సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మితమవుతున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు అవసరమైన ప్రధాన భాగం (సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్) దేశీయంగా సిద్ధమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వీఈఎం టెక్నాలజీస్‌లో తయారైన తొలి సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్‌ను సోమవారం తేజస్ రూపొందిస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు అందజేశారు. వీఈఎం టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు చేతుల మీదుగా తొలి యూనిట్ దస్తావేజులను హెచ్‌ఏఎల్ సీఎండీ ఆర్.మాధవన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కేంద్రం ఇటీవల ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని హెచ్‌ఏఎల్ 2011లోనే ప్రారంభించిందని పేర్కొన్నారు. తేజస్‌లోని ప్రధాన భాగాలను ఐదు ప్రైవేట్ కంపెనీలు చేపట్టాయని, మధ్య భాగమైన సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్ తయారీని వీఈఎం టెక్నాలజీస్ తక్కువ సమ యంలో పూర్తి చేసిందని కొనియాడారు. ఎల్‌సీఏ మార్క్–1 కోసం మొత్తం 83 యూనిట్లు అవసరం కాగా, కొన్ని మార్పులతో ఎల్‌సీఏ మార్క్–2 కోసం మరో 120 యూనిట్ల అవసరమని చెప్పారు. నావికాదళం, ఇతర విమానాల కోసం మరో 100 యూనిట్లు కావాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment