సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో నార్సింగి పోలీసులు వేగంగా పెంచారు. తాజాగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం, ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు.
కాగా, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు.. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను బుధవారం రికార్డు చేశారు. కాసేపటి క్రితమే ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఇక, మరికొన్ని ఆధారాల సేకరణ కోసం నేడు బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నట్టు సమాచారం. అయితే, ఇప్పటికే ఈ కేసు వివరాలను సఖీ బృందం సేకరించిన విషయం తెలిసిందే. మైనర్‌గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైనట్టు గుర్తించారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరింపులకు గురిచేసినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు.. జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ కూడా స్వరం పెంచింది. టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల అంశంపై ప్యానల్ విచారణ జరుపుతోంది. ఇక, ప్యానల్ సైతం వేధింపులపై ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతోంది. జానీ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తున్నామని ప్యానల్ తెలిపింది. ఇదిలా ఉండగా.. బాధితురాలికి ఉన్న వర్క్ టాలెంట్‌తో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అగ్ర హీరో బాధితురాలికి మద్దతు పలికినట్టు సమాచారం.
కేసు వివరాలు ఇలా..
జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు (21) చేసిన ఫిర్యాదు మేరకు ఈనెల 15న నార్సింగి పీఎస్‌లో ఐపీసీ 376 (2)(ఎన్), 506, 323 సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ముంబైలోని ఓ హోటల్లో మొదలుపెట్టి..
ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం..బాధితురాలు 2017లో తన స్వస్థలం నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఢీ–12 డ్యాన్స్ షో చేస్తున్న క్రమంలో ఆమెకు జానీ మాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. సహాయ కొరియోగ్రాఫర్‌గా పనిచేయడానికి జానీ మాస్టర్ బృందం నుంచి ఫోన్ కాల్ రావడంతో 2019లో ఆ బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఈ క్రమంలో ముంబైలో ఒక ప్రాజెక్టు కోసం జానీ మాస్టర్, ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి ముంబైకు వెళ్లింది. అప్పుడు ఓ హోటల్‌లో జానీ మాస్టర్ ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని బెదిరించాడు.
దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆపై ప్రతి షూట్ సమయంలోనూ జానీ మాస్టర్ ఆమెను వేధించేవాడు. ఆమె వ్యానిటీ వ్యాన్‌లోకి ప్రవేశించి లైంగిక వాంఛను తీర్చాలని బలవంతం చేసేవాడు. షూటింగ్ సెట్లలో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఒకసారి తన కోరిక తీర్చనన్నందుకు జుట్టు పట్టుకొని ఆమె తలను వ్యానిటీ వ్యాన్‌లోని అద్దానికి గుద్దాడు. ఒకసారి షూటింగ్ ముగిశాక అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడు. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు.
ఆగంతకుడి బెదిరింపులు.. అనుమానాస్పద పార్శిల్
వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా పనిచేసుకోవడం ప్రారంభించింది. కానీ చిత్ర పరిశ్రమలో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని జానీ మాస్టర్ ఆమెకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేసేవాడు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెను ఎంపిక చేసుకుని, షూటింగ్ కొంత పూర్తయ్యాక మధ్యలో వదిలేసి వేరొకర్ని నియమించుకున్నాడు. గత నెల 17న గుడి నుంచి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. 28న ఆమె ఇంటి తలుపులకు అనుమానాస్పద పార్శిల్ వేలాడదీసి ఉంది. అందులో ‘కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సన్ .. బట్ బీ కేర్ ఫుల్..’అని రాసి ఉందని బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: జానీ మాస్టర్ కేసులో మరిన్ని కీలక అంశాలు
Comments
Please login to add a commentAdd a comment