విప్రోలో సగం వాటాలు ట్రస్టుకు విరాళం
ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ దాతృత్వం
బెంగళూరు : ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ.. విప్రోలో తనకున్న వాటాల్లో దాదాపు సగభాగాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే సుమారు 21 శాతం వాటాలను ట్రస్టుకు ఇచ్చిన ప్రేమ్‌జీ తాజాగా అదనంగా మరో 18 శాతం వాటాలను విరాళమిచ్చారు. దీంతో అజీం ప్రేమ్‌జీ ట్రస్టుకు మొత్తం 39 శాతం వాటాలు (విలువ సుమారు రూ. 53,284 కోట్లు) ఇచ్చినట్లయింది. వ్యక్తిగతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో తాను కూడా పాలుపంచుకోవాలనే తలంపుతో గడిచిన పదిహేనేళ్లుగా విప్రోలో తనకున్న వాటాల్లో కొద్ది కొద్దిగా ట్రస్టుకు బదలాయిస్తూ వస్తున్నట్లు ప్రేమ్‌జీ.. విప్రో వార్షిక నివేదికలో షేర్‌హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్, అజీం ప్రేమ్‌జీ ఫిలాంత్రోపిక్ ఇనీషియేటివ్ సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ఈ ట్రస్టు తోడ్పాటు అందిస్తుందన్నారు.