పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ అప్రధాన్య వ్యాపారాల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. సినిమా, ఈవెంట్ టికెట్లను విక్రయించే పేటీఎం ఇన్‌సైడర్‌ను ఇటీవలే జొమాటోకు విక్రయించడం ద్వారా రూ.2,048 కోట్లు సమకూర్చుకున్న పేటీఎం.. తాజాగా జపాన్‌కు చెందిన పేపే కార్పొరేషన్‌లో తనకున్న వాటాలను విక్రయించాలని నిర్ణయించింది.
ఈ వాటాల వలువ 236 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,000 కోట్లు) ఉంటుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అంచనా. పే పే కార్పొరేషన్‌లో వన్97 కమ్యూనికేషన్స్‌కు 7.2 శాతం వాటా ఉంది. ‘‘జపాన్‌కు చెందిన పే పే కార్పొరేషన్‌లో స్టాక్ అక్విజిషన్ రైట్స్ (ఎస్‌ఏఆర్)ను విక్రయించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు వన్97 కమ్యూనికేషన్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి సమాచారం వచ్చింది’’అని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు పేటీఎం వెల్లడించింది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పేటీఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ రూ.930 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఎంటర్‌టైన్మెంట్ టికెట్ బిజినెస్ ద్వారా భారీ లాభాలు అందుకుంది. కంపెనీ రెవెన్యూ 10.5 శాతం పెరిగింది. ఇటీవలే గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సైతం ఈ స్టాక్ కొత్త టార్గెట్ ప్రైస్ రూ.1000గా పేర్కొంది.
కాగా పేటీఎం షేర్లు గత ఆరు నెలలుగా మంచి లాభాలు అందిస్తున్నాయి. నష్టాల్లోకి జారుకున్నప్పటికీ సహనంతో కొనసాగినందుకు మదుపర్లకు ప్రతిఫలాలు లభిస్తున్నాయి. గడిచిన ఆరు నెలల కాలంలో ఏటీఎం షేరు ఏకంగా 140 శాతం మేర పెరిగింది. దీంతో లక్ష రూపాయలు పెట్టిన వారికి ఆరు నెలల్లో రూ.2.40 లక్షలు అందించింది.
Comments
Please login to add a commentAdd a comment