సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు | World Suicide Prevention Day | Sakshi
Sakshi News home page

సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు

Published Tue, Sep 10 2024 9:27 AM | Last Updated on Tue, Sep 10 2024 9:42 AM

World Suicide Prevention Day

ఆత్మహత్య లేదా బలవన్మరణం అత్యంత బాధాకరమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8,00,000 మంది ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. జాతీయ నేర పరిశోధన బ్యూరో (NCRB) ప్రకారం, 2021లో మన దేశంలో 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే, రోజుకు 450 బలవన్మరణాలు. ప్రతి నాలుగు నిమిషాలకో జీవితం కోల్పోవడం. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. వ్యక్తుల నిశ్శబ్ద బాధను ప్రతిబింబిస్తాయి. ప్రతి ఆత్మహత్యకు, 20 కి పైగా ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలను నివారించే ప్రయత్నాలను ప్రోత్సహించడం, అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ‘ఆత్మహత్య నివారణ దినోత్సవం’ జరుపుకుంటాం. అవగాహన లోపమే ప్రధాన సమస్య.. భారతదేశంలో ఆత్మహత్యలను నివారించడంలో ప్రధాన అడ్డంకి, మానసిక ఆరోగ్యం చుట్టూ ఉండే అపహాస్యం. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది సహాయం కోసం బయటకు రావడానికి సిగ్గుపడుతున్నారు. ఈ మౌనం ప్రమాదకరం, ఇది ప్రజలను ఒంటరితనం, నిరాశలోకి నెట్టేస్తుంది. ఇవన్నీ కలిసి బలవన్మరణం వైపు నెట్టేస్తాయి.  

  • కొన్ని ముఖ్యమైన గణాంకాలు... 

  • దేశంలో మొత్తం బలవన్మరణాల్లో 34.5 శాతం 18-30 ఏళ్ల మధ్య ఉన్న యువకులే.

  • బలవన్మరణాల్లో 71 శాతం పురుషులే. మహిళల్లో 15-39 ఏళ్ల మధ్యవారే ఎక్కువ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

  • సామాజిక, ఆర్థిక సమస్యలు వల్ల 10,881 మంది రైతులు 2021లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

  • కొన్ని ప్రధాన కారణాలు... 

  • పరీక్షల ఒత్తిడి, పోటీ, భవిష్యత్తు పట్ల భయంతో 2021లో 13,089 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

  • ఉద్యోగాలు కోల్పోవడం, అప్పులు, పేదరికం ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.

  • కుటుంబ విభేదాలు, వివాహ పరమైన సమస్యలు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.

  • డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు చికిత్స లేకపోతే తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

  • ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలు ఆత్మహత్య నివారణలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించవచ్చు. అందుకోసం ముందుగా ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి. అవి... 
    నేను చనిపోవాలని అనుకుంటున్నాను" లేదా "నేను పుట్టకపోయినా బాగుండేది" అంటూ ఆత్మహత్య గురించి మాట్లాడటం.

  • కత్తి, తాడు, నిద్రమాత్రలు లాంటి వాటిని సమకూర్చుకోవడం.

  •  ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండాలని కోరుకోవడం. 

  •  ఒక రోజు అత్యంత సంతోషంగా, మరుసటి రోజు తీవ్ర నిరుత్సాహంగా ఉండటం వంటి మూడ్ స్వింగ్ కలిగి ఉండటం. 

  • సమస్యలో చిక్కుకున్నట్లు, బయటపడే మార్గం లేనట్లు, నిస్సహాయంగా ఉన్నట్లు మాట్లాడటం. 

  •  మద్యం లేదా మాదకద్రవ్యాల వాడకం పెరగడం. 

  •  తిండి, నిద్రలాంటి సాధారణ దినచర్యలలో మార్పు. 

  •  డ్రగ్స్ వాడటం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి ప్రమాదకర లేదా స్వీయ-విధ్వంసక పనులు చేయడం 

  •  తన వస్తువులను, వ్యవహారాలను ఇతరులకు అప్పజెప్పడం. 

  • మళ్లీ కనిపించనట్లుగా వీడ్కోలు చెప్పడం. 

 వ్యక్తిత్వంలో ఆకస్మిక మార్పులు, తీవ్ర ఆత్రుత లేదా ఆందోళన చెందడం. మీరేం చేయవచ్చు... మీ సన్నిహితుల్లో ఎవరిలోనైనా ఎవరికైనా ఆత్మహత్య యత్నం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మాట్లాడండి. మీ మద్దతును, సహాయాన్ని, సహకారాన్ని అందించండి. మీకు సాధ్యం కాదనుకున్నప్పుడు సైకాలజిస్ట్ ను సంప్రదించండి. 
ఆత్మహత్య గురించి అడగడాన్ని భయపడవద్దు. ఇది వాళ్లకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తుంది. 

 జడ్జ్మెంట్ లేకుండా, ప్రేమగా వారు చెప్పేది వినండి. వారు ఒంటరిగా ఉన్నారని అనిపించనీయకుండా సపోర్ట్ చేయండి. 

 ఒంటరిగా వదిలిపెట్టకుండా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. 

 వారి దగ్గర ఉన్న కత్తులు, తాళ్లు, మాత్రల్లాంటి ప్రమాదకరమైన వస్తువులు తీసివేయండి. 

 మీరు లేదా మీకు తెలిసినవారు ఆత్మహత్య ఆలోచనలకు గురవుతున్నట్లయితే, వెంటనే హైదరాబాద్ లో ఉన్న రోష్ణి ఆత్మహత్యల నివారణ సంస్థకు (081420 20033 ⋅ 081420 20044) ఫోన్ చేసి సహాయం పొందండి.  అప్పటికీ మీకు ఉపశమనం కలగకపోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవాలి.


సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com

గమనిక:
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement