సాక్షి, హైదరాబాద్: చిత్రపరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రకటించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గద్దర్ అవార్డు కమిటీసభ్యులతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం భేటీ అయ్యారు. అక్టోబర్ 14న కమిటీ సభ్యులతో భేటీ అయిన భట్టి తాజాగా మరోసారి సమావేశమయ్యారు.
గద్దర్ అవార్డు లోగో, విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ సభ్యులు చేసిన ప్రతిపాదనలు, సూచనలపై చర్చించారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి పేర్కొన్నారు. కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిష్ట పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలని సూచించారు. ఫీచర్ ఫిలింస్, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి వాటిని ప్రశంసించేలా అవార్డులు ఉండాలన్నారు. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యం దిశగా అవార్డుల ప్రదానం ఉండాలని చెప్పారు. కమిటీ సభ్యుల సూచనలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి తెలిపారు. కాగా నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment