మీరు చదివింది నిజమే.. బట్టలు ఉతకడం కోసం కాదు. మనుషుల స్నానం కోసం వాషింగ్ మెషీన్ తయారు చేస్తోంది ఓ జపనీస్ కంపెనీ. ఒసాకాకు చెందిన ‘సైన్స్ కో లిమిటెడ్’ దీన్ని రూపొందిస్తోంది. ఫైన్ బబుల్ టెక్నాలజీతోపాటు వివిధ సెన్సర్లు, కృత్రిమ మేధ ఆధారంగా ఈ పరికరం మనుషుల శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అంతేకాదు విశ్రాంతినిచ్చే సంగీతం వినిపిస్తూ, వాటర్ రెసిస్టెంట్ డిస్‌ప్లేలో ఫొటోలు కూడా చూపిస్తూ.. మరింత హాయిగొలిపేలా చేస్తున్నాయి.
ఏదేమైనా వాషింగ్ మెషీన్‌లోకి వెళ్లి కూర్చుంటే ఇంకేమన్నా ఉందా? అని భయపడకండి. ఇందులోని సెన్సర్లు శరీరంలోని నరాల స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయి. కృత్రిమ మేధతో సేకరించిన ఈ డేటా సాయంతో.. అందులో ఉన్నవారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని మెషీన్ సృష్టిస్తుందని రూపకర్తలు చెబుతున్నారు. అయితే ఇలా మనుషుల వాషింగ్ మెషీన్ తయారు చేసే ఐడియా కొత్తదేం కాదు.
జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సాన్యో ఎలక్ట్రిక్ 1970 సమయంలోనే ‘అల్ట్రాసోనిక్ బాత్’ పరికరాన్ని తయారు చేసింది. అది 15 నిమిషాల్లోనే శరీరాన్ని శుభ్రం చేయడంతోపాటు ఆరబెట్టడం, మసాజ్ చేయడం కూడా పూర్తిచేసింది. కానీ దానిపై వెల్లువెత్తిన సందేహాలతో మార్కెట్లోకి తీసుకురాలేదు. ఇన్నేళ్ల తర్వాత సైన్స్ కో లిమిటెడ్ చైర్మన్ యసాకీ అయోమా దీనిపై దృష్టి పెట్టాడు.
ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే సాన్యో తయారు చేసిన మనుషుల వాషింగ్ మెషీన్‌ను డెవలప్ చేసి.. మార్కెట్లోకి తేవాలని నిర్ణయించుకున్నాడట. ఇంతకీ ఈ మెషీన్‌ను కొనాలనుకుంటే 2025 దాకా ఆగాల్సిందే. 2024 చివరికల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, 2025లో అందరికీ అందుబాటులోకి తెస్తామని సైన్స్ కో సంస్థ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment