ట్రోలర్స్‌పై తమన్‌ ఆవేదన.. చిరంజీవి కామెంట్స్‌ | Chiranjeevi React On Thaman Comments | Sakshi
Sakshi News home page

ట్రోలర్స్‌పై తమన్‌ ఆవేదన.. చిరంజీవి కామెంట్స్‌

Published Sat, Jan 18 2025 1:51 PM | Last Updated on Sat, Jan 18 2025 3:06 PM

Chiranjeevi React On Thaman Comments

డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ (Thaman) చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాను ట్రోల్ చేస్తున్న వారిని చూస్తుంటే భయంతో పాటు సిగ్గుగా ఉందని ఆయన అన్నారు. ట్రోల్స్‌ చేసుకుంటూ మన సినిమాను మనమే చంపేస్తున్నామని తమన్‌ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కూడా సోషల్‌ మీడియా వేదికగా తమన్‌ కామెంట్స్‌పై రియాక్ట్‌ అయ్యారు.

'డియర్‌ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అనిపించింది. 

  (ఇదీ చదవండి: కలిసి మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మనోజ్‌)

విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఉచితమే, ఒక్కోసారి ఆ మాటలు కొందరికి స్ఫూర్తిగా నిలిస్తే.. మరొకరిని నాశనం చేస్తాయి. అయితే, ఆ మాటల ఎంపిక మాత్రం మనపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది' అని చిరు అన్నారు.  

ట్రోలర్స్‌పై తమన్‌ వ్యాఖ్యలు
సినిమాలపై ట్రోలింగ్ గురించి తమన్‌ ఇంకా ఏమన్నారంటే.. జీవితంలో విజయం చాలా గొప్పది. అది లేకపోతే మనుషుల్ని తక్కువ చేసి చూస్తారు. మేమంతా కూడా ఆ విజయం కోసం పోరాడుతుంటాం. జీవితం ముందుకు సాగడానికి విజయం దోహదపడుతుంది. ప్రస్తుతం ఒక నిర్మాత విజయాన్ని అందుకుంటే దాని గురించి బహిరంగంగా మాట్లాడటం కష్టంగా మారింది. నిర్మాతలు మనకు దేవుళ్లతో సమానం. కాబట్టి హీరోలతో పాటు ఫ్యాన్స్‌, చిత్ర పరిశ్రమలో ఉన్న అందరూ వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. అలాంటి వాటి వల్ల సినిమా చాలా నష్టపోతుంది. 

నేను బాలీవుడ్, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు అక్కడివారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని ఉందని నాతో అంటూ ఉంటారు. కానీ, మనవాళ్లు తెలుగు సినిమాలను చులకనగా చూస్తున్నారు. ఇది ఎంతో దారుణమైన విషయం. మనమే మన సినిమాని చంపేస్తుంటే ఎలా..? ఒక సినిమా విజయం గురించి కూడా బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. మీకేవైనా ఇబ్బందులు ఉంటే.. వ్యక్తిగతంగా మీరు మీరు తిట్టుకోండి. కానీ, సినిమాను మాత్రం చంపొద్దు' అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement