Fighter aircraft
-
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి
జైపూర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం గాల్లో దూసుకెళ్తుండగా అనూహ్యమైన సంఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో పలురకాల వైమానిక సామగ్రి జారిపడింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. యుద్ధ విమానం అనుకోకుండా నిర్మానుష్య ప్రాంతంలో సామగ్రిని జారవిడిచినట్లు అధికారులు తెలియజేశారు. ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జారిపడిన సామగ్రి ఏమిటన్నది బయటపెట్టలేదు. సైనిక భాషలో బాంబు, క్షిపణులు, ఆయుధాలు, చమురు ట్యాంక్‌లను కూడా వైమానిక సామగ్రిగా పిలుస్తుంటారు. -
రహదారే.. రన్‌వే.. జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, బాపట్ల/అద్దంకి/మేదరమెట్ల: నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే 16వ నంబర్ జాతీయ రహదారి.. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో కొంతసేపు నిర్మానుష్యంగా మారింది. ఆ వెంటనే సరిగ్గా 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు వరుసగా ఒకదాని వెంట ఒకటిగా దూసుకువచ్చాయి. స్థానికులు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా.. రెండు యుద్ధ విమానాలు రహదారిని తాకగా.. మరో రెండు అతి సమీపంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయాయి. అంతే అక్కడ ఉన్న వైమానిక దళ అధికారులు, సిబ్బంది, పోలీసులు చప్పట్లతో తమ సంతోషం వ్యక్తం చేశారు. అత్యవసర ల్యాండింగ్ కోసం.. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి–16పై రేణింగివరం నుంచి మేదరమెట్లకు వెళ్లే దారిలో పి.గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల పొడవున, 33 మీటర్ల వెడల్పుతో ల్యాండింగ్ స్ట్రిప్ నిర్మించారు. గతంలో ఒకసారి దీనిపై ట్రయల్ రన్ నిర్వహించారు. తాజాగా సోమవారం మరోసారి ఈ స్ట్రిప్‌పై బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళం ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు రన్‌వే స్ట్రిప్‌పై ఎగురుతూ వెళ్లాయి. 11.05 గంటల నుంచి 11.06, 11.07 గంటల సమయంలో రెండు విమానాలు ఐదు అడుగుల ఎత్తులో రన్‌వేపై వెళ్లాయి. ఆ తర్వాత 11.19 గంటలకు ఒకటి, 11.24 గంటలకు మరొకటి ఎయిర్ స్ట్రిప్‌ను తాకుతూ(డెడ్‌లైన్)లో వెళ్లాయి. 11.28 గంటలకు సుఖోయ్–30, హాక్ విమానాలు రెండు అతి తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏఎన్–32 ట్రాన్స్‌పోర్టు విమానం ల్యాండ్ అయ్యింది. ఇదే విమానం ఎయిర్ స్ట్రిప్‌పై కొంతదూరం నెమ్మదిగా వెళ్లి.. 12.08కి టేకాఫ్ తీసుకుంది. డారి్నయర్ ట్రాన్స్‌పోర్టు విమానం 12.30 గంటలకు ల్యాండ్ అయ్యి.. 12.39 నిమిషాలకు విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. దీంతో వైమానిక దళ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఏర్పాట్లు.. యుద్ధ విమానాల ల్యాండింగ్ నేపథ్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. పోలీస్ బలగాలు, సాయుధ మిలటరీ బలగాలు, వైమానిక దళానికి చెందిన ప్రత్యేక ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేశారు. అలాగే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టేషన్ నుంచి వైమానిక దళ అధికారులు విమానాలకు మార్గనిర్దేశం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు వైమానిక దళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ‘వరదలు, భూకంపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, తీర ప్రాంతాల్లో చొరబాటుదారులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ల్యాండ్ చేయడానికి అనువుగా జాతీయ రహదారి–16పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్లో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా ట్రయల్‌రన్ విజయవంతమైంది’ అని చెప్పారు. కార్యక్రమంలో వైమానిక దళ అధికారులు ఏవీఎం కుకరేజ్, జేపీ యాదవ్, విజయ్, ఎస్పీ వకుల్ జిందాల్, అడిషనల్ ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్, జేసీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏరో షోలో అమెరికా బాంబర్ జెట్ బీ1బీ
బెంగళూరు: బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా గగనతలంలో ప్రత్యేక అతిథి వచ్చి చక్కర్లు కొట్టింది. అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం బీ–1బీ లాన్సర్ బాంబర్ జెట్ మంగళవారం బెంగళూరు శివారులోని యెలహంక ఎయిర్‌బేస్ వినువీధులో వీక్షకులకు కనువిందు చేసింది. అమెరికా సుదూర గగనతల లక్ష్యాలను చేధించడంలో వాయుసేనకు వెన్నుముకగా నిలుస్తున్నందుకు గుర్తుగా దీనిని ‘ది బోన్’ అని పిలుస్తారు. ‘ ఇరు దేశాల వైమానిక దళాల అద్భుత అంతర్గత సంయుక్త నిర్వహణ వ్యవస్థకు బీ–1బీ బాంబర్ సానుకూలతను మరింత పెంచింది’ అని అమెరికా ఎయిర్‌ఫోర్స్ మేజర్ జనరల్ జూలియన్ చీటర్ వ్యాఖ్యానించారు. ‘ భారత్, అమెరికా రక్షణ భాగస్వామ్యం మరింతగా బలోపేతమవుతోంది. సంయుక్తంగా పనిచేస్తే రెండు దేశాల సైన్యాలు ఇంకా శక్తివంతమవుతాయి’ అని ఢిల్లీలో అమెరికా ఎంబసీలో ఆ దేశ రియర్ అడ్మిరల్ మైఖేల్ బేకర్ అన్నారు. కాగా, సోమవారం అమెరికా ఐదోతరం సూపర్సోనిక్ ఎఫ్–35ఏ యుద్ధ విమానం ఈ వైమానిక ప్రదర్శనలో పాలుపంచుకున్న విషయం విది తమే. ఎఫ్35ఏ భారత్‌లో ల్యాండ్ అవడం ఇదే తొలిసారికావడం విశేషం. బీ–1బీ బాంబర్ మాత్రం 2021 ఫిబ్రవరిలోనూ ఎయిర్‌షోలో పాల్గొంది. -
రహదారులే రన్వేలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లాలో జాతీయ రహదారి–925ఏపై సిద్ధం చేసిన సట్టా–గాంధవ్ స్ట్రెచ్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి రహదారి ఇదే. యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి వీలుగా కొన్ని జాతీయ రహదారుల్లో మార్పులు చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. సట్టా–గాంధవ్ స్ట్రెచ్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 19 నెలల్లో అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నా«థ్‌సింగ్, గజేంద్రసింగ్ షెకావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ఎస్ బదౌరియాలతో కూడిన సి–130జే యుద్ధ విమానం ఈ స్ట్రెచ్‌పై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. వాయుసేన ఈ డ్రిల్‌ను చేపట్టింది. అనంతరం సుఖోయ్–30ఎంకేఐ ఫైటర్ జెట్, ఏఎన్–32 మిలటరీ రవాణా విమానం, ఎంఐ–17వీ5 హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు మార్గాల్లో.. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఈ తరహా స్ట్రెచ్ నిర్మించడం ద్వారా దేశ ఐక్యత, వైవిధ్యం, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఎంత ఖర్చయినా వెనకాడం అనే సందేశాన్ని ఇచ్చినట్లు అయ్యిందని రక్షణ మంత్రి రాజ్నా«థ్ అన్నారు. ఎన్నో హెలిప్యాడ్ల నిర్మాణంలో జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. రోడ్లపై అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం యుద్ధ సమయాల్లోనే కాకుండా విపత్తుల సమయంలోనూ ఉపకరిస్తుందని తెలిపారు. రక్షణపరమైన మౌలిక సదుపాయాల బలోపేతంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని అభివర్ణించారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... సైన్యానికి జాతీయ రహదారులు సైతం ఉపకరించడం దేశాన్ని మరింత సురక్షితం చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు–ఒంగోలు, ఒంగోలు–చిలకలూరిపేట మార్గాలను ఈ దిశగా అభివృద్ధి చేయనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో కొరిశపాడు ఫ్లైఓవర్ నుంచి రేణంగివరం ఫ్లైఓవర్ వరకు రన్‌వే నిర్మాణంలో ఉంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సట్టా–గాంధవ్ మార్గంతోపాటు గగారియా–బఖాసర్ మార్గాన్ని రూ.765.52 కోట్లతో అభివృద్ధి చేశారు. అత్యవసర సమయాల్లోనే విమానాల ల్యాండింగ్ కోసం ఉపయోగిస్తారు. దీంతోపాటు కుందన్‌పురా, సింఘానియా, బఖాసర్‌లో మూడు హెలిప్యాడ్లను నిర్మించారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్లు, రవాణా విమానాలను ప్రయోగాత్మకంగా లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ మార్గంపై అత్యవసర ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయ జంక్షన్ వద్ద సిద్ధమవుతున్న రన్‌వే -
తేజస్ ప్రధాన విడి భాగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మితమవుతున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు అవసరమైన ప్రధాన భాగం (సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్) దేశీయంగా సిద్ధమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వీఈఎం టెక్నాలజీస్‌లో తయారైన తొలి సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్‌ను సోమవారం తేజస్ రూపొందిస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు అందజేశారు. వీఈఎం టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు చేతుల మీదుగా తొలి యూనిట్ దస్తావేజులను హెచ్ఏఎల్ సీఎండీ ఆర్.మాధవన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కేంద్రం ఇటీవల ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని హెచ్ఏఎల్ 2011లోనే ప్రారంభించిందని పేర్కొన్నారు. తేజస్‌లోని ప్రధాన భాగాలను ఐదు ప్రైవేట్ కంపెనీలు చేపట్టాయని, మధ్య భాగమైన సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్ తయారీని వీఈఎం టెక్నాలజీస్ తక్కువ సమ యంలో పూర్తి చేసిందని కొనియాడారు. ఎల్సీఏ మార్క్–1 కోసం మొత్తం 83 యూనిట్లు అవసరం కాగా, కొన్ని మార్పులతో ఎల్సీఏ మార్క్–2 కోసం మరో 120 యూనిట్ల అవసరమని చెప్పారు. నావికాదళం, ఇతర విమానాల కోసం మరో 100 యూనిట్లు కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
వచ్చే ఏడాదిలో తేజస్ మార్క్–2
న్యూఢిల్లీ: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బహుళ ప్రయోజక యుద్ధ విమానం తేజస్ సరికొత్త రూపంతో వచ్చే ఏడాదిలో తయారవుతుందని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సీఎండీ ఆర్.మాధవన్ వెల్లడించారు. తేజస్ మార్క్–2లో మరింత శక్తివంతమైన ఇంజిన్, ఎక్కువ బరువులు మోసే సామర్థ్యం, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంటాయని వివరించారు. తేజస్ మార్క్–2 తయారీ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయనీ, 2023లో హైస్పీడ్ ట్రయల్స్ మొదలవుతాయన్నారు. 2025 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొత్త వెర్షన్ జెట్ మరింత పెద్దదిగా ఉండటంతోపాటు ఎక్కువ దూరం ప్రయాణించలగలదనీ, నిర్వహణ కూడా మరింత తేలిగ్గా ఉంటుందన్నారు. హెచ్ఏఎల్ తయారు చేసిన తేజస్ మార్క్–1ఏ రకం 73 జెట్ విమానాలను రూ.48 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జనవరి 13న అంగీకారం తెలిపిందన్నారు. వీటి ఉత్పత్తి 2028 వరకు కొనసాగుతుందని చెప్పారు. మార్క్–2 జెట్ల తయారీ 2025 మొదలై 6 నుంచి 8 ఏళ్ల నడుస్తుందన్నారు. దీంతోపాటు, 5 బిలియన్ డాలర్ల మేర ఖర్చయ్యే 5వ తరం మీడియం ఫైటర్ జెట్ విమానం తయారీపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దీని నమూనా 2026 వరకు సిద్ధమవుతుందనీ, ఉత్పత్తి 2030 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హెచ్ఏఎల్, డీఆర్డీవోతోపాటు మరో రెండు ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశాలున్నాయని మాధవన్ తెలిపారు. ఇందులో రూ.2,500 కోట్ల పెట్టుబడి ప్రైవేట్ సంస్థలది కాగా, మిగతాది తాము భరిస్తామన్నారు. చైనా జేఎఫ్–17 యుద్ధ విమానం కంటే తేజస్ మార్క్–1ఏ జెట్ ఎంతో మెరుగైందని ఆయన వివరించారు. ఇంజిన్, రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలతోపాటు సాంకేతికత పరంగా కూడా చైనా జెట్ కంటే మంచి పనితీరు కనబరుస్తుందని చెప్పారు. -
సీ హారియర్ చూసొద్దాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అందమైన బీచ్ రోడ్డులో సరదాగా ముందుకెళ్తుంటే.. సాగర గర్భంలో శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సబ్‌మెరైన్ దర్శనమిస్తుంది. యుద్ధ సమయంలో గగనతలాన్ని గడగడలాడించిన టీయూ–142 విమానం కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కనే మరో యుద్ధ విమాన మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) సన్నాహాలు చేస్తోంది. విశాఖ నగరాన్ని నంబర్ వన్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా బీచ్ రోడ్డులో రూ.40 కోట్లతో సీ హారియర్ యుద్ధ విమాన మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు వీఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. సిద్ధంగా.. సీ హారియర్ ► ఆర్కే బీచ్‌లో టీయూ–142 ఎయిర్ క్రాఫ్ట్ సందర్శకులను అలరిస్తోంది. కురుసుర జలాంతర్గామి వీక్షకుల మనసు దోచుకుంటోంది. ► సాగర తీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్ యుద్ధ విమానం సన్నద్ధమవుతోంది. 1983లో బ్రిటిష్ ఏరో స్పేస్ నుంచి కొనుగోలు చేసిన సీ హారియర్ నౌకాదళం ఏవియేషన్ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్ఎస్ హన్సా యుద్ధనౌకలో దాదాపు 32 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి నిష్క్రమించింది. ► దీనిని వీఎంఆర్డీఏ సాగర తీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజీవ్ స్మృతి భవన్లో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్ కోర్టులు.. షాపింగ్ కాంప్లెక్స్‌లు రూ.10 కోట్లతో ఈ మ్యూజియం అభివృద్ధి చేయనున్నారు. మరో రూ.10 కోట్లతో సబ్‌మెరైన్ మ్యూజియంకు సరికొత్త హంగులు అద్దనున్నారు. మరో రూ.20 కోట్లతో ఫుడ్ కోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు వీఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ► ప్రస్తుతం ఉన్న టీయూ–142, కురుసుర మ్యూజియంతో పాటు సీ హారియర్‌ను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా రూపొందిస్తారు. ► దీనికి సంబంధించి ప్రాజెక్టు నివేదికను తూర్పు నౌకాదళం సిద్ధం చేసింది. మొత్తంగా రూ.40 కోట్ల అంచనా వ్యయంతో బీచ్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం అందుబాటులోకి రానుంది. ► రాజీవ్ స్మృతి భవన్ ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో ఉంది. దీన్ని వీఎంఆర్డీఏకు అప్పగించిన వెంటనే టెండర్లకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. సరికొత్త బీచ్‌ను చూస్తారు మూడు ప్రధాన మ్యూజియంలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. సీ హారియర్ మ్యూజియం అందుబాటులోకి వచ్చాక.. ప్రతి సందర్శకుడూ బీచ్‌ను సరికొత్తగా చూస్తారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తాం. – పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు..!
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వన్ లోయపై పొరుగు దేశం చైనా ఆక్రమణకు దిగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో చైనా ఆగడాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది. తన అమ్ములపొదిలో దాగిఉన్న అస్త్రాలను బయటకు తీస్తోంది. భారత సైన్యంలో కీలకమైన సుఖోయ్-300 ఎయ్కేఐ, మిగ్-29, జాగ్వార్ ఫైట్ జెట్స్‌ను రంగంలో దింపింది. అలాగే అమెరికా నుంచి దిగుమతి చేసుకుని అత్యాధునికమైన యుద్ధ విమానం అపాచీలను సైతం చైనా సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీనగర్, అవంతిపుర, లేహ్ ప్రాంతాల్లో చైనా చొరబాట్లను పసిగట్టేందుకు వాయు సేనను సైతం సన్నద్ధం చేసింది. మరోవైపు హిందు మహాసముద్ర తీరంలో నౌకాదళాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత వైమానిక దళాధిపతి చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా గురు, శుక్రవారాల్లో లేహ్, శ్రీనగర్‌ల్లో పర్యటించారు. సరిహద్దుల్లో ఎయిర్‌ఫోర్స్ సన్నద్ధతను పరిశీలించారు. (వాయుసేన.. సిద్ధంగా ఉండాలి) మరోవైపు భారత్‌కు ధీటుగా చైనా సైతం భారీగా సైన్యాన్ని, యుద్ధ విమానాలను సరిహద్దుకు తరలిస్తోంది. వీటి గర్జనలు, సైనికుల కవాతుతో చల్లని హిమాలయ కొండలు వేడెక్కుతున్నాయి. పాంగాంగ్ సరస్సు సమీపంలో డ్రాగన్ సైనిక క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారత్ సైతం మొత్తం 3400 కిమీ గల సరిహద్దుల్లో ఆర్మీని అప్రమత్తం చేసినట్లు సైనిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇరు దేశాలు సైనిక దళాలను సరిహద్దుల్లోకి తరలిస్తుండటంతో యుద్ధ వాతావరణం కనబడుతోంది. అయితే సైనిక సన్నద్ధపై మాత్రం కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) కాగా ఈనెల 15 జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ చీఫ్ భారత్-చైనా సరిహద్దుల్లో పర్యటించారు. మరోవైపు సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చైనా దురాక్రమనకు దిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ క్లిష్ట సమయంలో అన్ని పక్షాలు కేంద్ర ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మద్దతుగా నిలవాలని మోదీ పిలుపునిచ్చారు. ఇంచు భూభాగం కూడా వదలుకునే ప్రసక్తే లేదని మోదీ ప్రకటించారు. ఇక ప్రధాని మోదీ ప్రకటకపై చైనా ఘాటుగా స్పందించింది. గాల్వన్ లోయ ముమ్మాటికీ చైనాలో అంతర్భాగమేనని మరోసారి ఘంటాపథంగా స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం మరో ప్రకటన విడుదల చేసింది. భారత ఆర్మీ వాదిస్తున్నట్లు గాల్వన్ లోయ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి అవతలవైపు లేదని, తమ భూభాగంలోనే ఉందని పేర్కొంది. అంతేకాకుండా భారతకు చెందిన పదిమంది జవాన్లను చైనా నిర్బంధించిందంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, తమ కస్టడీలో ఎవరూ లేరని స్పష్టం చేసింది. -
ఏరో ఇండియా - 2019 ప్రదర్శనలో తేజోస్
-
అమెరికా అణుబాంబు పరీక్ష విజయవంతం
అల్బక్వెర్క్యు: ఆధునీకరించిన ‘బీ61–12’అణుబాంబు తొలి పరీక్ష విజయవంతమైనట్టు శాండియా నేషనల్ లేబొరేటరీస్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. గత మాసంలో నెల్లిస్ వైమానిక స్థావరానికి చెందిన ఎఫ్–16 యుద్ధ విమానం నుంచి నెవేడా ఎడారి ప్రాంతంలో ఈ బాంబును వదిలారు. ‘బాంబు డిజైన్, దాన్ని మోసుకెళ్లిన యుద్ధవిమానం... అన్నీ సరిగ్గా అమరి పరీక్ష విజయవంతమైంది’అని శాండియా స్టాక్‌పైల్ రిసోర్స్ సెంటర్ ఓ ప్రకటనలో పేర్కొంది. 2020 నాటికి బీ61–12 ప్రాజెక్ట్ పూర్తికావాల్సి ఉంది. రాబోయే మూడేళ్లలో మరిన్ని ప్రయోగ పరీక్షలు జరుపుతామని శాండియా తెలిపింది. -
వాయుసేనకు ‘తేజస్’
ఐఏఎఫ్‌లోకి రెండు తేజస్ ఫైటర్ జెట్లు - గగన దళానికి పెరిగిన బలం - తేజస్‌తో బెంగళూరు హెచ్ఏఎల్లో విన్యాసాలు - ఏడాది చివరికల్లా మరో ఆరు తేజస్‌లు సిద్ధం సాక్షి, బెంగళూరు: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి తేలికపాటి యుద్ధ విమానం(లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్-ఎల్సీఏ) ‘తేజస్’ ఎట్టకేలకు భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లోకి అధికారికంగా ప్రవేశించింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) రెండు తేజస్ ఫైటర్ జెట్లను లాంఛనంగా వైమానిక దళానికి అందజేసింది. సర్వమత ప్రార్థనల అనంతరం హెచ్ఏఎల్ జనరల్ మేనేజర్ శ్రీధరన్.. ఎయిర్ మార్షల్ జస్బీర్ వాలియాకు రెండు తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించిన పత్రాలతో పాటు విమాన నమూనాను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టం టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్(ఏఎస్‌టీఈ) ఆవరణలో 1,100 మీటర్ల ఎత్తులో గంటకు 900 కిలోమీటర్ల వేగంతో గ్రూప్ కెప్టెన్మాధవ్ రంగాచారి ఈ యుద్ధవిమానంతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తేజస్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేసి వైమానిక దళంలోకి ప్రవేశపెట్టేందుకు సుమారు 33 ఏళ్లు పట్టింది. వాయుసేనలోకి 45 స్క్వాడ్రాన్లోకి తేజస్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. 33 ఏళ్ల నిరీక్షణ.. ► స్వదేశీ పరిజ్ఞానంతో తేలికపాటి యుద్ధ విమానాన్ని రూపొందించాలనే ఆలోచన 1970ల్లోనే మొదలైనా.. తొలిసారిగా 2001లో ఇది గాల్లోకి ఎగిరింది. ►1998లో అణుపరీక్షల తర్వాత దేశంపై ఆంక్షలు విధించడంతో ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎక్కువ సమయం తీసుకుంది. ►తేజస్ ఫైటర్ జెట్.. సింగిల్ సీట్, సింగిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గగనతలం నుంచి గగనతల, భూఉపరితల లక్ష్యాలను ఛేదిస్తుంది. ►మిగ్ 21 యుద్ధ విమానాలకు ఇది ప్రత్యామ్నాయం. సుమారు నాలుగు టన్నుల పేలుడు పదార్థాలను/బాంబులను మోసుకుపోగలదు. ► ఈ ఏడాది చివరికి మరో ఆరు తేజస్ యుద్ధ విమానాలు సిద్ధం. 2018 నాటికి వైమానిక దళంలో మరో 20 తేజస్‌లు. ► హెచ్ఏఎల్కు ఏడాదికి 16 తేజస్‌లను తయారుచేసే సామర్థ్యం. తేజస్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న పొరుగు దేశాలు. ► ఒక్కో తేజస్ తయారీకి అయ్యే ఖర్చు రూ.220 కోట్లు. దేశానికి గర్వకారణం: మోదీ వైమానిక దళంలోకి తేజస్ చేరికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తేజస్ దేశానికి గర్వకారణమని, తేజస్ చేరిక భారత శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని ట్విటర్లో కొనియాడారు. భారత వైమానిక దళం శక్తి సామర్థ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తేజస్ తోడ్పడుతుందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ట్వీట్ చేశారు. తేజస్ విశేషాలు... ►1983లో తేజస్ విమానాల ప్రాజెక్టును ప్రారంభించారు. ►తేజస్ విమానాన్ని తొలిసారి 2001 జనవరి 4న పరీక్షించారు. ► గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి భూతలం, గగనతలం నుంచి సముద్రంపై లక్ష్యాలను చేధించేలా డిజైన్ చేశారు. ► పొడవు 13.7 మీటర్లు. ఎత్తు 4.4 మీటర్లు. రెక్కల వెడల్పు 8.3 మీటర్లు. 1.6 రెట్ల శబ్దవేగంతో దూసుకెళ్లగలదు. జీఈ-ఎఫ్414-ఐఎన్ఎస్6 ఇంజన్. ► ఈ తరహా సూపర్సోనిక్ యుద్ధవిమానాల్లో అత్యంత చిన్నది, తేలికైనది. ► దేశీయంగా డిజైన్, అభివృద్ధి, తయారైన తొలి సెమీ-ఆటోమేటిక్ విమానం. ► ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధిచేశాయి. రెండోరోజూ క్షిపణి పరీక్ష విజయవంతం బాలసోర్ (ఒడిశా): భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన మధ్య శ్రేణి ఉపరితలం నుంచి గగనతలం క్షిపణిని ఒడిశాలోని బాలసోర్‌లో శుక్రవారం మరోసారి పరీక్షించారు. గురువారం నాటి రెండు పరీక్షలలాగే శుక్రవారం జరిపిన మూడో పరీక్ష కూడా విజయవంతమైంది. రెండు వరుస రోజుల్లో మూడుసార్లు క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) హ్యాట్రిక్ నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 3వ లాంచ్‌ప్యాడ్ నుంచి దీన్ని పరీక్షించారు. బంగాళాఖాతం సముద్రంలో వెళ్తోన్న మానవ రహిత విమానాన్ని టార్గెట్‌గా నిర్ణయించారు. విమానం గురించి రాడార్ నుంచి సంకేతాలను అందుకున్న క్షిపణి, విమానాన్ని ఢీకొట్టి పరీక్షను విజయవంతం చేసింది. 70 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. బహుళ ప్రయోజనకారి అయిన ఈ క్షిపణి, నిఘా పరికరంగా కూడా పనిచే స్తుంది. వైమానిక దాడులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. దీన్ని హైదరాబాద్‌లోని డీఆర్డీవో ప్రయోగ శాలలో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో కలిసి అభివృద్ధి చేశారు. తేజస్‌ను నడపటం ఆనందంగా ఉంది: కెప్టెన్ రంగాచారి ‘స్వదేశీ తయారీ ఫైటర్ జెట్‌ను తొలిసారి నడిపే అవకాశం రావటం గౌరవంగా భావిస్తున్నాను. చాలా తేలికైన ఈ ఫైటర్ జెట్‌లో ప్రయాణించటం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రపంచంలోని ఇతర యుద్ధవిమానాలకంటే ఇది ఓ తరం ముందుగానే ఉందనటంలో సందేహం లేదు. దీన్ని ఏ ఇతర యుద్ధ విమానంతోనూ పోల్చలేం.’ -
ఇంధన ఉత్పత్తిలో ఎన్ఎఫ్సీ ప్రపంచ రికార్డు
ఎన్ఎఫ్సీ చైర్మన్ డాక్టర్ సాయిబాబా సాక్షి, హైదరాబాద్: అతుకుల్లేని గొట్టాల తయారీలో ఉన్నతస్థాయి నైపుణ్యం సాధించిన ఎన్ఎఫ్సీ యురేనియం ఇంధన బండిళ్ల తయారీలోనూ ప్రపంచ రికార్డు సాధించిందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్ చైర్మన్ డాక్టర్ ఎన్. సాయిబాబా తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కెనడా ఏడాదికి 100 టన్నులు, జనరల్ ఎలక్ట్రిక్ 1,000 టన్నుల చొప్పున యురేనియం ఇంధన బండిళ్లను తయారు చేస్తుండగా, ఎన్ఎఫ్సీ 2015-16కుగాను 1,503 టన్నుల యురేనియం ఇంధన బండిళ్లను ఉత్పత్తి చేసిందని వివరించారు. దేశంలోని అణురియాక్టర్లన్నింటికీ ఏటా 750 టన్నుల ఇంధన బండిళ్లు అవసరం కాగా.. ఎన్ఎఫ్సీ ఈ ఏడాది ఇందుకు రెట్టింపు ఉత్పత్తి సాధించిందని సాయిబాబా చెప్పారు. ఎన్ఎఫ్సీ స్థాపిత సామర్థ్యం వంద టన్నులు మాత్రమే అయినా.. ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అలవర్చుకోవడం, తయారీ విధానాలకు మెరుగులు దిద్దడం ద్వారా అదనపు ఉత్పత్తి సాధించగలుగుతున్నామని చెప్పారు. ఎన్ఎఫ్సీ ఆధ్వర్యంలో ఖండాంతర క్షిపణి బ్రహ్మోస్‌లో ఉపయోగించే కీలకమైన గొట్టాలతోపాటు, ఇస్రో మూన్ మిషన్‌కు అవసరమైన ప్రత్యేక లోహాన్ని అభివృద్ధి చేయగలిగామన్నారు. తేలికపాటి యుద్ధ విమానం తేజస్, పృథ్వీ, నాగ్ క్షిపణులు, అణుజలాంతర్గామిలో ఉపయోగించే వేర్వేరు లోహపు గొట్టాలను ఎన్ఎఫ్సీ తయారు చేస్తోందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 180 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంటే అందులో అణుశక్తి వాటా మూడు శాతం మాత్రమేనని అన్నారు. అయితే, వచ్చే ఆరేళ్లలో ఏర్పాటు కానున్న కొత్త అణు రియాక్టర్లతో ఇది మరింత పెరుగుతుందని, 2030 నాటికల్లా మొత్తం 220 గిగావాట్ల విద్యుదుత్పత్తిలో 40 గిగావాట్లు అణుశక్తి ద్వారా అందుతుందని అన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే అన్ని అణురియాక్టర్లను పరిగణనలోకి తీసుకుంటే 2030 నాటికి దాదాపు 2,800 టన్నుల అణు ఇంధనం అవసరమవుతుందని చెప్పారు. -
సుఖోయ్ నుంచి ‘అస్త్ర’ పరీక్షలు విజయవంతం
సాక్షి, హైదరాబాద్: గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల అస్త్ర క్షిపణిని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధవిమానం నుంచి భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం గోవా సమీపంలోని నావికాదళ స్థావరంపై ఆకాశంలో 6 కి.మీ. ఎత్తులో ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలో క్షిపణి నియంత్రణ, మార్గదర్శకత్వం అన్నీ విజయవంతం అయ్యాయని, క్షిపణి తన లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని పేర్కొన్నారు. జూన్ 9న కూడా అస్త్ర క్షిపణి సామర్థ్య నిర్ధారణకు చేపట్టిన పరీక్ష కూడా విజయవంతమైందని, తాజా పరీక్షతో మరోసారి క్షిపణి సత్తా చాటినట్లైందన్నారు. కాగా, అస్త్ర బీవీఆర్ఏఏఎం(బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిసైల్) ను అభివృద్ధిపర్చడంలో భాగంగా ఈ పరీక్షను విజయవంతం చేసిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు, వాయుసేన బృందానికి రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు, డీఆర్డీవో డెరైక్టర్ జనరల్ అవినాశ్ చందర్ అభినందనలు తెలియజేశారు. -
ఆకట్టుకున్న నేవీ సిబ్బంది విన్యాసాలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: డొర్నియర్లు రొద చేసుకుంటూ గగనంలో దూసుకుపోతుంటే... సముద్రంలోని యుద్ధనౌకల నుంచి హఠాత్తుగా బాంబుల మోత మోగితే... ఆకాశం నుంచి గ్లైడర్లు భూమిపైకి దూసుకువస్తుంటే... ఏదో ఉపద్రవం ముంచికొచ్చినట్లే. అయితే ఈ యుద్ధ సన్నివే శాలు శుక్రవారం సాగరతీరంలో చోటుచేసుకున్నాయి. ఇవన్నీ నేవీ డే వేడుకల్లో భాగంగా పూర్తిస్థాయిలో జరిగిన రిహార్సల్స్. డిసెంబర్ 4న నేవీ డే వేడుకల్లో భాగంగా యుద్ధ సన్నివేశాల్ని తూర్పు నావికా దళం సాగరతీరంలో ఓసారి నిర్వహించి సరిచూసుకుంది. సముద్రంలోనే బంకర్లును ఏర్పాటు చేసింది. వాటిని సముద్రంలో ప్రయాణిస్తున్న యుద్ధనౌకల నుంచే పేల్చేయడం...హఠాత్తుగా యుద్ధ విమానం నుంచి నావికుడు కిందకి దిగి సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించడం...ఆకాశంలోంచి త్రివర్ణాలతో స్క్రైడైవర్ భూమ్మీదకు దిగడం వంటి విన్యాసాలు సాగర తీరానికి విహారానికి వచ్చిన వారిని అబ్బురపరిచాయి.