
భారతదేశం సర్వమత సమ్మేళనం.. కాబట్టి ఇక్కడ అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఇందులో ముస్లింల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వీరు (ముస్లింలు) కళ, సాహిత్యం, సైన్స్ వంటి వివిధ రంగాలలో తమదైన ముద్ర వేసినప్పటికీ.. వ్యాపార రంగంలో మాత్రం ఇతరులతో పోలిస్తే కొంత వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే మూడు తరాలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని పాలిస్తోంది.
1947లో దేశ విభజన సమయంలో మహమ్మద్ అలీ జిన్నా.. అజీమ్ ప్రేమ్‌జీ తండ్రి 'మహ్మద్ ప్రేమ్‌జీ'ని పాకిస్తాన్‌కు రమ్మని ఆహ్వానించడమే కాకుండా.. అక్కడ ఆర్ధిక మంత్రి పదవిని కూడా ఇస్తామని చెప్పారు. కానీ మహ్మద్ ప్రేమ్‌జీ నిరాకరించి, భారతదేశంలో ఉండిపోయారు. నిజానికి మహ్మద్ ప్రేమ్‌జీ బియ్యం వ్యాపారి. ఈయన మొదట్లో మయన్మార్‌లో వ్యాపారం చేసేవారు. ఆ తరువాత 1940లో ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అజీమ్ ప్రేమ్‌జీ ముంబైలోనే 1945లో జన్మించారు.

అజీమ్ ప్రేమ్‌జీ.. ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు. ఈయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం అజీమ్ ప్రేమ్‌జీ నికర విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ.
ప్రాథమిక విద్యను భారతదేశంలోనే పూర్తి చేసిన అజీమ్ ప్రేమ్‌జీ.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. ఆ సమయంలోనే అజీమ్ ప్రేమ్‌జీ అన్న ఫరూఖ్ ప్రేమ్‌జీ తన తండ్రి వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టారు. అయితే అతని వివాహానంతరం.. పాకిస్తాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ముహమ్మద్ ప్రేమ్‌జీ మరణానంతరం.. అజీమ్ ప్రేమ్‌జీ అప్పులపాలైన కుటుంబ వ్యాపారాన్ని (చమురు వ్యాపారం) నిర్వహించాల్సి వచ్చింది. తన తెలివితో చమురు వ్యాపారాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాడు. ఆ తరువాత దానిని విస్తరించడం మాత్రమే కాకుండా.. ఇతర రంగాలలోకి కూడా అడుగుపెట్టారు. ఇందులో భాగంగానే విప్రో కంపెనీ ప్రారంభించారు.
ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..
భారతదేశంలో 19వ ధనవంతుడు.. ప్రపంచంలోని 195వ ధనవంతుడైన అజీమ్ ప్రేమ్‌జీ, ఉదారంగా విరాళాలు అందించడంలో కూడా ముందున్నారు. 2020- 2021ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో ఎక్కువ విరాళాలు అందించిన వ్యక్తుల జాబితాలో.. ఈయన రూ. 9713 కోట్లు విరాళం అందించి అగ్రస్థానంలో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే అజీమ్ ప్రేమ్‌జీ రోజుకు రూ. 27 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment