సాక్షి, హైదరాబాద్: గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) స్పెషల్ షోలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి మార్నింగ్ స్పెషల్ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెనిఫిట్ షోలను రద్దు చేసి స్పెషల్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. దీనిపై పునరాలోచించాలని సూచించింది. దీంతో ప్రభుత్వం స్పెషల్ షోలను రద్దు చేసింది.
బెనిఫిట్ షోకు నిరాకరణ
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కాకపోతే అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు మాత్రం అనుమతి నిరాకరించింది. జనవరి 10న తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆరు షోలు వేసుకోవచ్చని పేర్కొంటూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జనవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్‌రాజ్‌తోపాటు సతీశ్‌కమాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
స్పెషల్ షో కూడా బెనిఫిట్ షోలాంటిదే!
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. గేమ్‌ఛేంజర్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకపక్క బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, మరోపక్క ప్రత్యేక షోలకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించింది. ప్రత్యేక షో కూడా ఒకరకంగా బెనిఫిట్ షో లాంటిదే అని వ్యాఖ్యానించింది. వేకువజాము షోలకు అనుమతి, టికెట్ ధరల పెంపును పునఃసమీక్షించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వేకువజాము షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెబుతూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మార్నింగ్ స్పెషల్ షోలను రద్దు చేసింది.
చదవండి: హీరోల బాడీగార్డులు కోట్లల్లో సంపాదిస్తారా? ఎట్టకేలకు క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment