పుష్ప-2 సినిమా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కానీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటం మనసును కలచివేస్తోంది.
అసలెందుకిలా జరుగుతోంది? సినిమాల పట్ల ఇంత వేలంవెర్రి ఎందుకు? టికెట్ల ధరలు వేల రూపాయల్లో ఉండటమేంటి? అందుకు ప్రభుత్వాలు అనుమతించడమేంటి? వేలకు వేలు పెట్టి టికెట్లు కొనడమే కాకుండా, ప్రాణాలకు తెగించి మరీ బెనిఫిట్ షో చూడాలనే ఇంత పిచ్చి అభిమానం ఎందుకు ఏర్పడుతోంది? దీన్ని ఎలా నివారించాలి? అని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.
మనదేశంలో సినీ పరిశ్రమ కేవలం వినోదంగా మాత్రమే కాకుండా ఒక మతంలా మారిపోయింది. సినిమా హీరోలను దేవుళ్లుగా భావించడం, వారి సినిమా అందరికంటే ముందుగా చూడటం గొప్పగా భావించే మైండ్ సెట్ గా మారిపోయింది.
ఫ్యాన్స్ మానసిక స్థితి
అభిమానుల్లో చాలామంది తమ అభిమాన నటులతో మానసికంగా అనుబంధం ఏర్పరచుకుంటారు. వారితో మమేకమవుతారు. వారిలో తమను చూసుకుంటారు. అభిమాన హీరో సినిమా విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. అది వారి వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిస్తుంది. అంటే సామాన్య వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విజయాన్ని తమ హీరో విజయంలో చూసుకుని సంతృప్తి చెందుతాడు. ముఖ్యంగా పిల్లలు ఆ హీరోలకు అనుకరిస్తారు. ఈ దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్ తనను తాను పుష్పలా భావించుకునేవాడని, అతన్ని అందరూ పుష్ప అని పిలిచేవారని తండ్రి చెప్పడం మనం గుర్తించాలి.
మరోవైపు మొదటి రోజు మొదటి షో చూడటం వల్ల వచ్చే థ్రిల్, ఎక్సయిట్మెంట్ మనలో ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా స్రవించేందుకు కారణమవుతుంది. దాంతో ఆ అనుభవం ఎక్సయిటింగ్ గా అనిపిస్తుంది. అందుకే ప్రతీ మూవీ మొదటిరోజు చూసేందుకు, అందుకోసం ఎన్ని వేల రూపాయలైనా ఖర్చుపెట్టేందుకు ఉర్రూతలూగుతుంటారు.
మొదటిరోజు మొదటి షో చూసిన ఫ్యాన్స్ తమను తాము ప్రత్యేక వ్యక్తులుగా, ఇతరుల కంటే గొప్పగా భావిస్తుంటారు. అలా తమ గ్రూప్ లో ఒక గుర్తింపును పొందాలనుకునే కోరికను ఇది తెలియపరుస్తుంది. అంతేకాదు, ఫ్యాన్స్ గ్రూప్ లో ఉన్నవారిపై కనిపించని ఒత్తిడి ఉంటుంది. మొదటి రోజు మొదటి షోను మిస్ అవ్వకుండా చూడటం తప్పనిసరి బాధ్యతగా ఫీలవుతుంటారు. ఇది గుంపు ప్రవర్తన (Herd Behaviour)తో ముడిపడి ఉంటుంది.
గుంపులో ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత బాధ్యతను కోల్పోతారు. అభిమానుల ఆసక్తి, ఉత్తేజం వేగంగా పాకిపోతుంది, చిన్న అవాంతరాలు కూడా పెద్ద సంఘటనలుగా మారతాయి. తొక్కిసలాట జరిగినప్పుడు భయాందోళనలు పెరిగి అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రమాదాలకు కారణమవుతుంద. సంధ్య ధియేటర్ వద్ద జరిగింది ఇదే.
నిర్మాతల వ్యాపారాత్మక ధోరణి...
బాహుబలితో మొదలైన పాన్ ఇండియా మూవీల హవా పుష్ప-2తో ఒక మేనియాగా మారింది. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారిని ప్రోత్సహిస్తూ భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నాయి. ప్రజల భావోద్వేగాలను వీలైనంతగా సొమ్ము చేసుకునే కమర్షియల్ ఆపర్చునిజానికి ఇది నిలువెత్తు నిదర్శనం.
వ్యాపారాత్మక ధోరణి తప్ప, అభిమానుల బలహీనతలను సొమ్మి చేసుకోవడం నిర్మాతల నైతికలోపంగా భావించవచ్చు. కానీ టికెట్ ధరలు విపరీతంగా పెంచడం సినిమాను సామాన్య ప్రజలకు దూరం చేస్తుందన్న విషయాన్ని వారు గుర్తించడం లేదు.
ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?
మరోవైపు, భారీ రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌కు రావడం అల్లు అర్జున్ చేసిన తప్పని చెప్పక తప్పదు. ఆ సమయంలో తాను కనిపిస్తే తనను చూసేందుకు అభిమానులు ఎగబడతారని, తొక్కిసలాట జరగవచ్చని గుర్తించి ఉండాల్సింది. ఆయనా పని చేయలేదు. సరే ఆయన వచ్చారు. ధియేటర్ యాజమాన్యం, పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేకపోయారు. ఫలితంగా ఒక నిండుప్రాణం బలయ్యింది.
అందరూ బాధ్యత తీసుకోవాలి..
• ఇలాంటి సంఘటనలు చూశాకైనా ఫ్యాన్స్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రాధాన్యతలను పునరాలోచించుకోవాలి. ప్రాణాలకంటే సినిమా ఎక్కువ కాదని గుర్తించి మసలు కోవాల్సిన అవసరం ఉంది.
• పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు తమ అభిమానుల ఆలోచనలపై ప్రభావం చూపించగలగాలి. వాళ్ళ అభిమానులు జవాబుదారీతనం కలిగి ఉండేలా చేసే ప్రయత్నాలు చేయాలి.
• నిర్మాతలు ఆర్థిక ప్రయోజనాలకు మించిన బాధ్యతను గుర్తించాలి, మెరుగైన వినోదం సరసమైన ధరలకు అందించేందుకు ప్రయత్నించాలి.
• మీడియా కూడా సినిమా ప్రచార కార్యక్రమాల ప్రసారం విషయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.
-సైకాలజిస్ట్ విశేష్
8019 000066
www.psyvisesh.com
Comments
Please login to add a commentAdd a comment