పొద్దున్నే బైకో, కారో తీసుకుని రోడ్డెక్కారు.. ఎక్కడ చూసినా ట్రాఫిక్‌జామ్.. హాయిగా గాల్లో ఎగిరివెళితే బాగుండేదని చాలా మందికి అనిపిస్తుంటుంది. జపాన్‌కు చెందిన ఏఎల్‌ఐ టెక్నాలజీస్ సంస్థ ఈ కలను నిజం చేయబోతోంది. ఓ చిన్నపాటి హెలికాప్టర్‌లా గాల్లో ఎగురుతూ వెళ్లే బైక్‌ను రూపొందించింది. వచ్చే ఏడాదే దాన్ని మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్తోంది. ఆ ఎగిరే బైక్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా..
–సాక్షి సెంట్రల్ డెస్క్
గంటకు వందకిలోమీటర్ల వేగంతో..
జపాన్ సంస్థ రూపొందించిన ఎగిరే బైక్ పేరు ‘ట్సురిస్మో’. నాలుగు చిన్న ప్రొపెల్లర్లు (ఫ్యాన్‌లా తిరిగే మోటార్లు), మరో రెండు పెద్ద ప్రొపెల్లర్లతో ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో 40 నిమిషాల పాటు ఆగకుండా ప్రయాణించగలదు. అంటే సుమారు 67 కిలోమీటర్లు వెళ్లొచ్చు. తర్వాత మళ్లీ ఇంధనం నింపుకొని వెళ్లాల్సి ఉంటుంది.
దీని పనితీరును తాజాగా జపాన్‌లోని మౌంట్‌ఫుజీ సమీపంలో విజయవంతంగా పరీక్షించినట్లు ఏఎల్‌ఐ టెక్నాలజీస్ సంస్థ ప్రకటించింది. మరో ఏడెనిమిది నెలల్లో 200 ఎగిరే బైక్‌లను విక్రయించనున్నట్లు తెలిపింది. ఇంతకీ దీని ధర ఎంతో చెప్పనేలేదు కదా. జస్ట్.. రూ.5 కోట్లు.
రక్షణ కోసం వాడొచ్చు
తమ ఎగిరే బైక్‌ను కేవలం ప్రయాణాల కోసమే కాకుండా.. భద్రత కోసం వినియోగించవ్చని ఏఎల్‌ఐ టెక్నాలజీస్ సంస్థ చెప్తోంది. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు దీనిపై వేగంగా, నేరుగా చేరుకుని రక్షించవచ్చని వివరిస్తోంది. సముద్రాల్లో ప్రమాదం జరిగినప్పుడు, నదులకు వరదలు వచ్చినప్పుడు గాల్లో ఎగురుతూ వెళ్లి కాపాడవచ్చని పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment