వాయుసేనకు ‘తేజస్’ | Tejas fighter jets into the IAF | Sakshi
Sakshi News home page

వాయుసేనకు ‘తేజస్’

Published Sat, Jul 2 2016 1:50 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

వాయుసేనకు ‘తేజస్’ - Sakshi

వాయుసేనకు ‘తేజస్’

ఐఏఎఫ్‌లోకి రెండు తేజస్ ఫైటర్ జెట్లు
- గగన దళానికి పెరిగిన బలం
- తేజస్‌తో బెంగళూరు హెచ్‌ఏఎల్‌లో విన్యాసాలు
- ఏడాది చివరికల్లా మరో ఆరు తేజస్‌లు సిద్ధం
 
 సాక్షి, బెంగళూరు: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి తేలికపాటి యుద్ధ విమానం(లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్-ఎల్‌సీఏ) ‘తేజస్’ ఎట్టకేలకు భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లోకి అధికారికంగా ప్రవేశించింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) రెండు తేజస్ ఫైటర్ జెట్లను లాంఛనంగా వైమానిక దళానికి అందజేసింది. సర్వమత ప్రార్థనల అనంతరం హెచ్‌ఏఎల్ జనరల్ మేనేజర్ శ్రీధరన్.. ఎయిర్ మార్షల్ జస్బీర్ వాలియాకు రెండు తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించిన పత్రాలతో పాటు విమాన నమూనాను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టం టెస్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్(ఏఎస్‌టీఈ) ఆవరణలో 1,100 మీటర్ల ఎత్తులో గంటకు 900 కిలోమీటర్ల వేగంతో గ్రూప్ కెప్టెన్‌మాధవ్ రంగాచారి ఈ యుద్ధవిమానంతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తేజస్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేసి వైమానిక దళంలోకి ప్రవేశపెట్టేందుకు సుమారు 33 ఏళ్లు పట్టింది. వాయుసేనలోకి 45 స్క్వాడ్రాన్‌లోకి తేజస్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు.

 33 ఏళ్ల నిరీక్షణ..
► స్వదేశీ పరిజ్ఞానంతో తేలికపాటి యుద్ధ విమానాన్ని రూపొందించాలనే ఆలోచన 1970ల్లోనే మొదలైనా.. తొలిసారిగా 2001లో ఇది గాల్లోకి ఎగిరింది.
►1998లో అణుపరీక్షల తర్వాత దేశంపై ఆంక్షలు విధించడంతో ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎక్కువ సమయం తీసుకుంది.
►తేజస్ ఫైటర్ జెట్.. సింగిల్ సీట్, సింగిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గగనతలం నుంచి గగనతల, భూఉపరితల లక్ష్యాలను ఛేదిస్తుంది.
►మిగ్ 21 యుద్ధ విమానాలకు ఇది ప్రత్యామ్నాయం. సుమారు నాలుగు టన్నుల పేలుడు పదార్థాలను/బాంబులను మోసుకుపోగలదు.
► ఈ ఏడాది చివరికి మరో ఆరు తేజస్ యుద్ధ విమానాలు సిద్ధం. 2018 నాటికి వైమానిక దళంలో మరో 20 తేజస్‌లు.
► హెచ్‌ఏఎల్‌కు ఏడాదికి 16 తేజస్‌లను తయారుచేసే సామర్థ్యం. తేజస్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న పొరుగు దేశాలు.
► ఒక్కో తేజస్ తయారీకి అయ్యే ఖర్చు రూ.220 కోట్లు.
 
 దేశానికి గర్వకారణం: మోదీ
 వైమానిక దళంలోకి తేజస్ చేరికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తేజస్ దేశానికి గర్వకారణమని, తేజస్ చేరిక భారత శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని ట్విటర్‌లో కొనియాడారు. భారత వైమానిక దళం శక్తి సామర్థ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తేజస్ తోడ్పడుతుందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ట్వీట్ చేశారు.
 
తేజస్ విశేషాలు...
►1983లో తేజస్ విమానాల ప్రాజెక్టును ప్రారంభించారు.
►తేజస్ విమానాన్ని తొలిసారి 2001

 జనవరి 4న పరీక్షించారు.
► గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి భూతలం, గగనతలం నుంచి సముద్రంపై లక్ష్యాలను చేధించేలా డిజైన్ చేశారు.
► పొడవు 13.7 మీటర్లు. ఎత్తు 4.4 మీటర్లు. రెక్కల వెడల్పు 8.3 మీటర్లు. 1.6 రెట్ల శబ్దవేగంతో దూసుకెళ్లగలదు. జీఈ-ఎఫ్414-ఐఎన్‌ఎస్6 ఇంజన్.
► ఈ తరహా సూపర్‌సోనిక్ యుద్ధవిమానాల్లో అత్యంత చిన్నది, తేలికైనది.
► దేశీయంగా డిజైన్, అభివృద్ధి, తయారైన తొలి సెమీ-ఆటోమేటిక్ విమానం.
► ఎరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధిచేశాయి.
 
 రెండోరోజూ క్షిపణి పరీక్ష విజయవంతం
 బాలసోర్ (ఒడిశా): భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన మధ్య శ్రేణి ఉపరితలం నుంచి గగనతలం క్షిపణిని ఒడిశాలోని బాలసోర్‌లో శుక్రవారం మరోసారి పరీక్షించారు. గురువారం నాటి రెండు పరీక్షలలాగే శుక్రవారం జరిపిన మూడో పరీక్ష కూడా విజయవంతమైంది. రెండు వరుస రోజుల్లో మూడుసార్లు క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) హ్యాట్రిక్ నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 3వ లాంచ్‌ప్యాడ్ నుంచి దీన్ని పరీక్షించారు. బంగాళాఖాతం సముద్రంలో వెళ్తోన్న మానవ రహిత విమానాన్ని టార్గెట్‌గా నిర్ణయించారు. విమానం గురించి రాడార్ నుంచి సంకేతాలను అందుకున్న క్షిపణి, విమానాన్ని ఢీకొట్టి పరీక్షను విజయవంతం చేసింది. 70 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. బహుళ ప్రయోజనకారి అయిన ఈ క్షిపణి, నిఘా పరికరంగా కూడా పనిచే స్తుంది. వైమానిక దాడులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. దీన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ప్రయోగ శాలలో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో కలిసి అభివృద్ధి చేశారు.
 
 తేజస్‌ను నడపటం ఆనందంగా ఉంది: కెప్టెన్ రంగాచారి
 ‘స్వదేశీ తయారీ ఫైటర్ జెట్‌ను తొలిసారి నడిపే అవకాశం రావటం గౌరవంగా భావిస్తున్నాను. చాలా తేలికైన ఈ ఫైటర్ జెట్‌లో ప్రయాణించటం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రపంచంలోని ఇతర యుద్ధవిమానాలకంటే ఇది ఓ తరం ముందుగానే ఉందనటంలో సందేహం లేదు. దీన్ని ఏ ఇతర యుద్ధ విమానంతోనూ పోల్చలేం.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement