
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో విచారణకు రాలేనంటూ మహేశ్ బాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశాడు. షూటింగ్ కారణంగా రేపు (ఏప్రిల్ 28) ఈడీ ఎదుట హాజరు కాలేనని తెలిపాడు. విచారణ కోసం మరో తారీఖును ఫిక్స్ చేయాలని కోరాడు.
ఎందుకీ విచారణ?
సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు.. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసి ఎన్‌క్లేవ్, షణ్ముఖ నివాస్ పేరుతో వెంచర్లు వేశాయి. సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్‌కు రూ.3.25 కోట్ల చొప్పున కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.1.45 కోట్ల చొప్పున వసూలు చేసింది. నెలలు గడుస్తున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు గత నవంబర్‌లో సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు.
రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు
11 కేసులు నమోదు చేసిన పోలీసులు సాయిసూర్య డెవలపర్స్ ప్రొప్రైటర్ కె. సతీష్‌చంద్ర గుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రమోటర్ నరేంద్ర సురానాను నవంబర్‌లోనే అరెస్ట్ చేశారు. ఒకరికి విక్రయించిన ప్లాట్‌ను మరికొందరి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఏప్రిల్ 16న ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్ చేసింది.

ప్రచారకర్తగా మహేశ్ ఉన్నందువల్లే..
సాయిసూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు సేకరించింది. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు పంపింది. విచారణకు వచ్చే సమయంలో పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌బుక్స్‌ను తీసుకురావాలని సూచించింది. కానీ రాజమౌళి సినిమాతో (#SSMB29) బిజీగా ఉండటంతో మహేశ్ విచారణకు రాలేనని తాజాగా లేఖ రాశాడు.
చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి: దర్శకుడు