
బెంగళూరు: విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే టెక్నాలజీలపై ఆరంభంలో విప్రో చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తెలిపారు. విప్రో వాటాదారుల 72వ వార్షిక సమావేశంలో ప్రేమ్‌జీ మాట్లాడారు. తమ క్లయింట్లను విజయవంతం చేసేందుకు వీలుగా, పరిశ్రమలో ముందుండేందుకు వీలుగా తమ సేవల్ని తీర్చిదిద్దుకుంటున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్:)విభాగంలో కంపెనీ వృద్ధి నెలకొనగా, ఇప్పుడు కన్జ్యూమర్ విభాగంలో పరీక్షించుకుంటున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారుతున్నట్టు చెప్పారు. 2017 ప్రారంభం నుంచి అంతర్జాతీయంగా చాలా వరకు పెద్ద ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరును చూపిస్తున్నాయని, టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న అభివృద్ధి సమీకరణాలు అసాధారణ స్థాయికి చేరుతున్నాయని ప్రేమ్‌జీ వివరించారు. భారత్, అమెరికా, యూరోప్ దేశాలు, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. కంపెనీలు చురుగ్గా ఉంటూ టెక్నాలజీను స్వీకరిస్తూ తమను తాము మార్చుకోవాలని, మరీ ముఖ్యంగా తమ కస్టమర్ల అనుభవాన్ని మార్చే విధంగా ఉండాలని సూచించారు.