రేఖది పల్లెటూరి నేపథ్యం. తండ్రిది వ్యవసాయం. తల్లి గృహిణి. పిల్లల పెంపకం బాధ్యత కూడా ఆమె మీదనే ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టి, పెరిగిన రేఖకు భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తయ్యాక ఆమెకు ఆనంద్‌తో పెళ్లయింది. ఆనంద్ ప్రభుత్వోద్యోగి. గృహిణిగా రేఖ సంతోషంగా బాధ్యతలను స్వీకరించింది. ఒక బిడ్డ పుట్టాక కూడా రేఖ తన పనులను హ్యాపీగా మేనేజ్ చేసుకునేది. రెండో బిడ్డ పుట్టాక కష్టమైంది. ఉదయాన్నే లేచి ఆనంద్‌కు బ్రేక్‌ఫస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల పనులు చూసుకోవడంతో చాలా అలసిపోయేది. ఆనంద్ తన పని ఒత్తిడిలో ఉండి ఇంటి పనుల్లో పెద్దగా సాయం చేసేవాడు కాదు.
కనిపించని దూరం..
భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ సమకూర్చే క్రమంలో రేఖ తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. ఎప్పుడైనా తన అవసరాల గురించి ఆమె మాట్లాడగానే ఆనంద్ వాటిని పట్టించుకునేవాడు కాదు. లేదంటే తన ఆఫీసు ఒత్తిడి గురించి చెప్పుకునేవాడు. దీంతో తన కష్టాన్ని ఆనంద్ గుర్తించడం లేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించసాగింది. క్రమేపీ వారిద్దరి మధ్య మానసికంగా దూరం పెరిగింది. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తుంది.
బ్యాలెన్సింగ్ ప్రిన్సిపుల్స్..
కుటుంబ జీవితం అనేది ఆటోమేటిక్‌గా సాఫీగా సాగిపోయే విషయం కాదు. క్రమం తప్పకుండా పరస్పర సహకారం, ఓపిక, కమ్యూనికేషన్ అవసరం. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా బలమైన బంధాన్ని కాపాడు కోవడం కోసం పాటించాల్సిన సూత్రాలివే.
1. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం
⇒ పరిస్థితి ఎంత క్లిష్టమైనదైనా, భావాలను వ్యక్తపరచడంలో ఓపెన్‌గా ఉండాలి
⇒ ఐ–సెంటెన్సెస్ వాడకం అంటే ‘నాకు ఇలా అనిపిస్తోంది’, ‘నేను ఇలా ఫీలవుతున్నాను’ అని చెబుతూ, దూషణలకు లేదా నిందలకు తావు లేకుండా కమ్యూనికేషన్ చేయండి. మీ ఆలోచనలను ఈ విధంగా పంచుకోవడం ద్వారా సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
2.బాధ్యతలను పంచుకోండి
⇒ గృహభారాలు ఒక్కరిపై మాత్రమే ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ఏమి చేయాలో కూర్చుని మాట్లాడి నిర్ణయించు కోవాలి. చిన్న విషయాల్లో కూడా భాగస్వామ్యం ఉంటే, ఎదుటి వాళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది
⇒ వారానికి ఒకసారి ఆ వారం ఎవరేం పనులు చేయాలనేది చర్చించుకోవడం ద్వారా బ్యాలెన్స్ను సాధించవచ్చు.
3.తమ శ్రమను గుర్తించండి
⇒ కుటుంబంలో ఎవరి శ్రమకైనా విలువ ఇవ్వడం అవసరం
⇒ భర్త తన పని ఒత్తిడిని, భార్య తన ఇంటి పనుల కష్టాన్ని పంచుకుంటే పరస్పర అవగాహన పెరుగుతుంది.
⇒ వారానికి ఒకసారి ఓపెన్‌గా అభినందనలు లేదా కృతజ్ఞత వ్యక్తం చేయడం బంధాన్ని బలపరుస్తుంది.
4. ప్రత్యేక సమయాన్ని కేటాయించండి
⇒ పనుల మధ్య ఎప్పుడు తనతో మాట్లాడతాడో అన్న నిరీక్షణ భార్య/భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది · వారానికి ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని ఒకరి కష్టాన్ని మరొకరు వినండి · మనసు పంచుకునే ఈ చర్చలు బంధం బలపడటానికి దోహదపడతాయి.
5. ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేయడం నేర్చుకోండి
⇒ గృహిణిగా స్త్రీ, పనిలో పురుషుడు ఇద్దరూ ఒత్తిడితో ఉంటారు
⇒ దీర్ఘ శ్వాస, ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ వంటి పద్ధతులు ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయి
⇒ అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.
6. సామాజిక ప్రమాణాలను పునఃపరిశీలించండి
⇒ భార్యాభర్తలు తప్పనిసరిగా వారి వారి పాత్రల్లోనే ఉండాలి అనే ఆలోచనను మార్చుకోండి
⇒ ఇంటి పనులు లేదా పిల్లల సంరక్షణ విషయంలో భర్త సహాయాన్ని సగర్వంగా కోరండి
⇒ గృహిణి కష్టం కూడా సమాన గౌరవానికి అర్హమైనది.
7. సానుకూల దృక్పథం ఏర్పరచుకోండి
⇒ ఇతరులను తప్పు పట్టడం కంటే, కలిసి పనిచేయడం ద్వారా సమస్యలపై దృష్టి పెట్టండి
⇒ ఒకరి కొకరు సహాయం చేసుకోవడం, ప్రశంసలు అందించుకోవడమనేది ప్రేమానుబంధాన్ని పెంచుతుంది.
8. స్వీయపరామర్శ
⇒ తన బాధ్యతల్ని సరైన పద్ధతిలో నిర్వర్తించలేకపోతున్నానని భావించడంలో తప్పు లేదు. కానీ ఆలోచనను సానుకూలంగా మలచుకోవాలి
⇒ ‘నేను కుటుంబం కోసం ఇలా చేయగలిగాను’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి
⇒ అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. దానివల్ల మానసిక శక్తి పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment