sell stake
-
మరో బిజినెస్ నుంచి తప్పుకోనున్న పేటీఎం
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ అప్రధాన్య వ్యాపారాల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. సినిమా, ఈవెంట్ టికెట్లను విక్రయించే పేటీఎం ఇన్‌సైడర్‌ను ఇటీవలే జొమాటోకు విక్రయించడం ద్వారా రూ.2,048 కోట్లు సమకూర్చుకున్న పేటీఎం.. తాజాగా జపాన్‌కు చెందిన పేపే కార్పొరేషన్లో తనకున్న వాటాలను విక్రయించాలని నిర్ణయించింది.ఈ వాటాల వలువ 236 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,000 కోట్లు) ఉంటుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అంచనా. పే పే కార్పొరేషన్లో వన్97 కమ్యూనికేషన్స్‌కు 7.2 శాతం వాటా ఉంది. ‘‘జపాన్‌కు చెందిన పే పే కార్పొరేషన్లో స్టాక్ అక్విజిషన్ రైట్స్ (ఎస్ఏఆర్)ను విక్రయించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు వన్97 కమ్యూనికేషన్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి సమాచారం వచ్చింది’’అని స్టాక్ ఎక్స్ఛేంజ్లకు పేటీఎం వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పేటీఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ రూ.930 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఎంటర్టైన్మెంట్ టికెట్ బిజినెస్ ద్వారా భారీ లాభాలు అందుకుంది. కంపెనీ రెవెన్యూ 10.5 శాతం పెరిగింది. ఇటీవలే గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సైతం ఈ స్టాక్ కొత్త టార్గెట్ ప్రైస్ రూ.1000గా పేర్కొంది.కాగా పేటీఎం షేర్లు గత ఆరు నెలలుగా మంచి లాభాలు అందిస్తున్నాయి. నష్టాల్లోకి జారుకున్నప్పటికీ సహనంతో కొనసాగినందుకు మదుపర్లకు ప్రతిఫలాలు లభిస్తున్నాయి. గడిచిన ఆరు నెలల కాలంలో ఏటీఎం షేరు ఏకంగా 140 శాతం మేర పెరిగింది. దీంతో లక్ష రూపాయలు పెట్టిన వారికి ఆరు నెలల్లో రూ.2.40 లక్షలు అందించింది. -
ఎల్ఐసీ అమ్మక పరిమాణం ఓకే
ముంబై: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించడమే ప్రస్తుత పరిస్థితుల్లో సరైన పరిమాణమని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలోకి ఒక్కసారిగా భారీ పెట్టుబడులు తరలి వచ్చేందుకు వీలుండదని తెలియజేశారు. ప్రస్తుత సమస్యాత్మక మార్కెట్ వాతావరణంలో ఎల్ఐసీ వాటా విక్రయాన్ని రూ. 20,557 కోట్లకు పరిమితం చేయడం సరైన చర్యగా పేర్కొన్నారు. ఎల్ఐసీ ఇష్యూ అందరికీ.. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లకు విలువ చేకూర్చగలదని అభిప్రాయపడ్డారు. వెరసి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూపై అధికారికంగా వివరాలు వెలువడ్డాయి. తొలుత 5 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వం మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా 3.5 శాతానికి తగ్గించుకుంది. 22.13 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 20,557 కోట్లు లభించగలవని భావిస్తోంది. ఇష్యూ మే 4న ప్రారంభమై 9న ముగియనున్నట్లు అంచనా. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 902–949గా నిర్ణయించిన విషయం విదితమే. పాలసీదారులు, ఉద్యోగులు, రిటైలర్లకు ఇష్యూ ధరలో రూ. 60–40 వరకూ రాయితీని ప్రకటించింది. ఎల్ఐసీ.. మే 17న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. -
మెగా డీల్ : అంబానీ సరసన అదానీ
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ దిగ్గజ కంపెనీలకు వాటాను విక్రయిస్తూ, మెగాడీల్స్తో జోరుమీదున్న బడా వ్యాపారవేత్తల జాబితాలో తాజాగా బిలియనీర్ గౌతమ్ అదానీ చేరారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఎల్)లో మైనారిటీ వాటాను ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్ఈకి విక్రయించనుంది. ఈ డీల్ విలువ 2.5 బిలియన్ డాలర్ల (రూ.18,200 కోట్లు) గా ఉండనుంది. ఈ ఒప్పందం ద్వారా సమకూరిన నిధులతో అదానీ తన వ్యాపార రుణాన్ని తగ్గించుకోనుందని అంచనా. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ గ్రీన్‌లో 20శాతం వాటా కొనేందుకు ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అలాగే సోలార్ ఎనర్జీ అభివృద్ధిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఉన్న అదానీ గ్రీన్ బోర్డులోకి టోటల్ చేరనుంది. మొత్తం 2.35 గిగావాట్స్ సోలార్ అసెట్ లో 50 శాతం వాటా అదానీ సొంతం. కంపెనీలో ప్రమోటర్లకు 74.92 శాతం వాటా ఉండగా, దీనిలో 20 శాతం వాటాను టోటల్‌కు విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు చెందిన 16.4 శాతం వాటాకు సమానమైన 25.65 కోట్ల షేర్లను టోటల్ కొనుగోలు చేసినట్లు అదానీ గ్రీన్ వెల్లడించింది. పునరుత్పాదక , సహజ వాయువు అనే రెండు స్తంభాల ఆధారంగా శక్తి పరివర్తన వ్యూహాన్ని అమలు చేయడానికి భారతదేశం సరియైనదని తాము భావిస్తున్నామని టోటల్ సీఈఓ పాట్రిక్ పౌయన్నే ఒక ప్రకటనలో తెలిపారు. కాగా 1988లో వస్తువుల వ్యాపారిగా ప్రారంభమైన అదానీ గ్రూప్, భారతదేశపు అగ్రశ్రేణి ప్రైవేటు రంగ పోర్ట్ ఆపరేటర్ విద్యుత్ జనరేటర్‌గా ఎదిగింది. 2019 ఏడాదిలో విమానాశ్రయాలపై దృష్టి పెట్టిన, అదానీ తాజాగా డాటా స్టోరేజ్, ఆర్థిక సేవలు సహా ఇతర రంగాలలోకి ఎంట్రీ ఇస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 1.483 ట్రిలియన్ డాలర్లు (20.25 బిలియన్ డాలర్లు). 20 శాతం వాటా ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 4.1 బిలియన్ డాలర్లు. మరోవైపు తన వ్యాపార స్రామాజ్యంలో వాటాలను విదేశీ దిగ్గజాలకు అమ్మడం ద్వారా పెట్టుబడులను సేకరిస్తూ రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ విశషంగా నిలిచారు. ఫేస్బుక్, గూగుల్, సిల్వర్‌లేక్, అబుదాబి సహా వివిధ విదేశీ పెట్టుబడిదారుల నుంచి సుమారు 27 బిలియన్ల డాలర్లను సంపాదించిన సంగతి తెలిసిందే. -
త్వరలోనే టీహెచ్‌డీసీలో డిజిన్వెస్ట్‌మెంట్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (నీప్కో)లో వాటాలను మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ డీల్ ద్వారా ఖజానాకు దాదాపు రూ. 10,000 కోట్లు రావొచ్చని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 65,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పడగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది మార్చి 31 నాటికి నీప్కో నికర విలువ రూ. 6,301 కోట్లుగా ఉంది. అటు టీహెచ్‌డీసీఐఎల్ విలువ రూ. 9,281 కోట్లుగా ఉంది. కేంద్రానికి టీహెచ్‌డీసీఐఎల్‌లో 74.23 శాతం, నీప్‌కోలో 100 శాతం వాటాలు ఉన్నాయి. -
ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంలో 49 శాతం వాటా విక్రయం:జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో గతంలో నిర్ణయించిన 44.44 శాతానికి బదులు 49 శాతం వాటా విక్రయించనున్నట్టు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురువారం ప్రకటించింది. జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి టాటా గ్రూప్, సింగపూర్ సావెరీన్ వెల్త్ ఫండ్ జీఐసీతోపాటు ఎస్ఎస్జీ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఈ వాటాను కొనుగోలు చేస్తున్నాయి. ఒక్కొక్కరికి ఎంత వాటా దక్కనుందీ, డీల్ విలువలో ఏవైనా మార్పు ఉందా అన్న విషయాలను జీఎంఆర్ వెల్లడించలేదు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్, జీఐసీ, ఎస్ఎస్జీ క్యాపిటల్ సంయుక్తంగా రూ.8,000 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు గతేడాది జీఎంఆర్ ప్రకటించింది. పాత ఒప్పందం ప్రకారం టాటా గ్రూప్ 19.7 శాతం, జీఐసీ 14.8, ఎస్ఎస్జీ 9.9 శాతం వాటా కొనుగోలు చేయాల్సి ఉంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ విలువను రూ.18,000 కోట్లుగా లెక్కించారు. ఇక తాజా డీల్‌తో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో జీఎంఆర్ ఇన్ఫ్రా 48.9 శాతం, ఎంప్లాయీ వెల్ఫేర్ ట్రస్ట్ 2.1 శాతం వాటా కలిగి ఉంటాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా విక్రయం విషయమై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ఇండియా 2019 అక్టోబరులో ఆమోదం తెలిపింది. ఎయిర్‌పోర్టుల వ్యాపారంలో టాటా గ్రూప్ ఎంట్రీకి ఈ డీల్ దోహదం చేస్తోంది. మరోవైపు రుణ భారం తగ్గించుకోవడానికి జీఎంఆర్‌కు తోడ్పడనుంది. ఢిల్లీతోపాటు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహిస్తోంది. -
బీపీసీఎల్ మళ్లీ ‘విదేశీ’ పరం!
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను విదేశీ చమురు సంస్థకు విక్రయించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. దేశంలోనే రెండో అతి పెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్ సంస్థ, బీపీసీఎల్‌లో తనకున్న నియంత్రిత వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే బీపీసీఎల్‌లో తన వాటా(53.3 శాతం)ను విదేశీ సంస్థలకు విక్రయించాలని, తద్వారా భారత ఇంధన రిటైల్ రంగంలోకి బహుళ జాతి సంస్థలను ఆకర్షించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రంగంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ రంగ సంస్థలే పెత్తనం చెలాయించాయని, దీనికి స్వస్తి చెప్పడానికి, మరోవైపు ఈ రంగంలో పోటీని పెంచడానికి ఈ చర్య ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,05 లక్ష కోట్ల నిధులు సమీకరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీపీసీఎల్‌లో వాటా విక్రయం కారణంగా ఈ లక్ష్యంలో 40 శాతం మొత్తాన్ని సమీకరించే అవకాశముందని అంచనా. (శుక్రవారం నాటి ముగింపు ధరతో పోల్చితే) అలాగే ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేసుకోవాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆర్థిక మందగమనం కారణంగా రెవెన్యూ వసూళ్లు తగ్గడంతో మౌలిక, సంక్షేమ పథకాలకు నిధుల లభ్యత దుర్లభమవుతోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో బీపీసీఎల్ వాటా విక్రయం ఒకింత ఊరటనివ్వగలదని నిపుణుల అంచనా. ప్రారంభ స్థాయిలోనే చర్చలు.. అయితే విదేశీ సంస్థకు వాటా విక్రయ చర్చలు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయని, ఈ చర్చలు పూర్తవ్వడానికి ఎంతకాలం పడుతుందో స్పష్టత లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్‌ను ఐఓసీకి విక్రయించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. అయితే బీపీసీఎల్‌ను కొనుగోలు చేయడానికి ఐఓసీ మళ్లీ నిధులు సమీకరించాల్సి రావడం తదితర తలనొప్పులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ ఆలోచనను అటకెక్కించింది. గతంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్)లో తన వాటాను కేంద్రం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీకి విక్రయించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఓఎన్జీసీ భారీగా నిధులను సమీకరించాల్సి వచి్చంది. ఇక బీపీసీఎల్ వాటా విక్రయానికి ఏ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుందో ఇంత వరకైతే స్పష్టత లేదని నిపుణులంటున్నారు. అయితే బీపీసీఎల్ ప్రైవేటీకరణకు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. విదేశీ కంపెనీగా ఉన్న బర్మా షెల్ కంపెనీని కేంద్రం 1970లో జాతీయం చేసి బీపీసీఎల్‌గా పేరు మార్చింది. మళ్లీ బీపీసీఎల్ విదేశీ సంస్థల పరమయ్యే అవకాశాలు ఉండటం విశేషం. భారత్‌పై చమురు దిగ్గజాల కన్ను... ఇక పలు బహుళ జాతి సంస్థలు భారత ఇంధన రిటైల్ రంగంపై ఆసక్తి చూపుతున్నాయి. సౌదీ ఆరామ్కో, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ పీజేఎస్సీ, టోటల్ ఎస్, షెల్, బ్రిటిష్ పెట్రోలియమ్(బీపీ)లు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లో ఇంధన డిమాండ్ 2040 కల్లా రెట్టింపవ్వగలదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది, వచ్చే ఏడాది... ఈ రెండేళ్లలో ప్రపంచంలోనే చమురుకు అత్యంత డిమాండ్ భారత్‌లోనే ఉండగలదని ఇటీవలే ఒపెక్ కూడా తన నెలవారీ ఆయిల్ డిమాండ్ నివేదికలో వెల్లడించింది. దీంతో భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చమురు బహుళ జాతి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా విక్రయం ఆ సంస్థలకు ఆయాచిత వరంగా అందివచి్చంది. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన రిటైల్ వ్యాపారంలో 49% వాటాను బీపీ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేర్ శుక్రవారం 6.4 శాతం లాభంతో రూ. 409 వద్ద ముగిసింది. రిఫైనరీల సంఖ్య (నుమాలీగఢ్, బినా, ముంబై, కోచి) =4 దేశవ్యాప్తంగా బంకులు =13,439 భారత్ గ్యాస్ కస్టమర్ల సంఖ్య కోట్లలో=4.2 ఆదాయం రూ. కోట్లలో 2018–19= 3,37,623 2018–19 నికర లాభం రూ. కోట్లలో=7,132 -
ప్రమోషన్లు, కొత్త నియామకాలు నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు సంస్థ ఉద్యోగులకు ఎయిరిండియా భారీ షాక్ సిద్ధమవుతోంది. ఉద్యోగుల ప్రమోషన్లు, కొత్త నియామక ప్రక్రియను నిలిపివేసినట్టు తెలుస్తోంది. సుమారు రూ.55వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వీలైనంత త్వరంగా మోడీ సర్కార్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలు, ప్రమోషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం సూచించడం గమనార్హం.. ఎయిరిండియాను రానున్న నాలుగైదు నెలల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. వాటా విక్రయ ప్రక్రియ కోసం ఎయిరిండియా ఖాతాలను ఈ నెల (జూలై)15 తో క్లోజ్ చేసింది. ఈ ఖాతాలను బిడ్స్ ప్రక్రియ కోసం వినియోగించనున్నట్లు చెబుతున్నారు. అయితే తాజా వార్తలపై విమానయాన శాఖ , ఎయిరిండియా అధికారికంగా స్పందించాల్సి వుంది. ఎయిరిండియా వాటా విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సేల్కు ముందే కార్యకలాపాలు మెరుగుపరుస్తామని, నాలుగైదు నెలల్లో దీనిని విక్రయించే ప్రయత్నాలు చేస్తామని సంబంధిత మంత్రి, అధికారులు చెబుతున్నారు. దీపావళి లోపు అమ్మే ప్రయత్నాలు చేస్తామని డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ సెక్రటరీ అటన్ చక్రవర్తి ఇటీవల వెల్లడించారు. ఏ షరతులపై ప్రైవేటు కంపెనీల నుంచి బిడ్స్ ఆహ్వానించాలనే విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ సిద్ధం చేస్తోంది. ఎయిరిండియాలో 76 శాతం వాటాలు విక్రయించేందుకు 2018లో కేంద్రం ప్రయత్నించింది. అయితే, కొనుగోలుదారు దాదాపు రూ.30 వేల కోట్ల రుణభారాన్ని భరించాల్సి రానుండటంతో విక్రయ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎయిరిండియాలో సుమారు 10వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం ఎయిరిండియా ద్వారా రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. -
రూపాయికే ముంద్రా ప్లాంట్ వాటా విక్రయం
ముంబై: తీవ్ర నష్టాల్లతో టాటా పవర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేసిన ముంద్రా ప్లాట్ విషయంలో సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్‌లోని వాటా విక్రయం విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసింది. 4 వేల మెగావాట్ల ముంద్రా యూపీఎంపీ (అల్టా మెగా పవర్ ప్రాజెక్టు)లో 51 శాతం ఈక్విటీ వాటాను కేవలం ఒక్క రూపాయికి విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటాను కొనుగోలు చేయాలని గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ కు టాటా పవర్ అధికారులు లేఖ రాశారు. ఈ ప్రతిపాదన లేఖ కాపీలను విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, గుజరాత్ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శికి కోస్టల్ గుజరాత్ పవర్ లిమిటెడ్‌కూడా అందించింది. ఈ లేఖలో రెండు ఆప్షన్స్ ను ప్రస్తావిస్తూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, లేకుంటే ఈక్విటీని కొనుగోలు చేసి ప్లాంటును నిర్వహించుకోవాలని కోరినట్టు సమాచారం. ప్లాంటు నిర్వహణ పెనుభారం కావడంతో నష్టాల నుంచి కోలుకునేందుకు ప్రభుత్వమే ముందుకు రావాలని, 49 శాతం వాటాదారుగా, ప్లాంటుకు అవసరమైన అన్ని రకాల అవసరాలనూ తీర్చేందుకు తాము సిద్ధంగా ఉంటామని ఈ లేఖలో టాటా పవర్ అధికారులు పేర్కొన్నారు. 2008లో వేసిన అంచనా వ్యయాల ప్రాతిపదికన ఇప్పుడు ప్లాంటును నడిపించడం ఎలా సాధ్యమని టాటా సన్స్ బోర్డు ప్రశ్నిస్తూ, ముంద్రా ప్లాంటు విస్తరణ పెట్టుబడులను అడ్డుకున్న వేళ, టాటా పవర్ ఈ లేఖను రాయడం గమనార్హం. కాగా టాటా పవర్ ముంద్రా యుఎంపిపి ప్రాజెక్టు కోసం రూ.18,000 కోట్లు పెట్టుబడి పెట్టగా 2013-14లో ఈ ప్రాజెక్టుపై టాటా పవర్ రూ.1,500 కోట్ల నష్టాలు చవి చూసింది. ఈ ప్లాంటుకు మొత్తం సేకరించిన మొత్తం రు. 15000-16000 కోట్లు. ముంద్రా ప్లాంట్ బ్యాంకుల నుండి రూ .10,000 కోట్లు, టాటా గ్రూపు నుంచి 5000 కోట్ల రూపాయలను తీసుకుంది. మొత్తం రుణ 42,000-43,000 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్న ఐదు రాష్ట్రాలతో (రాజస్థాన్, హర్యానా, పంజా, మధ్యప్రదేశ్, గుజరాత్) దీనికి అనుమతించాల్సి ఉంది.