సాక్షి, న్యూఢిల్లీ : గాల్వన్ లోయపై పొరుగు దేశం చైనా ఆక్రమణకు దిగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో చైనా ఆగడాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది. తన అమ్ములపొదిలో దాగిఉన్న అస్త్రాలను బయటకు తీస్తోంది. భారత సైన్యంలో కీలకమైన సుఖోయ్-300 ఎయ్‌కేఐ, మిగ్-29, జాగ్వార్ ఫైట్ జెట్స్‌ను రంగంలో దింపింది. అలాగే అమెరికా నుంచి దిగుమతి చేసుకుని అత్యాధునికమైన యుద్ధ విమానం అపాచీలను సైతం చైనా సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీనగర్, అవంతిపుర, లేహ్ ప్రాంతాల్లో చైనా చొరబాట్లను పసిగట్టేందుకు వాయు సేనను సైతం సన్నద్ధం చేసింది. మరోవైపు హిందు మహాసముద్ర తీరంలో నౌకాదళాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత వైమానిక దళాధిపతి చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా గురు, శుక్రవారాల్లో లేహ్, శ్రీనగర్‌ల్లో పర్యటించారు. సరిహద్దుల్లో ఎయిర్‌ఫోర్స్ సన్నద్ధతను పరిశీలించారు. (వాయుసేన.. సిద్ధంగా ఉండాలి)
మరోవైపు భారత్‌కు ధీటుగా చైనా సైతం భారీగా సైన్యాన్ని, యుద్ధ విమానాలను సరిహద్దుకు తరలిస్తోంది. వీటి గర్జనలు, సైనికుల కవాతుతో చల్లని హిమాలయ కొండలు వేడెక్కుతున్నాయి. పాంగాంగ్ సరస్సు సమీపంలో డ్రాగన్ సైనిక క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారత్ సైతం మొత్తం 3400 కిమీ గల సరిహద్దుల్లో ఆర్మీని అప్రమత్తం చేసినట్లు సైనిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇరు దేశాలు సైనిక దళాలను సరిహద్దుల్లోకి తరలిస్తుండటంతో యుద్ధ వాతావరణం కనబడుతోంది. అయితే సైనిక సన్నద్ధపై మాత్రం కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం)
కాగా ఈనెల 15 జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ చీఫ్ భారత్-చైనా సరిహద్దుల్లో పర్యటించారు. మరోవైపు సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చైనా దురాక్రమనకు దిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ క్లిష్ట సమయంలో అన్ని పక్షాలు కేంద్ర ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మద్దతుగా నిలవాలని మోదీ పిలుపునిచ్చారు. ఇంచు భూభాగం కూడా వదలుకునే ప్రసక్తే లేదని మోదీ ప్రకటించారు.
ఇక ప్రధాని మోదీ ప్రకటకపై చైనా ఘాటుగా స్పందించింది. గాల్వన్ లోయ ముమ్మాటికీ చైనాలో అంతర్భాగమేనని మరోసారి ఘంటాపథంగా స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం మరో ప్రకటన విడుదల చేసింది. భారత ఆర్మీ వాదిస్తున్నట్లు గాల్వన్ లోయ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి అవతలవైపు లేదని, తమ భూభాగంలోనే ఉందని పేర్కొంది. అంతేకాకుండా భారతకు చెందిన పదిమంది జవాన్లను చైనా నిర్బంధించిందంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, తమ కస్టడీలో ఎవరూ లేరని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment