ఇంట్లో టీనేజర్స్ ఉన్నారంటే తల్లిదండ్రులకు గుండెల్లో గుబులే. ఎప్పుడేం మాట్లాడతారో, ఏం చేస్తారో, ఏ గొడవ తీసుకొస్తారో అని! అన్నింటికంటే భయపెట్టే అంశం.. ప్రేమ వ్యవహారాలు. పెళ్లికి ముందు శృంగారం కూడా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే అంశం. కానీ కాలంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి. ఈ కాలం పిల్లలకు రిలేషన్స్, బ్రేకప్స్ సర్వసాధారణమయ్యాయి.
కొందరు ఈ రిలేషన్స్‌లో పడి చదువును నిర్లక్ష్యం చేస్తే, మరికొందరు బ్రేకప్ వల్ల అనేక మానసిక సమస్యలకు లోనవుతున్నారు. అందుకే పిల్లలు ప్రేమలో పడ్డారని తెలియగానే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కొందరైతే తిడతారు, కొడతారు, కంట్రోల్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. దీనివల్ల టీనేజర్లలో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెరగడం తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. దీనికన్నా టీనేజర్లతో ఓపెన్‌గా మాట్లాడటం, సరైన గైడెన్స్‌ను అందించడమే మంచిదని గుర్తించాలి. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం.
సెక్సువల్ డెవలప్‌మెంట్..
సెక్సువల్ డెవలప్‌మెంట్ అనేది సహజమైన పరిణామం. పీరియడ్స్, వెట్ డ్రీమ్స్ లాంటి శారీరక మార్పులు, అపోజిట్ సెక్స్ పట్ల ఆసక్తి లాంటి భావోద్వేగ మార్పులు మొదలవుతాయి. ఇదంతా వారికి కొత్తగా, కన్ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్‌తో చర్చిస్తారు. లేదా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తారు. అందులో తప్పుడు సమాచారం అందే ప్రమాదం ఉంది. అందుకే ఈ అంశాలపై తల్లిదండ్రులే చర్చించాలి. అలా చర్చించడంలో ఎలాంటి తప్పూ లేదని గుర్తించాలి.
ప్రేమ, ఆకర్షణ..
టీనేజ్‌లో ప్రేమ, ఆకర్షణ సహజమైన భావోద్వేగాలు. నచ్చిన వ్యక్తి పట్ల బలమైన ఆకర్షణను కలిగి ఉంటారు. అదే ప్రేమ అని భ్రమపడుతుంటారు. ఇది చూసి తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఈ ఆకర్షణ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కొందరిలో ఎక్కువకాలం కొనసాగవచ్చు. అయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పిల్లలను జడ్జ్ చేయకుండా, వారి క్రష్, లవ్ గురించి ఓపెన్‌గా మాట్లాడండి, తప్పొప్పులు, పర్యవసానాల గురించి చర్చించండి. అప్పుడే వాళ్లు తమ భావోద్వేగాలను సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.
టీనేజ్ సెక్స్..
యవ్వనంలో సెక్స్ అనే అంశం చాలా సున్నితమైనది. యవ్వనంలో వచ్చే హార్మోన్ మార్పుల వల్ల లేదా సోషల్ మీడియా లేదా ఫ్రెండ్స్ ప్రభావం వల్ల టీనేజ్ సెక్స్ పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ దశలో టీనేజర్లకు సరైన గైడెన్స్ అవసరం. అది ఫ్రెండ్స్ ద్వారానో, పోర్న్ ద్వారానో వచ్చేకంటే, పేరెంట్స్ ద్వారా అందడం అవసరం. భయపెట్టడం, నియంత్రించడం కంటే గైడెన్స్ ద్వారానే పిల్లలను సరైన దారిలో నడపగలమని గుర్తించాలి.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లలు ఎలాంటి సందేహాలనైనా అడగడానికి, వారి భావాలు పంచుకోవడానికి అవకాశాన్ని ఇవ్వాలి ∙సెక్సువల్ డెవలప్‌మెంట్, రిలేషన్స్ గురించి కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి ∙ తాత్కాలిక ఆకర్షణలు, టీనేజ్ లవ్, సంపూర్ణ ప్రేమ మధ్య తేడాలు అర్థం చేసుకునేందుకు సహాయపడాలి ∙సోషల్ మీడియా ప్రభావం, స్నేహితుల ఒత్తిళ్లను అర్థం చేసుకోవడానికి సహాయపడాలి ∙టీనేజర్ల ఫ్రీడమ్, తల్లిదండ్రుల గైడె¯న్స్ మధ్య బ్యాలె¯న్స్ సాధించాలి ∙పేరెంట్స్ చర్చించలేని అంశాల గురించి చెప్పేందుకు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి.
టీనేజర్లు చేయాల్సింది..
టీనేజ్‌లో జరిగే మార్పుల గురించి చదవాలి, అవగాహన పెంచుకోవాలి. పేరెంట్స్‌తో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలి
టీనేజ్ లవ్, ఇన్ఫాచ్యుయేషన్ సహజమైన విషయాలని, శాశ్వతం కావని గుర్తించాలి
తొందరపాటు చర్యల వల్ల వచ్చే ఎమోషనల్ పెయిన్ గురించి అవగాహన పెంచుకోవాలి
ఈ వయసులో ప్రేమ వ్యవహారాల కంటే అకడమిక్ సక్సెస్ ముఖ్యమని అర్థం చేసుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
కొత్త ఆసక్తులు, హాబీలను కనుగొనేందుకు సమయం కేటాయించాలి
మైండ్‌ఫుల్‌నెస్, జర్నలింగ్, నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం వంటి పనుల ద్వారా ఎమోష¯న్స్‌ను నియంత్రించుకోవడం ప్రాక్టీస్ చేయాలి
సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి. నిజమైన సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశగా అనిపిస్తే సైకాలజిస్ట్‌తో మాట్లాడి సహాయం తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment