మంచు కుటుంబ ఆస్తి వివాదంపై విచారణ... హాజరైన మోహన్‌బాబు, మనోజ్
రెండు గంటలపాటు సుదీర్ఘ విచారణ.. తీవ్ర వాగ్వాదం
అది నా స్వార్జితం.. నా ఇంటిని ఖాళీ చేయాల్సిందే: మోహన్‌బాబు
ఆయనకు ఆ ఇల్లు ఒక్కటే కాదు చాలా ఆస్తులున్నాయి: మంచు మనోజ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మంచు కుటుంబ వివాదం మరింత క్లిష్టంగా మారుతోంది. తన ఇల్లు ఖాళీ చేయించండి అంటూ సినీనటుడు మంచు మోహన్‌బాబు వయో వృద్ధుల చట్టం కింద నెలన్నర రోజుల క్రితమే జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ నారాయణరెడ్డి మంచు మనోజ్‌కు 15 రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. మంచు మనోజ్ తన అడ్వకేట్‌తో కలిసి జనవరి 18న జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఎదుట హాజరై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని అడిగారు. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రెండో హియరింగ్ జరిగింది. తండ్రీ కొడుకులిద్దరూ వేర్వేరు వాహనాల్లో తమ న్యాయవాదులతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
ముందు వేర్వేరుగా లోపలకు పిలిచి.. వారు నేరుగా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
చాంబర్‌కు చేరుకున్నారు. తొలుత ఇద్దరిని వేర్వేరుగా లోపలకు పిలిచి మాట్లాడారు. సుమారు రెండుగంటల పాటు విచారణ కొనసాగింది. చివరి నిమిషంలో ఇద్దరూ అదనపు కలెక్టర్ ఎదుటే వాగ్వాదానికి దిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తీవ్ర వాగ్వాదంతోపాటు ఒకరినొకరు దూషించుకోవడమే కాకుండా ఒకానొక దశలో తోపులాడుకునే స్థాయికి వెళ్లినట్టు సమాచారం. ప్రతిమాసింగ్ వారిని సముదాయించే ప్రయత్నం చేసినా..వినిపించుకోకపోవడంతో రక్షణ కోసం పోలీసులను లోపలకు పిలిపించారు. ‘ఇల్లు, ఇతర ఆస్తులన్నీ నా స్వార్జితం, వాటి నుంచి ఖాళీ చేయించాల్సిందే’అంటూ తండ్రి మోహన్‌బాబు విచారణ అధికారి ముందు పట్టుబట్టగా, కొడుకు మనోజ్ అందుకు నిరాకరించినట్టు తెలిసింది.
ముందు నుంచి ఒకరు..వెనుక నుంచి మరొకరు
నాన్నకు ఇల్లు ఒక్కటే కాదని, చా లా ఆస్తులు ఉన్నాయని, వారసత్వంగా నాకు ఆస్తిలో వాటా ఉందని, విద్యా సంస్థల్లో జరుగుతున్న అన్యా యాలపై ప్రశ్నించినందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏనాడు కూడా నాన్నపై చేయి చేసుకోలేదని మనోజ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ‘అతను నా కొడుకే కాదు..అతని నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కల్పించండి’అంటూ మోహన్‌బాబు అదనపు కలెక్టర్‌కు విన్నవించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను మనోజ్ విచారణాధికారి ముందు ఉంచారు. అనంతరం మోహన్‌బాబు వెనుక వైపు నుంచి వెళ్లిపోగా, మనోజ్ ముందు వైపు నుంచి ఆవేశంగా బయటకు వెళ్లిపోవడం, విచారణ జరుగుతున్న సమయంలో మీడియా సహా ఇతర వ్యక్తులను అటు వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం గమనార్హం. మరో పదిరోజుల్లో మూడో విచారణకు హాజరుకావాలని ప్రతిమాసింగ్ వారికి సూచించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment