బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసే సమస్యలుగా మారాయి. సాధారణంగా బుల్లీయింగ్ అంటే భౌతిక హింస, మాటలతో అవమానించడం, సామాజికంగా బహిష్కరించడం, పుకార్లు. డిజిటల్ టెక్నాలజీ వల్ల సైబర్ బుల్లీయింగ్ వచ్చేసింది. ఇది సోషల్ మీడియా, టెక్స్‌టింగ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగే బుల్లీయింగ్. తామెవ్వరో తెలీకుండా కామెంట్ చేసే అవకాశం ఉండటంతో దీనికి హద్దే లేకుండా పోతోంది.
కాదేదీ అనర్హం..
బుల్లీయింగ్ చిన్న సమస్య కాదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా యువత నిరంతర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బుల్లీయింగ్ చేసేవారికి ప్రత్యేక కారణమేదీ అవసరం లేదు. తమ ఆధిక్యతను ప్రదర్శించడం కోసం బాధితుల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని బుల్లీయింగ్ చేస్తుంటారు. అది వారి రూపం నుంచి అకడమిక్ పర్ఫార్మెన్స్ వరకూ ఏదైనా కావచ్చు. దీంతో బాధితులకు ‘నాకు మద్దతుగా ఎవ్వరూ లేరు, నాకిది భద్రమైన ప్రదేశం కాదు’ అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని టీనేజర్ లేడనే చెప్పవచ్చు. దీంతో సైబర్ బుల్లీయింగ్ వ్యక్తిగత జీవితానికీ విస్తరించింది.
టీనేజ్‌లోనే ఎందుకు ఎక్కువ?
టీనేజర్లు తమ వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక సంబంధాలు వంటి అంశాలను అన్వేషించే సమయంలో వారు మరింత సున్నితంగా ఉంటారు. స్నేహితుల నుంచి అనుకూలత పొందడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీన్ని బుల్లీయర్లు దుర్వినియోగం చేస్తుంటారు.
నివారణ వ్యూహాలు
బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రభావాలను అర్థం చేసుకోవడం మొదటి దశ మాత్రమే. ఈ సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీల భాగస్వామ్యంతో సమర్థవంతమైన వ్యూహాలు అవసరం. కొన్ని ముఖ్యమైన వ్యూహాలు:
1. బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవడం చాలా అవసరం. అవగాహన కార్యక్రమాలు యువతను బుల్లీయింగ్ ప్రవర్తనలను గుర్తించేందుకు ప్రోత్సహిస్తాయి.
2. పాస్‌వర్డ్స్‌ని పంచుకోవద్దని స్పష్టంగా చెప్పండి. మానసికంగా ప్రేరేపించేదాన్ని గుర్తించి నిరోధించండి.
3. మీ టీన్‌తో ఓపెన్‌గా మాట్లాడండి. వారి అనుభవాలను తెలుసుకుని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించండి.
4. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అవసరమైన ధైర్యాన్నివ్వండి. వారి మంచి లక్షణాలను గుర్తించి అభినందించండి.
5. బుల్లీయింగ్ గురించి మీతో చెప్పుకునే స్వేచ్ఛనివ్వండి. వాళ్లను జడ్జ్ చేయకుండా సమస్యను అర్థం చేసుకోండి.
6. సానుకూలమైన స్నేహాలు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. వారి స్నేహాలను ఆరోగ్యకరమైన దిశలో ప్రోత్సహించండి.
7. పాఠశాల లేదా కళాశాలలో బుల్లీయింగ్ చోటు చేసుకుంటే.. ఉపాధ్యాయులు, కౌన్సిలర్లతో కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. బుల్లీయింగ్ వ్యతిరేక విధానాలు స్పష్టంగా అమలయ్యేలా చూడండి.
8. బుల్లీయింగ్‌ని చూస్తూ ఉండకుండా, వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రోత్సహించండి.
9. తీవ్రత నుంచి బయటపడటానికి బ్రీదింగ్, మెడిటేషన్, జర్నలింగ్ వంటి సాధనాలు నేర్పండి.
10. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ వారిని అనుకరిస్తుంటారు. అందుకే మీరు ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించి చూపడానికి ప్రయత్నించాలి.
11. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సాయం తీసుకోవడం మంచిది.
తీవ్ర ప్రభావం..
బుల్లీయింగ్ అనుభవించిన పిల్లల్లో దీర్ఘకాలంలో వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అది ఈ విధంగా ఉంటుంది:
1. ఎక్కువగా అవమానాలు, ఛీత్కారాలు పిల్లల్లో ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి.
2. బుల్లీయింగ్ వల్ల కలిగే ఒత్తిడి కలతకు, డిప్రెషన్‌కు దారితీస్తుంది.
3. బుల్లీయింగ్ బాధితులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమంది ఉండే పరిసరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.
4. బుల్లీయింగ్ వల్ల ఇతరులపై నమ్మకం పోతుంది. అది వారి స్నేహాలకు ప్రతిబంధకంగా మారుతుంది.
5. అకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ప్రభావితం అవుతుంది. తరచుగా పాఠశాలకు వెళ్లడం మానేస్తారు, తద్వారా చదువులో వెనకబడతారు.
6. బుల్లీయింగ్ తీవ్రమైన సందర్భాల్లో పిల్లలు ఆత్మహత్య గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment