బుధవారం లేహ్ నుంచి బయలుదేరిన భారత సైన్యానికి చెందిన చినూక్ హెలికాప్టర్
దుష్ట పన్నాగాల డ్రాగన్ దేశం ఒక వైపు చర్చలంటూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్‌పై ఒత్తిడి పెంచడానికి పాక్‌తో చేతులు కలిపింది. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు తూర్పు దిక్కున చైనా సైనికులు మోహరించి రంకెలు వేస్తూ ఉంటే, ఉత్తరాన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించి ఉరుముతోంది. ఎటు నుం చైనా ఎలాంటి విషమ పరిస్థితి ఎదురైనా రెండు దేశాలకు గట్టి బుద్ధి చెప్పడానికి భారత్ సన్నద్ధమైంది.
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో సంక్షోభ నివారణకు ఒక వైపు భారత్‌తో చర్చలు సాగిస్తూనే చైనా తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటోంది. భారత్‌పై ఒత్తిడి పెంచడానికి పాకిస్తాన్‌తో చేతులు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది. తూర్పు దిశగా తమ సైన్యం, ఉత్తరాన పాక్ సైన్యాన్ని మోహరించి, జమ్ము కశ్మీర్‌లో హింస రాజేసే ముక్కోణపు కుట్రకు డ్రాగన్ దేశం తెరతీసింది. ఉగ్రవాద సంస్థ అల్‌బదర్‌తో చైనా అధికారులు మంతనాలు సాగిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. లద్దాఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉత్తరం దిశగా గిల్గిట్ బాల్టిస్తాన్ సమీపంలో పాకిస్తాన్ 20 వేల మంది సైనికుల్ని మోహరించింది. ఈ ప్రాంతమంతా పాక్ రాడార్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు సమాచారం.
జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోకి వచ్చింది. అయితే ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో ఉంది. లద్దాఖ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పుదిక్కున చైనా 20 వేల మందికి పైగా సైనికుల్ని మోహరిస్తే, వాళ్లతో సరిసమానంగా పాకిస్తాన్ ఉత్తరం దిశగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇక చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మరో 10 నుంచి 12 వేల మంది సైనికులు సరిహద్దులకి వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉత్తర జిన్‌జియాంగ్ ప్రాంతంలో మోహరించారు. వారితో పాటు వాయువేగంతో పరుగులు తీసే వాహనాలు, ఆయుధాలు కూడా ఉన్నాయి. అవసరమైతే ఈ సైనికులు 48 గంటల్లో భారత్ సరిహద్దుకు చేరుకునేలా డ్రాగన్ దేశం సన్నాహాలు చేసిందని ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి తెలిపారు.
అయితే భారత ప్రభుత్వం ఈ సైనికుల కదలికలపై పూర్తిగా నిఘా ఉంచిందని చైనా వ్యూహాలను దీటుగా ఎదుర్కొంటామని ఆ అధికారి వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో అల్‌బదర్‌తో చైనా అధికారులు చర్చలు జరుపుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. జమ్ము కశ్మీర్‌లో రక్తపాతం సృష్టించిన చరిత్ర ఈ సంస్థకి ఉంది. అల్‌బదర్‌ను మళ్లీ పునరుద్ధరించడానికి చైనా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం.
వేడెక్కుతున్న పాంగాంగ్ సరస్సు తీరం
పాంగాంగ్ సరస్సుకి ఉత్తరంగా భారత్ భూభాగంలోకి 8 కి.మీ. మేర లోపలికి చొచ్చుకు వచ్చిన చైనా ఆ ప్రాంతం తనదేనని చాటి చెప్పడానికి చిహ్నాలను ఏర్పాటు చేసింది. ఫింగర్ 4–5 మధ్య 80 మీటర్ల పొడవున శాసనాల మాదిరి చిహ్నాలను నిర్మించింది. వీటిపై చైనాకు చెందిన మాండరిన్ గుర్తులను ఉంచి ఆ ప్రాంతమంతా తమదేనని చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇక ఫింగర్ 4–8 మధ్య ఎనిమిది కిలో మీటర్ల పొడవునా తాత్కాలిక శిబిరాలు, బంకర్లు ఏర్పాటు చేసి భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. చైనా ఆర్మీకి ఈ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గే ఆలోచన లేదని, అందుకే డ్రాగన్ దేశాన్ని ఎదుర్కోవడానికి భారత్ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకుల్ని మోహరిస్తూ ప్రణాళికలు రచిస్తోందని ఉన్నతాధికారులు వెల్లడించారు.
పాంగాంగ్‌కు భారత్ ఉక్కు పడవలు
పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో నిఘా మరింత పెంచడానికి భారత నావికా దళం సమాయత్తమైంది. డజనుకు పైగా ఉక్కు పడవల్ని లద్దాఖ్ వైపు మళ్తిస్తోంది. ఇప్పటికే పాంగాంగ్‌లో చైనా ఆర్మీ అత్యంత భారీ నౌకలైన టైప్ 928 బీలను మోహరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా భారీ నౌకలను తరలించే దిశగా ప్రణాళికలు సిద్ధంగా చేస్తోంది. ఈ లోగా పరిస్థితుల్ని పర్యవేక్షించడానికి ఈ ఉక్కు పడవలు పాంగాంగ్ తీర ప్రాంతానికి చేరుకుంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపు చర్యలకు దిగుతుండడంతో కేంద్రం సరిహద్దుల్లో ఆర్మీకి సర్వాధికారాలు కట్టబెట్టింది. చైనా ఏదైనా చర్యలకు పాల్పడితే వాటిని తిప్పికొట్టడమే లక్ష్యంగా భారత్ సర్వసన్నద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment