Japanese company
-
మరో బిజినెస్ నుంచి తప్పుకోనున్న పేటీఎం
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ అప్రధాన్య వ్యాపారాల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. సినిమా, ఈవెంట్ టికెట్లను విక్రయించే పేటీఎం ఇన్‌సైడర్‌ను ఇటీవలే జొమాటోకు విక్రయించడం ద్వారా రూ.2,048 కోట్లు సమకూర్చుకున్న పేటీఎం.. తాజాగా జపాన్‌కు చెందిన పేపే కార్పొరేషన్లో తనకున్న వాటాలను విక్రయించాలని నిర్ణయించింది.ఈ వాటాల వలువ 236 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,000 కోట్లు) ఉంటుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అంచనా. పే పే కార్పొరేషన్లో వన్97 కమ్యూనికేషన్స్‌కు 7.2 శాతం వాటా ఉంది. ‘‘జపాన్‌కు చెందిన పే పే కార్పొరేషన్లో స్టాక్ అక్విజిషన్ రైట్స్ (ఎస్ఏఆర్)ను విక్రయించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు వన్97 కమ్యూనికేషన్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి సమాచారం వచ్చింది’’అని స్టాక్ ఎక్స్ఛేంజ్లకు పేటీఎం వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పేటీఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ రూ.930 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఎంటర్టైన్మెంట్ టికెట్ బిజినెస్ ద్వారా భారీ లాభాలు అందుకుంది. కంపెనీ రెవెన్యూ 10.5 శాతం పెరిగింది. ఇటీవలే గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సైతం ఈ స్టాక్ కొత్త టార్గెట్ ప్రైస్ రూ.1000గా పేర్కొంది.కాగా పేటీఎం షేర్లు గత ఆరు నెలలుగా మంచి లాభాలు అందిస్తున్నాయి. నష్టాల్లోకి జారుకున్నప్పటికీ సహనంతో కొనసాగినందుకు మదుపర్లకు ప్రతిఫలాలు లభిస్తున్నాయి. గడిచిన ఆరు నెలల కాలంలో ఏటీఎం షేరు ఏకంగా 140 శాతం మేర పెరిగింది. దీంతో లక్ష రూపాయలు పెట్టిన వారికి ఆరు నెలల్లో రూ.2.40 లక్షలు అందించింది. -
డైకిన్ ఏసీలు.. ఇక మేడిన్ ఆంధ్రా
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద ఏసీ తయారీ సంస్థ.. జపాన్‌కు చెందిన డైకిన్ ఇక నుంచి మేడిన్ ఆంధ్రా ఏసీలను విక్రయించనుంది. ఈ మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీసిటీలో జపాన్ కంపెనీ ప్రతినిధులు, రాయబారుల సమక్షంలో నవంబర్ 23న లాంఛనంగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 75.5 ఎకరాల విస్తీర్ణంలో డైకిన్ ఈ యూనిట్‌ను స్థాపించింది. గతేడాది ఏప్రిల్‌లో నిర్మాణ పనులు ప్రారంభించిన డైకిన్ రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లోనే యూనిట్‌ను సిద్ధం చేసింది. తొలి దశలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌కు ఏటా 10 లక్షల ఏసీలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన యూనిట్లలో 75 శాతం నియామకాలు స్థానికులకే ఉండాలన్న ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)తో డైకిన్ ఒప్పందం కుదుర్చుకుంది. 2020–21లో డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ సంస్థలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని డైకిన్ వెల్లడించింది. ఎంపికైన ఉద్యోగులకు రూ.1.99 లక్షల వార్షిక వేతనాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. వేగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు.. రెండో దశలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 20 లక్షల ఏసీలకు డైకిన్ చేర్చనుంది. 2017లో రాజస్థాన్‌లోని నిమ్రాణాలో రెండో యూనిట్‌ను ప్రారంభించిన డైకిన్ ఏపీలో మూడో యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా శ్రీసిటీని ఎంపిక చేసుకున్నట్లు శంకుస్థాపన సమయంలో డైకిన్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీ కన్వలజీత్ జావా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు వేగంగా మంజూరు చేయడంతో రికార్డు స్థాయిలో డైకిన్ ఉత్పత్తికి సిద్ధమైందని తెలిపారు. ఏసీ తయారీ హబ్‌గా శ్రీసిటీ.. దేశీయ ఏసీ మార్కెట్లో బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న సందర్భంగా శ్రీసిటీలో మూడో యూనిట్ అందుబాటులోకి రావడంపై శ్రీసిటీ వ్యవస్థాపక ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఏసీ తయారీ హబ్‌గా శ్రీసిటీ ఎదుగుతోందన్నారు. డైకిన్‌తో పాటు బ్లూస్టార్, లాయిడ్ (హావెల్స్), పానాసోనిక్, యాంబర్, ఈప్యాక్ వంటి అనేక సంస్థలు ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేశాయన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఏసీల ఉత్పత్తి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 75 లక్షల గృహవినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షల ఏసీలకు పైనే ఉంటుందని అంచనా. ఈ విధంగా చూస్తే వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ఏసీలో ఒకటి మన రాష్ట్రంలో తయారైందే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం ఈ ఆరు యూనిట్లు, వీటికి సరఫరా చేసే ఉపకరణాల యూనిట్లను చూసుకుంటే ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ యూనిట్లకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చింది. -
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా!
ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్ పెన్నును చూశారా? ఇక్కడున్న పెన్ను అదే! జపాన్‌కు చెందిన మిత్సుబిషి కంపెనీ యూని–బాల్ వన్ సిరీస్ బ్లాక్ జెల్ పెన్ను. ప్రపంచంలోనే అత్యంత నల్లని జెల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. దీని సిరా లోపలి వినూత్నమైన వర్ణద్రవ్య కణాల కారణంగా ఈ పెన్నుతో కాగితంపై రాస్తున్నప్పుడు ఇది ఇతర బ్లాక్ జెల్ పెన్నుల కంటే రంగును మరింత నల్లగా కనిపించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ పెన్నుకు సంబంధించిన వివరాలను కంపెనీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. చాలామంది ఈ పెన్నును కొనడానికి పోటీ పడుతున్నారు. కానీ ఇది ఇంకా మార్కెట్లో విడుదల కాలేదు. త్వరలోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. (చదవండి: కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!) -
రూ.450 కోట్లతో ఉత్పత్తి యూనిట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో జపాన్ సంస్థ భారీ పెట్టుబడితో రానుంది. జపాన్‌కు చెందిన ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ, సొల్యూషన్స్ సంస్థ డైఫుకు (ఈఅఐఊ్ఖఓ్ఖ) తెలంగాణలో తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ. 450 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ యూనిట్ మొదటి దశ విస్తరణకు రూ.250 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ఆ కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. రంగారెడ్డి జిల్లా చందనపల్లిలో ఏర్పాటు చేసే ఈ తయారీ యూనిట్‌ను 18 నెలల్లో ప్రారంభించనుంది. దీని ద్వారా సుమారు 800 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో డైఫుకు సంస్థ తరఫున భారతీయ అనుబంధ సంస్థ వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీనివాస్ గరిమెళ్ల, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ భారత్‌లో విస్తృతమైన దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తయారీ రంగానికి కేంద్రంగా ఉన్న చైనా అవతల తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఈ తరుణంలో భారతదేశం ఈ అవకాశాన్ని జార విడవకుండా అందిపుచ్చుకోవాలని కోరారు. భారతదేశానికి చెందిన పెట్టుబడిదారులు సైతం ఇండియా కోసం మాత్రమే కాకుండా ప్రపంచానికి సరిపడా తమ ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రాథమికస్థాయి తయారీపైనే కాకుండా హైటెక్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లోనూ ముందుకు పోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణలో తమ తయారీ సంస్థలను ఏర్పాటు చేసిన, చేయనున్న కంపెనీలు బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలతో భాగస్వాములవ్వాలని విజ్ఞప్తి చేశారు. 800 మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి డైఫుకు అనుబంధ భారతీయ సంస్థ వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శ్రీనివాస్ గరిమెళ్ల మాట్లాడుతూ జపాన్ సాంకేతిక సహకారంతో భారత్‌లో తమ సంస్థ ఉత్పత్తులను తయారు చేయాలనే లక్ష్యంతో పరిశ్రమల యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల 800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని, ఆటోమేటివ్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ స్థానికంగా ఉత్పత్తి అయి వినియోగంలోకి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు పాల్గొన్నారు. -
మనుషులను ఉతికేసే వాషింగ్ మెషీన్! భయపడకండి భలే ఉంటుంది!
మీరు చదివింది నిజమే.. బట్టలు ఉతకడం కోసం కాదు. మనుషుల స్నానం కోసం వాషింగ్ మెషీన్ తయారు చేస్తోంది ఓ జపనీస్ కంపెనీ. ఒసాకాకు చెందిన ‘సైన్స్ కో లిమిటెడ్’ దీన్ని రూపొందిస్తోంది. ఫైన్ బబుల్ టెక్నాలజీతోపాటు వివిధ సెన్సర్లు, కృత్రిమ మేధ ఆధారంగా ఈ పరికరం మనుషుల శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అంతేకాదు విశ్రాంతినిచ్చే సంగీతం వినిపిస్తూ, వాటర్ రెసిస్టెంట్ డిస్ప్లేలో ఫొటోలు కూడా చూపిస్తూ.. మరింత హాయిగొలిపేలా చేస్తున్నాయి. ఏదేమైనా వాషింగ్ మెషీన్‌లోకి వెళ్లి కూర్చుంటే ఇంకేమన్నా ఉందా? అని భయపడకండి. ఇందులోని సెన్సర్లు శరీరంలోని నరాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి. కృత్రిమ మేధతో సేకరించిన ఈ డేటా సాయంతో.. అందులో ఉన్నవారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని మెషీన్ సృష్టిస్తుందని రూపకర్తలు చెబుతున్నారు. అయితే ఇలా మనుషుల వాషింగ్ మెషీన్ తయారు చేసే ఐడియా కొత్తదేం కాదు. జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సాన్యో ఎలక్ట్రిక్ 1970 సమయంలోనే ‘అల్ట్రాసోనిక్ బాత్’ పరికరాన్ని తయారు చేసింది. అది 15 నిమిషాల్లోనే శరీరాన్ని శుభ్రం చేయడంతోపాటు ఆరబెట్టడం, మసాజ్ చేయడం కూడా పూర్తిచేసింది. కానీ దానిపై వెల్లువెత్తిన సందేహాలతో మార్కెట్లోకి తీసుకురాలేదు. ఇన్నేళ్ల తర్వాత సైన్స్ కో లిమిటెడ్ చైర్మన్ యసాకీ అయోమా దీనిపై దృష్టి పెట్టాడు. ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే సాన్యో తయారు చేసిన మనుషుల వాషింగ్ మెషీన్‌ను డెవలప్ చేసి.. మార్కెట్లోకి తేవాలని నిర్ణయించుకున్నాడట. ఇంతకీ ఈ మెషీన్‌ను కొనాలనుకుంటే 2025 దాకా ఆగాల్సిందే. 2024 చివరికల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, 2025లో అందరికీ అందుబాటులోకి తెస్తామని సైన్స్ కో సంస్థ చెబుతోంది. -
ఇక గాల్లో తేలిపోవడమే.. ఎగిరే బైక్ గురించి తెలుసుకుందామా..
పొద్దున్నే బైకో, కారో తీసుకుని రోడ్డెక్కారు.. ఎక్కడ చూసినా ట్రాఫిక్‌జామ్.. హాయిగా గాల్లో ఎగిరివెళితే బాగుండేదని చాలా మందికి అనిపిస్తుంటుంది. జపాన్‌కు చెందిన ఏఎల్ఐ టెక్నాలజీస్ సంస్థ ఈ కలను నిజం చేయబోతోంది. ఓ చిన్నపాటి హెలికాప్టర్లా గాల్లో ఎగురుతూ వెళ్లే బైక్‌ను రూపొందించింది. వచ్చే ఏడాదే దాన్ని మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్తోంది. ఆ ఎగిరే బైక్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. –సాక్షి సెంట్రల్ డెస్క్ గంటకు వందకిలోమీటర్ల వేగంతో.. జపాన్ సంస్థ రూపొందించిన ఎగిరే బైక్ పేరు ‘ట్సురిస్మో’. నాలుగు చిన్న ప్రొపెల్లర్లు (ఫ్యాన్‌లా తిరిగే మోటార్లు), మరో రెండు పెద్ద ప్రొపెల్లర్లతో ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో 40 నిమిషాల పాటు ఆగకుండా ప్రయాణించగలదు. అంటే సుమారు 67 కిలోమీటర్లు వెళ్లొచ్చు. తర్వాత మళ్లీ ఇంధనం నింపుకొని వెళ్లాల్సి ఉంటుంది. దీని పనితీరును తాజాగా జపాన్‌లోని మౌంట్ఫుజీ సమీపంలో విజయవంతంగా పరీక్షించినట్లు ఏఎల్ఐ టెక్నాలజీస్ సంస్థ ప్రకటించింది. మరో ఏడెనిమిది నెలల్లో 200 ఎగిరే బైక్‌లను విక్రయించనున్నట్లు తెలిపింది. ఇంతకీ దీని ధర ఎంతో చెప్పనేలేదు కదా. జస్ట్.. రూ.5 కోట్లు. రక్షణ కోసం వాడొచ్చు తమ ఎగిరే బైక్‌ను కేవలం ప్రయాణాల కోసమే కాకుండా.. భద్రత కోసం వినియోగించవ్చని ఏఎల్ఐ టెక్నాలజీస్ సంస్థ చెప్తోంది. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు దీనిపై వేగంగా, నేరుగా చేరుకుని రక్షించవచ్చని వివరిస్తోంది. సముద్రాల్లో ప్రమాదం జరిగినప్పుడు, నదులకు వరదలు వచ్చినప్పుడు గాల్లో ఎగురుతూ వెళ్లి కాపాడవచ్చని పేర్కొంటోంది. -
సుమితోమో చేతికి ఫుల్లర్టన్ క్రెడిట్
ముంబై: జపనీస్ దిగ్గజం సుమితోమో గ్రూప్ ఎన్బీఎఫ్సీ విభాగం ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీని సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.5 బిలియన్ డాలర్ల(రూ. 18,550 కోట్లు) విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా సింగపూర్ కంపెనీ ఫుల్లర్టన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హోల్డింగ్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన ఫుల్లర్టన్ క్రెడిట్లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలుత 74.9 శాతం వాటాకుగాను 2 బిలియన్ డాలర్లు, తదుపరి మిగిలిన వాటాను పొందేందుకు మరో 50 కోట్ల డాలర్లు వెచ్చించనున్నట్లు తెలియజేశాయి. డీల్ తదుపరి గృహ రుణ విభాగం ఫుల్లర్టన్ ఇండియా హోమ్ ఫైనాన్స్.. ఫుల్లర్టన్ క్రెడిట్‌కు సొంత అనుబంధ సంస్థగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఫుల్లర్టన్ క్రెడిట్ కథ ఇదీ..: ఫుల్లర్టన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాతృ సంస్థ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం టెమాసెక్ హోల్డింగ్స్‌కాగా.. ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్ 2007లో కార్యకలాపాలు ప్రారంభించింది. 600 పట్టణాలు, 58,000 గ్రామాలలో బిజినెస్‌ను విస్తరించింది. 629 బ్రాంచీలతో 2.3 మిలియన్ల చిన్న బిజినెస్‌లు, రిటైలర్లకు సేవలు అందిస్తోంది. 13,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. డీల్ విలువను వెల్లడించనప్పటికీ తొలుత 74.9%, తదుపరి 25.1% వాటా చేతులు మారనున్నట్లు సుమితోమోతోపాటు.. ఫుల్లర్టన్ ఫైనాన్షి యల్ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ కొనుగోలు ద్వారా దేశీయంగా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు సుమితోమో పే ర్కొంది. అంతేకాకుండా ఆసియావ్యాప్తంగా డిజిటల్ సేవలను పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది. దేశీయంగా ఫుల్లర్టన్ క్రెడిట్లో పెట్టుబడి ద్వారా కన్జూమర్, ఎంఎస్ఎంఈ రుణాలలో ఆసియాలో మరింత విస్తరించనున్నట్లు సుమితోమో తెలియజేసింది. దేశీయంగా భారీస్థాయి కన్జూమర్స్, ఎంఎస్ఎంఈ కస్టమర్లకు సైతం సేవలు అందించేందుకు వీలు చిక్కుతుందని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన మూడేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా తాజా కొనుగోలు తమ డిజిటల్ సేవల విస్తరణకు దోహద పడుతుందని సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవో జున్ ఓటా తెలియజేశారు. ప్రస్తుతం సుమితోమోకు ఇండొనేసియాలో అనుబంధ సంస్థ ఉంది. ఇతర కంపెనీల కొనుగోళ్ల ద్వారా ఆసియాలో మరింత పటిష్టంకావాలని చూస్తున్నట్లు జున్ వెల్లడించారు. అత్యధిక వృద్ధికి వీలున్న భారత్ తమకు కీలక మార్కెట్ అని పేర్కొన్నారు. 2015లో ప్రారంభమైన ఫుల్లర్టన్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ ఉద్యోగులు, సొంత ఉపాధి కలిగిన వ్యక్తులకు రుణాలు మంజూరు చేస్తోంది. 23,000 మందికి గృహ రుణాలు విడుదల చేసింది. 650 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
వినూత్న మాస్కు.. ధర రూ.3 వేలు!
టోక్యో: మాస్కు లేనిదే మనిషి ఉనికే ప్రమాదంలో పడుతున్న తరుణంలో జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్నెట్తో అనుసంధానమయ్యే ‘స్మార్ట్ మాస్కు’ను తయారు చేసింది. మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కు ధరించడం తప్పనిసరి కావడంతో స్మార్ట్ మాస్కును రూపొందించినట్టు డోనట్ రోబోటిక్స్ సీఈఓ తైసుకే ఓనో తెలిపారు. రోబో తయారీకి ఏళ్లపాటు కృషి చేశామని, ఆ టెక్నాలజీ సాయంతోనే దీన్ని తయారు చేశామని చెప్పారు. తెల్లని ప్లాస్టిక్‌తో తయారైన స్మార్ట్ మాస్కును సీ-మాస్కుగా వ్యవహరిస్తామని అన్నారు. ఇది బ్లూటూత్ ద్వారా మొబైల్ యాప్‌తో కనెక్ట్ అవుతుందని తైసుకే తెలిపారు. సీ-మాస్కు ద్వారా మన ఆదేశాలతో మొబైల్ యాప్ మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేయడం, మాటల్ని టెక్స్ట్ రూపంలోకి మార్చుతుందని అన్నారు. మాస్కు ధరించిన వ్యక్తి చిన్నగా మాట్లాడినా దానిని శబ్ద తీవ్రతను యాప్ అధికం చేస్తుందన్నారు. జపాన్ భాష నుంచి 8 ఇతర భాషల్లోకి సీ-మాస్కు ద్వారా యాప్ పదాల్ని తర్జుమా చేస్తుందని అన్నారు. ఒక నాణ్యమైన మాస్కుపైన సీ-మాస్కు అమర్చబడి ఉంటుందని తైసుకే తెలిపారు. జపాన్ మార్కెట్లోకి వచ్చే సెప్టెంబర్ నాటికి 5000 యూనిట్లు పంపిస్తామని అన్నారు. అమెరికా, చైనా, యూరప్‌లలో వీటిని ఆదరిస్తారనే నమ్మకముందన్నారు. సీ-మాస్కు ధర రూ.3 వేలు. (చదవండి: పాక్‌లో 30 శాతం బోగస్ పైలట్లు) -
మీ ప్రేమకు.. మా ప్రపోజ్
ప్రేమించడం అందరూ చేస్తారు.. కానీ ఆ ప్రేమను వ్యక్తపరిచేది మాత్రం కొందరే. ప్రేమించిన వ్యక్తితో మాట్లాడటానికి ఉండే సిగ్గు.. భయం.. మొహమాటం.. ఏమంటారో అనే సందేహం.. ఇలా ఏదైనా కావచ్చు.. కొన్ని ప్రేమలు చూపులతో ప్రారంభమై.. చూపులతోనే ఆగిపోతాయి. ఇలాంటి వారి కోసమే జపాన్‌లోని ‘కొకునావీ’ అనే కంపెనీ మేమున్నాం మీకోసం అంటోంది. మీ ప్రేమను మీ తరఫున మేము ప్రపోజ్ చేస్తామంటోంది. మీ ప్రేమ భావాలకు మరింత మెరుగులు దిద్ది.. కవితలుగా మార్చి మీరు ప్రేమించిన వారికి వ్యక్తపరుస్తామని చెబుతోంది. ఇదంతా చూస్తుంటే స్నేహితులకు ప్రేమ లేఖలు ఇచ్చి ప్రేయసి/ప్రియుడికి ఇవ్వమని పంపే విషయం గుర్తుకు వస్తుంది కదూ.. ఇది కూడా అలాంటిదే. కానీ ఇదంతా కొకునావీ ఊరికే ఏం చేయదు. కొంత చార్జ్ చేస్తుంది. ఇలా ప్రపోజ్ చేయడానికి 3 రకాల ప్యాకేజ్‌లు కూడా ఉన్నాయి వారి దగ్గర. తక్కువ ఖర్చుతో.. సింపుల్‌గా చెప్పాలనుకునే వారికి బేసిక్ ప్లాన్ సరిపోతుందట. ఇక ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకునేవారికి కొకునావీ సపోర్ట్ ప్లాన్ సరిగ్గా సూట్ అవుతుందని కంపెనీ చెబుతోంది. మరో ప్యాకేజ్ కూడా ఉంది. మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవాలంటే ఈ ప్యాక్ తీసుకోవాల్సిందేనని చెబుతోంది. ఈ ప్యాక్‌లో భాగంగా ఎలా ప్రేమను ప్రపోజ్ చేస్తే ఇష్టపడతారు.. గతంలో లవ్ సక్సెస్ అయిన సందర్భాలు.. ప్రేమ లేఖలో ఎలాంటి కవితలు ఉండాలి.. తదితర విషయాలని డేటా ఎనాలసిస్ సాంకేతికతను ఉపయోగించి ఓ అందమైన ప్రపోజల్‌ను మీ ప్రేయసి/ప్రియుడి ముందు ఉంచుతారు. ఇప్పటికే కొకునావీ సహాయంతో చాలా మంది ఒక్కటయ్యారు. జపాన్‌లో ఈ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందడంతో కంపెనీకి బాగా పేరొచ్చింది. -
‘ముజీ’ స్టోర్ ఏర్పాటు చేయండి..
జపనీస్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ఆహ్వానం జైకా, జెట్రోలతోనూ సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రిటైల్ స్టోర్ ఏర్పాటు చేయాలని జపనీస్ రిటైల్ మార్కెట్ రంగ దిగ్గజం ముజీ కంపెనీని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు ఆహ్వానించారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అక్కడ ముజీ కంపెనీ డైరెక్టర్, జనరల్ మేనేజర్ సటోషీ షిముజుతో సమావేశమై చర్చలు జరిపారు. హైదరాబాద్ నగరంలో వాల్‌మార్ట్ తరహా రిటైల్ కంపెనీలు తమ స్టోర్స్‌ను ఏర్పాటు చేశాయని మంత్రి వివరిం చారు. స్థానిక ఉత్పత్తులను ఎలాంటి బ్రాండ్ లేకుండా విక్రయించడం ముజీ ప్రత్యేకతని, ఇలాంటి సంస్థ రాష్ట్రానికి వస్తే స్థానిక ఉత్పత్తులను విక్రయించే అవకాశం లభిస్తుం దన్నారు. అనంతరం జైకా సీనియర్ ఉపాధ్య క్షుడు హిడెటోషి ఇరిగాకి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. జైకా రుణ సహకారం తో రాష్ట్రంలో అవుటర్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు నిర్మించారని మంత్రి గుర్తు చేశా రు. ప్రాజెక్టుల వారీగా ప్రతిపాదనలు అం దించాలని, రాష్ట్రానికి మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జైకా అధికారులు మంత్రికి తెలియ జేశారు. -
5జీ కూడా వచ్చేస్తోంది!
మన దేశంలో 4జీ మొబైల్ నెట్వర్క్ ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. కొంతమంది ఆపరేటర్లు దీన్ని ప్రవేశపెట్టి, బాగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ జపాన్ మాత్రం అప్పుడే ఒకడుగు ముందుకు వేసేసింది. అక్కడ వైర్లెస్ కమ్యూనికేషన్లలో ముందంజలో ఉన్న ఓ కంపెనీ.. విజయవంతంగా 5జీ డేటా ట్రాన్స్మిషన్ ప్రయోగాలు చేసింది. 2020 నాటికి దీన్ని వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెబుతోంది. ఎన్ఐటీ డొకోమో ఇంక్ సంస్థ ఈ ప్రయోగం చేసింది. టోక్యోలోని రొపోంగి హిల్స్ కాంప్లెక్సులో తాము అక్టోబర్ 13వ తేదీన అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్మిషన్ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్ వేగాన్ని అందుకుందని కంపెనీని ఉటంకిస్తూ సిన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఈ ప్రయోగంలో.. మిల్లీమీటరు తరంగదైర్ఘ్యంతో కూడిన సిగ్నళ్లను అత్యధికంగా 70 గిగాహెర్ట్జ్ పౌనఃపున్యంతో పంపారు. ఇప్పటివరకు షాపింగ్ మాల్స్ లాంటి వాణిజ్య ప్రాంగణంలో ఎవరూ 5జీ డేటా ట్రాన్స్మిషన్ ప్రయోగాలు చేయలేదని, సాధారణంగా ఇలాంటి చోట్ల డేటా ట్రాన్స్‌మిషన్‌లో రకరకాల సమస్యలు రావడమే ఇందుకు కారణమని డొకోమో సంస్థ తెలిపింది. అయితే, తాము బీమ్ ఫార్మింగ్, బీమ్ ట్రాకింగ్ అనే రెండు కొత్త టెక్నాలజీలు ఉపయోగించి మొబైల్ పరికరం ఎక్కడుందో అన్న దాని ఆధారంగా బీమ్ దిశను నియంత్రించామని డొకోమో వివరించింది. దానివల్ల తమ ప్రయోగం విజయవంతం అయినట్లు చెప్పింది. -
శ్రీసిటీకి మరిన్ని జపాన్ కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీపై మరిన్ని జపాన్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన 15 కంపెనీలు ఈ సెజ్‌లో అడుగు పెట్టాయి. తయారీ రంగాల్లో ఉన్న కంపెనీలు ఇక్కడ ప్లాంటు పెట్టే ఆలోచనలో ఉన్నాయి. ప్రధానంగా ఆటోమొబైల్, ఇంజనీరింగ్ సంస్థలు రానున్నాయని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. శ్రీసిటీలో భారత్‌తోపాటు పలు దేశాలకు చెందిన 116 కంపెనీలు చేతులు కలిపాయి. ఇందులో 55కిపైగా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ ఏడాది మరో 20-25 కంపెనీలు వీటికి జతకూడనున్నాయని ఆయన చెప్పారు. కాగా, జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీకి చెందిన దక్షిణాసియా విభాగం డిప్యూటీ డెరైక్టర్ జనరల్ కట్సువో మట్సుమోటో బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్రతోనూ ఈ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. రానున్న రోజుల్లో శ్రీసిటీ నుంచి మరింత వ్యాపారం ఆశిస్తున్నట్టు మట్సుమోటో చెప్పారు.