కవిత, సురేష్ తమ బిడ్డ సుమనతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. అక్కడ ఒక బొమ్మ సుమనకు నచ్చింది. అది కావాలని అడిగింది. ఇప్పటికే ఇంట్లో చాలా ఉన్నాయి, వద్దన్నారు. లేదు, నాకది కావాలి అని మంకుపట్టు పట్టింది. పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతే! ‘‘నాకా బొమ్మ కావాలీ’’ అంటూ కిందపడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఎంత ప్రయత్నించినా కంట్రోల్ అవ్వడం లేదు. మాల్‌లో అందరూ వాళ్లనే చూస్తున్నారు. సిగ్గనిపించింది. చేసేదేంలేక ఆ బొమ్మ కొనిచ్చారు.
ఇది చదువుతుంటే మీ అనుభవమూ గుర్తొచ్చింది కదా! పిల్లలు తమకు కావాల్సిన దానికోసం మొండిపట్టు పట్టడం, హఠం చేయడం తల్లిదండ్రులందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో ఎలా స్పందించాలో తెలియక, పిల్లలు అడిగింది ఇచ్చేసి సమస్య నుంచి బయటపడతారు. అయితే అలా చేయడం వల్ల పిల్లల్లో అలాంటి మొండితనం తగ్గకపోగా, పెరుగుతుందని, అలాంటి ప్రవర్తన పెరిగేందుకు తామే కారణమవుతున్నామని చాలామంది తల్లిదండ్రులకు తెలియదు.
పిల్లల్లో మొండిపట్టు సాధారణం
పిల్లల్లో మంకుతనం తమ భావోద్వేగాలను, బాధను ప్రదర్శించే ప్రక్రియ. తమ కోపం, నిరాశ, విచారం లేదా నిరాశ వంటి తీవ్రమైన భావోద్వేగాలను ‘టాంట్రమ్స్’ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. ఆ క్రమంలో అరుస్తారు, తంతారు, కొడతారు, వస్తువులను విసిరేస్తారు, ఊపిరి బిగపడతారు లేదా కదలకుండా కూర్చుంటారు. వయసు పెరిగే కొద్దీ, పిల్లలు భాష, భావోద్వేగాల నియంత్రణ పెంపొందించుకునే కొద్దీ ఈ ప్రవర్తన తగ్గుతుంది.
సాధారణంగా ఈ మంకుతనం 15 నిమిషాలు ఉంటుంది. కానీ ఆ సమయంలో ఆ ప్రవర్తనకు తల్లిదండ్రులు ఏమాత్రం అటెన్షన్ చూపినా అది రెట్టింపవుతుంది. ‘వద్దు’ అని చెప్పింది ఇచ్చారంటే, ఆ ప్రవర్తనను ప్రోత్సహించినట్లు అవుతుంది. దాంతో భవిష్యత్తులో వాళ్లకు ఏం కావాల్సి వచ్చినా అదే మంకుతనం ప్రదర్శిస్తారు. అందువల్ల పిల్లల్లో ఈ మంకుతనం, మొండితనం తగ్గాలంటే వారికి భావోద్వేగాల గురించి అవగాహన కల్పించడం, వాటినెలా ప్రాసెస్ చేయాలో, కోపాన్నెలా నియంత్రించడం నేర్పించాలి.
మొండితనానికి విరుగుడు...
మూడేళ్లు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు చిన్నచిన్న విషయాలకే నిరుత్సాహానికి గురవుతారు. తమ అవసరాలను ఎలా కమ్యూనికేట్ చేయాలో అప్పుడప్పుడే నేర్చుకుంటుంటారు. సొంతంగా పనిచేయాలని, అన్వేషించాలని కోరుకుంటారు. వాటిని ఎవరైనా అడ్డుకున్నప్పుడు మొండితనం ప్రదర్శిస్తారు. అందువల్ల ఏ విషయం వారిలో మొండితనాన్ని ప్రేరేపిస్తుందో తల్లిదండ్రులు గుర్తించాలి.
బిడ్డలు తమ భావోద్వేగాలను మాటల్లో ఎలా వ్యక్తీకరించాలో ఇంకా నేర్చుకోలేదు. కాబట్టి టాంట్రమ్స్ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. అందువల్ల మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి భావాలను వివరించే పదాలను ఉపయోగించండి. దానివల్ల తమ అవసరాలు, కోరికలు, ఆందోళనల గురించి మీకు మాటల్లో చెప్పే వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు సినిమా చూస్తున్నప్పుడు, పాత్రలు భావోద్వేగాలను వ్యక్తం చేసినప్పుడు వాటి గురించి చెప్పండి. బొమ్మల పుస్తకాల్లో సంతోషంగా, దుఃఖంగా, కోపంతో, ఆకలితో లేదా అలసిపోయిన వంటి భావాలను వారికి చూపించండి. మీ భావోద్వేగాలను చెప్పడం ద్వారా వారు దాన్ని అనుకరిస్తారు.
తమకు కావాలనుకున్నది దొరకని సందర్భాల్లో కూడా పిల్లలు సానుకూల ప్రతిచర్యలు చూపినప్పుడు, తగిన ప్రవర్తనలో నిమగ్నమైనప్పుడు వారిని మెచ్చుకోండి, బహుమతి ఇవ్వండి. ఉదాహరణకు, మీ బిడ్డ కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేయకుండా శాంతంగా ప్రవర్తించినప్పుడు ‘‘నువ్విలా కూల్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అని మెచ్చుకోండి.
పిల్లలు మొండితనంతో ప్రవర్తిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కష్టమే. కానీ ఆ సమయంలో మీరే కోపంతో అరిస్తే లేదా కొడితే.. అలాంటి సందర్భాల్లో అదే సరైన ప్రవర్తనని పిల్లలు భావిస్తారు, దాన్నే అనుకరిస్తారు. అందువల్ల పిల్లలు మంకుతనం చూపినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. దాన్ని చూసి వాళ్లూ నేర్చుకుంటారు.
దారి మళ్లింపు అనేది మరో ప్రభావవంతమైన వ్యూహం. ముందుగా, పిల్లల మంకుపట్టుకు కారణమయ్యే ట్రిగ్గర్‌ను గుర్తించండి. బహుశా వారు దుకాణంలో ఒక బొమ్మను చూసి కావాలంటున్నారు. దాన్నుంచి వారి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, ‘మీ దగ్గర బొమ్మ లేదు కాబట్టి ఏడవడం సరికాదు. అక్కడ చాలా ఆటలున్నాయి. కలిసి ఆడుకుందాం రా!’
పిల్లలకు ఆప్షన్స్ ఇవ్వడం వారికి సాధికారతను అందిస్తుంది, మొండిపట్టును నివారిస్తుంది. ఉదాహరణకు, ప్లేగ్రౌండ్‌లో ఇంకా ఉండాలని మొండిపట్టు పట్టినప్పడు ‘సరే, ఇంకో ఐదు నిమిషాలు ఆడుకుంటావా లేక ఇంటికి వెళ్లి ఐస్క్రీమ్ తిందామా?’ అని నిర్ణయం వారికే వదిలివేయవచ్చు. టాంట్రమ్స్ నియంత్రణకు మీరు ఎంచుకున్న పద్ధతులను నిలకడగా ఉపయోగించడం ద్వారా మీ పిల్లల్లో మొండితనాన్ని కొద్ది కాలంలోనే నియంత్రించవచ్చు.
-సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment