తన ఇంటిపై ఐటీ శాఖ అధికారుల జరుపుతున్న సోదాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)స్పందించారు. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైన మాత్రమే జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వారికి తనతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం సహకరిస్తున్నామని అని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
కాగా, టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం మొదలైన ఈ సోదాలు.. బుధవారం కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.
సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్(sukumar) ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు(IT Rids) నిర్వహించారు. . శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.
వెలుగులోకి కీలక ఆంశాలు..
ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
అలాగే దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లు వస్తుంది. ఈ సినిమా వారం రోజుల్లో రూ.203 కోట్లు వసూళ్లు సాధించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వచ్చిన లాభాలకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment