యూపీఐ ప్రొవైడర్లకు సంబంధించిన 30 శాతం మార్కెట్ షేర్ పరిమితిని పాటించేందుకు గడువును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో రెండేళ్లు పొడిగించింది. ఈ ప్రకటన తర్వాత బుధవారం (జనవరి 1) ట్రేడింగ్ సెషన్‌లో పేటీఎం (Paytm) షేర్లు బీఎస్‌ఈ (BSE)లో దాదాపు 4 శాతం పడిపోయి రూ. 976.5కి చేరుకున్నాయి.
యూపీఐ ప్రొవైడర్ల డిజిటల్ లావాదేవీల పరిమాణం వాటి మార్కెట్ షేర్‌లో 30 శాతానికి మించకూడదని ఎన్‌పీసీఐ నిబంధన విధించింది. దీనికి ఇదివరకు 2024 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా దీన్ని 2026 డిసెంబర్ 31 వరకు మరో రెండేళ్లు పొడిగించింది. "వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (TPAPs) సమ్మతి గడువును మరో రెండేళ్లు పొడిగిస్తున్నాము" అని ఎన్‌పీసీఐ తన ప్రకటనలో తెలిపింది.
పేటీఎం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,626 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ట విలువ రూ.310 కాగా, 52 వారాల గరిష్టం రూ.1,063. జనవరి 1న బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఇది ఒకటి.
కాగా ఎన్‌పీసీఐ నిర్ణయం వల్ల వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay)కి స్వల్పకాలిక ఉపశమనం లభించనుంది. రెండూ కలిసి యూపీఐ (UPI) చెల్లింపుల మార్కెట్‌లో 85 శాతానికి పైగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొత్త పరిమితిని పాటించడానికి వాటికి అదనపు సమయం లభించింది.
రెగ్యులేటరీ డేటా ప్రకారం.. 2024 నవంబర్‌లో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే 47.8% వాటాను కలిగి ఉండగా గూగుల్ పే 37 శాతం వాటాను కలిగి ఉంది. రెండు కంపెనీలు కలిసి ఆ నెలలో 13.1 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment