అల్లు అర్జున్‌ అరెస్టు | Telugu Actor Allu Arjun Arrested In Sandhya Theatre Stampede Death Case, Time To Time Updates Inside | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ అరెస్టు

Published Sat, Dec 14 2024 4:01 AM | Last Updated on Sat, Dec 14 2024 1:41 PM

Telugu Actor Allu Arjun Arrested in Stampede Death Case

హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చినా రాత్రంతా చంచల్‌గూడ జైల్లోనే..

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసు.. అరెస్టు నుంచి అర్ధరాత్రి దాకా ఉత్కంఠ

శుక్రవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు 

బెడ్రూమ్‌ వరకు వెళ్లి అదుపులోకి తీసుకున్న తీరు 

చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌లో గంటన్నరపాటు విచారణ 

గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు.. నాంపల్లి కోర్టుకు తరలింపు 

14 రోజుల రిమాండ్‌.. చంచల్‌గూడ జైలుకు తరలింపు 

మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు 

తీర్పు కాపీ అందకపోవడంతో రాత్రి జైల్లోనే.. మంజీరా బ్యారక్‌కు తరలింపు.. రిమాండ్‌ ఖైదీ నంబర్‌ 7697 కేటాయింపు 

నేటి ఉదయం విడుదల కానున్న అల్లు అర్జున్‌

సాక్షి, హైదరాబాద్‌:  పుష్ప–2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్‌ విధింపు, చంచల్‌గూడ జైలుకు  తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకో­ర్టులో క్వాష్‌ పిటిషన్, బెయిల్‌ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అదే సమయంలో అల్లు అర్జున్‌ను తరలించిన ప్రతిచోటా భారీగా పోటె­త్తిన అభిమానులు, ప్రముఖుల రాకతో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. చివరికి అల్లు అర్జున్‌ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఆయనను శనివారం ఉదయం విడుదల చేయనున్నట్టు జైలు సూపరింటెండెంట్‌ ప్రకటించారు. 

బెడ్రూమ్‌ వరకు వెళ్లి అరెస్టు.. 
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి  ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. శుక్రవారం అల్లు అర్జున్‌ను అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఉదయం నుంచీ తగిన ఏర్పాట్లు చేసుకున్న టాస్‌్కఫోర్స్, చిక్కడపల్లి పోలీసులు 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్, భార్య స్నేహరెడ్డి ఇంట్లోనే ఉన్నారు. వారిద్దరూ బయటికి వెళ్లేవరకు సమీపంలోనే వేచి ఉన్న పోలీసులు.. ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించారు.

ఆ సమయంలో అల్లు అర్జున్‌ షార్ట్స్, టీ–షర్ట్‌ ధరించి.. ఇంట్లోని స్విమ్మింగ్‌ పూల్‌ సమీపంలో కూర్చుని ఫోన్‌ మాట్లాడుతున్నారు. ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. సంధ్య థియేటర్‌ కేసులో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘సరే మీ పని మీరు చేసుకోండి’ అంటూ పోలీసులకు సహకరించిన అల్లు అర్జున్‌.. బట్టలు మార్చుకోవడం కోసం రెండు నిమిషాలు సమయం కోరారు. దీనికి అనుమతించిన పోలీసులు.. ఆయన వెంటే బెడ్రూమ్‌ వరకు వెళ్లారు. ఈలోపు విషయం తెలుసుకున్న అరవింద్, స్నేహరెడ్డి, అర్జున్‌ సోదరుడు శిరీష్‌ ఇంటికి చేరుకున్నారు. 

అరెస్టు చేసినా ఫర్వాలేదు.. కాఫీ తాగండి! 
పోలీసులు అల్లు అర్జున్‌ను ఆయన ఇంటి మొదటి అంతస్తులో ఉన్న బెడ్రూమ్‌ నుంచి కింద ఉన్న హాల్‌లోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడున్న తండ్రి అల్లు అరవింద్‌ కాసింత ఆందోళన చెందారు. అర్జున్‌ను హత్తుకుని ‘అరెస్టు చేస్తున్నారు.. చెయ్యనీ.. నువ్వేమీ కంగారు పడకు’ అంటూ ధైర్యం చెప్పారు. తర్వాత అల్లు అర్జున్, పోలీసులు ఇంటి బయట పోరి్టకో వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పోలీసు వాహనాలను సిద్ధం చేశారు. అల్లు అర్జున్‌ కాఫీ తాగడానికి ఆగారు. ఇంట్లో నుంచి తెచ్చిన కాఫీని తన సమీపంలో ఉన్న ఓ పోలీసు అధికారికి ఇవ్వబోయారు. అధికారి కాఫీ వద్దని చెప్పడంతో ‘అది అదే (అరెస్టు చేసుకోండి).. ఇది ఇదే (కాఫీ తాగండి)’ అని నవ్వుతూ పేర్కొన్నారు. కాఫీ తాగడం పూర్తయ్యాక పోలీసులను ఉద్దేశించి ‘రెడీ సార్‌.. కాఫీ అయిపోయింది’ అంటూ ముందుకు నడిచారు. 

బెడ్రూం వరకు రావడం సరికాదు.. 
ఇంటి ముందు పోలీసు వాహనం ఎక్కే సమయంలో అల్లు అర్జున్‌ పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘బట్టలు మార్చుకోవడానికి వెళ్లి వస్తానని, ఒకరిని పంపాలని కోరితే ఇంత మంది పోలీసుల బెడ్రూమ్‌ వరకు వచ్చారు. నన్ను అరెస్టు చేయడంలో తప్పులేదు, తీసుకువెళ్లడం తప్పులేదు. కానీ రెండు నిమిషాలు టైమ్‌ ఇవ్వాలని కోరితే బెడ్రూమ్‌ వరకు వచ్చి ఇలా చేశారు. ఇది సరికాదు..’’ అని పేర్కొన్నారు. తర్వాత తన భార్యకు వీడ్కోలు చెప్పారు. అయితే అల్లు అర్జున్‌ పోలీసు వాహనం ఎక్కుతుండగా.. తానూ అదే వాహనంలో వస్తానంటూ అల్లు అరవింద్‌ బయలుదేరారు.

అయితే తన తండ్రి పోలీసు వాహనంలో రాకూడదని భావించిన అర్జున్‌.. ‘మీరు పోలీసు వాహనంలో ఉంటే మీడియాలో అలానే వస్తుంది. ఏ క్రెడిట్‌ వచ్చినా నా మీదనే ఉండాలి. గుడ్‌ అయినా, బ్యాడ్‌ అయినా..’’ అని ఆపేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్‌ను తీసుకుని చిక్కడపల్లి ఠాణాకు బయలుదేరారు. అప్పటికే ఆ ప్రాంతమంతా అల్లు అర్జున్‌ అభిమానులతో నిండిపోయింది. 

ఠాణాలో గంటన్నర పాటు విచారణ.. 
పోలీసులు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి ఠాణాలో దాదాపు గంటన్నర పాటు విచారించారు. ఠాణా వద్దకు అల్లు శిరీష్, అల్లు అరవింద్, అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి, దిల్‌ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పోలీసులు అల్లు అర్జున్‌తోపాటు శుక్రవారం ఉదయమే అదుపులోకి తీసుకున్న సంధ్య థియేటర్‌ పర్సనల్‌ మేనేజర్‌ జేబీ సంతోష్‌కుమార్‌ల అరెస్టు ప్రక్రియను పూర్తి చేసి, రిమాండ్‌ రిపోర్టులు తయారు చేశారు. ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నేరుగా సూపరింటెండెంట్‌ రాజకుమారి చాంబర్‌కు తీసుకెళ్లి.. అప్పటికే సిద్ధంగా ఉంచి పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం వారిని నాంపల్లి కోర్టుకు తరలించారు. గాంధీ ఆస్పత్రికి వచ్చిన అల్లు అరవింద్‌ వైద్య పరీక్షల సమయంలో కుమారుడి వెంటే ఉన్నారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. గాంధీ ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాలు సైతం అభిమానులతో నిండిపోయాయి. ఆస్పత్రి సిబ్బంది అభ్యర్థన మేరకు వారితో అల్లు అర్జున్‌ ఫొటోలు దిగారు. మరోవైపు సినీ నటుడు చిరంజీవి, ఆయన భార్య సురేఖ, నాగబాబుతోపాటు పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

14 రోజులు రిమాండ్‌ విధించిన కోర్టు 
అల్లు అర్జున్, సంతోష్‌లను చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు గంటన్నరకుపైగా ఇరుపక్షాల న్యాయవాదుల వాదోపవాదాలు జరిగాయి. చివరికి అల్లు అర్జున్, సంతో‹Ùలకు 14 రోజుల జ్యుడిíÙయల్‌ రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇరువురినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు అదే సమయంలో హైకోర్టులో క్వాష్‌ పిటిషన్, బెయిల్‌ పిటిషన్లపై వాదనలు జరిగాయి. దీంతో అల్లు అర్జున్‌ నాలుగు గంటలకుపైగా జైలు రిసెప్షన్‌లోనే వేచిచూశారు. చివరికి హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అవుతారని భావించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. 

రిమాండ్‌ ఖైదీ నంబర్‌ 7697తో.. 
అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసినా.. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్‌ పూర్తి కాకపోవడంతో ఆయన శుక్రవారం రాత్రి రిమాండ్‌ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చినా.. దానికి సంబంధించిన కాపీ రాత్రి వరకు కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాలేదు. అల్లు అర్జున్‌ న్యాయవాదులు సరి్టఫైడ్‌ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా.. ఒరిజినల్‌ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు. రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్‌ను జైలు రిసెప్షన్‌లోనే ఉంచిన సిబ్బంది.. ఆపై మంజీరా బ్యారక్‌లోని క్లాస్‌–1 రూమ్‌కు తరలించారు. రిమాండ్‌ ఖైదీగా నంబర్‌ 7697ను కేటాయించారు. అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌ రాత్రి 10.30 గంటల వరకు చంచల్‌గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్‌ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకువెళ్లాలని భావించారు. కానీ బాధగా  ప్రైవేట్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయారు. ఇక తమ అభిమాన హీరోకు బెయిల్‌ వచ్చినా విడుదల చేయకపోవడంపై అర్జున్‌ అభిమానులు జైలు వద్ద నిరసన తెలిపారు. 

క్షణక్షణం హైడ్రామా.. ఉత్కంఠ మధ్య.. 
ఉదయం 11.45: అల్లు అర్జున్‌ ఇంట్లోకి పోలీసులు 
మధ్యాహ్నం 12: అరెస్టు చేస్తున్నట్టు అల్లు అర్జున్‌కు చెప్పిన పోలీసులు 
12.20: జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి చిక్కడపల్లికి తరలింపు 
12.40: చిక్కడపల్లి ఠాణా వద్దకు వచ్చిన దిల్‌ రాజు, ఇతర ప్రముఖులు 
1.00: చిక్కపడపల్లి ఠాణాకు అల్లు అర్జున్‌తో చేరుకున్న పోలీసులు 
1.10: పోలీసుస్టేషన్‌ వద్దకు అల్లు శిరీష్, అరవింద్‌ 
1.15: రిమాండ్‌ రిపోర్టు సిద్ధం చేసిన దర్యాప్తు అధికారి 
2.00: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్‌ తరలింపు 
2.19: అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు ప్రారంభించిన వైద్యులు 
2.30: అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఆయన భార్య సురేఖ 
2.45: అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి 
3.10: నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్‌.. లాయర్ల వాదనలు 
5.00: అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధింపు 
5.28: చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్‌ తరలింపు 
5.40: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు 
7.15: బెయిల్‌ పేపర్లతో చంచల్‌గూడ జైలుకు చేరుకున్న లాయర్లు 
7.30: ఆ పత్రాలు సక్రమంగా లేకపోవడం, ఆర్డర్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాకపోవడంతో జైల్లోనే బన్ని 
10.00: జైలు రిసెప్షన్‌ నుంచి మంజీరా బ్యారక్‌కు అల్లు అర్జున్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement