technologies
-
బుల్లీయింగ్... సైబర్ బుల్లీయింగ్...
బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసే సమస్యలుగా మారాయి. సాధారణంగా బుల్లీయింగ్ అంటే భౌతిక హింస, మాటలతో అవమానించడం, సామాజికంగా బహిష్కరించడం, పుకార్లు. డిజిటల్ టెక్నాలజీ వల్ల సైబర్ బుల్లీయింగ్ వచ్చేసింది. ఇది సోషల్ మీడియా, టెక్స్టింగ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగే బుల్లీయింగ్. తామెవ్వరో తెలీకుండా కామెంట్ చేసే అవకాశం ఉండటంతో దీనికి హద్దే లేకుండా పోతోంది. కాదేదీ అనర్హం..బుల్లీయింగ్ చిన్న సమస్య కాదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా యువత నిరంతర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బుల్లీయింగ్ చేసేవారికి ప్రత్యేక కారణమేదీ అవసరం లేదు. తమ ఆధిక్యతను ప్రదర్శించడం కోసం బాధితుల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని బుల్లీయింగ్ చేస్తుంటారు. అది వారి రూపం నుంచి అకడమిక్ పర్ఫార్మెన్స్ వరకూ ఏదైనా కావచ్చు. దీంతో బాధితులకు ‘నాకు మద్దతుగా ఎవ్వరూ లేరు, నాకిది భద్రమైన ప్రదేశం కాదు’ అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని టీనేజర్ లేడనే చెప్పవచ్చు. దీంతో సైబర్ బుల్లీయింగ్ వ్యక్తిగత జీవితానికీ విస్తరించింది. టీనేజ్లోనే ఎందుకు ఎక్కువ?టీనేజర్లు తమ వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక సంబంధాలు వంటి అంశాలను అన్వేషించే సమయంలో వారు మరింత సున్నితంగా ఉంటారు. స్నేహితుల నుంచి అనుకూలత పొందడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీన్ని బుల్లీయర్లు దుర్వినియోగం చేస్తుంటారు. నివారణ వ్యూహాలుబుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రభావాలను అర్థం చేసుకోవడం మొదటి దశ మాత్రమే. ఈ సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీల భాగస్వామ్యంతో సమర్థవంతమైన వ్యూహాలు అవసరం. కొన్ని ముఖ్యమైన వ్యూహాలు:1. బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవడం చాలా అవసరం. అవగాహన కార్యక్రమాలు యువతను బుల్లీయింగ్ ప్రవర్తనలను గుర్తించేందుకు ప్రోత్సహిస్తాయి.2. పాస్‌వర్డ్స్‌ని పంచుకోవద్దని స్పష్టంగా చెప్పండి. మానసికంగా ప్రేరేపించేదాన్ని గుర్తించి నిరోధించండి.3. మీ టీన్‌తో ఓపెన్‌గా మాట్లాడండి. వారి అనుభవాలను తెలుసుకుని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించండి.4. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అవసరమైన ధైర్యాన్నివ్వండి. వారి మంచి లక్షణాలను గుర్తించి అభినందించండి.5. బుల్లీయింగ్ గురించి మీతో చెప్పుకునే స్వేచ్ఛనివ్వండి. వాళ్లను జడ్జ్ చేయకుండా సమస్యను అర్థం చేసుకోండి. 6. సానుకూలమైన స్నేహాలు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. వారి స్నేహాలను ఆరోగ్యకరమైన దిశలో ప్రోత్సహించండి.7. పాఠశాల లేదా కళాశాలలో బుల్లీయింగ్ చోటు చేసుకుంటే.. ఉపాధ్యాయులు, కౌన్సిలర్లతో కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. బుల్లీయింగ్ వ్యతిరేక విధానాలు స్పష్టంగా అమలయ్యేలా చూడండి. 8. బుల్లీయింగ్ని చూస్తూ ఉండకుండా, వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రోత్సహించండి. 9. తీవ్రత నుంచి బయటపడటానికి బ్రీదింగ్, మెడిటేషన్, జర్నలింగ్ వంటి సాధనాలు నేర్పండి.10. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ వారిని అనుకరిస్తుంటారు. అందుకే మీరు ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించి చూపడానికి ప్రయత్నించాలి. 11. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సాయం తీసుకోవడం మంచిది.తీవ్ర ప్రభావం..బుల్లీయింగ్ అనుభవించిన పిల్లల్లో దీర్ఘకాలంలో వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అది ఈ విధంగా ఉంటుంది:1. ఎక్కువగా అవమానాలు, ఛీత్కారాలు పిల్లల్లో ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి. 2. బుల్లీయింగ్ వల్ల కలిగే ఒత్తిడి కలతకు, డిప్రెషన్‌కు దారితీస్తుంది.3. బుల్లీయింగ్ బాధితులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమంది ఉండే పరిసరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. 4. బుల్లీయింగ్ వల్ల ఇతరులపై నమ్మకం పోతుంది. అది వారి స్నేహాలకు ప్రతిబంధకంగా మారుతుంది.5. అకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ప్రభావితం అవుతుంది. తరచుగా పాఠశాలకు వెళ్లడం మానేస్తారు, తద్వారా చదువులో వెనకబడతారు. 6. బుల్లీయింగ్ తీవ్రమైన సందర్భాల్లో పిల్లలు ఆత్మహత్య గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. -
బోర్డ్ తిప్పేసిన మరో కంపెనీ
-
టెక్ టాక్: సరికొత్త టెక్నాలజీతో ఈ పరికరాలు మీకోసమే..
రోజురోజుకి మారుతున్న కొత్త టెక్నాలజీతో పాటు మానవ అవసరాలలో కూడా మార్పులు జరుగుతున్నాయి. కొత్త పరికరాలు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా అని ఎదురుచూపులు, పడిగాపులు కాచుకునే వారికోసం.. ఇలాంటి సరికొత్త టెక్నాలజీని కూడిన వస్తువులు దూసుకొస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. షావోమి వాచ్ 2 డిస్ప్లే: 1.43 అంగుళాలు రిజల్యూషన్: 466“466 పిక్సెల్స్ ∙లైట్ వెయిట్ 150 స్పోర్ట్స్ మోడ్స్ బ్యాటరీ: 495 ఎంఏహెచ్ స్లీప్ ట్రాకింగ్ పోకో ఎక్స్ 6 నియో 5జీ డిస్ప్లే: 6.67 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13 ర్యామ్: 8జీబి, 12జీబి స్టోరేజ్: 128జీబి, 256జీబి బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బరువు: 175.00 గ్రా. ఇవి చదవండి: ఈ విశేషాల గురించి మీరెప్పుడైనా విన్నారా..! -
టెక్ టాక్: ఈ సరికొత్త వాటిని గురించి ఎప్పుడైనా విన్నారా..!
నిత్య జీవితంలో.. టెక్నాలజీ పరంగా నూతన మార్పులు సంభవిస్తున్నాయి. మానవ అన్నీ అవసరాలను తీర్చిదిద్దేలాగా ఈ టెక్నాటజీ వృద్ధి చెందుతుంది. విద్య, వైద్య, ఉద్యోగాలలోనూ దీని అవసరం మరెంతగానో ఉండేలా కాలం మారుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సరికొత్త పరికరాలు మీ ముందుకొచ్చాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కట్టుకుంటే నొప్పులు మాయం.. జిమ్‌లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్‌లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్‌ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ధర 149 డాలర్లు (రూ.12,350) మాత్రమే! హైడ్రోజన్‌తో పరుగులు తీసే కారు.. జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ‘హోండా’ తాజాగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే కారును రూపొందించింది. హోండా మోడల్స్‌లోని ‘సీఆర్–వి’ మోడల్ ఎస్‌యూవీకి అవసరమైన మార్పులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచేలా ‘సీఆర్వీ: ఈఎఫ్సీఈవీ’ మోడల్‌కు రూపకల్పన చేసింది. ఇందులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్ తయారీకి మరో కార్ల తయారీ సంస్థ ‘జనరల్ మోటార్స్’ సహకారం తీసుకుంది. ఇందులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్‌లోని 110 వోల్టుల పవర్ ఔట్లెట్ ద్వారా ఇంజిన్‌కు దాదాపు 1500 వాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే, ఇది ఏకంగా 435 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారును హోండా మోటార్స్ వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీతో నడిచే ఈ–విమానం ఇది బ్యాటరీతో నడిచే ఈ–విమానం నమూనా. ఇది అందుబాటులోకి వస్తే, విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ విమానం కూడా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. డచ్ విమానాల తయారీ కంపెనీ ‘ఎలీసియన్’ ఈ బ్యాటరీ విమానం నమూనాకు ఇటీవల రూపకల్పన చేసింది. ‘ఎలీసియన్–ఈ9ఎక్స్’ పేరుతో రూపొందించిన ఈ విమానం 2033 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ‘ఎలీసియన్’ కంపెనీ ప్రకటించింది. సాధారణ విమానాల కంటే చాలా తక్కువ బరువుతో రూపొందించిన ఈ విమానం వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 90 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇవి చదవండి: వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు! -
వినూత్నం: రోబో టీచరమ్మ.. పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే..
'సినిమాల్లో హ్యుమనాయిడ్ రోబోను చూడగానే పిల్లల సంతోషం ఇంతా అంతా కాదు. సినిమాల్లో కనిపించే రోబో క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెడితే? ‘అబ్బో! ఆ అల్లరికి అంతు ఉండదు’ అనుకుంటాం. అయితే ‘ఐరిష్’ అనే ఈ రోబో ముందు మాత్రం పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే. ఇంతకూ ఎవరీ ఐరిష్?' కేరళలోని తిరువనంతపురం కేటీసీటీ హైయర్ సెకండరీ స్కూల్ లోకి ఫస్ట్ జెనరేటివ్ ఏఐ స్కూల్ టీచర్ ఐరిష్ అడుగు పెట్టింది. ఈ హ్యుమనాయిడ్ ఉపాధ్యాయురాలు మూడు భాషల్లో మాట్లాడగలదు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా జవాబులు చెప్పగలదు. ఎడ్టెక్ ‘మేకర్ల్యాబ్స్’ రూపకల్పన చేసిన ఈ జెనరేటివ్ ఏఐ స్కూల్ టీచర్ కేరళలోనే కాదు దేశంలోనే మొదటిది. ‘ఐరిష్ నాలెడ్జ్బేస్ ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే విస్తృతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది’ అంటుంది మేకర్ ల్యాబ్స్. చదువుకు సంబంధం లేని సబ్జెక్ట్‌ల జోలికి ‘ఐరిష్’ వెళ్లదు. ‘కృత్రిమ మేధతో అవకాశాలు అనంతం అని చెప్పడానికి ఐరిష్ ఒక ఉదాహరణ. పిల్లలు అడిగే సందేహాలకు టీచర్‌లాగే ఐరిష్ సరిౖయెన సమాధానాలు ఇవ్వగలదు’ అంటున్నారు ‘మేకర్ల్యాబ్స్’ సీయీవో హరిసాగర్. ‘మేకర్ల్యాబ్స్తో కలిసి ఎన్నో రకాల వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటి ద్వారా పిల్లలు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్‌కు సంబంధించిన నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు’ అంటున్నారు స్కూల్ ప్రిన్సిపాల్ మీరా ఎంఎన్. ఇవి చదవండి: International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే? జీవితంపై అధికారం హక్కులపై ఎరుక -
ఆచితూచి అడుగేద్దాం!
శాస్త్రవిజ్ఞాన విజయాలతో మానవాళి ఎప్పటికప్పుడు ముందడుగేయడం చరిత్రలో సంతోష సందర్భమే. గతవారం అలాంటి మరో సందర్భం ఎదురైంది. పుడమికి అతి సమీపంలో ఉండే గ్రహమైన చంద్రునిపై మరోసారి మానవ మేధ సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగింది. ఇప్పటి దాకా వివిధ దేశాల ప్రభుత్వాలు అధికారిక అంతరిక్ష పరిశోధనా సంస్థలతో అద్భుత విజయాలు సాధించడం చూశాం. ఈసారి ఓ ప్రైవేట్ సంస్థ చందమామపై జయకేతనం ఎగరేసింది. అమెరికాకు చెందిన ‘ఇన్ట్యూటివ్ మెషిన్స్’ (ఐఎం) సంస్థ ఫిబ్రవరి 22న ఓ రోబోటిక్ వ్యోమనౌకను చందమామపై సాఫ్ట్ ల్యాండ్ చేసింది. ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం అయిదే దేశాలు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. అలా చూస్తే, ఒక ప్రైవేట్ సంస్థ ఆ అపురూప విన్యాసం చేయడం చెప్పుకోదగ్గ మైలురాయి. అయితే, చరిత్రలో రెండో పర్యాయం ఇప్పుడు మళ్ళీ జాబిల్లిపై వ్యోమయానం ఊపందుకున్న వేళ రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా నిర్దిష్టమైన అంతరిక్ష విధానం, ప్రత్యేక అంతరిక్ష చట్టం అవసరం ఉందని అర్థమవుతోంది. అమెరికా అంతరిక్ష నౌక ఒకటి చంద్రమండల ఉపరితలంపై దిగడం గత 50 ఏళ్ళ పైచిలుకులో ఇదే ప్రథమం! అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ 1972లో అపోలో ప్రోగ్రామ్‌కు తెర దించిన తర్వాత మళ్ళీ ఆ దేశం చంద్ర మండల పునఃప్రవేశం మళ్ళీ ఇప్పుడే! చంద్రునిపై వ్యోమనౌక దిగడమనే సవాలులో మానవజాతి ఎన్నో ఏళ్ళుగా విజయాలు, వైఫల్యాలు – రెండూ చవిచూసింది. చంద్రునిపై దిగడంలో విఫలమైన ప్రతిసారీ వ్యోమనౌకల శకలాలు చంద్రోపరితలంపై చెల్లాచెదరై పడివుండడమూ చూశాం. అంతెందుకు... గత నెలలో మరో అమెరికన్ సంస్థ ‘ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ’ సైతం ఓ ల్యాండర్‌ను చంద్రునిపైకి పంపాలని చూసింది. ఇంధనం లీకేజీతో ఆ యత్నాన్ని అర్ధంతరంగా ముగించింది. సదరు ల్యాండర్ భూవాతావరణంలోకి పునఃప్రవేశించి, పసిఫిక్ మహాసముద్రంపై దగ్ధమైంది. విఫలమైన ఆ ‘ఆస్ట్రోబోటిక్’, విజయవంతమైన ‘ఐఎం’ సంస్థ... రెండూ ‘నాసా’ అండతో వాణిజ్యపంథాలో చంద్రునిపైకి వ్యోమనౌకల్ని పంపే కృషిలో భాగమే. గగనాంతర సీమల గవేషణలో ప్రైవేట్ రంగ ప్రమేయం పెరుగుతున్న తీరుకు ఇది ఉదాహరణ. చరిత్ర గమనిస్తే – 1966లోనే సోవియట్ యూనియన్ ‘లూనా9’ తొలిసారిగా చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. నాలుగు నెలల తర్వాత ‘సర్వేయర్1’తో అమెరికా విజయం సాధించింది. అది క్రమంగా చంద్రునిపైకి మానవయాత్రకు దారి తీసింది. 1969లో నాసా ‘అపోలో11’తో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్ద్రిన్లు చంద్రునిపై అడుగిడిన తొలి వ్యక్తులుగా చరిత్ర సృష్టించినప్పటి నుంచి ఇప్ప టికి అరడజనుకు పైగా యాత్రల్లో డజను మంది చంద్రునిపై కాలుమోపారు. 2026 చివరి కల్లా మరోసారి చంద్రునిపైకి మానవ యానానికి అమెరికా సిద్ధమవుతోంది. మూడో దేశంగా చైనా, గత ఏడాది ‘చంద్రయాన్3’ ద్వారా రెండో ప్రయత్నంలో విజయం సాధించి నాలుగో దేశంగా భారత్ చంద్రునిపై ల్యాండింగ్ చేశాయి. ఈ జనవరిలో జపాన్ తప్పుదిశలో ల్యాండింగ్ జరిపినప్పటికీ, అసలంటూ చేసిన అయిదో దేశంగా ఆ జాబితాలో చేరింది. ఇప్పుడు ఐఎం విజయంతో చంద్రమండల యాత్రల్లో ప్రైవేట్ రంగ శక్తియుక్తులు హెచ్చనున్నాయి. మరిన్ని యాత్రలకు సన్నాహాలు సాగుతు న్నందున లోతైన అన్వేషణ, శాస్త్రీయ పరిశోధనలకు కలువలరేడు కేంద్రబిందువు కానున్నాడు. నిజానికి, చంద్రునిపై దిగేందుకు ప్రైవేట్ సంస్థలు గతంలోనూ అనేక యత్నాలు చేశాయి. 2019లో ఇజ్రాయెల్ బెరేషీట్ చంద్రునిపై కుప్పకూలింది. 2023లో ఓ జపనీస్ సంస్థ తాలూకు ల్యాండర్ పడిపోయింది. తాజా ప్రైవేట్ ప్రయోగ విజయంలోనూ లోటుపాట్లు లేకపోలేదు. గ్రీకు పురాణా ల్లోని తెలివైన వీరుడు ‘ఒడిస్సియస్’ పేరు పెట్టుకున్న ఐఎం వారి వ్యోమనౌక ఆఖరుఘట్టంలో జాబిల్లి దక్షిణ ధ్రువానికి దగ్గరలో నేరుగా కాక అనుకున్నదాని కన్నా వేగంగా, పక్కవాటుగా దిగింది. దాంతో, ముందనుకున్నట్టు వారం కాకుండా, 2–3 రోజుల ముందే తట్టాబుట్టా సర్దుకుంటోంది. అయితే, అసలంటూ ఐఎం విజయవంతం కావడంతో నాసా ‘కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్’ (సీఎల్పీఎస్) కార్యక్రమం కింద మరిన్ని ప్రైవేట్ ప్రయత్నాలు సాగుతాయి. 2020 నాటికి పూర్తయ్యేలా మరో 14 ప్రైవేట్ సంస్థలతో నాసా పెట్టుకున్న 260 కోట్ల డాలర్ల కాంట్రాక్టులే అందుకు తార్కాణం. ఇటీవలే భారత్ సైతం జాతీయ అంతరిక్ష రంగంలో నూరు శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టు బడులకు ద్వారాలు తెరిచింది. అంటే రానున్న రోజుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై భారం తగ్గి, ప్రైవేట్ రంగంలో భారతీయ అంకుర సంస్థల మధ్య పోటాపోటీ పెరగనుంది. ప్రపంచమంతటా ఇలాంటి ప్రైవేట్ ప్రయత్నాలతో కష్టాలూ తప్పవు. 1967 నాటి ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ మినహా ఇప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనలేవీ లేవు. ఆ ఒడంబడిక సైతం అనుసరించాల్సిన విధుల జాబితాయే తప్ప, పాటించి తీరాల్సిన ఆదేశాలు కావు. తాజా ఒడిస్సియస్ దెబ్బతో వివిధ సంస్థలు చంద్రునిపైకి ఏవైనా పంపి, దాన్ని ఎలాగైనా నింపే వీలుంది. అందుకే, ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష, చంద్రమండల చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఇప్పటికే ఉప గ్రహాలతో క్రిక్కిరిసిన దిగువ భూకక్ష్య లానే చంద్రమండలమూ నిండవచ్చని శాస్త్రవేత్తల జోస్యం. చంద్రునిపై నిర్ణీత ప్రాంతాలు శాస్త్రీయ పరిశోధనా శాలలకు కీలకం గనక అవాంఛనీయ పోటీ తప్పదు. విలువైన హీలియమ్3 కోసం చంద్రునిపై గనుల తవ్వకాలు జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. కాబట్టి, ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భమిది. నైతికతకు కట్టుబడి పరిశోధనలు సాగిస్తూనే, వెన్నెలరేడు వాతావరణాన్ని విధ్వంసం చేయనిరీతిలో చట్టాలు చేసుకోవాల్సిన సమయమిది. -
టెక్.. టాక్: లేటెస్ట్ అప్డేట్స్, గాడ్జెట్స్
గూగుల్ అసిస్టెంట్‌లో.. గూగుల్ తన ఏఐ-పవర్డ్ అసిస్టెంట్ అప్డేటింగ్లో భాగంగా కొన్ని అండర్ యుటిలైజ్డ్ ఫీచర్లను తొలిగించనుంది. వాటిలో కొన్ని: ప్లేయింగ్ అండ్ కంట్రోలింగ్ ఆడియో బుక్స్, సెట్టింగ్ మీడియా అలారమ్స్, మ్యానేజింగ్ కుక్‌బుక్స్, యూజింగ్ వాయిస్ కాల్స్ అండ్ ఇ–మెయిల్, రీషెడ్యూలింగ్ ఈవెంట్స్, వాయిస్ కంట్రోల్ ఫర్ యాక్టివిటీస్, వ్యూయింగ్ యువర్ స్లీప్ సమ్మరిస్, రిక్వెస్టింగ్ స్పెసిఫిక్ యాక్షన్స్ వయా వాయిస్-మేకింగ్ పేమెంట్స్, రిజర్వేషన్స్, సోషల్ మీడియా పోస్ట్స్, రిక్వెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఎబౌట్ యువర్ కాంటాక్ట్స్, కమ్యూట్ టు వర్క్ టైమ్ ఎస్టిమేట్స్. వన్‌ప్లస్ 12 ఆర్.. డిస్ప్లే : 6.78 అంగుళాలు ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ బ్యాటరీ : 5500 ఎంఏహెచ్ వోఎస్ : ఆండ్రాయిడ్ 14 ర్యామ్ : 12జీబి ; స్టోరేజŒ æ: 256 జీబి వోఎస్ : ఆండ్రాయిడ్ 14 రిఫ్రెష్ రేట్ : 120 హెచ్జడ్ మొబైల్ టేబుల్‌టాప్ స్టాండ్.. ♦ బ్రాండ్: స్వాప్కార్ట్ ∙కలర్: వైట్ ♦ ఫామ్ ఫ్యాక్టర్: టేబుల్ స్టాండ్ ♦ మల్టీ ఫంక్షన్ క్లిప్ ♦ మల్టీపర్పస్ మొబైల్ యాక్సెసరీ ఎవర్గ్రీన్ ఎనర్జీ.. ‘వెల్కమ్ టు హమ్బోల్డీ బొటానికల్ గార్డెన్’ అంటూ ఆహ్వానిస్తోంది ది కబ్. అడ్వెంచర్ గేమ్ ‘ది కబ్’ నేడు విడుదల అవుతుంది. ‘ది జంగిల్ బుక్’ ‘లయన్ కింగ్’లాంటి ఎన్నో క్లాసిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని నేటి కాలానికి తగినట్లుగా రూపొందించిన గేమ్ ఇది. ఈమధ్య విడుదలైన గేమ్ ట్రైలర్ ప్లేయర్స్‌కు ఉత్సాహం కలిగించేలా ఉంది. పబ్లిషర్స్: అన్‌టోల్డ్ టేల్స్, గేమర్స్కైగేమ్స్, ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 5, నిన్టెండో స్విచ్, ఎక్స్‌బాక్స్ వన్, ప్లేస్టేషన్4, మైక్రోసాఫ్ట్ విండోస్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్. జానర్స్: ప్లాట్‌ఫామ్ గేమ్, అడ్వెంచర్ గేమ్. ఎట్ సీ.. అయోమయంలో ఉండి ఏమీ చేయాలో తెలియని పరిస్థితుల్లో వాడే మాట... ఎట్ సీ. ఉదా: ఐయామ్ కంప్లీట్లీ ఎట్ సీ విత్ ది న్యూ కంప్యూటర్ సిస్టం. నెససరీ ఇవిల్.. ఒక విషయం నచ్చకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవడం. ఉదా: మోస్ట్ అమెరికన్స్ యాక్సెప్ట్ ట్యాక్సెస్ యాజ్ ఏ నెససరీ ఇవిల్. మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ బటన్.. మైక్రోసాఫ్ట్ తన విండోస్ కీబోర్డులకు కొత్త ఏఐ బటన్‌ను యాడ్ చేస్తుంది. రిబ్బన్–షేప్డ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఏఐ–పవర్డ్ చాట్‌బాట్ కోపైలట్ ఆన్లైన్లో ఫర్నీచర్ సెర్చింగ్, డ్రాఫ్ట్ టెక్ట్స్, ఇమేజ్‌లను క్రియేట్ చేయడం, ఐడియాలను సాంగ్స్‌గా మలచడానికి యూజర్లకు ఉపయోగపడుతుంది. కొత్త బటన్ స్పేస్బార్కు కుడి వైపున ఉంటుంది. రీమార్కబుల్ 2 ఇ–ఇంక్ ట్యాబ్.. రీమార్కబుల్ 2 ఇ–ఇంక్ ట్యాబ్ మన దేశంలో లాంచ్ అయింది. ఈ ఇ–ఇంక్ ట్యాబ్ రోజువారీ నోటుబుక్లాగే పనిచేస్తుంది. నోటుబుక్ రాసిన అనుభూతిని ఇస్తుంది. నోట్స్ తీసుకోవడానికి, డాక్యుమెంట్లను రివ్యూ చేయడానికి... రకరకాలుగా ఇది ఉపయోగపడుతుంది. కొన్ని వివరాలు.. 10.3 అంగుళాల మోనో క్రోమ్ డిజిటల్ పేపర్ డిస్ప్లే రిజల్యూషన్: 1,872్ఠ1,404 పిక్సెల్స్ 1.2 జీహెచ్ డ్యూయల్–కోర్ ఏఆర్ఏం చిప్సెట్ వై–ఫై బ్యాటరీ: 3.000 ఎంఏహెచ్ ఇవి చదవండి: మ్యూజిక్ వరల్డ్‌లో.. తను ఒక సుమధుర 'ధ్వని' -
అంకురాల అభివృద్ధిలో మనమెక్కడ..?
భారత ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కొత్త ఊపు తెస్తున్నాయి. స్టార్లప్‌ల రూపంలో కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు అందిస్తున్నాయి. అందుకు అనువుగా ఒడుదొడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తున్నాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య అభివృద్ధి విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు పన్ను రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు మేధాహక్కులూ వేగంగా మంజూరు అవుతున్నాయి. భారత్‌లో దాదాపు 110 యూనికార్న్ కంపెనీలు.. ప్రపంచంలో అంకురాల సంఖ్యలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023 అక్టోబరు నాటికి దేశంలోని 763 జిల్లాల్లో డీపీఐఐటీ గుర్తింపు పొందిన 1,12,718 అంకురాలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రపంచంలో నవీకరణ, నాణ్యత పరంగా చూస్తే మన స్టార్టప్‌లు రెండో స్థానంలో నిలుస్తున్నాయి. 100 కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. అలాంటివి భారత్‌లో 110 వరకు ఉన్నాయి. అమెరికా, చైనాల తరవాత ఇంత పెద్ద సంఖ్యలో యూనికార్న్‌లు ఉన్నది భారత్‌లోనే. ఒక్క 2022లోనే భారత్‌లో 42 టెక్నాలజీ అంకురాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ వెన్నుదన్నుతో ఇవి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐదు విభాగాల్లో డీపీఐఐటీ ర్యాంకింగ్‌లు.. స్టార్టప్‌ల వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది. ఇందులో బెస్ట్ పర్ఫార్మర్స్, టాప్ పర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింజ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ విభాగాల్లో గుర్తింపు ఇస్తున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు. ‘లీడర్స్’ కేటగిరీలో ఏపీ టాప్.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్' కేటగిరీలో చేర్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, త్రిపుర వరుస స్థానాల్లో ఉన్నాయి. ఆంత్రప్రెన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్ణాటకలు బెస్ట్ పర్ఫార్మర్లుగా ర్యాంకులు తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ తరువాత స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్ స్టేట్‌గా నిలిచింది. కర్ణాటక ఈ విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలు టాప్ పర్ఫార్మర్స్గా ఎంపికయ్యాయి. బిహార్, హరియాణా, అండమాన్ నికోబార్ దీవులు, నాగాలాండ్‌లు ఆస్పైరింగ్ లీడర్స్ విభాగంలో వరుస స్థానాల్లో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, దిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లద్ధాఖ్, మిజోరాం, పుదుచ్చేరి , సిక్కింలు ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ విభాగంలోకి చోటుసాధించాయి. ఇదీ చదవండి: తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! వీటి ఆధారంగానే ర్యాంకింగ్‌లు.. ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్ యాక్సెస్, ఇంక్యుబేషన్ ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసుకోవాలని అధికారులను కోరారు. స్టార్టప్‌లు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌ల వంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్‌లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు. -
India-US CEO Forum: ఫార్మా బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఫార్మా, సెమీకండక్టర్లు, కీలక లోహాలు, వర్ధమాన టెక్నాలజీలు తదితర అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. అలాగే, పర్యవరణ అనుకూల సాంకేతికతలను కలిసి అభివృద్ధి చేయడం, క్రిటికల్ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించాయి. భారత్–అమెరికా సీఈవో ఫోరం వర్చువల్ భేటీలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచి్చనట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫోరం సభ్యులు సూచించిన సిఫార్సుల అమలుపై దృష్టి పెట్టాలని సీఈవో ఫోరంనకు రైమండో సూచించారు. అలాగే ఫోరంలో అమెరికాకు చెందిన దిగ్గజాలు హనీవెల్, ఫైజర్, కిండ్రిల్, వయాశాట్ చేరికను ప్రకటించారు. సెమీకండక్టర్ సరఫా వ్యవస్థ, ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ వంటి వేదికల ద్వారా పరిశ్రమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని గోయల్ పేర్కొన్నారు. 2014లో ఫోరంను పునరుద్ధరించిన తర్వాత నుంచి ఇది ఎనిమిదో సమావేశం. వచ్చే ఏడాది తొలినాళ్లలో తదుపరి భేటీ నిర్వహించనున్నారు. భారత్, అమెరికా దిగ్గజ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు సభ్యులుగా ఉన్న ఈ ఫోరంనకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, లాక్‌హీడ్ మారి్టన్ ప్రెసిడెంట్ జేమ్స్ టైస్లెట్ సారథ్యం వహిస్తున్నారు. -
కృత్రిమ మేధపై మథనం
సృష్టిలో నూతనత్వాన్ని ఆహ్వానించటం, హత్తుకోవటం, తలకెత్తుకోవటం మనిషి సహజ లక్షణం. అదే లేకుంటే ప్రపంచంలో ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేది కాదు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) విషయంలో మొదటినుంచీ అనుమాన దృక్కులు తప్పడం లేదు. ఆరంభంలో టెక్ సిబ్బందిని మాత్రమే వణికించిన ఏఐ ఇప్పుడు సమస్త జీవన రంగాల్లోకి చొచ్చుకొస్తూ అందరినీ భయపెడుతోంది. ఈ వారం చోటుచేసుకున్న రెండు పరిణామాలు ఈ భయసందేహాలు కేవలం అపోహల పర్యవసానం మాత్రమే కాదనీ, చేదు వాస్తవమనీ రుజువు చేస్తున్నాయి. వ్యూహాత్మకమైన అణుబాంబుల వ్యవస్థలోకి కూడా అది చొరబడితే ఏమవుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఏఐకి కళ్లెం బిగించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులపై ఈ వారం మొదట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయగా, బ్రిటన్‌లో ఈ విషయమై అమెరికా, చైనా, భారత్ సహా 28 దేశాలు పాల్గొన్న రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. ఇందులో ప్రభుత్వాల ప్రతినిధు లతోపాటు కంప్యూటర్ శాస్త్రవేత్తలు, టెక్ దిగ్గజాల ప్రతినిధులు కూడా పాల్గొనటం సమస్య తీవ్రతను తెలియజెబుతోంది. ఏఐతో ఏర్పడే అవకాశాలతోపాటు, అందులో చోటుచేసుకుంటున్న నూతన ఆవిష్కరణలు మానవాళికి పెనుముప్పు కలిగించే ఆస్కారం ఉందన్న అంశంలో అన్ని దేశాల మధ్యా ఏకాభిప్రాయం కుదిరింది. శిఖరాగ్ర సదస్సుకు ఎంచుకున్న బ్లెచ్లీ పార్క్ చరిత్రాత్మకమైనది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ రూపొందించి, దేశదేశాల్లోని తన సైనిక బలగాలకూ పంపే ‘నిగూఢ సంకేతాన్ని’ ఛేదించింది అక్కడే. అది పంపే సందేశాలేమిటో తెలియక కాకలు తీరిన నిపుణులే తలలు పట్టుకున్న తరుణంలో ఈ పరిణామం జర్మనీ కట్టడికి, రెండో ప్రపంచ యుద్ధ ముగింపునకు కారణమైంది. ‘ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్న చందంగా ఏఐ తయారవటం వాస్తవం. అంతక్రితం మాటెలావున్నా ఏడెనిమిది నెలల క్రితం రంగంలోకొచ్చిన చాట్‌జీపీటీ అంద రినీ ఒక్కసారి దిగ్భ్రమపరిచింది. దాన్నుంచి తేరుకునే లోగానే చాట్‌జీపీటీ–4 కూడా అందుబాటు లోకొచ్చింది. దాని సాయంతో పాఠశాల, కళాశాలల విద్యార్థులు గణిత శాస్త్ర సమస్యలను క్షణాల్లో ఛేదిస్తున్నారనీ, మెదడుకు పదును పెట్టడం మానేశారనీ మొదట్లో వినగా... అమెరికావంటి దేశాల్లో ఏఐని ఉపయోగించి పరిశోధక పత్రాలు కూడా తయారు చేశారని తర్వాత బయటపడింది. లక్షల మంది బుర్రలు బద్దలుకొట్టుకునే జటిలమైన సమస్యకు ఏఐ క్షణంలో పరిష్కారం చూపుతుందనీ, దాని సాయంతో భారీ సొరంగాల తవ్వకాల్లో ఎదురయ్యే కష్టాలను అవలీలగా అధిగమించవచ్చనీ రుజువవుతూనే వుంది. ప్రయోజనాల సంగతి తేలినా పూర్తి స్థాయిలో వినియోగంలోకొస్తే ఏమవు తుందోనన్న బెంగ అందరిలోనూ గూడుకట్టుకుని వుంది. ఆ మధ్య స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను సర్వే చేయగా, వారిలో మూడోవంతుకు మించి ఏఐ వల్ల అనర్థాలున్నాయని అభిప్రాయపడ్డారు. మొన్న మార్చిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వాజ్నిక్ సహా 1,300 మంది ఏఐ పరిశోధనలను ఆర్నెల్లపాటు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఎవరు ఏం చెప్పినా వేలంవెర్రి ఆగదు. ఏఐ విషయంలో జరిగింది అదే. దానివల్ల కలిగే ముప్పేమిటో దాదాపు అన్ని దేశాల్లోనూ రుజువవుతూనే వుంది. క్షణాల్లో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపి మాయ చేయటం ఏఐకి చాలా సులభమని తేలిపోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ్క రష్యా అధ్యక్షుడు పుతిన్ సేనలకు దాసోహమంటున్న వీడియో కొన్నాళ్లు హల్చల్ చేసింది. ‘నన్ను అడగకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు అసలు తెలియకుండా ఏదో ఒకరోజు నన్ను ఏఐ ద్వారా దృశ్యబద్ధం చేసే ప్రమాదమున్నద’ని పేర్కొంటూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ న్యాయస్థానం తలుపుతట్టాడు. ఉత్తర్వులు కూడా పొందాడు. దేనికైనా అనుకూల, ప్రతికూల అంశాలు రెండూ వుంటాయి. సాంకేతికత అనేది ఎప్పుడూ రెండువైపులా పదునున్న కత్తి. ఏఐతో ఒక మనిషికి జీవం పోయొచ్చు. వేలాదిమంది కుత్తుకలు తెగ్గొట్టవచ్చు. తులనాత్మకంగా చూస్తే మొదటి అంశంలో ఏఐ పురోగతి నత్తనడకన వుండగా... ఉద్దేశపూర్వకంగా, సమాజానికి నష్టం కలిగించే రీతిలో దాన్ని ఉపయోగించుకునే ధోరణులు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వాల నియంత్రణలు సృజనాత్మకతకు అవరోధమవుతాయని, కట్టడిలో మనుగడ సాగించే సమాజాలు ఎదగవని ఒకప్పుడు నమ్మేవారు. సామాజిక మాధ్యమాల రాకతో కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వాలే చడీచప్పుడూ లేకుండా వాటి సాయంతో జనంలో ఆమో దాన్ని సృష్టించుకుంటూ బతకనేరుస్తున్న వైనాన్ని చూస్తున్నాం. లాభార్జనే తప్ప మరేం పట్టని కార్పొ రేట్ సంస్థల తీరు కూడా కళ్లముందే వుంది. కనుక ఏఐ నియంత్రణలో పాటించాల్సిన ధర్మాలేమిటో, పౌరుల గోప్యత పరిరక్షణకు ఏం చేయాలో, స్వీయభద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త లేమిటో నిర్ణయించటం అంత సులభం కాదు. అమెరికా వరకూ తీసుకుంటే బైడెన్ ఉత్తర్వులిచ్చారు గానీ, వాటిని పెద్దగా బలంలేని ప్రతినిధుల సభలో ఆమోదింపజేసుకోవటం కష్టమే. బ్రిటన్ కూడా సొంతానికి ఒక నిబంధనావళి రూపొందించుకుంది. చైనా, యూరోపియన్ యూనియన్లు సైతం అంతే. మన దేశం ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి బయటికొచ్చిన భూతాన్ని తెలివిగా వినియోగించుకోవటమెలాగో, అదుపు చేయటమెలాగో గ్రహించటం ప్రపంచానికి పెను సవాలే. దీన్ని మానవాళి ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఇదీ చదవండి: అఫిడవిట్లతో జాగ్రత్త -
ఫ్యూచర్ ఫోన్లు ఇవే..చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ రూపురేఖలు మారుతున్నాయి. 1973లో మార్టిన్‌కూపర్ ఆవిష్కరించిన డబ్బా ఆకారంలో ఉండే మొదటి సెల్యులర్ ఫోన్ బరువు అక్షరాల 790గ్రాములు. అయితే రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు పుట్టుకొస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో వాటి ఆవిష్కరణలు అగ్రస్థానాన్ని తాకాయి. ప్రత్యేకించి మొబైల్ తయారీరంగంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. బరువు తక్కువగా ఉండే మొబైల్‌లు గతంలో ఆదరణ పొందేవి. ఇప్పడు ఫోల్డబుల్ ఫోన్లపై ఆసక్తి ఎక్కువవుతుంది. అయితే కంపెనీలు ఇంకా అడ్వాన్స్‌గా ఆలోచించి మడిచేఫోన్లను తయారు చేయనున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. (ఇదీ చదవండి: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత) Wow! Exciting mobile phones from the future… pic.twitter.com/tzPiIpX7gp — Wow Videos (@ViralXfun) October 24, 2023 -
ప్రపంచాన్ని గెలిచేలా.. పాఠాలను మారుద్దాం
మన విద్యా వ్యవస్థలో వీఆర్ (వర్చువల్ రియాలిటీ), ఏఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీల సాంకేతికతను పెంచాలి. లో లెవల్ మెషిన్ లెర్నింగ్, మెటావర్స్‌తో మిళితం చేయాలి. మన విద్యార్థులు ఏఐలో నిష్ణాతులుగా మారి, ఆ తర్వాత క్రియేటర్లుగా రాణించేలా ఇక్కడి నుంచే తొలి అడుగు వేయాలి. అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్య స్థాయిలో వేర్వేరుగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తాం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ విద్యా వ్యవస్థలో సాంకేతికతను ముందుకు తీసుకెళదాం. అత్యుత్తమ ప్రతిభావంతుల ద్వారా పాశ్చాత్య దేశాల విద్యా విధానంలోని అంశాలతో మన కరిక్యులమ్‌ను రీడిజైన్ చేద్దాం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ బోధన, నేర్చుకునే సామర్థ్యం పెంచడంతో పాటు.. వారిని ఏఐ క్రియేటర్లుగా తీర్చిదిద్దేలా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్సిటీల వీసీలకు పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్‌లో ఏఐ ఒక భాగం కావాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు విద్యా విధానాన్ని ఏఐ మార్చబోతోందని, ఈ రూపంలో ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. బోధన, నైపుణ్యాభివృద్ధిలో తొలిసారిగా ఎమర్జింగ్ టెక్నాలజీ అనుసంధానం చేసేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా శాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రాక్టికల్ అప్లికబులిటీ ఆఫ్ నాలెడ్జ్‌ను తీసుకురావడంతో పాటు మరిన్ని వర్టికల్స్ చదువుకునే అవకాశం ఇవ్వాలన్నారు. సాంకేతిక వైద్య విధానాలు అందుబాటులోకి రావడంతో వైద్య విద్య పాఠ్య ప్రణాళిక, బోధనలో రోబోటిక్స్, ఏఐల ప్రాధాన్యం పెంచాలని చెప్పారు. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేయాలని దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు సీఎం జగన్ మాటల్లోనే.. ఏఐలో మనమే లీడర్లుగా ఉండాలి ► ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. అందుకు తగ్గట్టుగా మనం చదువులు అందిస్తున్నామో లేదో ఆలోచించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విప్లవం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో మనం వెనుకబడితే కేవలం అనుసరించే వాళ్లుగానే మిగిలిపోతాం. ఏఐ అభివృద్ధి చెందేకొద్దీ.. దానిని వినియోగించుకుని, సామర్థ్యాన్ని పెంచుకునే వర్గం ఒకటైతే.. ఏఐని క్రియేట్ చేసే వర్గం మరొకటి తయారవుతుంది. ► టెక్నాలజీ పరంగా తొలి రివల్యూషన్ 1784లో స్టీమ్‌తో నడిచే రైలు ఇంజన్ ద్వారా చూశాం. ఆ తర్వాత 100 ఏళ్లకు విద్యుత్, 1960–70ల్లో కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూపంలో మరో రెండు విప్లవాలు అత్యంత మార్పును తీసుకొచ్చాయి. ఈ మూడింటిలోనూ మనం వెనుకబడ్డాం. ఏదీ క్రియేట్ చేసే పరిస్థితుల్లో లేం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారాలి. ఈ రంగంలో మనమే లీడర్లుగా ఉండాలి. అందుకోసం ఆ దిశగా అడుగులు వేగంగా వేయాలి. ఫ్యాకల్టీల్లో ఆప్షన్లు పెంచాలి ► జర్మనీ వంటి దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉంది. పాశ్చాత్య ప్రపంచం అంతా జనాభా అసమతుల్యత (డెమొగ్రఫిక్ ఇన్‌బ్యాలెన్స్)ను ఎదుర్కొంటోంది. కానీ, భారతదేశంలోనైనా.. ఆంధ్రప్రదేశ్‌లో చూసినా సుమారు 70 శాతం మంది పనిచేసే వయస్కులు ఉన్నారు. వీరికి సరైన విజ్ఞానం, నైపుణ్యం అందించేందకు విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలి. ► ఇప్పటి వరకు మన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులను మాత్రమే నిర్దేశిస్తున్నాం. అదే పాశ్చాత్య దేశాల కరిక్యులమ్‌లో ఒక ఫ్యాకల్టీలో చాలా వర్టికల్స్ కనిపిస్తాయి. అక్కడ బీకాంలోనే అసెట్ మేనేజ్మెంట్, ఫైనాన్సియల్ మార్కెట్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అనాలసిస్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి మన దగ్గర లేవు. ► మన వాళ్లు మంచి డిగ్రీ కోసం విదేశాలకు వెళ్లాల్సిందే. ఏపీలో చదువుకునే విద్యార్థులకు నచ్చిన వర్టికల్స్ చదువుకునే అవకాశాలు ఇవ్వాలి. తాజాగా డిగ్రీలకు సంబంధించి క్రెడిట్స్ ఇస్తున్నాం. ఇకపై వాటి స్థాయిని పెంచుతూ ప్రతి ఫ్యాకల్టీలో ఎక్కువ ఆప్షన్లలో బోధన సాగించాలి. ఇప్పటికే ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. విద్యార్థుల ఉన్నతికి ఇలాంటి ఎన్నో మార్పులు అవసరం. ► సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వర్టికల్ కోర్సులకు బోధన సామర్థ్యం మన దగ్గర అందుబాటులో లేకపోతే.. వర్చువల్ రియాలిటీని.. ఆగ్మెంటెడ్ రియాలిటీతో అనుసంధానించి వర్చువల్ క్లాస్ టీచర్ ద్వారా పాఠాలు చెప్పిద్దాం. మెడికల్ కోర్సుల్లో సాంకేతిక విజ్ఞానం పెంపు ► వైద్య విద్య కోర్సుల్లోని బోధన పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలి. భవిష్యత్తులో ఐదేళ్ల మెడికల్ కోర్సులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి. శరీర భాగాలను కోసి ఆపరేషన్ చేసే రోజులు మారిపోయాయి. కంప్యూటర్ల ద్వారా ఏఐను వాడకుని చిన్న చిన్న రంధ్రాలతో ఆపరేషన్ చేస్తున్నారు. అందుకే వైద్య విద్యలో రోబోటిక్స్, ఏఐలను భాగస్వామ్యం చేయాలి. ► హర్యానాలోని ఒక మెడికల్ కాలేజీలో ఇలాంటి కోర్సులనే ప్రవేశపెట్టారు. కేవలం మెడిసిన్‌లో చికిత్సకు సంబంధించిన విజ్ఞానం ఇవ్వడమే కాదు, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడంపై కూడా పాఠ్య ప్రణాళికలో జోడించాలి. త్వరలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ ► ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ఏర్పాటుతో వ్యవసాయం చేసే తీరులో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే గ్రామ స్థాయిలోనే రైతును చేయి పట్టుకుని సాగు చేయించే వ్యవస్థను తీసుకొచ్చాం. ► ఇంతటితో ఆగిపోకుండా.. ప్రతి ఎకరాలో భూసార పరీక్షలు చేసి పంట సాగయ్యేలా చర్యలు చేట్టాలి. శాటిలైట్ ఇమేజ్ ద్వారా భూమిలోని కాంపోజిషన్‌ను తెలుసుకోవచ్చు. డ్రోన్ల ద్వారా భూమిలోని మినరల్ డిపాజిట్లను ఇంకా దగ్గరగా తెలుసుకునే అవకాశం వస్తోంది. ఆ రిపోర్టుల ద్వారా వ్యవసాయంలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావచ్చు. అప్పుడు పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో సులభంగా తెలుస్తుంది. ఇటువంటి టెక్నాలజీని మన విద్యార్థులకు నేర్పించాలి. హైలెవల్ అకడమిక్ బోర్డు ► ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోని పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాల సరళి మన కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ టెక్ట్ బుక్స్ విద్యార్థులకు ఇచ్చి సమాధానాలు రాయిస్తారు. తద్వారా ప్రాక్టికల్ అప్లికబిలిటీని పరీక్షిస్తారు. అందుకే మనదగ్గర కూడా ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలి. ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రకంగా కరిక్యులమ్ తయారు చేయడం కాకుండా అందరూ అనుసరించేలా ఒక నిర్దిష్టమైన కరిక్యులమ్ రూపొందించాలి. ► అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్య స్థాయిలో వేర్వేరుగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మనం విజన్ కోసం ఒక హైలెవల్ అకడమిక్ బోర్డు అవసరం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో ఈ బోర్డును ఏర్పాటు చేద్దాం. తద్వారా పాశ్చాత్య దేశాల విద్యా విధానంలోని అంశాలతో మన కరిక్యులమ్‌ను రీడిజైన్ చేద్దాం. పాఠ్యప్రణాళికను, బోధనను, ప్రశ్నపత్రాల తీరును మారుద్దాం. పాఠశాల స్థాయి నుంచే మార్పులు ► విద్యా వ్యవస్థలో పాఠశాల స్థాయి నుంచే సమూల మార్పులు రావాలి. ఇప్పటికే మనం ఆ దిశగా చర్యలు చేపట్టాం. ఇంగ్లిష్ మీడియం చదువులు, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధనను తీసుకొచ్చాం. డిసెంబర్ నాటికి 63 వేల క్లాస్ రూమ్స్‌ను ఐఎఫ్‌పీ ఫ్యానెల్స్‌తో డిజిటలైజ్ చేస్తున్నాం. ఇప్పటికే 31 వేల తరగతి గదుల్లో ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. ► బైజూస్ కంటెంట్‌ను ఇంటిగ్రేట్ చేశాం. ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. దీనికి తదుపరిగా మరిన్ని మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమర్జింగ్ టెక్నాలజీల్లో చాలా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అవసరమైతే ఇంటర్నెట్లోని కంటెంట్ ద్వారా టెక్నాలజీ వాడకంపై శిక్షణ ఇస్తే మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధమవుతారు. ► విద్యా రంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే.. లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే వైస్ చాన్సలర్లు కూడా ఆలోచించాలి. దీనిపై మరిన్ని సమాలోచనలకు నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. మెడికల్, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని అత్యుత్తమ పాఠ్య ప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి. ► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కళాశాల విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సలర్లు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనం వాడే ప్రతిఒక్కరికి ఇది ఒక శుభవార్త..!
-
స్టెరిలైట్ టెక్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆప్టికల్, డిజిటల్ సొల్యూషన్ల కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి రూ. 50 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో వన్‌టైమ్ ప్రొవిజన్‌తో కలిపి రూ. 138 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 1,882 కోట్లను తాకింది. మొత్తం ఆర్డర్‌బుక్ రూ. 12,054 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. వృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టడం, నిర్వహణా సామర్థ్యాల మెరుగు, పెట్టుబడుల వ్యూహాత్మక కేటాయింపు వంటి అంశాలు పటిష్ట పనితీరుకు సహకరించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో స్టెరిలైట్ టెక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2.6 శాతం నష్టంతో రూ. 175 వద్ద ముగిసింది. -
లోకలైజేషన్ పెరగాలి
న్యూఢిల్లీ: వాహన విడిభాగాల పరిశ్రమ స్థానికీకరణ (లోకలైజేషన్) పెంచడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కెనిచి అయుకావా అభిప్రాయపడ్డారు. నిలకడైన వృద్ధి సాధించేందుకు కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచడాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 62వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా అయుకావా ఈ విషయాలు తెలిపారు. ‘ముడి వస్తువులు మొదలుకుని అత్యంత చిన్న విడిభాగాలను కూడా వీలైనంత వరకూ స్థానికంగానే ఉత్పత్తి చేసేందుకు మార్గాలు వెతకాలి. భారతీయ ఆటో పరిశ్రమ దేశీయంగాను, అటు ఎగుమతులపరంగానూ భారీ స్థాయికి పెరిగింది. ఇలాంటప్పుడు నాణ్యత అత్యంత ప్రాధాన్యమైన అంశంగా ఉంటుంది. కాబట్టి నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలన్న ప్రధాని లక్ష్యం సాకారం చేసే దిశగా భవిష్యత్ తరం టెక్నాలజీలపై పరిశ్రమ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. పరిశ్రమను తిరిగి వృద్ధి బాట పట్టించేందుకు ఏసీఎంఏ, వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ కలిసి పనిచేయాలని అయుకావా తెలిపా రు. కాగా, ప్యాసింజర్, వాణిజ్య వాహనాల అమ్మకాలు కరోనా పూర్వ స్థాయికి చేరగా.. ద్విచక్ర వాహనాల విక్రయాలు కూడా ఈ పండుగ సీజన్లో ఆ స్థాయిని అందుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఏసీఎంఏ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ చెప్పారు. వాహనాల పరీక్షకు కఠిన ప్రమాణాలు ఉండాలి: పవన్ గోయెంకా ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీలు ఆదరాబాదరాగా మార్కెట్లోకి తెచ్చేయకుండా తయారీకి సంబంధించి కఠిన ప్రమాణాలు, పరీక్షలు ఉండాలని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. తద్వారా విద్యుత్ వాహనాలు అగ్ని ప్రమాదాల బారిన పడే ఉదంతాలను నివారించవచ్చని పేర్కొన్నారు. కఠిన చర్యలు.. సరఫరాదారులు విడిభాగాలను స్థానికంగా తయారు చేయకుండా అడ్డుపడే ఆటోమొబైల్ కంపెనీల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుంది. దేశీయంగానే విడిభాగాలను తయారు చేసుకోవడానికి పరిశ్రమ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి -
బోయిగూడ ప్రమాదంతో మేల్కొనక తప్పదా.. దేశంలో వాడే టెక్నాలజీ ఇదే..
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ప్రమాదం జరిగిన ఫ్లోర్‌లోకి వెళ్లడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి రెండు గంటలు పట్టింది. బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు ఉన్న స్పైరల్ స్టెయిర్ కేస్ (మెట్లు) వేడెక్కిపోవడంతో ఇబ్బందిపడాల్సి వచ్చింది. వేకువజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో మంటలంటుకోగా ఉదయం 8 గంటలకు 8 ఫైరింజన్లు కష్టపడి మంటలార్పాయి. అయితే అగ్ని ప్రమాదాల్లో మంటలను త్వరగా ఆపేందుకు మన దేశంలో అత్యాధునిక పరికరాలేమున్నాయి, ఎలాంటి టెక్నాలజీని వాడి మంటలను అదుపు చేస్తున్నారు, ప్రాణాలను ఎలా కాపాడుతున్నారు? రిమోట్ కంట్రోల్డ్ ఫైర్ ఫైటింగ్ మెషీన్ ప్రస్తుతం ఢిల్లీ అగ్నిమాపక శాఖ దగ్గర ఉంది. తీవ్రమైన వేడి ఉన్నప్పుడు, ప్రమాద స్థలంలోకి వెళ్లే పరిస్థితి లేనప్పుడు రిమోట్ ద్వారా కంట్రోల్ చేసే మెషీన్లను సులువుగా వాడొచ్చు. 140 హార్స్ పవర్‌తో పని చేసే డీజిల్ ఇంజిన్ ఇందులో ఉంటుంది. నిమిషానికి దాదాపు 2,400 లీటర్ల నీటిని ఇది పంప్ చేస్తుంది. పైగా ఇందులోని ఆటోమైజ్డ్ వాటర్ జెట్.. నీటిని కోట్లాది చిన్న చిన్న నీటి బిందువులుగా మార్చేస్తుంది. అవసరమైన ప్రదేశాల్లో నురగను కూడా ఉత్పత్తి చేసి పంప్ చేస్తుంది. టర్న్ టేబుల్ ల్యాడర్ పెద్ద పెద్ద బిల్డింగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాడటానికి టర్న్ టేబుల్ ల్యాడర్‌ను వాడుతున్నారు. దీని ద్వారా దాదాపు 32 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి మంటలు ఆర్పవచ్చు. నిచ్చెనను జాగ్రత్తగా ఆపరేట్ చేయడానికి కంప్యూటర్ మానిటరింగ్ ఉంది. డిస్ప్లే ఇండికేషన్లు కూడా ఉన్నాయి. మోటార్ సైకిళ్లకు మిస్ట్ సిస్టమ్ ఈ తరహా సిస్టమ్‌ను మోటార్ సైకిళ్లకు బిగిస్తారు. ఇది దాదాపు 40 మైక్రాన్ల స్థాయిలో నీటి అణువులను వెదజల్లుతుంది. చిన్నస్థాయి, ఎలక్ట్రిక్ మంటలను ఆర్పేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో బాగా పని చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడానికి ముందు మంటల తీవ్రతను ఇది తగ్గించగలుగుతుంది. హై ప్రెజర్ హోస్ రీల్ సిస్టమ్ నీటిని సమర్థంగా వాడి మంటలార్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా అత్యధిక ఒత్తిడితో నీటిని, ఇతర మంటలార్పే పదార్థాలు, ద్రావణాలను చల్లుతారు. విదేశాల్లో కొత్త టెక్నాలజీలు ఇవే.. డ్రోన్లతో.. అగ్ని ప్రమాదాల్లో మంటలార్పేందుకు చైనాలో డ్రోన్లను వాడుతున్నారు. ఎంత ఎత్తుకైనా, ఎక్కడికైనా చాలా సులువుగా డ్రోన్లు వెళ్లిపోగలవు. కచ్చితత్వంలో మంటలను ఆర్పగలవు. ఆ మధ్య చైనాలోని చాంగ్‌క్వింగ్‌లో డ్రోన్లతో మంటలార్పే డ్రిల్‌ను కూడా నిర్వహించారు. షాట్ గన్స్.. మంటలార్పే ఇంపల్స్ ఫైర్ ఎక్స్‌టింగ్విషింగ్ సిస్టమ్ షాట్ గన్స్‌లో తక్కువ స్థాయిలో నీటిని వాడతారు. అయితే అత్యధిక వేగంతో మంటలపై దీన్ని ప్రయోగిస్తారు. వీటిలోంచి వచ్చే నీటి బిందువులు సెకనుకు 120 మీ. వేగంతో వెళ్లి పరిసరాలను చల్లబరుస్తాయి. దీంతో మంటలు ఆరిపోతాయి. రోబోటిక్ ఫైర్ ఫైటర్స్ చూడటానికి అచ్చం యుద్ధ ట్యాంకులా ఉంటుంది. ఇది నిమిషానికి 2 వేల నుంచి 20 వేల లీటర్ల నీటిని చల్లుతుంది. దీంట్లో కెమెరాలు, వేడిని గుర్తించే సెన్సార్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా రోబోలు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని దూరం నుంచే అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంగా నగరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశానికి హైదరాబాద్ వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. నరాలు, గుండె జబ్బులకు సంబంధించిన అత్యాధునిక వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ సంస్థ సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైద్య ఉపకరణాల పార్కులో 2017 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులతో పాటు 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయన్నారు. 302 ఎకరాల్లో విస్తరించి ఉన్న మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడులకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటివరకు 50కి పైగా కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వచ్చి తయారీ, పరిశోధన, అభివృద్ధి యూనిట్లు ఏర్పాటు చేశాయన్నారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, తయారీ రంగంలో వైద్య ఉపకరణాల పార్కును బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని కేటీఆర్ అన్నారు. రూ.250 కోట్లతో తాము నెలకొల్పే యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రమోటర్, డైరెక్టర్ బదరీ నారాయణ్ వెల్లడించారు. కేటీఆర్‌తో బదరీ నారాయణ్, విజయగోపాల్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర లైఫ్‌సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
యాడ్‌వెర్బ్‌లో రిలయన్స్‌కు వాటా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ రిటైల్ దేశీ రోబోటిక్స్ కంపెనీ యాడ్‌వెర్బ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ 13.2 కోట్ల డాలర్ల(రూ. 983 కోట్లు)తో తమ కంపెనీలో 54 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు యాడ్వెర్బ్ సహవ్యవస్థాపకుడు, సీఈవో సంగీత్ కుమార్ తాజాగా వెల్లడించారు. తద్వారా రిలయన్స్ రిటైల్ అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించినట్లు తెలియజేశారు. అయితే తమ సంస్థ స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. రిలయన్స్ నుంచి లభించనున్న నిధులను విదేశాలలోనూ వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా నోయిడాలో అతిపెద్ద రోబోటిక్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే నోయిడాలో వార్షికంగా 10,000 రోబోల తయారీ సామర్థ్యంగల ప్లాంటును కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే సేవలు.. ఇప్పటికే రిలయన్స్ తమకు ప్రధాన కస్టమర్లలో ఒకటిగా ఉన్నట్లు కుమార్ పేర్కొన్నారు. జియోమార్ట్ గ్రోసరీ బిజినెస్ కోసం కంపెనీతో కలసి అత్యాధునిక ఆటోమేటెడ్ వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీంతో రెండు సంస్థల మధ్య నమ్మకమైన సంబంధాలు నెలకొన్నట్లు తెలియజేశారు. రిలయన్స్ రిటైల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా 5జీ, బ్యాటరీ టెక్నాలజీ, కార్బన్ ఫైబర్ అభివృద్ధికి వీలున్నట్లు వివరించారు. దీంతో అత్యాధునిక, చౌక ధరలలో రోబోలను అందించగలమని తెలియజేశారు. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ 2016లో ఏర్పాటైన యాడ్వెర్బ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 శాతం వృద్ధితో రూ. 400 కోట్ల టర్నోవర్ సాధించే వీలున్నట్లు కుమార్ తెలియజేశారు. 5–6ఏళ్లలో బిలియన్ డాలర్ కంపెనీగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆదాయంలో 80 శాతం దేశీయంగా సమకూరుతున్నట్లు వెల్లడించారు. రానున్న 4–5 ఏళ్లలో విదేశాల నుంచి 50 శాతం టర్నోవర్‌ను సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఆదాయంలో 15 శాతం వాటా ఆక్రమిస్తున్న సాఫ్ట్వేర్ విభాగాన్ని భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీకి సింగపూర్, నెదర్లాండ్స్, యూఎస్, ఆస్ట్రేలియాలలో నాలుగు అనుబంధ సంస్థలున్నాయి. -
ఇక గాల్లో తేలిపోవడమే.. ఎగిరే బైక్ గురించి తెలుసుకుందామా..
పొద్దున్నే బైకో, కారో తీసుకుని రోడ్డెక్కారు.. ఎక్కడ చూసినా ట్రాఫిక్‌జామ్.. హాయిగా గాల్లో ఎగిరివెళితే బాగుండేదని చాలా మందికి అనిపిస్తుంటుంది. జపాన్‌కు చెందిన ఏఎల్ఐ టెక్నాలజీస్ సంస్థ ఈ కలను నిజం చేయబోతోంది. ఓ చిన్నపాటి హెలికాప్టర్లా గాల్లో ఎగురుతూ వెళ్లే బైక్‌ను రూపొందించింది. వచ్చే ఏడాదే దాన్ని మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్తోంది. ఆ ఎగిరే బైక్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. –సాక్షి సెంట్రల్ డెస్క్ గంటకు వందకిలోమీటర్ల వేగంతో.. జపాన్ సంస్థ రూపొందించిన ఎగిరే బైక్ పేరు ‘ట్సురిస్మో’. నాలుగు చిన్న ప్రొపెల్లర్లు (ఫ్యాన్‌లా తిరిగే మోటార్లు), మరో రెండు పెద్ద ప్రొపెల్లర్లతో ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో 40 నిమిషాల పాటు ఆగకుండా ప్రయాణించగలదు. అంటే సుమారు 67 కిలోమీటర్లు వెళ్లొచ్చు. తర్వాత మళ్లీ ఇంధనం నింపుకొని వెళ్లాల్సి ఉంటుంది. దీని పనితీరును తాజాగా జపాన్‌లోని మౌంట్ఫుజీ సమీపంలో విజయవంతంగా పరీక్షించినట్లు ఏఎల్ఐ టెక్నాలజీస్ సంస్థ ప్రకటించింది. మరో ఏడెనిమిది నెలల్లో 200 ఎగిరే బైక్‌లను విక్రయించనున్నట్లు తెలిపింది. ఇంతకీ దీని ధర ఎంతో చెప్పనేలేదు కదా. జస్ట్.. రూ.5 కోట్లు. రక్షణ కోసం వాడొచ్చు తమ ఎగిరే బైక్‌ను కేవలం ప్రయాణాల కోసమే కాకుండా.. భద్రత కోసం వినియోగించవ్చని ఏఎల్ఐ టెక్నాలజీస్ సంస్థ చెప్తోంది. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు దీనిపై వేగంగా, నేరుగా చేరుకుని రక్షించవచ్చని వివరిస్తోంది. సముద్రాల్లో ప్రమాదం జరిగినప్పుడు, నదులకు వరదలు వచ్చినప్పుడు గాల్లో ఎగురుతూ వెళ్లి కాపాడవచ్చని పేర్కొంటోంది. -
గాడ్జెట్ మహిమ, వంటకం ఏదైనా చిటికెలో చేయెచ్చు...!
చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్స్‌కి చాలా చక్కగా, అనువుగా ఉండే ఈ ఫ్యామిలీ సైజ్ ఓవెన్.. ఎయిర్ ఫ్రైయర్లా కూడా పనిచేస్తుంది. డిజిటల్ టచ్‌స్క్రీన్ తో ఆయిల్‌లెస్ రుచులని అందిస్తుంది. చికెన్, ఫిష్, పిజ్జా, కేక్, స్టిక్స్, వింగ్స్, కుకీస్, ఫ్రెంచ్‌ఫ్రైస్ ఇలా చాలానే చేసుకోవచ్చు. 1700గి సామర్థ్యం కలిగిన ఈ మేకర్‌కి ముందు భాగంలో దానికి ఆనుకునే గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని పైనుంచి కిందకు ఓపెన్ చేసుకోవచ్చు. లోపల ట్రాన్స్పరెంట్ బౌల్ పెట్టుకుని.. మూడు సొరుగులుగా గ్రిల్ ప్లేట్స్ అమర్చి, వాటిపై ఆహారాన్ని బేక్ చేసుకోవచ్చు. ఇందులో 3600ఊ వద్ద పిజ్జా 10 నిమిషాలు, కూరగాయలు 12 నిమిషాలు, ఫిష్ 15 నిమిషాలు, కేక్ 30 నిమిషాలు సమయం పడుతుంది. 4300ఊ వద్ద.. పాప్‌కార్న్ 8 నిమిషాలు, చికెన్ వింగ్స్ 10 నిమిషాలు, ఫ్రెంచ్‌ఫ్రైస్ 20 నిమిషాలు, హోల్ చికెన్ 30 నిమిషాలు సమయం తీసుకుంటాయి. అధిక–నాణ్యత గల మెటీరియల్‌తో రూపొందిన చికెన్ ఫోర్క్, డిప్ ట్రే, రొటేటింగ్ బాస్కెట్, ఎయిర్ ఫ్లో రాక్స్, మెస్ బాస్కెట్ వంటివన్నీ మేకర్‌తో పాటు లభిస్తాయి. ఈ గాడ్జెట్ 80 శాతం నూనె వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆప్షన్స్ అన్నీ మేకర్ ముందువైపు డిస్ప్లేలో బొమ్మలతో సహా వివరంగా కనిపిస్తుంటాయి. దాంతో దీన్ని ఆపరేట్ చెయ్యడం ఎవరికైనా సులభమే. -
తేజస్ ప్రధాన విడి భాగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మితమవుతున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు అవసరమైన ప్రధాన భాగం (సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్) దేశీయంగా సిద్ధమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వీఈఎం టెక్నాలజీస్‌లో తయారైన తొలి సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్‌ను సోమవారం తేజస్ రూపొందిస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు అందజేశారు. వీఈఎం టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు చేతుల మీదుగా తొలి యూనిట్ దస్తావేజులను హెచ్ఏఎల్ సీఎండీ ఆర్.మాధవన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కేంద్రం ఇటీవల ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని హెచ్ఏఎల్ 2011లోనే ప్రారంభించిందని పేర్కొన్నారు. తేజస్‌లోని ప్రధాన భాగాలను ఐదు ప్రైవేట్ కంపెనీలు చేపట్టాయని, మధ్య భాగమైన సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్ తయారీని వీఈఎం టెక్నాలజీస్ తక్కువ సమ యంలో పూర్తి చేసిందని కొనియాడారు. ఎల్సీఏ మార్క్–1 కోసం మొత్తం 83 యూనిట్లు అవసరం కాగా, కొన్ని మార్పులతో ఎల్సీఏ మార్క్–2 కోసం మరో 120 యూనిట్ల అవసరమని చెప్పారు. నావికాదళం, ఇతర విమానాల కోసం మరో 100 యూనిట్లు కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
‘ఎన్ఎస్ఓకు ఎలాంటి సంబంధం లేదు..పెగాసస్‌కు థ్యాంక్స్’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాపంగా ప్రకంపనలు రేపిన పెగాసస్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ స్పందించింది. లీకైన డేటా, ఫోన్ నెంబర్ల జాబితాకు ఎన్ఎస్ఓకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అసలు స్నూపింగ్ లాంటి టెక్నాలజీని దేన్నీ వాడటం లేదనీ, ఫోన్ల డేటా ప్రాప్యత ఏదీ తమ క్లయింట్ల వద్ద లేదని తెలిపింది. వాస్తవానికి పెగాసస్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం కారణంగానే లక్షలాదిమంది ప్రజలు రాత్రిళ్లు నిశ్చింతగా నిద్రపోతున్నారని, వారంతా వీధుల్లో సురక్షితంగా సంచరిస్తున్నారని ఎన్ఎస్ఓ తెలిపింది. సురక్షితమైన ప్రపంచాన్ని సృష్టించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎన్ఎస్ఓ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ పెగాసస్‌పై తీవ్ర వివాదాల మధ్య, ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ వివావాదానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తనను తాను సమర్థించుకుంది పెగాసస్ లాంటి టెక్నాలజీకి కృతజ్ఞతలు తెలిపాలనీ పేర్కొంది. ఎందుకంటే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ యాప్స్‌తో ఒకే గొడుగు కింద పని చేస్తున్న నేరస్తులు, ఉగ్రవాదులు, పెడోఫిలియా రింగులను నివారించే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, చట్ట అమలు సంస్థల పరిశోధనకు ఇది సాయపడుతోందని ఎన్ఎస్ఓ ప్రతినిధి చెప్పారు. ప్రపంచంలోని అనేక ఇతర సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో కలిసి, ప్రభుత్వాలకు సైబర్ ఇంటెలిజెన్స్ సాధనాలను అందిస్తామని ప్రకటించింది. అలాగే తన క్లయింట్లు సేకరించిన డేటా పూర్తిగా సురక్షితమని కూడా వాదించింది. ఇంటెలిజెన్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు అందిస్తున్న టెక్నాలజీ కారణంగానే ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని, సంతోషంగా నిద్రపోతు న్నారని పేర్కొంది కాగా భారతదేశం సహా పలు దేశాల్లోని జర్నలిస్టులు, మానవహక్కుల నేతలు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘాకు పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందన్న వివాదం పెద్ద దుమారాన్ని రేపింది. ఇజ్రాయెల్ సంస్థ వివిధ ప్రభుత్వాలకు విక్రయించిన ఫోన్ ట్యాపింగ్ సాప్ట్వేర్ ఆరోపణలతో గోప్యతకు సంబంధించిన సమస్యలపై అనే ఆందోళన రేకెత్తించింది. మరోవైపు లీకయిన నంబర్లు ఎన్ఎస్ఓ సాఫ్ట్వేర్ వినియోగిస్తున్న దేశాలకు సంబంధించినవేనని పలువురు నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే ఈ విమర్శలను కొట్టిపారేసిన ఎన్ఎస్ఓ,పెగాసస్‌కు సంబంధించిన అన్ని ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మరోసారి బ్రేకులు, వీడియోకాన్ టేకోవర్‌పై స్టే
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద వేలానికి వచ్చిన వీడియోకాన్‌ను ట్విన్ స్టార్ టెక్నాలజీస్ టేకోవర్ చేసే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. దీనిపై జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్టే విధించింది. రుణ దాతల కమిటీ (సీవోసీ) నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐ దాఖలు చేసిన పిటీషన్లపై ఎన్సీఎల్ఏటీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. వీటిపై తమ సమాధానాలను రెండు వారాల్లోగా సమర్పించాలని సీవోసీ, పరిష్కార నిపుణుడు, ట్విన్ స్టార్‌కు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది. బ్యాంకులకు సుమారు రూ. 64,838 కోట్లు బాకీపడి, వేలానికి వచ్చిన వీడియోకాన్‌ను దాదాపు రూ. 2,962 కోట్లకు కొనుగోలు చేసేందుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఉత్తర్వులు ఇచ్చింది. -
ఈ చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందట?
ఢిల్లీ: కేంద్రం కొత్తగా అమల్లోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలను సరైన పద్దతిలో వినియోగించుకుంటే రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఏజెన్సీ బయాన్ అండ్ కంపెనీ వెల్లడించింది. అగ్రిటెక్‌లో పెట్టుబడులు కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి రావడం వల్ల సాగు విధానాల్లో మార్పులు, నూతన సాంకేతికత జోడింపులో వేగం పెరుగుతాయని, ఫలితంగా అగ్రిటెక్ రంగంలో ఉన్న కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకు వస్తాయని అంచనా వేసింది. 2025 నాటికి అగ్రిటెక్ రంగంలోకి 30 నుంచి 35 బిలియన్ల పెట్టుబడులకు అవకాశం ఉందని లెక్కకట్టింది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అగ్రిటెక్ పెట్టుబడుల విలువ కేవలం ఒక బిలియన్ డాలర్లుగా ఉంది. సాగు రంగంలో మార్పులు అగ్రిటెక్‌లోకి భారీగా పెట్టుబడులు రావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా, అమ్మకం వంటి రంగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేసింది. ఇంటిగ్రేటెడ్ అగ్రి ఫ్లాట్‌ఫామ్స్, ఇంక్యుబేషన్ వింగ్స్, న్యూ బిజినెస్ మోడల్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అదే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కొనుగోలులో ప్రస్తుతం అమలవుతున్న పద్దతుల స్థానంలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా కొత్త పద్దతులు అమల్లోకి వస్తాయంటూ బయన్ అండ్ కంపెనీ అభిప్రాయపడింది. వ్యవసాయ రంగంలో వచ్చే ఈ మార్పులతో రైతుల ఆదాయం రాబోయే రోజుల్లో రెండింతలు అయ్యే అవకాశం ఉందని బయాన్ సూచించింది. స్టార్టప్‌లతో.. వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లకు ఆర్థిక నిధులు అందించే దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉందని, కొత్త వ్యవసాయ చట్టాలు అమలయితే స్టార్ట్అప్లకు మరింత తోడ్పాటు అందుతుందని బయాన్ కంపెనీ చెప్పింది. వ్యవసాయ రంగానికి టెక్నాలజీ తోడై రాబోయే ఇరవై ఏళ్లలో సాగు రంగంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కూడా టాప్ మేనేజ్మెంట్ కంపెనీ వెల్లడించింది. ఆ చట్టాలతో నష్టం మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దులను కేంద్రంగా చేసుకుని ఆరు నెలలకు పైగా పోరాటం చేస్తున్నారు. పంజాబ్. హర్యాణా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రకి చెందిన రైతులు ఈ పోరాటంలో ముందున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే కార్పోరేట్ కంపెనీల చేతుల్లో రైతులు కీలుబొమ్మలు అవుతారంటూ రైతులు ఆందోళనలో పాల్గొంటున్న రైతులు అభిప్రాయ పడుతున్నారు. చదవండి : పెట్టుబడుల లక్ష్యాలపై దృష్టి పెట్టండి -
అడ్వాన్స్డ్ ఎంజైమ్- కేపీఐటీ.. దూకుడు
మిడ్‌సెషన్ నుంచీ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్ రంగ కౌంటర్ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. మరోపక్క సాఫ్ట్వేర్ సేవల కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ తాజాగా 52 వారాల గరిష్టాలకు చేరాయి. వివరాలు చూద్దాం.. అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ ఇటీవల ముఖ విలువ విభజన నేపథ్యంలో జోరు చూపుతున్న ఫార్మా రంగ కంపెనీ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ తాజాగా ఏడాది గరిష్టానికి చేరింది. ఎన్ఎస్ఈలో తొలుత 15 శాతంపైగా దూసుకెళ్లి రూ. 339ను తాకింది. ప్రస్తుతం 13 శాతం ఎగసి రూ. 332 వద్ద ట్రేడవుతోంది. రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా కంపెనీ ఇటీవల విభజించింది. దీనికితోడు ఎఫ్‌పీఐ విభాగంలో నలంద ఇండియా ఈక్విటీ ఫండ్ షేరుకి రూ. 264 ధరలో 4.19 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 3.75 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 111 కోట్లు వెచ్చించింది. ఈ కారణాలతో గత వారం రోజుల్లోనే అడ్వాన్స్డ్ ఎంజైమ్ షేరు 45 శాతం దూసుకెళ్లింది! కేపీఐటీ టెక్నాలజీస్ ప్రమోటర్లు వాటాను పెంచుకున్న వార్తలతో తాజాగా కేపీఐటీ టెక్నాలజీస్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత 10 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 127ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.2 శాతం లాభపడి రూ. 123 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల మూడో వారంలో ప్రమోటర్ కుంటుంబంలోని అనుపమ కిశోర్ పాటిల్ రెండు దఫాలలో 14.9 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీంతో అనుపమ కిశోర్ వాటా 0.59 శాతానికి చేరింది. కాగా.. ద్వితీయార్థంలో కంపెనీ పటిష్ట పనితీరును చూపనున్న అంచనాలతో ఇటీవల ఈ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి గత రెండు వారాలలో ఈ షేరు 30 శాతం ర్యాలీ చేసింది!