
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా (Tollywood) పాటల్లో ఈ మధ్య డ్యాన్స్ అసభ్యకరంగా ఉంటున్నాయని మహిళా కమిషన్ (Telangana State Women's Commission) ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను తక్కువ చేసి చూపించే డ్యాన్స్ స్టెప్పులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల సినిమా పాటల్లో డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా ఉండటంతో పాటు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి.
అసభ్య స్టెప్పులు ఆపేయండి
దీనిపై గురువారం నాడు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద స్పందిస్తూ.. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం. ఇందులో మహిళల్ని అవమానించేలా, అసభ్యంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ విషయంలో సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లతో పాటు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మహిళల్ని చులకన చేసి చూపించే స్టెప్పులను వెనక్కు తీసుకోవాలి. లేదంటే చర్యలు తప్పవు.
(చదవండి: నందమూరి 'తమన్'పై మెగా ఫ్యాన్స్ ఫైర్)
స్వీయ నియంత్రణ పాటించండి
సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించాలి. మహిళల గౌరవాన్ని కాపాడటమనేది నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చలన చిత్ర పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయంపై నిశితంగా పరిశీలన కొనసాగించి తగు చర్యలు తీసుకుంటాం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దబిడి దిబిడి పాటపై ట్రోలింగ్
కాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి పాటపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ పాటలో బాలయ్య.. ఊర్వశి రౌతేలాను కొట్టడం చూడటానికే చండాలంగా ఉందని పలువురూ విమర్శించారు. ఇటీవల రాబిన్‌హుడ్ నుంచి రిలీజైన అదిదా సర్‌ప్రైజు పాటలోనూ కేతిక శర్మతో అసభ్యకర స్టెప్పులు వేయించారు. ఈ రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం గమనార్హం.
చదవండి: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాం.. సారీ చెప్పాం.. ఇంకేంటి? సురేఖావాణి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment