
వాటాల అమ్మకానికి ప్రభుత్వ ప్రణాళికలు
ఈ ఏడాది(2025) చివరి నాటికి ఎయిరిండియా మాజీ అనుబంధ సంస్థల్లో వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వీలుగా మే నెలలో రోడ్ షోలు చేపట్టాలని యోచిస్తోంది. భారత్‌సహా సింగపూర్, యూరప్‌లో వీటిని నిర్వహించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్ట్‌లోగా ఆయా కంపెనీలపట్ల ఆసక్తి కలిగిన సంస్థలు బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశాయి.
కేంద్రం విక్రయించాలని నిర్ణయించిన కంపెనీల జాబితాలో ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఏఐఈఎస్‌ఎల్), ఎయిరిండియా ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ సర్వీసస్ (ఏఐఏటీఎస్‌ఎల్), ఎయిరిండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ (ఏఐఏఎస్‌ఎల్), హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(హెచ్‌సీఐ), ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీసెస్(ఏఏఎస్) ఉన్నాయి. వెరసి డిసెంబర్‌లోగా వాటాల విక్రయాన్ని పూర్తి చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ 2021వరకూ ప్రభుత్వ అజమాయిషిలోని ఎయిరిండియాకు అనుబంధ సంస్థలుగా వ్యవహరించాయి. కాగా.. 2022 జనవరిలో ఎయిరిండియా అధికారికంగా టాటా గ్రూప్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.
స్పైస్‌జెట్‌లో 1% వాటా అమ్మకం
1.15 కోట్ల షేర్లు విక్రయించిన ప్రమోటర్
బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో ప్రమోటర్ అజయ్ సింగ్ 0.9 శాతం వాటా విక్రయించారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ.45.34 సగటు ధరలో 1.15 కోట్ల షేర్లు అమ్మివేశారు. వెరసి రూ.52.3 కోట్లు అందుకున్నారు. ఈ లావాదేవీ తదుపరి స్పైస్‌జెట్‌లో అజయ్ సింగ్ వాటా 22 శాతానికి పరిమితమైంది. మొత్తం ప్రమోటర్ గ్రూప్ వాటా 29.13 శాతం నుంచి 28.23 శాతానికి తగ్గింది. వాటా కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు.
ఇదీ చదవండి: జనరల్ ఇన్సూరెన్స్‌లోకి పతంజలి