ఆత్మహత్యల నివారణ కోసం 4కే రన్
Published Sat, Sep 10 2016 8:09 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం నిర్వహించే 4కె రన్ ను విజయవంతం చేయాలని భారతీయ మనో వైద్యుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జార్జిరెడ్డి కోరారు. ప్రపంచ ఆత్మహత్యల నిర్మూలన దినోత్సవంను పురస్కరించుకుని అల్వాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు చొప్పున ప్రతి సంవత్సరం దాదాపు 8 లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
ఇందులో ప్రపంచ జనాభాలో 17.5 శాతం ఉన్న భారతీయులలో ఏటా లక్షా 35 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. వీటికి అనేక కారణాలు ఉన్నప్పటికీ క్షణికావేశంలో జరిగేవే అధికంగా ఉన్నాయన్నారు. అవగాహన లేకపోవడం వలననే క్షణికావేశంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వీటిని నిర్మూలించాల్సిన అవసరం అన్ని వర్గాలపై ఉందన్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 4కె రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో వైద్య కళాశాల విద్యార్థులు, మానసిక వైద్య నిపుణులు పాల్గొంటారని తెలిపారు.
Advertisement