Kids Mind
-
పిల్లల్లో మొండితనం.. మంచికా..? చెడుకా..?
కవిత, సురేష్ తమ బిడ్డ సుమనతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. అక్కడ ఒక బొమ్మ సుమనకు నచ్చింది. అది కావాలని అడిగింది. ఇప్పటికే ఇంట్లో చాలా ఉన్నాయి, వద్దన్నారు. లేదు, నాకది కావాలి అని మంకుపట్టు పట్టింది. పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంతే! ‘‘నాకా బొమ్మ కావాలీ’’ అంటూ కిందపడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఎంత ప్రయత్నించినా కంట్రోల్ అవ్వడం లేదు. మాల్లో అందరూ వాళ్లనే చూస్తున్నారు. సిగ్గనిపించింది. చేసేదేంలేక ఆ బొమ్మ కొనిచ్చారు. ఇది చదువుతుంటే మీ అనుభవమూ గుర్తొచ్చింది కదా! పిల్లలు తమకు కావాల్సిన దానికోసం మొండిపట్టు పట్టడం, హఠం చేయడం తల్లిదండ్రులందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఆ సమయంలో ఎలా స్పందించాలో తెలియక, పిల్లలు అడిగింది ఇచ్చేసి సమస్య నుంచి బయటపడతారు. అయితే అలా చేయడం వల్ల పిల్లల్లో అలాంటి మొండితనం తగ్గకపోగా, పెరుగుతుందని, అలాంటి ప్రవర్తన పెరిగేందుకు తామే కారణమవుతున్నామని చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. పిల్లల్లో మొండిపట్టు సాధారణం పిల్లల్లో మంకుతనం తమ భావోద్వేగాలను, బాధను ప్రదర్శించే ప్రక్రియ. తమ కోపం, నిరాశ, విచారం లేదా నిరాశ వంటి తీవ్రమైన భావోద్వేగాలను ‘టాంట్రమ్స్’ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. ఆ క్రమంలో అరుస్తారు, తంతారు, కొడతారు, వస్తువులను విసిరేస్తారు, ఊపిరి బిగపడతారు లేదా కదలకుండా కూర్చుంటారు. వయసు పెరిగే కొద్దీ, పిల్లలు భాష, భావోద్వేగాల నియంత్రణ పెంపొందించుకునే కొద్దీ ఈ ప్రవర్తన తగ్గుతుంది. సాధారణంగా ఈ మంకుతనం 15 నిమిషాలు ఉంటుంది. కానీ ఆ సమయంలో ఆ ప్రవర్తనకు తల్లిదండ్రులు ఏమాత్రం అటెన్షన్ చూపినా అది రెట్టింపవుతుంది. ‘వద్దు’ అని చెప్పింది ఇచ్చారంటే, ఆ ప్రవర్తనను ప్రోత్సహించినట్లు అవుతుంది. దాంతో భవిష్యత్తులో వాళ్లకు ఏం కావాల్సి వచ్చినా అదే మంకుతనం ప్రదర్శిస్తారు. అందువల్ల పిల్లల్లో ఈ మంకుతనం, మొండితనం తగ్గాలంటే వారికి భావోద్వేగాల గురించి అవగాహన కల్పించడం, వాటినెలా ప్రాసెస్ చేయాలో, కోపాన్నెలా నియంత్రించడం నేర్పించాలి. మొండితనానికి విరుగుడు... మూడేళ్లు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు చిన్నచిన్న విషయాలకే నిరుత్సాహానికి గురవుతారు. తమ అవసరాలను ఎలా కమ్యూనికేట్ చేయాలో అప్పుడప్పుడే నేర్చుకుంటుంటారు. సొంతంగా పనిచేయాలని, అన్వేషించాలని కోరుకుంటారు. వాటిని ఎవరైనా అడ్డుకున్నప్పుడు మొండితనం ప్రదర్శిస్తారు. అందువల్ల ఏ విషయం వారిలో మొండితనాన్ని ప్రేరేపిస్తుందో తల్లిదండ్రులు గుర్తించాలి. బిడ్డలు తమ భావోద్వేగాలను మాటల్లో ఎలా వ్యక్తీకరించాలో ఇంకా నేర్చుకోలేదు. కాబట్టి టాంట్రమ్స్ రూపంలో వ్యక్తం చేస్తుంటారు. అందువల్ల మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి భావాలను వివరించే పదాలను ఉపయోగించండి. దానివల్ల తమ అవసరాలు, కోరికలు, ఆందోళనల గురించి మీకు మాటల్లో చెప్పే వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు సినిమా చూస్తున్నప్పుడు, పాత్రలు భావోద్వేగాలను వ్యక్తం చేసినప్పుడు వాటి గురించి చెప్పండి. బొమ్మల పుస్తకాల్లో సంతోషంగా, దుఃఖంగా, కోపంతో, ఆకలితో లేదా అలసిపోయిన వంటి భావాలను వారికి చూపించండి. మీ భావోద్వేగాలను చెప్పడం ద్వారా వారు దాన్ని అనుకరిస్తారు. తమకు కావాలనుకున్నది దొరకని సందర్భాల్లో కూడా పిల్లలు సానుకూల ప్రతిచర్యలు చూపినప్పుడు, తగిన ప్రవర్తనలో నిమగ్నమైనప్పుడు వారిని మెచ్చుకోండి, బహుమతి ఇవ్వండి. ఉదాహరణకు, మీ బిడ్డ కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేయకుండా శాంతంగా ప్రవర్తించినప్పుడు ‘‘నువ్విలా కూల్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అని మెచ్చుకోండి. పిల్లలు మొండితనంతో ప్రవర్తిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కష్టమే. కానీ ఆ సమయంలో మీరే కోపంతో అరిస్తే లేదా కొడితే.. అలాంటి సందర్భాల్లో అదే సరైన ప్రవర్తనని పిల్లలు భావిస్తారు, దాన్నే అనుకరిస్తారు. అందువల్ల పిల్లలు మంకుతనం చూపినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. దాన్ని చూసి వాళ్లూ నేర్చుకుంటారు. దారి మళ్లింపు అనేది మరో ప్రభావవంతమైన వ్యూహం. ముందుగా, పిల్లల మంకుపట్టుకు కారణమయ్యే ట్రిగ్గర్ను గుర్తించండి. బహుశా వారు దుకాణంలో ఒక బొమ్మను చూసి కావాలంటున్నారు. దాన్నుంచి వారి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, ‘మీ దగ్గర బొమ్మ లేదు కాబట్టి ఏడవడం సరికాదు. అక్కడ చాలా ఆటలున్నాయి. కలిసి ఆడుకుందాం రా!’ పిల్లలకు ఆప్షన్స్ ఇవ్వడం వారికి సాధికారతను అందిస్తుంది, మొండిపట్టును నివారిస్తుంది. ఉదాహరణకు, ప్లేగ్రౌండ్‌లో ఇంకా ఉండాలని మొండిపట్టు పట్టినప్పడు ‘సరే, ఇంకో ఐదు నిమిషాలు ఆడుకుంటావా లేక ఇంటికి వెళ్లి ఐస్‌క్రీమ్ తిందామా?’ అని నిర్ణయం వారికే వదిలివేయవచ్చు. టాంట్రమ్స్ నియంత్రణకు మీరు ఎంచుకున్న పద్ధతులను నిలకడగా ఉపయోగించడం ద్వారా మీ పిల్లల్లో మొండితనాన్ని కొద్ది కాలంలోనే నియంత్రించవచ్చు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
దేశంలో దొంగలు పడ్డారు
వీధి చివర మొగలో ఏడు పెంకులాట ఆడే పిల్లలు కనిపిస్తున్నారా? మండు వేసవిలో మిట్టమధ్యాహ్నం ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని అల్టిమేటం జారీచేసే అమ్మానాన్నల కళ్లు గప్పి ఆరుబయటకు వచ్చి జోరీ బాల్ ఆడే కుర్రాళ్లు కనిపిస్తున్నారా? బంతీ బ్యాటూ లేకపోతే రంగు రంగుల గోళీకాయలతో వీధుల్లో అంతర్జాతీయ మ్యాచులు ఆడే బాలలు కనిపిస్తున్నారా? ఎర్ర గోళీని పచ్చగోళీతో కొట్టేసి గెలిచిన ఆనందంలో కేరింతలు కొట్టేవాళ్లనీ, ఓడిపోయి గోళీ పోగొట్టుకుని రాజ్యం కోల్పోయిన రాజులా బెంగపడే వాళ్లనీ చూశారా? ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు పోగు చేసి వాటితో బొమ్మ గడియారాలు తయారు చేసే చిన్ని చిన్ని కళాకారులు కనిపిస్తున్నారా? సిగరెట్ ప్యాకెట్లనే చించి బచ్చాలాట ఆడుకునే బచ్చాల్ని ఈ మధ్య ఎక్కడైనా చూశారా? ఏ వెంకన్న కాపు పొలంలోనో... కాపరి లేని సమయం చూసి మామిడి చెట్లు ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడే అబ్బాయిలు మురిపిస్తున్నారా? ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అంటూ దాక్కున్న వాళ్లని పట్టుకోడానికి నానా తంటాలు పడే పిల్లల ఒలింపిక్స్ క్రీడ ఇప్పటికీ ఉందా? గూటీ బిళ్ల లేదా గిల్లీ దండా ఆటతో వీధిలో అటూ ఇటూ పోయే వాళ్లని భయపెడుతూ తమాషా చూసే పిల్లల ఆనందాన్ని చూశారా? ఇంట్లో పెద్దలు మరీ చండ శాసనుల్లా బయటకు వెళ్ళనీయకుండా ఆపేస్తే ఇళ్ల అరుగుల మీదే పులీ మేక ఆడే పిల్లలు ఇంకా ఆడుతున్నారా? మంచి ఎండలో ఏ మధ్యాహ్నమో ఐస్ ఫ్రూట్ అబ్బాయి ‘ఐస్... పాలైస్’ అంటూ అరుచుకుంటూ వస్తే అమాంతం నిద్ర నటనలోంచి బయటపడి ఐస్ కొని పెట్టమని పెద్దాళ్లను బతిమాలే పిల్లల ఆరాటం చూశారా? (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?) ఇళ్ల లోగిళ్లలో రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు తొక్కుడు బిళ్ల ఆటలు ఆడుతున్నారా? తాటి ముంజెలను మూడు చక్రాల బళ్లుగా తయారు చేసుకుని వాటినే మెర్సిడెస్ బెంజ్ కారులా సంబరపడిపోయే పిల్ల ఇంజినీర్ల బాలానందాన్ని చూశారా? నదీ తీరాల్లో ఇసుకతో ఇళ్లు కట్టేసి గర్వంగా నవ్వుకునే బుల్లి సివిల్ ఇంజనీర్లు కొత్త వెంచర్లు వేస్తున్నారా లేదా? నెమలి పింఛాన్ని పుస్తకం మధ్యలో పెట్టుకుని కొబ్బరి మట్టపై నూగును తురిమి, పింఛానికి ఆహారంగా పెట్టి ప్రతీ రోజూ పింఛం ఎంత పెరిగిందో పరీక్షించుకునే అమాయక బాల్యంలోని అందాన్ని చూశారా? (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!) వేసవిలో పూడిక తీతల పనుల కోసం కాలువలు బంద్ చేసే సమయంలో నడుం లోతు ఉన్న నీళ్లల్లో రోజూ దొంగచాటుగా ఈత కొట్టి తడిసిన జుట్టుతో ఇంట్లో డిటెక్టివ్లకు దొరికిపోయి వీపు మీద విమానం మోత మోగగానే గుక్కపెట్టి ఏడ్చే బాల్యాన్ని చూశారా? చిల్ల పెంకును కాలువ నీళ్లపై విసిరి అది ఎన్ని ఎక్కువ గంతులు వేస్తూ ముందుకు పోతే అంత గొప్ప అని పోటీలు పడి ఆడుకునే కుర్రాళ్లు ఇంకా ఉన్నారా? (చదవండి: ఋతు ఘోష) ఏవీ కనపడ్డం లేదు కదూ! మన ఆటలు మన ఆనందాలు రేపటి తరపు మధుర జ్ఞాపకాలు అన్నీ కూడా ఎత్తుకుపోయారు. మన నుండి మన ఆత్మను దోచుకుపోయారు. మన జీవితాల నుండి వెలుగులను దోచుకుపోయారు. ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే మన దేశంలో అడుగు పెట్టాయో అప్పుడే కార్పొరేట్ దొంగలు అవతరించారు. వారే మన ఊళ్లల్లోని చేతి వృత్తులను ఎత్తుకుపోయారు. మన పేదల ఉపాధి అవకాశాలు ఎత్తుకుపోయారు. ఊళ్లల్లో జీవాన్ని, బాలల్లో ఆనందాన్ని, మనుషుల్లో మానవత్వాన్ని... అన్నింటినీ ఎత్తుకుపోయారు. అన్నీ దోచుకుపోయిన ఘరానా దొంగలను పట్టుకోండని ఎవరికి చెప్పాలి? ఒక్కసారి మళ్లీ బాల్యంలోకి రివైండ్ అయిపోయి గత కాలపు ఆటలు మరోసారి ఆడుకుంటే బాగుండునని అనిపిస్తోంది కదూ! కార్పొరేట్ ప్రపంచంలో ఈ కల బహుశా ఇక ఎప్పటికీ నెరవేరదేమో? పగటి కలలోనే ఇక ఈ ఆటలు ఆడుకోవాలేమో? – సి.ఎన్.ఎస్.యాజులు -
వద్దంటే వినదు... వారించేదెలా?
మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. చాలా హుషారుగా ఉంటాడు. కానీ వాడితో ఒక్కటే సమస్య. చిన్న మాట అంటే చాలు, ఏడ్చేస్తాడు. ఎంత ఏడుస్తాడంటే... ఏం చెప్పినా, ఏం ఇచ్చినా ఊరుకోడు. ప్రతి చిన్నదానికీ ఏడుస్తుంటే ఒక్కోసారి విసుగొచ్చేస్తుంది. అలా ఏడవడం మంచిది కాదని ఎంత చెప్పినా వినడు. అలా చెప్పినందుకు ఇంకా గట్టిగా ఏడుస్తాడు. పెద్దవాడవుతున్నా తన ప్రవర్తన ఎందుకు మారడం లేదు? ఇలా ఊరికూరికే ఏడవడం అనేది మానసిక సమస్యా? - శ్రీవిద్య, హైదరాబాద్ బాబు అలిగినప్పుడు మీరు బాగా బతిమాలతారనుకుంటా. అది బాగా అలవాటై ఇలా చేస్తున్నట్టున్నాడు. క్రమశిక్షణ నేర్పే క్రమంలో ఏదైనా అంటే ఇంత ఉక్రోషం రావడం అంత మంచిది కాదు. కొన్నాళ్లు అందరూ తనని బతిమాలడం మానేయండి. ఏడిస్తే ఏడవనివ్వండి. ఏడ్చి ఏడ్చి తనే ఊరుకుంటాడు. ఏడుస్తున్నాడు కదా అని మీరు జాలిపడి బతిమాలడం మొదలుపెడితే మళ్లీ మొండికేస్తాడు. కాబట్టి ఏడుపు ఆపి రమ్మని చెప్పండి. వస్తే వస్తాడు. లేదంటే తననలా వదిలేసి ఎవరి పని వాళ్లు చూసుకోండి. ఎంతకీ పిలవకపోయేసరికి విషయం అర్థమై తనే దిగి వస్తాడు. అయితే ఒకరు వదిలేసి నప్పుడు మరొకరు చేరదీయడం చేయ వద్దు. అందరూ ఒకే మాట మీద ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. బాబుది మానసిక సమస్యేమీ కాదు. కేవలం తన మాట చెల్లేలా చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. చెల్లదని తెలిసిన రోజున తనే దారికొస్తాడు. కంగారు పడకండి. మా పాప ఐదో త రగతి చదువుతోంది. మహా చురుగ్గా ఉంటుంది. కాకపోతే తనతో ఒకటే సమస్య. తన వస్తువులు వాళ్లకీ వీళ్లకీ ఇచ్చేస్తూ ఉంటుంది. స్కూలు నుంచి వచ్చాక చూస్తే ఏదో ఒక వస్తువు ఉండదు. ఏం చేశావ్ అని అడిగితే... ఫలానా వాళ్లకి లేదు, అందుకే ఇచ్చేశాను అంటుంది. అలా ఎందుకిచ్చావ్ అంటే వాళ్లకు లేదు, పాపం కదా అంటుంది. ఆ మంచితనం ఉండటం మంచిదే. కానీ ఎప్పుడైనా ఓసారి అంటే ఫర్వాలేదు. ఇలా తరచూ అంటే కొని ఇవ్వడం మాకూ ఇబ్బందే కదా. పాపపై చెడు ప్రభావం పడకుండా తనకెలా నచ్చజెప్పాలో సలహా ఇవ్వండి. - పి.రంగనాథ్, రేపల్లె పాప తన వస్తువులు అందరికీ ఎందుకు ఇచ్చేస్తుందో తెలుసుకోవడం అవసరం. అవన్నీ ఇస్తే వాళ్లు తనతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారని ఇస్తోందా లేక వాళ్ల దగ్గర లేనివి తన దగ్గర ఉన్నందుకు గిల్టీగా ఫీలవుతోందో? లేదంటే వాళ్లకు లేవని జాలిపడి సాయం చేయాలనుకుంటోందా? నెమ్మదిగా తనతో మాట్లాడి తన సమాధానం ఏమిటో తెలుసుకోండి. ఇలాంటివన్నీ చప్పున అడిగి తేల్చేసుకునే విషయాలు కావు. పాప మానసిక స్థితి, ఆలోచనలపై ఇదంతా ఆధారపడి ఉంది. కాబట్టి తను అలా చేసినప్పుడల్లా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండండి. గట్టిగా అరవొద్దు. ఫ్రెండ్లీగా మాట్లాడి తెలుసుకోండి. తన సమాధానాన్ని బట్టి దీనికి పరిష్కారం ఉంటుంది. జాలిపడి ఇస్తోంటే అది తప్పు కాదు. కానీ మన పరిస్థితి కూడా అందరికీ అన్నీ ఇచ్చేసేంత గొప్పది కాదు, మనకీ కష్టాలు ఉన్నాయి అన్న విషయాన్ని మెల్లగా నచ్చజెప్పండి. తను అలా ఇవ్వడం వల్ల మీరు పడే ఇబ్బంది గురించి తెలియజేయండి. అలా కాకుండా గిల్టీగా ఫీలవుతున్నా, తనతో వాళ్లు ఫ్రెండ్లీగా ఉండటం కోసం ఇచ్చేస్తున్నా ఓ మంచి కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు తనకు అర్థమయ్యేలా వివరించి ఆ అలవాటు మాన్పిస్తారు. మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కానీ వాడు సరిగ్గా చదవడం లేదు. అదేంటో వాడసలు హుషారుగానే ఉండడు. ఎప్పుడూ బద్దకంగా, నిద్రపోతున్నట్టుగా ఉంటాడు. పొద్దున్నే లేవడు. పుస్తకం పట్టుకుని చదువుతున్నట్టు నటిస్తూ నిద్రపోతుంటాడు. క్లాస్‌లో కూడా ఒక్కోసారి నిద్రపోతాడని టీచర్లు కంప్లయింట్ చేస్తున్నారు. ఇంత నిద్ర రావడం ఏదైనా సమస్యా? - కె.నీలిమ, నిజాంపేట బాబు ఇంతకుముందు బాగా చదివి, కేవలం ఈ మధ్యే ఇలా ఉంటున్నాడా లేక ఎప్పుడూ ఇంతేనా అన్నది మీరు చెప్పలేదు. తనకు నిజంగా నిద్ర వస్తోందా లేక చదవడం ఇష్టం లేక, చదవలేక అలా ఉంటున్నాడా అన్నది కూడా స్పష్టంగా రాయలేదు. రాత్రి నిద్రపోయినా పగలంతా తనకు నిద్ర వస్తోంది అంటే కనుక ఒక్కసారి స్లీప్ స్పెషలిస్టుకు కానీ, ఈఎన్టీ స్పెషలిస్టుకు గానీ చూపించండి. ఎందుకంటే, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే సమస్య ఉంటే అలా నిద్ర వస్తుంది. అయితే అది మానసిక సమస్య కాదు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏ సమస్యా లేకుండా బాబు కేవలం నిద్ర వచ్చినట్టు నటిస్తూ కనుక ఉంటే... ఒక్కసారి చైల్డ్ సైకియాట్రిస్టుకు చూపించండి. చదువుకు సంబంధించిన సమస్యలు (ఐక్యూ కానీ కాన్సట్రేషన్ కానీ తక్కువ ఉండటం) ఏవైనా ఉన్నాయేమో పరీక్షిస్తారు. తన సమస్య ఏమిటో తెలిస్తే బాబుని ఈ స్థితి నుంచి బయట పడేయడం ఎలానో తెలుస్తుంది.