
సాక్షి, చెన్నై: ప్రజలకు చేరువయ్యేందుకు మక్కల్ నీది మయ్యం నేత కమల్‌హాసన్ శనివారం రోడ్ షో నిర్వహించారు. కోయంబత్తూరు నుంచి ఈరోడ్–తిరుప్పూర్ వైపుగా సాగిన ఈ షోలో 18 చోట్ల పార్టీ జెండాలను ఎగుర వేశారు. ప్రధానంగా పశ్చిమ తమిళనాడు మీద దృష్టి పెట్టిన కమల్ హఠాత్తుగా తిరుప్పూర్, ఈరోడ్, కోయంబత్తూరు పర్యటనలకు సిద్ధమయ్యారు. కోయంబత్తూరు విమానాశ్రయానికి చేరుకున్న కమల్‌కు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. జనం అత్యధికంగా గుమిగూడిన ప్రదేశాల్లో తన వాహనంలోని ఓపెన్ విండో నుంచి అభివాదం చేస్తూ కమల్ ముందుకు సాగారు. జెండా ఎగుర వేసిన చోటంతా ఓపెన్ విండో నుంచి ప్రసంగించారు. అలాగే మార్గమధ్యంలోని ఓ గ్రామంలో అక్కడి ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. గ్రామాల మీదుగానే కమల్ పర్యటన ఈరోడ్ వరకు సాగింది. సాయంత్రం అన్నదాతలతో, చేనేత కార్మికులతో కమల్ భేటీ అయ్యారు.