలో చేరిన 18మంది ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును ఇటీవల మద్రాస్ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. దీంతోపాటు డీఎంకే అధినేత కరుణానిధి, ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మరణంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఏర్పడ్డాయి. -
అమావాస్య చందమామ!
కథానాయికలు కేవలం గ్లామర్‌కి మాత్రమే అంటే అస్సలు ఒప్పుకోరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఎప్పటికప్పుడు చాలెంజింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారామె. ఇందులో భాగంగా ఇటీవల అంధురాలిగా నటించడానికి కూడా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘రాజపార్వై’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్రబృందం. 1981లో వచ్చిన కమల్ హాసన్ సినిమా టైటిల్ ఇది కావడం విశేషం. ‘రాజపార్వై’ సినిమా ‘అమావాస్య చంద్రుడు’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంటే వరలక్ష్మీ అమావాస్య చందమామగా కనిపించబోతోందా?. చూపు లేని అమ్మాయిగా కనిపించడానికి వరలక్ష్మీ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. అంధురాలిగా నటించడం ఓ సవాల్ అంటే.. ఈ చిత్రంలో ఫైట్స్ కూడా చేస్తారు వరలక్ష్మీ. అందుకోసం కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. పాత్ర పట్ల తనకున్న డెడికేషన్ అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం తమిళ హీరోయిన్స్‌లో ఫుల్ బిజీ యాక్టర్ కూడా వరలక్ష్మీనే. సుమారు 4–5 సినిమాలతో బిజీగా ఉన్నారు. -
ఇక షురూ
కమల్ హాసన్, విక్రమ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసి మల్టీస్టారర్ మూవీకి కొబ్బరికాయ కొట్టారని తప్పులో కాలేయకండి. ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ విక్రమ్ హీరో. కమల్‌హాసన్ నిర్మాత. రాజేష్. ఎమ్. సెల్వ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా కమల్ సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కమల్ రెండో కుమార్తె అక్షరాహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ‘‘స్టైలిష్ అండ్ టాలెంట్ హీరో విక్రమ్‌తో నా సినిమా మొదలైంది. అమేజింగ్ టీమ్ కుదిరింది’’ అని రాజేష్ పేర్కొన్నారు. ఈ సినిమా ఓ ఫ్రెంచ్ మూవీకి రీమేక్ అని టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే.. విక్రమ్, కీర్తీ సురేశ్, ఐశ్వర్యా రాజేష్ ముఖ్య తారలుగా హరి దర్శకత్వంలో ‘సామి’కి సీక్వెల్‌గా రూపొందిన ‘సామీ స్క్యేర్’ చిత్రం సెప్టెంబర్ 20న రిలీజ్ కానుందన్న వార్తలు వస్తున్నాయి. -
పెరియ మనుషన్ ఏమయ్యాడు?
‘‘భేష్.. సినిమా బాగుంది. రైట్ స్క్రిప్ట్ తీసుకొస్తే నీ డైరెక్షన్లో సినిమా చేస్తా’’... శంకర్‌కి సూపర్ స్టార్ రజనీకాంత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ‘జెంటిల్‌మేన్’ చూసి శంకర్‌కి రజనీ ఈ ఆఫర్ ఇచ్చారు. శంకర్‌కి దర్శకుడిగా ఇది ఫస్ట్ మూవీ. రజనీ ఇచ్చిన ఆఫర్‌తో ఉత్సాహంగా కథ రాయడం మొదలుపెట్టారు. అది రాస్తూనే ‘ప్రేమికుడు’ సినిమా తీయడం మొదలుపెట్టారు. ఈ సినిమా పూర్తయ్యేసరికి రజనీ కోసం తయారు చేసిన కథ కూడా పూర్తయింది. ‘పెరియ మనుషన్’ అని టైటిల్ కూడా పెట్టేశారు. అంటే పెద్ద మనిషి అని అర్థం. ఇక రజనీ కథ వినడమే ఆలస్యం. ‘పెరియ మనుషన్’ పట్టాలెక్కేస్తాడు. అయితే అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని జరగవు కొన్ని అనే సామెతలా రజనీతో తీయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ మొదలు కాలేదు. ఎందుకంటే, రజనీ అప్పటికి వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చేశారు. ఇది జరిగింది 1993లో. ఆ తర్వాత 14 ఏళ్లకు ‘శివాజీ’ (2007)తో రజనీ–శంకర్ కాంబినేషన్ కుదిరింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘రోబో’తో ఇద్దరూ మరో ఘనవిజయం ఇచ్చారు. ఈ చిత్రం సీక్వెల్ ‘2.0’తో ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ కుదిరింది. ‘2.0’ నవంబర్ 29న విడుదల కానుంది. అంతా బాగానే ఉంది. ఇంతకీ ఆ ‘పెరియ మనుషన్’ స్క్రిప్ట్ ఏమైంది? అంటే.. ఆ కథనే శంకర్ అటూ ఇటూ మార్చి కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు’ తీశారని టాక్. -
ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు
‘‘విశ్వరూపం’ సినిమా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ సినిమాలకు వచ్చిన గ్యాప్ మా వల్ల కాదు. అది రాజకీయం. ఇప్పుడు అవన్నీ పక్కకు తప్పుకోవడంతో ఈ సినిమా ఆడియన్స్ దగ్గరకు వస్తోంది. ఇంతకు ముందు సినిమాను మర్చిపోతారేమో అనే భయం ఉండేది. డిజిటల్ యుగం వల్ల ఫస్ట్ పార్ట్ పోయిన సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలానే గుర్తుపెట్టుకొని సీక్వెల్‌ను స్వాగతిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అని కమల్‌హాసన్ అన్నారు. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘విశ్వరూపం 2’. 2013లో రిలీజ్ అయిన ‘విశ్వరూపం’ చిత్రానికి సెకండ్ పార్ట్. ఆండ్రియా, పూజా కుమార్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. జిబ్రాన్ సంగీత దర్శకుడు. ఈ నెల 10న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా కమల్‌హాసన్ చెప్పిన విశేషాలు. సినిమాను ముందుగానే రెండు పార్ట్స్‌గా డిజైన్ చేశాం. ఈ సినిమా షూటింగ్ నాలుగేళ్ల క్రితం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యాయి. కొత్తగా ఏమీ షూటింగ్ చేయలేదు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేశాం. సెకండ్ పార్ట్ ఇండియాలో జరుగుతుంది. ఈ ఇండికేషన్ ఫస్ట్ పార్ట్ లాస్ట్‌లో చూపించాం. ఫస్ట్ పార్ట్ అంతా అమెరికాలో జరిగింది. సినిమాలో హీరోకి వసీమ్ అహ్మద్ కశ్మీరీ అనే పేరు ఎందుకు పెట్టాం? అనేది కూడా ఇందులో వివరిస్తాం. సెకండ్ పార్ట్ చూసేటప్పుడు సినిమాలోని అన్ని లేయర్స్ అర్థం అవుతాయి. ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు క్రియేటీవ్ ఫ్రీడమ్ అనేది మన దగ్గర చాలా తక్కువ అని ఫీల్ అవుతాను. వాక్ స్వాతంత్య్రం కూడా తక్కువే. సినిమా అనేది నాకు దొరికిన ఒక ప్లాట్‌ఫామ్. వివాదాలు చేసేవాళ్లు ఆ పనిని ఆపేశారు. ఇప్పుడు నేను కూడా రాజకీయ నాయకుడినే. ఇప్పుడు ఎవరూ ఎవరి ఉద్దేశాలు వినేలా లేరు. నేషనలిజానికి అర్థం మారుతూ ఉంటుంది. పెషావర్ మనది. కానీ ఇప్పుడు కాదే. నిజాం అని పిలిచే వాళ్లం. కానీ ఇప్పుడు? ఎవరి ఒపీనియన్ వాళ్లది. నేషనలిజానికి నా అర్థం ఏంటో నేను తెలుసుకున్నాను. ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు. మా స్టైల్లో మేం పాటిస్తూనే ఉన్నాం. ఎవరి అర్థం వారు డిఫైన్ చేసుకోవచ్చు. ప్రపంచ స్థాయి సినిమాలు తీస్తున్నాం ‘విశ్వరూపం 2’ యాక్షన్ సీన్స్ ఫస్ట్ పార్ట్స్‌ని మించి ఉంటాయి అనుకుంటున్నాను. నాతోటి హీరోలు ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాను. పది సంవత్సరాల క్రితం చేసిన యాక్షన్స్ సినిమాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు సినిమా స్టాండర్డ్స్ ఇంకా పెరిగాయి. వరల్డ్ సినిమా స్టాండర్డ్స్‌లో మనం సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమా కూడా ఆ స్థాయికి తక్కువ ఏం ఉండదనుకుంటున్నాను. జిబ్రాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్‌కి పని చేసిన శంకర్ ఎహసన్ లాయ్‌ని రిపీట్ చేయడం కుదర్లేదు. సినిమాలు వేరు.. పాలిటిక్స్ వేరు సినిమాలు వేరు. పాలిటిక్స్ వేరు. సినిమాల్లానే నా పొలిటికల్ ఐడియాలజీలు కూడా సోఫిస్టికేటెడ్‌గా ఉంటాయా అంటే.. అందరూ ప్రజాస్వామ్యానికి అలవాటు పడాలి, అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. మనకు స్వాతంత్య్రం వచ్చి 71 సంవత్సరాలు అయింది. కానీ నేను మాత్రం 1948లోనే ఉన్నాం అని భావిస్తాను. స్వాతంత్య్రం వచ్చి ఒక్క ఏడాదే అయిందని భావించి, అభివృద్ధికి అందరూ తమ వంతు సహకారం అందించాలి. కమల్ పేరు వినిపించదు! చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇంత మంది జనాభా ఉన్నాం. మంచి నటులు వస్తారు, రావాలి. నేను చాలా స్వార్థపరుణ్ణి. మంచి మంచి పాత్రలన్నీ నేనే ఎంచుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి. అయితే రాజకీయాల్లోకి వెళ్లాను కాబట్టి వేరే వాళ్లు చెబుతారు. కమల్‌హాసన్ అనే పేరు వినిపించదు. అంతే కానీ అదే టాలెంట్‌తో, ఇంకా ఎక్కువ టాలెంట్‌తో వస్తూనే ఉంటారు. ‘సాగర సంగమం’లో ‘ఆర్ట్ నెవర్ ఎండ్స్’ అని వేశాం. సినిమాలపై పొలిటికల్ ప్రెజర్ సినిమాలపై వచ్చే పొలిటికల్ ప్రెజర్ అసలు పొలిటికల్ ప్రెజరే కాదు. జస్ట్ ప్రెజర్ మాత్రమే. పొలిటికల్ అని అంటున్నాం. నిరంకుశత్వ ధోరణి ఉన్నవాళ్లే ఎక్కువ భయపడతారని నేను భావిస్తాను. ఫిల్మ్ జర్నలిస్ట్ అయినా, వేరే ఏ జర్నలిస్ట్ అయినా టైమ్ వచ్చినప్పుడు పొలిటీషియన్స్‌ను ప్రశ్నలు అడగాలి. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ బాధ్యత ఉంది జర్నలిస్ట్‌లకు. వాళ్లు సమాధానాలను దాటేయవచ్చు కానీ జర్నలిస్ట్‌లు క్వశ్చన్స్ వేయకుండా ఉండకూడదు. ఇలా జర్నలిస్ట్‌లు క్వశ్చన్స్ అడిగినప్పుడు పొలిటీషియన్‌గా నా పని ఈజీ అవుతుంది. బాలచందర్‌గారు స్టార్స్‌ని తయారు చేశారు యాక్టర్స్‌ని సెలెక్ట్ చేయడం రెండు విధాలు. ఒకటి స్టార్ దగ్గరకు వెళ్లడం, స్టార్స్‌ని తయారు చేయడం. బాలచందర్ గారు స్టార్స్‌ని తయారు చేయడం చూశాను. మట్టి బొమ్మలకు దేవత రూపాలు ఇచ్చారు. మేల్ స్టార్స్, ఫీమేల్ స్టార్స్‌ని తయారు చేశారు. ఆ పద్ధతి నాకు ఇష్టం. ఆర్ట్‌ని ప్రేమిస్తే తప్ప అలా చేయలేం. స్టార్స్ అంటే సెపరేట్ వ్యాన్, టచప్ చేయడం ఇవన్నీ కాదు. ఎప్పుడు రిహార్సల్స్‌కి పిలిచినా వచ్చేవారు. పట్టుదలతో చేసేవారే స్టార్స్. మా టీమ్ అందరం కలిసి స్క్రిప్ట్ చదువుతాం. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్లు నన్ను అడుగుతారు. ఈ సినిమా కెమెరామెన్ ఒక డైరెక్టర్, ఎడిటర్ ఒక డైరెక్టర్.. ఇలా ఎంతో మంది ఇంటెలిజెన్స్ పర్సన్స్ వేసే ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్, వచ్చే డిస్కషన్స్ సినిమాకు ప్లస్ అవ్వడంతో పాటు నా క్యారెక్టర్ మరింత మెరుగు అవ్వడానికి దోహదపడుతుంది. మా టీమ్‌లో ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉన్నారు. ఒక సినిమాను తీయడంలో ఉన్న కష్టం ఏంటో వారందరికీ తెలుసు. వాళ్ల రుణం తీర్చుకోవాలి ఫిల్మ్ మేకింగ్‌లో ప్రతీ పనిని ఎంజాయ్ చేస్తాను. నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్‌తో కలిసి చూడటమే నా రెమ్యునరేషన్, ఫస్ట్ అడ్వాన్స్లా భావిస్తాను. నా ఫేమ్, మనీ, నా స్టేటస్ అన్నీ ఆడియన్స్ ఇచ్చినవే. వాళ్ల రుణం తీర్చుకోవాలి కదా. వాళ్లకు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను (రాజ కీయాల్లోకి అడుగుపెట్టడాన్ని ఉద్దేశించి). -
అమ్మ చేసింది తప్పు
... అని కమల్‌హాసన్ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అంటే మలయాళం నటీనటుల సంఘం అని అర్థం. గతేడాది నటి భావన కారులో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన వెనకాల నటుడు దిలీప్ హస్తం ఉందని భావన ఆరోపించారు. ఆమె ఫిర్యాదుని పరిశీలించి, పోలీసులు దిలీప్‌ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్‌పై బయటకు రావడం జరిగాయి. కాగా, ‘అమ్మ’లో దిలీప్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు సభ్యత్వం ఇచ్చారు ఇటీవల ‘అమ్మ’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్‌లాల్. ఈ నిర్ణయంపై బాధితురాలు భావనతో సహా పలువురు కథానాయికలు బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ సభ్యత్వం ఎలా ఇస్తారు? అని ‘అమ్మ’ని నిలదీశారు. ఈ విషయం గురించి కమల్‌హాసన్ స్పందించారు. ‘‘చట్టపరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సభ్యత్వం ఇవ్వడం తప్పు. ఒకవేళ దిలీప్ని క్షమించాలనుకుంటే వ్యక్తిగతంగా చేయొచ్చు. అయితే ఓ అసోసియేషన్ తీసుకునే నిర్ణయానికి సభ్యులందరి ఆమోదం ఉండాలి. దిలీప్ని వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని ‘అమ్మ’లో ఉన్న పలువురు అంటున్నారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం సభ్యులందరితో చర్చించాలి. అలా కాకుండా అతనికి సభ్యత్వం ఇచ్చి, బాధిత నటికి అన్యాయం చేశారు. ఆర్టిస్టులందరి కలయికతో ఏర్పడేదే ఆర్టిస్ట్స్ అసోసియేషన్. అది సజావుగా సాగాలంటే అందరి సహకారం కావాలి’’ అన్నారు కమల్. చిత్రసీమలో లింగ వివక్ష గురించి మాట్లాడుతూ – ‘‘మిగతా చిత్రపరిశ్రమలతో పోల్చితే మలయాళంలో లింగ వివక్ష తక్కువ’’ అన్నారు కమల్. -
కాంగ్రెస్‌తో పొత్తా.. ఇప్పుడే చెప్పలేను!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడంపై ఇప్పుడే చెప్పలేనని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్ అన్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న తరువాత కమల్ మీడియాతో మాట్లాడారు. పొత్తు అంశాన్ని కాంగ్రెస్ అగ్ర నేతల వద్ద ప్రస్తావించలేదని అన్నారు. రాజకీయాల్లో తన దారేదో తానే నిర్ణయించుకుంటానని చెప్పారు. జాతీయ రాజకీయాల గురించి చర్చించేందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కలిశానని తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే విషయంపై తన పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ఇప్పుడే ఏం మాట్లాడలేనని అన్నారు. రాహుల్, కమల్ల భేటీపై స్పందించేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ నిరాకరించారు.