బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ సందర్భంగా సుఖోయ్ విన్యాసం
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ సక్సెస్
ట్రయల్ రన్ వేసిన సుఖోయ్ 30, హాక్, ఏఎన్–32, డార్నియర్ విమానాలు
పటిష్ట భద్రత మధ్య విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ సంతోషం వ్యక్తం చేసిన వైమానిక దళ అధికారులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల/అద్దంకి/మేదరమెట్ల: నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే 16వ నంబర్ జాతీయ రహదారి.. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో కొంతసేపు నిర్మానుష్యంగా మారింది. ఆ వెంటనే సరిగ్గా 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు వరుసగా ఒకదాని వెంట ఒకటిగా దూసుకువచ్చాయి. స్థానికులు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా.. రెండు యుద్ధ విమానాలు రహదారిని తాకగా.. మరో రెండు అతి సమీపంలో చక్కర్లు కొట్టి వెళ్లిపోయాయి. అంతే అక్కడ ఉన్న వైమానిక దళ అధికారులు, సిబ్బంది, పోలీసులు చప్పట్లతో తమ సంతోషం వ్యక్తం చేశారు.
అత్యవసర ల్యాండింగ్ కోసం..
యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి–16పై రేణింగివరం నుంచి మేదరమెట్లకు వెళ్లే దారిలో పి.గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల పొడవున, 33 మీటర్ల వెడల్పుతో ల్యాండింగ్ స్ట్రిప్ నిర్మించారు. గతంలో ఒకసారి దీనిపై ట్రయల్ రన్ నిర్వహించారు. తాజాగా సోమవారం మరోసారి ఈ స్ట్రిప్‌పై బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళం ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం 11.03 గంటలకు నాలుగు యుద్ధ విమానాలు రన్‌వే స్ట్రిప్‌పై ఎగురుతూ వెళ్లాయి. 11.05 గంటల నుంచి 11.06, 11.07 గంటల సమయంలో రెండు విమానాలు ఐదు అడుగుల ఎత్తులో రన్‌వేపై వెళ్లాయి.
ఆ తర్వాత 11.19 గంటలకు ఒకటి, 11.24 గంటలకు మరొకటి ఎయిర్ స్ట్రిప్‌ను తాకుతూ(డెడ్‌లైన్)లో వెళ్లాయి. 11.28 గంటలకు సుఖోయ్–30, హాక్ విమానాలు రెండు అతి తక్కువ ఎత్తులో దూసుకెళ్లాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏఎన్–32 ట్రాన్స్‌పోర్టు విమానం ల్యాండ్ అయ్యింది. ఇదే విమానం ఎయిర్ స్ట్రిప్‌పై కొంతదూరం నెమ్మదిగా వెళ్లి.. 12.08కి టేకాఫ్ తీసుకుంది. డారి్నయర్ ట్రాన్స్‌పోర్టు విమానం 12.30 గంటలకు ల్యాండ్ అయ్యి.. 12.39 నిమిషాలకు విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. దీంతో వైమానిక దళ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
యుద్ధ విమానాల ల్యాండింగ్ నేపథ్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. పోలీస్ బలగాలు, సాయుధ మిలటరీ బలగాలు, వైమానిక దళానికి చెందిన ప్రత్యేక ఫైర్ ఇంజిన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టేషన్ నుంచి వైమానిక దళ అధికారులు విమానాలకు మార్గనిర్దేశం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు వైమానిక దళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ‘వరదలు, భూకంపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, తీర ప్రాంతాల్లో చొరబాటుదారులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో విమానాలు ల్యాండ్ చేయడానికి అనువుగా జాతీయ రహదారి–16పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్‌లో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా ట్రయల్‌రన్ విజయవంతమైంది’ అని చెప్పారు. కార్యక్రమంలో వైమానిక దళ అధికారులు ఏవీఎం కుకరేజ్, జేపీ యాదవ్, విజయ్, ఎస్పీ వకుల్ జిందాల్, అడిషనల్ ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్, జేసీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment