సుఖోయ్ నుంచి ‘అస్త్ర’ పరీక్షలు విజయవంతం
సాక్షి, హైదరాబాద్: గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల అస్త్ర క్షిపణిని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధవిమానం నుంచి భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం గోవా సమీపంలోని నావికాదళ స్థావరంపై ఆకాశంలో 6 కి.మీ. ఎత్తులో ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలో క్షిపణి నియంత్రణ, మార్గదర్శకత్వం అన్నీ విజయవంతం అయ్యాయని, క్షిపణి తన లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని పేర్కొన్నారు.
జూన్ 9న కూడా అస్త్ర క్షిపణి సామర్థ్య నిర్ధారణకు చేపట్టిన పరీక్ష కూడా విజయవంతమైందని, తాజా పరీక్షతో మరోసారి క్షిపణి సత్తా చాటినట్లైందన్నారు. కాగా, అస్త్ర బీవీఆర్‌ఏఏఎం(బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిసైల్) ను అభివృద్ధిపర్చడంలో భాగంగా ఈ పరీక్షను విజయవంతం చేసిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, వాయుసేన బృందానికి రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు, డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్ అవినాశ్ చందర్ అభినందనలు తెలియజేశారు.