Suicide Prevention Day
-
సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు
ఆత్మహత్య లేదా బలవన్మరణం అత్యంత బాధాకరమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8,00,000 మంది ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. జాతీయ నేర పరిశోధన బ్యూరో (NCRB) ప్రకారం, 2021లో మన దేశంలో 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే, రోజుకు 450 బలవన్మరణాలు. ప్రతి నాలుగు నిమిషాలకో జీవితం కోల్పోవడం. ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదు. వ్యక్తుల నిశ్శబ్ద బాధను ప్రతిబింబిస్తాయి. ప్రతి ఆత్మహత్యకు, 20 కి పైగా ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలను నివారించే ప్రయత్నాలను ప్రోత్సహించడం, అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ‘ఆత్మహత్య నివారణ దినోత్సవం’ జరుపుకుంటాం. అవగాహన లోపమే ప్రధాన సమస్య.. భారతదేశంలో ఆత్మహత్యలను నివారించడంలో ప్రధాన అడ్డంకి, మానసిక ఆరోగ్యం చుట్టూ ఉండే అపహాస్యం. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది సహాయం కోసం బయటకు రావడానికి సిగ్గుపడుతున్నారు. ఈ మౌనం ప్రమాదకరం, ఇది ప్రజలను ఒంటరితనం, నిరాశలోకి నెట్టేస్తుంది. ఇవన్నీ కలిసి బలవన్మరణం వైపు నెట్టేస్తాయి. కొన్ని ముఖ్యమైన గణాంకాలు... దేశంలో మొత్తం బలవన్మరణాల్లో 34.5 శాతం 18-30 ఏళ్ల మధ్య ఉన్న యువకులే.బలవన్మరణాల్లో 71 శాతం పురుషులే. మహిళల్లో 15-39 ఏళ్ల మధ్యవారే ఎక్కువ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.సామాజిక, ఆర్థిక సమస్యలు వల్ల 10,881 మంది రైతులు 2021లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.కొన్ని ప్రధాన కారణాలు... పరీక్షల ఒత్తిడి, పోటీ, భవిష్యత్తు పట్ల భయంతో 2021లో 13,089 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.ఉద్యోగాలు కోల్పోవడం, అప్పులు, పేదరికం ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.కుటుంబ విభేదాలు, వివాహ పరమైన సమస్యలు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు చికిత్స లేకపోతే తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలు ఆత్మహత్య నివారణలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించవచ్చు. అందుకోసం ముందుగా ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి. అవి... నేను చనిపోవాలని అనుకుంటున్నాను" లేదా "నేను పుట్టకపోయినా బాగుండేది" అంటూ ఆత్మహత్య గురించి మాట్లాడటం.కత్తి, తాడు, నిద్రమాత్రలు లాంటి వాటిని సమకూర్చుకోవడం. ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండాలని కోరుకోవడం. ఒక రోజు అత్యంత సంతోషంగా, మరుసటి రోజు తీవ్ర నిరుత్సాహంగా ఉండటం వంటి మూడ్ స్వింగ్ కలిగి ఉండటం. సమస్యలో చిక్కుకున్నట్లు, బయటపడే మార్గం లేనట్లు, నిస్సహాయంగా ఉన్నట్లు మాట్లాడటం. మద్యం లేదా మాదకద్రవ్యాల వాడకం పెరగడం. తిండి, నిద్రలాంటి సాధారణ దినచర్యలలో మార్పు. డ్రగ్స్ వాడటం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి ప్రమాదకర లేదా స్వీయ-విధ్వంసక పనులు చేయడం తన వస్తువులను, వ్యవహారాలను ఇతరులకు అప్పజెప్పడం. మళ్లీ కనిపించనట్లుగా వీడ్కోలు చెప్పడం. వ్యక్తిత్వంలో ఆకస్మిక మార్పులు, తీవ్ర ఆత్రుత లేదా ఆందోళన చెందడం. మీరేం చేయవచ్చు... మీ సన్నిహితుల్లో ఎవరిలోనైనా ఎవరికైనా ఆత్మహత్య యత్నం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మాట్లాడండి. మీ మద్దతును, సహాయాన్ని, సహకారాన్ని అందించండి. మీకు సాధ్యం కాదనుకున్నప్పుడు సైకాలజిస్ట్ ను సంప్రదించండి. ఆత్మహత్య గురించి అడగడాన్ని భయపడవద్దు. ఇది వాళ్లకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తుంది. జడ్జ్మెంట్ లేకుండా, ప్రేమగా వారు చెప్పేది వినండి. వారు ఒంటరిగా ఉన్నారని అనిపించనీయకుండా సపోర్ట్ చేయండి. ఒంటరిగా వదిలిపెట్టకుండా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. వారి దగ్గర ఉన్న కత్తులు, తాళ్లు, మాత్రల్లాంటి ప్రమాదకరమైన వస్తువులు తీసివేయండి. మీరు లేదా మీకు తెలిసినవారు ఆత్మహత్య ఆలోచనలకు గురవుతున్నట్లయితే, వెంటనే హైదరాబాద్ లో ఉన్న రోష్ణి ఆత్మహత్యల నివారణ సంస్థకు (081420 20033 ⋅ 081420 20044) ఫోన్ చేసి సహాయం పొందండి. అప్పటికీ మీకు ఉపశమనం కలగకపోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవాలి.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.comగమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
జగమంతా దగా చేసినా
పెద్దగా ఏమీ మార్పు ఉండదు. తెల్లవారి టీకొట్టు దగ్గర పెద్దమనిషి ఎప్పటిలాగే న్యూస్‌పేపర్‌ని మడతపెట్టి చదువుతుంటాడు. పిల్లల్ని తీసుకెళ్లే స్కూల్‌బస్ వారిని గోలగోలగా మోసుకెళుతూ ఉంటుంది. సూర్యుడు ప్రసరింప చేస్తున్న ఎండ జామచెట్టుపై పడి కింద నీడను పరుస్తూ ఉంటుంది. చెరువులో నీళ్లు అదే నిమ్మళంతో ఉంటాయి. లీవులున్నా పెట్టలేని ఉద్యోగాల హాజరీకి అందరూ తయారవుతూ ఉంటారు. వారికై వంటగదుల్లో సాగే ఇల్లాళ్ల హడావిడి ఏమీ మారదు. ఢిల్లీలో తెల్లవారుతుంది. ముంబైలో తెల్లవారుతుంది. పాలకులు పట్టు పరుపుల మీద నుంచి లేచి పనుల్లో పడతారు. సకల మానవ జీవన వ్యాపారాలకు చీమైనా కుట్టదు. కబురు తెలిసిన కొందరు ఆత్మీయులు కూడా ‘తొందరగా టిఫెను పెట్టు. తినేసి వెళతాను’ అనే బయలుదేరుతారు. మీరు ఆత్మహత్య చేసుకుని మరణించారు. అది మీకూ మీ ఇంటికీ. మిగిలిన లోకానికి ఏంటట?ఆత్మహత్య చేసుకుని మరణించిన రైతుకు ఏ శిక్షా విధించలేక ‘పోయి నీ కుటుంబం ఎలా ఉందో చూసిరా’ అని పంపిస్తాడు దేవుడు– అదే శిక్షగా. చేసిన అప్పుకు ఎడ్లు జమ అయితే పొలంలో భార్యే ఎద్దులా కష్టపడుతూ ఉంటుంది. బడికెళ్లాల్సిన కూతురు తల్లికి సాయం చేస్తూ ‘మా... అందుకే నిన్ను నాన్న తిడతాండె. చూడు... పడిన చోట నాలుగైదు ఇత్తనాలు పడినాయి. లేనిచోట్ల లేనే లేవు. ఇట్లేనా ఇత్తనమేసేది’ అని తండ్రిని తలుచుకుంటూ ఆరిందాలా గద్దిస్తూ ఉంటుంది. భర్త గుర్తొచ్చిన తల్లి బొరుమని పొలంలో కూలబడుతుంది. గాలిరూపంలో ఉన్న రైతు అది చూసి ఎంత లబలబలాడినా ఏమొస్తుంది– ప్రాణమే వదులుకొని వచ్చేసినాక. బండి నారాయణ స్వామి కథ ‘రంకె’ ఇది.మొన్న హైదరాబాద్‌లో ఒక తండ్రి– చిన్న టీకొట్టు నడుపుకునే తండ్రి– స్కూలుకెళ్లకుండా హఠం చేస్తున్న పిల్లల్ని కొట్టి, ఎందుకు కొట్టానా అని తీవ్రమైన కలతతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడా పిల్లలకు స్కూలుకు వెళ్లమని చెప్పే తండ్రి లేడు. స్కూల్ ఫీజు కట్టే తండ్రి లేడు. ఏ రాత్రో కొట్టు కట్టేసి ఇల్లు చేరి నిద్రపోతున్న పిల్లల్ని చూసి భార్యతో ‘నిద్రపోయారా పిల్లలూ’ అనడుగుతూ ప్రేమగా వారి తలను నిమిరే తండ్రి లేడు. ఖాళీ టీకొట్టు ఉంది. దాని ముందు ట్రాఫిక్‌కు ఏమెరగనట్టుగా ఉంది. ఇరుగు పొరుగు షాపులలో బేరాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. అతడు లేడు. అతనికీ– ఇంటికీ.మృత్యువుకు మోహగుణం ఉంటుంది. ‘నా పరిష్వంగంలోకిరా విముక్తి సుఖం ఇస్తాను’ అని పిలుస్తూ ఉంటుంది. అందుకోసం అది సముద్రంలోని నీలి కెరటాలకు మరింత నీలిమ ఇస్తుంది. నది ప్రవాహానికి మరింత చిక్కదనం ఇస్తుంది. దూకే వరకు బావినీళ్లను మెరుపు అద్దంలా మారుస్తుంది. పురుగుల మందుకు ఎంత రుచి ఇస్తుందో. ధగధగమని మండే మంటకు మంచుకంటే చల్లనైన గుణం ఉంటుందనే ప్రలోభం కలిగిస్తుంది. ఒక్క మృత్యువు. వేయి ఆకర్షణలు. కాని జీవితానికి వేయిన్నొక్కటి. ఆ ఒక్కటికై బతకాలి.‘మృత్యువా... నీవొక అందమైన కవితా పంక్తివి. నిను కలుస్తాననే వాగ్దానాన్ని మరువను’ అంటాడు ‘ఆనంద్’ సినిమాలో రాజేష్ ఖన్నా. జీవితం అంటే ఏమిటి? చనిపోవడానికి ముందు దొరికే కాసింత సమయం. కేన్సర్ డయాగ్నసిస్ అయ్యి రెండు మూడు నెలల్లో పోతానని తెలిశాక ఆనంద్ ప్రతి నిమిషం జీవించడానికి ఉబలాటపడతాడు. తెలిసినవారినీ తెలియనివారినీ తన అభిమానంలో ముంచెత్తుతాడు. బతికేది కాసిన్ని రోజులే అయినా గాఢంగా ఎన్నటికీ మరువనంతగా ముద్రలేసి వెళతాడు. చావు ఎప్పుడో తెలిసిన అతడే, జబ్బు మనిషి అతడే అలా బతికితే ఇవాళ్టికి అంతా బాగున్న మనం ఎలా బతకాలి?అవునండీ. భార్యాభర్తల మధ్య కీచులాటలు వస్తాయి. డబ్బుల కటాకటీ ఉంటుంది. బాస్ నరకం చూపుతుంటాడు. స్నేహితులు ద్రోహం చేస్తారు. బంధువులు వంచిస్తారు. సొంత తోబుట్టువులు ఊహించని నొప్పి కలిగిస్తారు. అనారోగ్యాలు ఉంటాయి. పంటల్లో నష్టం వస్తుంది. అయితే? చనిపోవడమేనా? ఇవాళ్టిని ఇవాళ్టితో ముగించడమేనా? ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఎవరి ఆమోదంతో తీసుకున్నారు ఈ నిర్ణయం? ‘ఆత్మహత్య మహాపాతకం’ అంది హిందూ ధర్మం. ‘ఏ ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నాడో అదే ఆయుధంతో పైన దండింపబడతాడు’ అంది ఇస్లాం ధర్మం. బతికి ఉండగా బతకడానికి చేసిన అన్ని తప్పొప్పులకైనా కన్సిడరేషన్ ఉందిగాని ఆత్మహత్య చేసుకుంటే నేరుగా నరకానికే. చచ్చాక సుఖపడదామనుకునే వారికి పైన ఎన్ని చచ్చే చావులు ఉన్నాయో ఏం తెలుసు? దాని బదులు బతకొచ్చుగా హాయిగా? ఏమిటి... పరువు పోయిందా... చచ్చిపోతారా? మన పరువును ఎంచేంత పరువు ఈ సమాజానికి ఉందంటారా ఇప్పుడు?‘మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’ అన్నాడు సిరివెన్నెల. సెప్టెంబర్ 10– ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. అసలు ఈ పేరే సరి కాదు. దీనిని ‘ప్రపంచ జీవన కాంక్షా దినోత్సవం’ అని మార్చాలి. జీవనకాంక్ష... ఇదే కావాల్సింది. ఎవరూ కష్టాలకు మినహాయింపు కాదు. ఎవరినీ సవాళ్లు ఒదిలిపెట్టవు. ఉక్కిరిబిక్కిరి అయ్యే క్షణాల వాయిదాలవారీ పంపకమే జీవితం. ఇది అందరికీ తెలుసు. అందుకే అర్ధంతరంగా మరణించిన వారికి గౌరవం లేదు. ‘ఏం.. మేం బతకట్లేదా.. చచ్చేం సాధించాలి గనక’ అనుకుంటారు. అందుకే ఓడినా సరే బతికి తీరాలి. సినారె అంటాడు– ‘జగమంతా దగా చేసినా చివురంత ఆశను చూడు... గోరంత దీపం కొండంత వెలుగు... చివురంత ఆశ జగమంత వెలుగు’. ఏం మహాశయా... బతికేద్దామా? బతుకుదాం లేద్దూ! -
ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఉంటేనా..
World Suicide Prevention Day 2021: మనిషికి జంతువుతో పోలిస్తే ఉన్న అడ్వాంటేజ్.. మనుగడ పోరాటంలో తెలివితేటల్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలగడం. నోరు లేని మూగజీవాలు ఎలాగోలా తమ బతుకుల్ని నెట్టుకొస్తుంటే.. అన్నీ ఉన్నా సంఘజీవి మనిషి మాత్రం పిరికితనంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలెన్నో బతుకుల్ని బుగ్గిపాలు చేస్తుంటే.. అందులో ఒకటైన ఆత్మహత్య మనిషిని మానసికంగా కుంగదీసి మరీ చంపేస్తోంది. ఒకవేళ ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. నెగెటివ్ అంశాలెన్నో పాజిటివ్‌గా మారిపోవడమే కాదు.. మరో మలుపు తిరిగి జీవితంలో అద్భుతాలు జరగొచ్చేమో కదా! ► సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ►ఆత్మహత్యలను నివారించేందుకు, అది ఎంత పెద్ద నేరమో అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏటా ఒక దినం నిర్వహిస్తున్నారు. ►ప్రతీ ఏటా ఆత్మహత్యా నివారణ దినోత్సవం సెప్టెంబర్ 10న జరుపుతున్నారు. ►ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా? ‘బతకాలనే ఆశను అవతలివాళ్లలో సృష్టించడం.. అదీ చేతల ద్వారా’. ►కరోనా వల్ల మనిషిలో మానసికంగా కుంగుబాటు ఎక్కువ అయిపోయింది. ►ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి అవకాశాలు పోగొట్టుకోవడం, అయినవాళ్లను దూరం చేసుకోవడం, సోషల్ గ్యాదరింగ్‌లు లేకపోవడం వల్ల మనిషి.. నిరాశానిస్పృహలోకి నెట్టేస్తున్నాయి. క్షణికావేశంలో అయినవాళ్లకు, అభిమానించేవాళ్లకు దూరంగా వెళ్లిపోతున్నారు. ►కిందటి ఏడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హఠాన్మరణం తర్వాత దేశవ్యాప్తంగా డిప్రెషన్-సూసైడ్‌ల గురించి విస్తృత చర్చ నడిచింది. అంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న సెలబ్రిటీలతో పాటు యువత మానసిక స్థితి గతులపై సమీక్ష నిర్వహించేందుకు మేధావులకు, మానసిక నిపుణులకు అవకాశం ఇచ్చింది. ►అందుకే ఈ ఏడాది “Creating Hope Through Action” థీమ్ తెచ్చారు ►వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. ది ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్(IASP), వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్(WFMH) సంయుక్తంగా ఈ రోజును నిర్వహిస్తారు. ►2003లో తొలిసారి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు ►వందల్లో 60 మంది ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం.. ఒంటరిమనే భావన. కష్టకాలంలో సరైన ఓదార్పు లేకపోవడం. ►ఆర్థిక కారణాలు, బంధాలు, అయినవాళ్లతో గొడవలు కూడా మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. ►కాలు విరిగినా, చెయ్యి విరిగినా ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. ►సపోర్ట్‌గా నిలవాల్సింది సొసైటీనే. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉండే ఎవరైనా కావొచ్చు. ►సెన్సిటివ్ బిహేవియర్.. అంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్న మనిషి, చిన్న సంఘటనతోనూ కుంగుబాటుకు గురై ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి, వరుస దెబ్బలతో నిరాశనిస్పృహల్లోకి కూరుకుపోయిన వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడతారనే అభిప్రాయం సరైంది కాదు. ►ఆత్మహత్యకు పాల్పడటం, ఆత్మహత్యకు యత్నించడం, పుసిగొల్పడం-ప్రేరేపించడం.. ఇవన్నీ నేరాలే. ఐపీసీ సెక్షన్-309 ప్రకారం.. జైలుశిక్ష జరిమానా తప్పవు. రాజీ కుదుర్చుకోవడానికి వీల్లేదు. అలాగే వీళ్ల తరపున ఏ లాయర్ వాదించడు. ►ప్రపంచంలో ప్రతీ నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య నమోదు అవుతోంది. అందులో భారత్ టాప్ టెన్‌లో ఉండడం గమనార్హం. ►ఎందుకు బతకాలి? బతికి ఏం సాధించాలి? అనే పిరికి ప్రశ్నల కంటే.. బతికి సాధించుకోవాలి అనే ధైర్యం మనిషిని మహర్షిగా మారుస్తుంది. క్షణికావేశ నిర్ణయం ఒక జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ క్షణాన్ని గనుక అధిగమిస్తే అంతా వెలుగే నిండుతుంది - జాకీ చాన్ ఓడిన ప్రతీసారి రెట్టింపు ఉత్సామంతో పైకి లేవడమే మనిషి తన జీవితంలో సాధించే గొప్ప కీర్తి - నెల్సన్ మండేలా - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
బతికి సాధిద్దాం !
ఒక్క నీటి బిందువు మీద పడితేనే అల్ప ప్రాణి చీమ చివరి క్షణం వరకూ ప్రాణం కాపాడుకోవడానికి పోరాడుతుంది. చల్లటి చిరుగాలి వీస్తే ఆ స్పర్శకు చిటికెన వేలు మీద వెంట్రుక సైతం లేచి నిలబడుతుందే.. అలాంటిది ఏళ్ల తరబడి ఎంతో ఇష్టంగా తీర్చిదిద్దుకున్న నిండు ప్రాణం ఎలా తీసుకోవాలనిపిస్తుంది. అసలు ఈ భూమ్మీద మనిషి కాకుండా మరో ప్రాణి ఏదైనా ఆత్మహత్యకు ప్రయత్నించడం చూశామా.. మేధస్సు కలిగిన మనిషికి ఎందుకింత బలహీనత.. ఒక్క నిమిషం.. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. జీవితం మీద విరక్తికలిగి నేనే ఈ ప్రయత్నానికి ఒడిగట్టాను. నా కోసం ఎవరూ బాధపడొద్దు. తమ్మున్ని, చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి. బాగా చదివించండి. ఉంటాను. ఇక సెలవు’. ఇలా.. మరణానికి ముందు సొంతంగా రాసుకునే చివరి అక్షరాలు రాయడానికి కనీసం ఐదు నిమిషాలు పడుతుంది కదా.. అందులోంచి ఒక్క నిమిషం.. బతికి చూస్తే ఈ సమస్యలనుంచి బయటపడే మార్గం ఉంటుంది కదా.. చనిపోయి మాత్రం సాధించేదేముంటుంది. సాక్షి జగిత్యాల : యుక్తవయసు, వృద్ధ వయసు అనే భేధం లేకుండా జిల్లాలో ఆర్థిక, మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, ముగ్గురు ఆడపిల్లల తర్వాత కొడుకు జన్మించాడు. తమను పోషిస్తాడని అనుకున్న తరుణంలో ఎదిగిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. అలాగే సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన ఓ చిన్నారి చదువు ఇష్టం లేదని ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌లో ఓ యువతి ప్రేమ వివాహం చేసుకుని నెలరోజుల పాప ఉండగా భర్త విదేశాల్లో ఉండటం జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఆ చిన్నారిని చూసిన వారు కన్నీరుమున్నీరవుతున్నారు. జగిత్యాల జిల్లాలో 2018లో వివిధ కారణాలతో 242 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 163 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో కారణం. తీవ్ర ఒత్తిళ్లకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎక్కడో ఏదో కారణం చేత ఆత్మహత్య చేసకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మానసిక స్థితి సరిగా లేకపోవడం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, గృహహింస, చదువులో విఫలమవడం, ప్రేమ వైపల్యం వంటి కారణాలతో ఈ బతుకు నాకొద్దు.. అంటూ అభాగ్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యమైనాయి. ఇంతే కాకుండా నచ్చిన కూర వండలేదనో, పండుగకు పుట్టింటికి పంపించలేదనో, సినిమాకు వద్దన్నారనో, చీరలు, నగలు కొనివ్వలేదనో, చివరకు పెళ్లి కాలేదనో, ఒంటరిగా బతకలేమనే నెపంతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఎక్కువగా 15–40 ఏళ్ల వయస్సు వారే.. జగిత్యాల జిల్లాలో 2018లో 242 మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 163 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు కారణం కడుపునొప్పిగా మాత్రమే పోలీసు రికార్డులకెక్కుతున్నాయి. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా 15–40 ఏళ్ల వయస్సులోపు వారే ఉంటున్నారు. ఆత్మహత్యలను మానవీయ కోణంలో చూసి ప్రజల్లో స్థైర్యాన్ని నింపాల్సిన అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. సమస్య చిన్నదే.. దృక్పథమే వేరు ఎవరి సమస్య వారికి పెద్దదిగా కనిపించడం సహజమే. అయితే గోళీకాయను కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కంటి పరిధిని తగ్గిస్తుంది. అదే కాస్త దూరంగా పెట్టి చూస్తే సమస్య చిన్నదవుతుంది. ప్రపంచం విశాలంగా కనిపిస్తుంది. విశాల ప్రపంచంలో చిన్న సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. సమస్యలు పలు రూపాలు.. ఆత్మీయుల మోసాలు, ప్రేమ వైఫల్యాలు, పరీక్షల్లో పరాజయం, తల్లిదండ్రుల అంచనాలకు అందుకునే ర్యాంకు రాకపోవడం, ఆలోచనలేవీ కార్యరూపంలోకి రాకపోవడం, ఎంతకీ మెరుగుపడని కుటుంబ ఆర్థిక పరిస్థితులు, దాంపత్యంలో అభిప్రాయ భేదాలు, అయినవాళ్లతోనే సమస్యలు, ఊహించిన ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగంలో పై అధికారి చులకనగా మాట్లాడడం కారణం ఏదైనా సరే జీవితంపై విరక్తి కలిగించవచ్చు. లక్షణాలు ఇలా కూడా ఉండొచ్చు.. నలుగురికీ దూరంగా కాలక్షేపం చేయడం, గదిలో ఒంటరిగా తలుపులు వేసుకుని కూర్చోవడం, చావు గురించో, ఆత్మహత్య ప్రయత్నాల గురించో మాట్లాడడం, కవితలు, పాటల్లో మరణదేవతను పొగుడుతూ ఉండడం, ఇంకేమీ లేదనే నిరాశావాదం, మత్తుపదార్థాలకు బానిస కావడం, చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో ఆసక్తి తగ్గిపోవడం, ఇవన్నీ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తుల లక్షణాలు కాకపోయినా వీటిలో కొన్నింటినైనా ప్రదర్శించడం అలాంటి వాళ్ల సహజ లక్షణం. ‘నాకు బతకాలని లేదు. చస్తే తప్ప నా సమస్యకు పరిష్కారం’ లేదనుకునే వాళ్లు ఏదో సందర్భంలో మాటలు, తమ చేతల ద్వారా వాళ్ల ఆలోచనను బయట పెడుతుంటారు. ఆత్మీయులు పసిగట్టాలి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలి. మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. బయట పడనివ్వాలి ముందు వాళ్లను మనసు విప్పి మాట్లాడనివ్వండి. ఏడ్పులు, ఎక్కిళ్లు రానివ్వండి. ఎన్ని కన్నీళ్లు కారుస్తారో కార్చనివ్వండి. అడ్డు చెప్పే ప్రయత్నం చేయొద్దు. ఎంత వరకు వాళ్ల భావోద్వేగాల్ని బయట పెట్టగలరో అంత వరకు ఓపిగ్గా ఎదురు చూడండి. హృదయంలో భారం దిగేవరకు వేచి చూడండి. ఆవేశం, కోపం, పశ్చాత్తాపం, ఒక్కసారిగా కట్ట తెగిన ప్రవాహంలో వెల్లువెతనివ్వండి. మనసు కుదుటపడ్డాక జీవితం మీద ఆశ కల్గించే మంచి స్ఫూర్తినిచ్చే మాటలు మాట్లాడాలి. ఎంతటి కష్టాలనుంచైనా ఎదురీది నిలిచిన విజేతల గురించి వివరించాలి. పాజిటివ్ దృక్పథాన్ని మనసు నిండా నింపాలి. నలుగురితో కలవాలి ఏకాంతం వేరు ఒంటరి తనం వేరు. ఒంటరిగా కూర్చుని బాధల్లోంచి బయటకు రాలేకపోతున్నామనే భావనతో కుమిలిపోవడం మంచిదికాదు. సమస్యలు ఏవైనా సరే.. ఏ స్థాయిలో ఉన్నా సరే అయినవాళ్లతో కాసేపు పంచుకోవాలి. కనీసం ఒక్క స్నేహితుడైనా దొరక్కపోతాడా.. ఆలోచించండి. భక్తి భావనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు అ«ధికంగా ఉన్నవాళ్లకు సహజంగానే ఇలాంటి అపసవ్యమైన ఆలోచనలు రావు. మనల్ని మన ప్రపంచాన్ని ఏదో అద్భుత శక్తి నడిపిస్తుందన్న ఆశావాదం మనల్ని మాత్రం ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుందో ఆలోచించాలి. సంప్రదించేందుకు సంకోచమెందుకు.. కష్టమొచ్చినప్పుడు మరో దారి లేనప్పుడు మంత్రాల్లాంటి మాటలతో మనల్ని దారిలో ఉంచగలిగిన సైకాలజిస్టులు, ప్రేరణాత్మక ఉపన్యాసకులు మన చుట్టూ ఎందరో ఉంటారు. వాళ్లతో మాట్లాడి చూడడానికి సంకోచించాల్సిన పని లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కౌన్సెలింగ్ చాలాసార్లు పని చేస్తుంది. ఓటమిలోనూ ఆనందించాలి.. ఓడిపోయిన వాడి అనుభవం ముందు అదేమంత పెద్దది కాదు. ప్రతీ విజేత ఏదో దశలో ఓటమి చవిచూసిన వాడే. ప్రతీ ప్రయత్నం విజయం కోసం చేసిందే. అన్ని ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఒక ప్రయత్నం మాత్రం కచ్చితంగా మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. అందుకే విజేతల ఆత్మకథల్ని విస్తృతంగా చదవండి. గెలిచే వాళ్ల సాహచర్యం కోసం ప్రయత్నించండి. ఆత్మీయులను పెంచుకోవాలి అందర్నీ ప్రేమిస్తే మనవాళ్లవుతారు. అభిమానించే మనుషులు లేకపోవడం అంత పెద్ద సమస్య మరేదీ ఉండదు. నిజానికి ప్రేమించే మనుషులు మన చుట్టూ ఎంత ఎక్కువ మంది ఉంటే అంతగా సమస్యల తీవ్రత తగ్గుతుంది. కరీంనగర్ జిల్లాలో 2017, 2018, 2019 సెప్టెంబర్ వరకు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినవారి సంఖ్య 2017 2018 2019 232 229 142 ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు చాలా మంది ఆత్మస్థైర్యం కోల్పోయి చిన్నచిన్న సమస్యలకు మనస్తాపానికి గురై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవద్దు. గ్రామాల్లో పోలీసు కళాబృందాలతో ఆత్మహత్యల నివారణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సామాజిక సేవకులు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. – సిందూశర్మ, ఎస్పీ, జగిత్యాల జిల్లా క్షణికావేశమే శాపమైంది.. పెద్దపల్లిరూరల్ : సాగుచేసిన పంటకు నీరందక ఎండిపోయి, పెట్టిన పెట్టుబడులు చేతికి అందని పరిస్థితి ఏర్పడిందని.. చేసిన అప్పులు ఎలా తీర్చాలోననే మనస్తాపంతో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్న గుర్రాల గట్టేశం కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామానికి చెందిన గట్టేశంకు ఎకరం 10గుంటలు భూమి ఉండగా మరో 10ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేయగా నీరందక పంటలు ఎండిపోయి నష్టపోయాడు. కూతురు మమత పెళ్లికి చేసిన అప్పుతో కలిపి రూ.7లక్షల దాక అప్పు అయింది. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడం, పంట దిగుబడి రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలోననే బెంగతో క్షణికావేశంలో క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుమారులు మల్లేశ్, రాజు చదువును అర్ధాంతరంగా ఆపేసి కూలీలుగా మారారు. గట్టేశం భార్య శాంత తనకున్న ఎకరం భూమిలో పంట సాగు చేసేందుకు నానా తంటాలు పడుతోంది. తన భర్త మరణించిన తర్వాత ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామంటూ వచ్చిన అధికారులు మళ్లీ కనిపించకుండా పోయారని, ఇప్పటివరకు సర్కార్‌సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుమారులకైనా ఉపాధి కల్పించాలని లేదా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటుంది. ఫెయిల్‌కు భయపడి.. సిరిసిల్లక్రైం: ఇంటర్ బోర్డు తప్పిదం వల్లే ఇంటర్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో కోనారావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి లావణ్య ఆత్మహత్య చేసుకుంది. పదిహేనేళ్ల పాటు పెంచిన కూతురు మరణంతో తల్లిదండ్రులు మరణ వార్త విని తట్టులేకపోయారు. చదువుకోకున్న ఉన్న ఊరిలో పని చేసుకుని బతకాలే కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని మృతి చెందిన విద్యార్థి కుటుంబీకులు అంటున్నారు. -
నాకే ఎందుకిలా..!
మూడు నెలల కింద ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి హుస్సేన్‌సాగర్‌లో దూకాడు. లేక్‌పోలీసులు గమనించి అతన్ని కాపాడారు. తాను చాలా కష్టాల్లో ఉన్నానని, తనను ఆదుకొనేందుకు ఎవరూ లేరని గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నెల 10వ తేదీన ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా డిప్రెషన్‌పై ప్రత్యేక కథనం.. నెల రోజుల కింద 18 ఏళ్ల వయసు కూడా లేని ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగానే తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థకు కాల్ చేసి తాను చనిపోబోతున్నానని చెప్పాడు. ప్రేమ విషయంలో మోసపోయిన తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆవేదన చెందాడు. చివరకు స్వచ్ఛంద సంస్థ కౌన్సెలింగ్ సాయంతో ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. వైమీ సిండ్రోమ్ అనే కుంగుబాటుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఎందరున్నా డిప్రెషన్‌తో కుంగిపోతున్నారు. ప్రపంచంలో ఎవరికీ లేని బాధలు, కష్టాలు తమకే ఉన్నాయని, తామే ఎందుకిలాంటి దుర్భరమైన స్థితిలో బతకాల్సి వస్తోందనే డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు ఏటికేటికీ పెరుగుతున్నారు. ఏటా వారి సంఖ్య 250 నుంచి 300 వరకు నమోదవుతున్నట్లు ఆత్మహత్యల నివారణ సంస్థ రోష్ని అధ్యయనంలో వెల్లడైంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు యువత 50 శాతం వరకు ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత మహిళలు, వయోధికులు, తదితర కేటగిరీలకు చెందిన వారున్నారు. అన్ని వర్గాల్లోనూ ఎక్కువ శాతం డిప్రెషన్ కారణంగా ఒంటరితనానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారానికి సుమారు ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. సగటున నెలకు 30 మందికి పైగా బాధితులు తమకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదంటూ ఫోన్ ద్వారా ‘రోష్ని’ని సంప్రదిస్తున్నారు. బంధాలు తెగిపోతున్నాయి.. కుటుంబాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇంట్లో అందరూ ఉన్నా ఎవరికీ ఎవరూ ఏమీ కాని ఓ చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి ప్రపంచంలోకి మరొకరు తొంగి చూడట్లేదు. ఎవరికి వారు ఒంటరిగానే బతికేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా జీవన శైలి బాగా వేళ్లూనుకుపోతోంది. ఒకరి సమస్యలను ఒకరికి చెప్పుకొని పరిష్కరించుకొనే స్నేహపూరితమైన వాతావరణం లోపిస్తోంది. ఇంటా బయటా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వారు చివరకు డిప్రెషన్‌తో ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్, ర్యాంకులు వంటి అంశాల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు ‘వైమీ సిండ్రోమ్’తో బాధపడుతున్నారు. చివరకు చావును పరిష్కారంగా భావిస్తున్నారు. కుటుంబ హింస, అనారోగ్యం.. మోసపోయిన వారు, కుటుంబ హింస ఎదుర్కొంటున్న మహిళలు కూడా తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతున్నారు. అనారోగ్యంతో బాధపడే వృద్ధులు పరిష్కారంగా చావును వెతుక్కుంటున్నారు. చివరకు ఖరీదైన మొబైల్ ఫోన్ లేదనే కారణంతో డిప్రెషన్‌కు గురై ‘వైమీ సిండ్రోమ్’బారిన పడుతున్నట్లు అంచనా. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం.. కుంగుబాటు మనిషిలో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తుంది. నిద్రలేమి.. విపరీతమైన కోపం, తీవ్రమైన బాధ, అకారణమైన దుఃఖం, ఎవరికీ భారం కావొద్దనే భావన వెంటాడుతాయి. తరచుగా జీవితంపై విరక్తి ప్రకటిస్తారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు గుర్తించి భరోసా ఇవ్వాలి. డిప్రెషన్ బాధితుల బాధను ఓపిగ్గా వినాలి. గ్రేటర్లో ఇలా.. ► రోష్ని స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 250 మంది డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ► ఏటా 350 నుంచి 400 వరకు ఈ తరహా కేసులు నమోదువుతున్నాయి. ► తాము ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రతి నెలా 30 మందికి పైగా ‘రోష్ని’ని సంప్రదిస్తున్నారు. గతేడాది ఆత్మహత్యల్లో 20 ఏళ్లలోపు వారు: 62 21 నుంచి 30 ఏళ్ల వయసు వారు: 140 31 నుంచి 40 ఏళ్ల వయసు వారు: 91 41 నుంచి 60 ఏళ్ల వయసు వారు: 38 60 ఏళ్లు దాటినవారు: 31 మీ కోసం మేమున్నాం జీవితంలో సమస్యలు రావడం సహజం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రపంచంలో ఎవ్వరికీ లేని బాధలు తమకు మాత్రమే ఉన్నాయనుకోవడం సరికాదు. డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లు నేరుగా సికింద్రాబాద్, సింధ్ కాలనీలోని రోష్ని సంస్థను సంప్రదించొచ్చు. లేదా 040–6620 2000, 040–6620 2001 నంబర్లకు ఫోన్ చేసి పరిష్కారం పొందొచ్చు. మీ కోసం మేమున్నామనే విషయాన్ని మరిచిపోవద్దు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు రోష్ని పని చేస్తుంది. - మాలతీరాజి, డైరెక్టర్, రోష్ని ఓదార్పు ఎంతో ముఖ్యం సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపవుతుంది. బాధను పంచుకుంటే సగమవుతుంది. బాధలో ఉన్నవారు చెప్పేది ఓపిగ్గా వింటే చాలు వారికి ఎంతో ఊరట లభిస్తుంది. భరోసాను, మానసిక ధైర్యాన్ని అందజేస్తే డిప్రెషన్ నుంచి బయటపడతారు. - ఆనంద దివాకర్, రోష్ని ప్రతినిధి – సాక్షి, హైదరాబాద్ -
ఆత్మహత్యల నివారణ కోసం 4కే రన్
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించే 4కె రన్ ను విజయవంతం చేయాలని భారతీయ మనో వైద్యుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జార్జిరెడ్డి కోరారు. ప్రపంచ ఆత్మహత్యల నిర్మూలన దినోత్సవంను పురస్కరించుకుని అల్వాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు చొప్పున ప్రతి సంవత్సరం దాదాపు 8 లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇందులో ప్రపంచ జనాభాలో 17.5 శాతం ఉన్న భారతీయులలో ఏటా లక్షా 35 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. వీటికి అనేక కారణాలు ఉన్నప్పటికీ క్షణికావేశంలో జరిగేవే అధికంగా ఉన్నాయన్నారు. అవగాహన లేకపోవడం వలననే క్షణికావేశంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వీటిని నిర్మూలించాల్సిన అవసరం అన్ని వర్గాలపై ఉందన్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 4కె రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో వైద్య కళాశాల విద్యార్థులు, మానసిక వైద్య నిపుణులు పాల్గొంటారని తెలిపారు. -
నేడు ఆత్మహత్యల నివారణ దినం
సంగారెడ్డి క్రైం : ఆ.. ఒక్క క్షణం ఆలోచిస్తే భవిష్యత్ అంతా బంగారు మయ మే.. కానీ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాయి. విద్యార్థి టెన్త్ పరీ క్షలో తప్పిందనో.. భర్త భార్యను తిట్టాడనో.. భార్య కాపురానికి రాలేదనో.. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ విఫలమైందనో.. యువత జల్సాలకు డబ్బులు ఇవ్వలేదనో.. ఇ లా అనేక కారణాల వల్ల ప్రతి ఏడాది వందల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాగా కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులే ఎక్కువగా ఆత్మహత్యలకు ఎక్కువ కారణాలవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను వెతుక్కుంటే భవిష్యత్ అంతా బంగారు భవితగానే ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి. ఇదిలా ఉంటే 2012 సంవత్సరంలో 321 మంది పురుషులు, 125 మంది మహిళలు వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2013లో 417 మంది పురుషులు, 133 మంది మహిళలు, 2014 ఆగస్టు నెల వరకు 221 మంది పురుషులు, 59 మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో ఉన్నారు. చట్టం ఏం చెబుతోంది.. చట్టప్రకారం ఆత్మహత్యకు పాల్పడ డం, ఆత్మహత్యకు యత్నించడం, అందుకు ప్రోత్సహించడం నేరం. భారతీయ శిక్షా స్మృతి విభాగంలో 309 ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నిం చిన వారికి ఏడాది సాధారణ శిక్షతో పాటు జరిమానా విధించబడుతుం ది. ఈ కేసు ప్రథమ శ్రేణి న్యాయాధిపతి న్యాయస్థానంలో విచారింప బడుతుంది. ఆత్మహ త్యాయత్నానికి పాల్పడితే ఏ న్యాయవాది కూడా వాదించబోరు. అంతేగాక బెయిల్ కూడా మంజూరు కాదు. రాజీ కూడా కుదుర్చుకోవడానికి అవకాశం లేనిది. ఆత్మహత్యకు ప్రోత్సహించే వారికి విభాగం 306 ప్రకారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించడం జరుగుతుంది. ఈ కేసు విచారణ సెషన్స్ కోర్టులో జరుగుతుంది. ఈ కేసు రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం లేకపోవడంతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యేందుకు అవకాశం ఉంది.