మూడు నెలల కింద ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి హుస్సేన్‌సాగర్‌లో దూకాడు. లేక్‌పోలీసులు గమనించి అతన్ని కాపాడారు. తాను చాలా కష్టాల్లో ఉన్నానని, తనను ఆదుకొనేందుకు ఎవరూ లేరని గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నెల 10వ తేదీన ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా డిప్రెషన్‌పై ప్రత్యేక కథనం..
నెల రోజుల కింద 18 ఏళ్ల వయసు కూడా లేని ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగానే తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థకు కాల్ చేసి తాను చనిపోబోతున్నానని చెప్పాడు. ప్రేమ విషయంలో మోసపోయిన తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆవేదన చెందాడు. చివరకు స్వచ్ఛంద సంస్థ కౌన్సెలింగ్ సాయంతో ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు.
వైమీ సిండ్రోమ్ అనే కుంగుబాటుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఎందరున్నా డిప్రెషన్‌తో కుంగిపోతున్నారు. ప్రపంచంలో ఎవరికీ లేని బాధలు, కష్టాలు తమకే ఉన్నాయని, తామే ఎందుకిలాంటి దుర్భరమైన స్థితిలో బతకాల్సి వస్తోందనే డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు ఏటికేటికీ పెరుగుతున్నారు. ఏటా వారి సంఖ్య 250 నుంచి 300 వరకు నమోదవుతున్నట్లు ఆత్మహత్యల నివారణ సంస్థ రోష్ని అధ్యయనంలో వెల్లడైంది.
ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు యువత 50 శాతం వరకు ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత మహిళలు, వయోధికులు, తదితర కేటగిరీలకు చెందిన వారున్నారు. అన్ని వర్గాల్లోనూ ఎక్కువ శాతం డిప్రెషన్ కారణంగా ఒంటరితనానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారానికి సుమారు ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. సగటున నెలకు 30 మందికి పైగా బాధితులు తమకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదంటూ ఫోన్ ద్వారా ‘రోష్ని’ని సంప్రదిస్తున్నారు.
బంధాలు తెగిపోతున్నాయి..
కుటుంబాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇంట్లో అందరూ ఉన్నా ఎవరికీ ఎవరూ ఏమీ కాని ఓ చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి ప్రపంచంలోకి మరొకరు తొంగి చూడట్లేదు. ఎవరికి వారు ఒంటరిగానే బతికేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా జీవన శైలి బాగా వేళ్లూనుకుపోతోంది. ఒకరి సమస్యలను ఒకరికి చెప్పుకొని పరిష్కరించుకొనే స్నేహపూరితమైన వాతావరణం లోపిస్తోంది. ఇంటా బయటా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వారు చివరకు డిప్రెషన్‌తో ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్, ర్యాంకులు వంటి అంశాల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు ‘వైమీ సిండ్రోమ్’తో బాధపడుతున్నారు. చివరకు చావును పరిష్కారంగా భావిస్తున్నారు.
కుటుంబ హింస, అనారోగ్యం..
మోసపోయిన వారు, కుటుంబ హింస ఎదుర్కొంటున్న మహిళలు కూడా తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతున్నారు. అనారోగ్యంతో బాధపడే వృద్ధులు పరిష్కారంగా చావును వెతుక్కుంటున్నారు. చివరకు ఖరీదైన మొబైల్ ఫోన్ లేదనే కారణంతో డిప్రెషన్‌కు గురై ‘వైమీ సిండ్రోమ్’బారిన పడుతున్నట్లు అంచనా.
నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం..
కుంగుబాటు మనిషిలో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తుంది. నిద్రలేమి.. విపరీతమైన కోపం, తీవ్రమైన బాధ, అకారణమైన దుఃఖం, ఎవరికీ భారం కావొద్దనే భావన వెంటాడుతాయి. తరచుగా జీవితంపై విరక్తి ప్రకటిస్తారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు గుర్తించి భరోసా ఇవ్వాలి. డిప్రెషన్ బాధితుల బాధను ఓపిగ్గా వినాలి.
గ్రేటర్‌లో ఇలా..
► రోష్ని స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 250 మంది డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
► ఏటా 350 నుంచి 400 వరకు ఈ తరహా కేసులు నమోదువుతున్నాయి.
► తాము ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రతి నెలా 30 మందికి పైగా ‘రోష్ని’ని సంప్రదిస్తున్నారు.
గతేడాది ఆత్మహత్యల్లో 20 ఏళ్లలోపు వారు: 62
21 నుంచి 30 ఏళ్ల వయసు వారు: 140
31 నుంచి 40 ఏళ్ల వయసు వారు: 91
41 నుంచి 60 ఏళ్ల వయసు వారు: 38
60 ఏళ్లు దాటినవారు: 31
మీ కోసం మేమున్నాం
జీవితంలో సమస్యలు రావడం సహజం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రపంచంలో ఎవ్వరికీ లేని బాధలు తమకు మాత్రమే ఉన్నాయనుకోవడం సరికాదు. డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లు నేరుగా సికింద్రాబాద్, సింధ్ కాలనీలోని రోష్ని సంస్థను సంప్రదించొచ్చు. లేదా 040–6620 2000, 040–6620 2001 నంబర్లకు ఫోన్ చేసి పరిష్కారం పొందొచ్చు. మీ కోసం మేమున్నామనే విషయాన్ని మరిచిపోవద్దు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు రోష్ని పని చేస్తుంది.
- మాలతీరాజి, డైరెక్టర్, రోష్ని
ఓదార్పు ఎంతో ముఖ్యం
సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపవుతుంది. బాధను పంచుకుంటే సగమవుతుంది. బాధలో ఉన్నవారు చెప్పేది ఓపిగ్గా వింటే చాలు వారికి ఎంతో ఊరట లభిస్తుంది. భరోసాను, మానసిక ధైర్యాన్ని అందజేస్తే డిప్రెషన్ నుంచి బయటపడతారు.
- ఆనంద దివాకర్, రోష్ని ప్రతినిధి
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment