పెద్దగా ఏమీ మార్పు ఉండదు. తెల్లవారి టీకొట్టు దగ్గర పెద్దమనిషి ఎప్పటిలాగే న్యూస్‌పేపర్‌ని మడతపెట్టి చదువుతుంటాడు. పిల్లల్ని తీసుకెళ్లే స్కూల్‌బస్ వారిని గోలగోలగా మోసుకెళుతూ ఉంటుంది. సూర్యుడు ప్రసరింప చేస్తున్న ఎండ జామచెట్టుపై పడి కింద నీడను పరుస్తూ ఉంటుంది. చెరువులో నీళ్లు అదే నిమ్మళంతో ఉంటాయి. లీవులున్నా పెట్టలేని ఉద్యోగాల హాజరీకి అందరూ తయారవుతూ ఉంటారు.
వారికై వంటగదుల్లో సాగే ఇల్లాళ్ల హడావిడి ఏమీ మారదు. ఢిల్లీలో తెల్లవారుతుంది. ముంబైలో తెల్లవారుతుంది. పాలకులు పట్టు పరుపుల మీద నుంచి లేచి పనుల్లో పడతారు. సకల మానవ జీవన వ్యాపారాలకు చీమైనా కుట్టదు. కబురు తెలిసిన కొందరు ఆత్మీయులు కూడా ‘తొందరగా టిఫెను పెట్టు. తినేసి వెళతాను’ అనే బయలుదేరుతారు. మీరు ఆత్మహత్య చేసుకుని మరణించారు. అది మీకూ మీ ఇంటికీ. మిగిలిన లోకానికి ఏంటట?
ఆత్మహత్య చేసుకుని మరణించిన రైతుకు ఏ శిక్షా విధించలేక ‘పోయి నీ కుటుంబం ఎలా ఉందో చూసిరా’ అని పంపిస్తాడు దేవుడు– అదే శిక్షగా. చేసిన అప్పుకు ఎడ్లు జమ అయితే పొలంలో భార్యే ఎద్దులా కష్టపడుతూ ఉంటుంది. బడికెళ్లాల్సిన కూతురు తల్లికి సాయం చేస్తూ ‘మా... అందుకే నిన్ను నాన్న తిడతాండె. చూడు... పడిన చోట నాలుగైదు ఇత్తనాలు పడినాయి. లేనిచోట్ల లేనే లేవు.
ఇట్లేనా ఇత్తనమేసేది’ అని తండ్రిని తలుచుకుంటూ ఆరిందాలా గద్దిస్తూ ఉంటుంది. భర్త గుర్తొచ్చిన తల్లి బొరుమని పొలంలో కూలబడుతుంది. గాలిరూపంలో ఉన్న రైతు అది చూసి ఎంత లబలబలాడినా ఏమొస్తుంది– ప్రాణమే వదులుకొని వచ్చేసినాక. బండి నారాయణ స్వామి కథ ‘రంకె’ ఇది.
మొన్న హైదరాబాద్‌లో ఒక తండ్రి– చిన్న టీకొట్టు నడుపుకునే తండ్రి– స్కూలుకెళ్లకుండా హఠం చేస్తున్న పిల్లల్ని కొట్టి, ఎందుకు కొట్టానా అని తీవ్రమైన కలతతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడా పిల్లలకు స్కూలుకు వెళ్లమని చెప్పే తండ్రి లేడు. స్కూల్ ఫీజు కట్టే తండ్రి లేడు.
ఏ రాత్రో కొట్టు కట్టేసి ఇల్లు చేరి నిద్రపోతున్న పిల్లల్ని చూసి భార్యతో ‘నిద్రపోయారా పిల్లలూ’ అనడుగుతూ ప్రేమగా వారి తలను నిమిరే తండ్రి లేడు. ఖాళీ టీకొట్టు ఉంది. దాని ముందు ట్రాఫిక్కు ఏమెరగనట్టుగా ఉంది. ఇరుగు పొరుగు షాపులలో బేరాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. అతడు లేడు. అతనికీ– ఇంటికీ.
మృత్యువుకు మోహగుణం ఉంటుంది. ‘నా పరిష్వంగంలోకిరా విముక్తి సుఖం ఇస్తాను’ అని పిలుస్తూ ఉంటుంది. అందుకోసం అది సముద్రంలోని నీలి కెరటాలకు మరింత నీలిమ ఇస్తుంది. నది ప్రవాహానికి మరింత చిక్కదనం ఇస్తుంది.
దూకే వరకు బావినీళ్లను మెరుపు అద్దంలా మారుస్తుంది. పురుగుల మందుకు ఎంత రుచి ఇస్తుందో. ధగధగమని మండే మంటకు మంచుకంటే చల్లనైన గుణం ఉంటుందనే ప్రలోభం కలిగిస్తుంది. ఒక్క మృత్యువు. వేయి ఆకర్షణలు. కాని జీవితానికి వేయిన్నొక్కటి. ఆ ఒక్కటికై బతకాలి.
‘మృత్యువా... నీవొక అందమైన కవితా పంక్తివి. నిను కలుస్తాననే వాగ్దానాన్ని మరువను’ అంటాడు ‘ఆనంద్’ సినిమాలో రాజేష్ ఖన్నా. జీవితం అంటే ఏమిటి? చనిపోవడానికి ముందు దొరికే కాసింత సమయం. కేన్సర్ డయాగ్నసిస్ అయ్యి రెండు మూడు నెలల్లో పోతానని తెలిశాక ఆనంద్ ప్రతి నిమిషం జీవించడానికి ఉబలాటపడతాడు.
తెలిసినవారినీ తెలియనివారినీ తన అభిమానంలో ముంచెత్తుతాడు. బతికేది కాసిన్ని రోజులే అయినా గాఢంగా ఎన్నటికీ మరువనంతగా ముద్రలేసి వెళతాడు. చావు ఎప్పుడో తెలిసిన అతడే, జబ్బు మనిషి అతడే అలా బతికితే ఇవాళ్టికి అంతా బాగున్న మనం ఎలా బతకాలి?
అవునండీ. భార్యాభర్తల మధ్య కీచులాటలు వస్తాయి. డబ్బుల కటాకటీ ఉంటుంది. బాస్ నరకం చూపుతుంటాడు. స్నేహితులు ద్రోహం చేస్తారు. బంధువులు వంచిస్తారు. సొంత తోబుట్టువులు ఊహించని నొప్పి కలిగిస్తారు. అనారోగ్యాలు ఉంటాయి. పంటల్లో నష్టం వస్తుంది. అయితే? చనిపోవడమేనా? ఇవాళ్టిని ఇవాళ్టితో ముగించడమేనా? ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఎవరి ఆమోదంతో తీసుకున్నారు ఈ నిర్ణయం? ‘ఆత్మహత్య మహాపాతకం’ అంది హిందూ ధర్మం.
‘ఏ ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నాడో అదే ఆయుధంతో పైన దండింపబడతాడు’ అంది ఇస్లాం ధర్మం. బతికి ఉండగా బతకడానికి చేసిన అన్ని తప్పొప్పులకైనా కన్సిడరేషన్ ఉందిగాని ఆత్మహత్య చేసుకుంటే నేరుగా నరకానికే. చచ్చాక సుఖపడదామనుకునే వారికి పైన ఎన్ని చచ్చే చావులు ఉన్నాయో ఏం తెలుసు? దాని బదులు బతకొచ్చుగా హాయిగా? ఏమిటి... పరువు పోయిందా... చచ్చిపోతారా? మన పరువును ఎంచేంత పరువు ఈ సమాజానికి ఉందంటారా ఇప్పుడు?
‘మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’ అన్నాడు సిరివెన్నెల. సెప్టెంబర్ 10– ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. అసలు ఈ పేరే సరి కాదు. దీనిని ‘ప్రపంచ జీవన కాంక్షా దినోత్సవం’ అని మార్చాలి. జీవనకాంక్ష... ఇదే కావాల్సింది. ఎవరూ కష్టాలకు మినహాయింపు కాదు. ఎవరినీ సవాళ్లు ఒదిలిపెట్టవు. ఉక్కిరిబిక్కిరి అయ్యే క్షణాల వాయిదాలవారీ పంపకమే జీవితం. ఇది అందరికీ తెలుసు.
అందుకే అర్ధంతరంగా మరణించిన వారికి గౌరవం లేదు. ‘ఏం.. మేం బతకట్లేదా.. చచ్చేం సాధించాలి గనక’ అనుకుంటారు. అందుకే ఓడినా సరే బతికి తీరాలి. సినారె అంటాడు– ‘జగమంతా దగా చేసినా చివురంత ఆశను చూడు... గోరంత దీపం కొండంత వెలుగు... చివురంత ఆశ జగమంత వెలుగు’. ఏం మహాశయా... బతికేద్దామా? బతుకుదాం లేద్దూ!
జగమంతా దగా చేసినా
Published Mon, Sep 9 2024 12:19 AM | Last Updated on Mon, Sep 9 2024 12:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment