సాఫ్ట్‌వేర్ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం వివిధ విభాగాల్లో దాదాపు రూ.83వేలకోట్లు(10 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. తాజాగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ ఆఫీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలియజేశారు.
ప్రైవేట్ ఈక్విటీ రంగంలో ఏఐ సాధనాలను ఉపయోగించిన మొట్టమొదటి అతిపెద్ద భారతీయ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ నిలిచింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ క్వాంట్ మోడల్‌పై పని చేస్తోందని మేనేజింగ్ పార్ట్‌నర్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ టీకే కురియన్ తెలిపారు. అధికరాబడుల కోసం ఏఐటూల్స్‌ను వినియోగిస్తూ ఆయా కంపెనీల్లో తన పెట్టుబడులను సైతం పెంచుకోవాలనుకుంటుందని ఆయన చెప్పారు.
బ్లాక్‌రాక్ ఇంక్., సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సంస్థలు మార్కెట్‌లోని డేటా స్ట్రీమ్‌లను విశ్లేషించడానికి ఏఐపై ఆధారపడుతున్నాయి. దాంతోపాటు ఈ రంగంలో మరింత పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేమ్‌జీఇన్వెస్ట్ మూడేళ్ల క్రితం ఏఐ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దానికోసం ఏఐ ఇంజినీర్లను నియమించుకుంది. అదే సమయంలో ఏఐ ఇన్వెస్ట్‌మెంట్ టూల్స్ తయారుచేసే సంస్థలకు మద్దతుగా నిలవడం మొదలుపెట్టినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్‌లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించడానికి 600 పారామీటర్లను విశ్లేషించేందుకు ఏఐ సహాయం చేస్తోందని కురియన్ అన్నారు. ఈ కసరత్తు వల్ల తోటివారి కంటే ముందంజలో ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కోహెసిటీ ఇంక్-డేటా మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, లండన్‌లోని ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ-హోలిస్టిక్ ఏఐ, ఇకిగాయ్, ఫిక్సిస్ వంటి ప్రముఖ కంపెనీలకు ప్రేమ్‌జీఇన్వెస్ట్ సేవలందిస్తోందని తెలిసింది. దేశంలో అధికంగా పోగవుతున్న కోర్టు కేసులను వేగంగా పరిష్కరించడానికి ఉపయోగపడే ఏఐను అభివృద్ధి చేసేందుకు సంస్థ సహకరిస్తుందని కురియన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment