హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో గతంలో నిర్ణయించిన 44.44 శాతానికి బదులు 49 శాతం వాటా విక్రయించనున్నట్టు జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురువారం ప్రకటించింది. జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి టాటా గ్రూప్, సింగపూర్ సావెరీన్ వెల్త్ ఫండ్ జీఐసీతోపాటు ఎస్‌ఎస్‌జీ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఈ వాటాను కొనుగోలు చేస్తున్నాయి. ఒక్కొక్కరికి ఎంత వాటా దక్కనుందీ, డీల్ విలువలో ఏవైనా మార్పు ఉందా అన్న విషయాలను జీఎంఆర్ వెల్లడించలేదు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్, జీఐసీ, ఎస్‌ఎస్‌జీ క్యాపిటల్ సంయుక్తంగా రూ.8,000 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు గతేడాది జీఎంఆర్ ప్రకటించింది.
పాత ఒప్పందం ప్రకారం టాటా గ్రూప్ 19.7 శాతం, జీఐసీ 14.8, ఎస్‌ఎస్‌జీ 9.9 శాతం వాటా కొనుగోలు చేయాల్సి ఉంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ విలువను రూ.18,000 కోట్లుగా లెక్కించారు. ఇక తాజా డీల్‌తో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో జీఎంఆర్ ఇన్‌ఫ్రా 48.9 శాతం, ఎంప్లాయీ వెల్ఫేర్ ట్రస్ట్ 2.1 శాతం వాటా కలిగి ఉంటాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా విక్రయం విషయమై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్‌ఇండియా 2019 అక్టోబరులో ఆమోదం తెలిపింది. ఎయిర్‌పోర్టుల వ్యాపారంలో టాటా గ్రూప్ ఎంట్రీకి ఈ డీల్ దోహదం చేస్తోంది. మరోవైపు రుణ భారం తగ్గించుకోవడానికి జీఎంఆర్‌కు తోడ్పడనుంది. ఢిల్లీతోపాటు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment