టైటిల్: పుష్ప 2: ది రూల్
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ పాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనంజయ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ తదితరులు
నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
నిర్మాతలు: నవీన్ కుమార్, రవిశంకర్
రచన-దర్శకత్వం: సుకుమార్
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్
ఎడిటింగ్: నవీన్ నూలి
విడుదల తేది: డిసెంబర్ 5, 2024
అల్లు అర్జున్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేల పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీలోకం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించడంతో దేశం మొత్తం ‘పుష్ప 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.
‘పుష్ప 2’ కథేంటంటే..?
ఒక సాధారణ కూలీగా జీవీతం మొదలు పెట్టిన పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ‘పుష్ప పార్ట్-1’లో చూపించారు. పుష్పరాజ్ సిండికేట్ లీడర్ కావడంతో ‘పుష్ప : ది రైజ్’ కథ ముగుస్తుంది. పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule Movie Telugu Review) సినిమా కథ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీవల్లి(రష్మిక)ని పెళ్లి చేసుకొని అటు వ్యక్తిగతం జీవితాన్ని హాయిగా గడుపుతూనే.. మరోవైపు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ని దేశం మొత్తం విస్తరిస్తాడు పుష్పరాజ్. ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) అండతో తన వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహరెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళ్తాడు.
భార్య శ్రీవల్లి కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా..‘స్మగ్లర్‌తో ఫోటో దిగలేను’ అంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దప్పను చేయాలనుకుంటాడు. దాని కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? తనను అవమానించిన పుష్పరాజ్‌ని ఎలాగైన పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ షెకావత్(ఫాహద్ ఫాజిల్) ప్రయత్నం ఫలించిందా? షెకావత్‌కి పుష్పరాజ్ విసిరిన సవాల్ ఏంటి? కేంద్రమంత్రి ప్రతాప్‌రెడ్డి(జగపతి బాబు), పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ప్రతాప్‌రెడ్డి తమ్ముడు కొడుకు (తారక్ పొన్నప్ప) పుష్పరాజ్‌పై పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? తనను తప్పించి సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ను అణచివేసేందుకు మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ)వేసిన ఎత్తుగడలు ఏంటి? చివరకు పుష్పరాజ్ అనుకున్నట్లుగా సిద్దప్పను సీఎం చేశాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కొన్ని సినిమాలకు కథ అవసరం లేదు. స్టార్ హీరో.. ఆయన స్థాయికి తగ్గట్లు ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్.. మాంచి పాటలు ..ఇవి ఉంటే చాలు బొమ్మ హిట్టైపోతుంది. పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేశాడు. పుష్ప : ది రైజ్ సినిమాతో పుష్పరాజ్ పాత్రను డ్రగ్‌లా ఎక్కించిన సుక్కు.. పార్ట్ 2లో ఆ మత్తును అలానే కంటిన్యూ చేసేశాడు. కథపై కాకుండా ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేశాడు. పార్ట్ 1లో ఉన్నంత కథ కూడా ఈ సీక్వెల్‌లో లేదు. హై ఇవ్వడమే లక్ష్యంగా కొన్ని సీన్లను అల్లుకుంటూ పోయాడు అంతే. ప్రతి పది నిమిషాలకొకసారి హై ఇచ్చే సీన్ ఉండేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కథనం నీరసంగా సాగుతుందన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి వచ్చేలోగా.. ఓ భారీ యాక్షన్ సీన్ పడుతుంది. అందులో బన్నీ నటవిశ్వరూపం చూసి గూస్‌బంప్స్ తెచ్చుకోవడమే తప్ప.. మరో ఆలోచన రాదు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే పాయింట్‌ని ఈ స్మగ్లింగ్ కథతో ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. పుష్పరాజ్ క్యారెక్టర్, అతని ప్రపంచం గురించి అల్రేడీ తెలుసు కనుక.. స్టార్టింగ్ నుంచే హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ అంతా షెకావత్-పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్‌లా కథనం సాగుతుంది. ఎర్రచందనం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం.. పుష్పరాజ్ అతన్ని బురిడీ కొట్టించి దాన్ని తరలించడం .. ఫస్టాఫ్ మొత్తం ఇదే తంతు నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమింగ్‌ఫూల్ సీన్ అదిరిపోతుంది. ఇద్దరి జరిగే సవాల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే శ్రీవల్లీ, పుష్పరాజ్‌ల మధ్య వచ్చే ‘ఫీలింగ్స్’ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ద్వితియార్థంలో ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతర ఎపిసోడ్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది.
ఇక క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఆ సీన్‌లో బన్నీ మాస్ తాండవం చేశాడు. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా నిడివి (దాదాపు 3 గంటల 20 నిమిషాలు) ఎక్కువగా ఉండడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాకుంటే అంత మంచిది. అయితే మాస్ ఆడియన్స్‌కి ఇవేవి అవసరం లేదు. వారిని ఎంటర్‌టైన్ చేస్తే చాలు. అలాంటి వారికి పుష్ప 2 విపరీతంగా నచ్చుతుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి.
ఎవరెలా చేశారంటే..
పుష్ప: ది రూల్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అయితే ‘తగ్గేదేలే’ అన్నట్లుగా తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్‌లో బన్నీ ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవన్‌లో ఉంది. చిత్తూర యాసలో ఆయన పలికిన సంభాషణలు అలరిస్తాయి.
ఇక శ్రీవల్లీగా డీగ్లామర్ పాత్రలో రష్మిక జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. జాతర ఎపిసోడ్‌లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. డీఎస్పీ షెకావత్‌గా ఫహద్ పాజిల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంపీ సిద్దప్పగా రావు రమేశ్ మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు.
తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది. బన్నీకి ఆయన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల అదరగొట్టేసింది. బన్నీతో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది. మంగళం శ్రీను పాత్రలో నటించిన సునీల్‌కి పెద్దగా గుర్తుంచుకునే సీన్లేవి పడలేదు. దాక్షయణిగా నటించిన అనసూయ పరిస్థితి కూడా అంతే. ఒకటి రెండు చోట్ల ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డిగా జగపతి బాబు ఉన్నంత చక్కగా నటించాడు. పార్ట్ 3లో ఆయన నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగదీశ్, ధనుంజయ, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవీశ్రీ ప్రసాద్, శ్యామ్ సీఎస్‌ల నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ‘సూసేకీ..’, కిస్సిక్’, ‘ఫీలింగ్స్’ పాటలు తెరపై అలరించాయి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెపాల్సింది. నిడివిని కొంచెం తగ్గిస్తే బాగుండేవి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు.
- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment