సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
టాలీవుడ్‌పై టార్గెట్
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్‌లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.
బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సుకుమార్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.
మరోవైపు ఈ వ్యవహారంపై దిల్‌రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment