Roshni
-
ఫోర్బ్స్'అత్యంత శక్తివంతమైన మహిళల' జాబితా : మరోసారి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు. వరుసగా ఆరోసారి ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. 21వ వార్షిక ర్యాంకింగ్స్‌లో ఈ ఏడాది నిర్మలా సీతారామన్ 34వ స్థానంలో నిలిచారు.ప్రతీ ఏడాది వినోద, వ్యాపార, రాజకీయ, దాతృత్వం, తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్‌లను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత ప్రభావాన్ని చూపిస్తున్న మహిళా వ్యాపారవేత్తలు, ఎంటర్టైనర్లు, రాజకీయ నాయకులు, దాతలు, విధాన రూపకర్తలతో కూడిన వార్షిక జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం ముగ్గురికి చోటు దక్కింది. నిర్మలా సీతారామన్‌తోపాటు, ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా 81వ స్థానంలో నిలవగా, బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా 82వ స్థానంలో ఉన్నారు.ఇక శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం, 2022లో 36వ స్థానం, 2023లో 32వ స్థానంలో నిలిచారు. యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ వరుసగా మూడోసారి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో నిలిచారు. మూడవ స్థానంలో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని , మొదటి ఐదు స్థానాల్లో కొత్తవారు మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ చోటు దక్కించుకున్నారు. -
Roshni Nadar: దిగ్గజ ఐటీ కంపెనీ వారసురాలు.. మోస్ట్ పవర్ఫుల్ మహిళ! (ఫొటోలు)
-
రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రమోటర్ రోష్నీ నాడార్ మల్హోత్రాకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఓపెన్ ఆఫర్ అంశంపై వెసులుబాటును కల్పించింది. గ్రూప్ సంస్థలలో అదనపు వాటా కొనుగోలు ప్రతిపాదనల నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు రోష్నీ నాడార్ చేసుకున్న అభ్యర్ధనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే.. గ్రూప్ కంపెనీలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లలో రోష్నీ నాడార్ వాటాను పెంచుకునేందుకు ప్రతిపాదించారు. దీంతో టేకోవర్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించవలసి ఉంటుంది. అయితే ఇందుకు మినహాయింపును కోరుతూ సెప్టెంబర్ 30న విడిగా సెబీకి దరఖాస్తు చేశారు. కుటుంబ వాటాల మార్పిడిలో భాగంగా వాటాల కొనుగోలు ప్రతిపాదనలు చేయడంతో సెబీ మినహాయింపునకు సానుకూలంగా స్పందించింది.రెండు కంపెనీలలోనూ నిలకడైన యాజమాన్యాన్ని కొనసాగించే యోచనతో అదనపు వాటా కొనుగోలుకి తెరతీయనున్నట్లు దరఖాస్తులలో నాడార్ పేర్కొన్నారు. తద్వారా తండ్రి శివ నాడార్ నుంచి బహుమతి రూపేణా రెండు కంపెనీలలోనూ 47 శాతం వాటాను అందుకోనున్నారు. దీంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫొసిస్టమ్స్ ప్రమోటర్లు హెచ్‌సీఎల్ కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్(ఢిల్లీ) పీవీటీ లిమిటెడ్ నుంచి వాటాలు లభించనున్నాయి.ప్రస్తుతం రెండు ప్రమోటర్ సంస్థలలోనూ రోష్నీ నాడార్ 10.33 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నారు. వెరసి హెచ్సీఎల్కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రోష్నీ నాడార్ వాటా 57.33 శాతానికి చేరనుంది. అయితే ఈ లావాదేవీల తదుపరి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లలో ప్రమోటర్ల వాటాలు యథాతథంగా అంటే 60.82 శాతం, 62.89 శాతం చొప్పున కొనసాగనున్నాయి. -
హెచ్‌సీఎల్ మరో క్యాంపస్.. అదనంగా 5 వేల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నగరంలోని హైటెక్ సిటీలో త్వరలో కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త క్యాంపస్ ద్వారా మరో 5 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్నీ నాడర్ మల్హోత్రా శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. కొత్త క్యాంపస్ ప్రారంపోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వనించారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్.. విద్యార్థులకు మెరుగైన శిక్షణ, విద్యావనరుల విస్తరణ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేయాల్సిందిగా హెచ్సీఎల్ను కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్‌సీఎల్ చేస్తున్న కృషిని సీఎం అభినందించారు. హెచ్‌సీఎల్‌కు తగినంత సహకారం అందిస్తామని చెప్పారు. నైపుణ్య శిక్షణ ద్వారా యువత సాధికారత కోసం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామని రోష్నీ నాడర్ హామీ ఇచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీతోపాటు హెచ్‌సీఎల్ విద్యాకార్యక్రమాలను రాష్ట్రంలోని ఇతర వర్సిటీలకు విస్తరిస్తామన్నారు. -
హెచ్‌సీఎల్ రోష్ని నాడార్కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాను .. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. వ్యాపార, పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన ’షెవాలీర్ డి లా లెజియన్ డి హానర్’ (’నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’) లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పురస్కారాన్ని అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, భారత్ .. ఫ్రాన్స్ మధ్య పటిష్టమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రోష్ని తెలిపారు. తమకు కీలక మార్కెట్లలో ఒకటైన ఫ్రాన్స్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నామని ఆమె పేర్కొన్నారు. -
వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ఇదే..
వనపర్తి: పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి పిల్లలు, పెద్దలందరితో ఇంటి నుంచి బయల్దేరిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట శివారులో చోటుచేసుకుంది. అతివేగం, కునికి పాటు ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు డ్రైవింగ్ చేసిన పెళ్లి కుమారుడు ఖాజాకుత్బుద్దీన్ మాట్లాడుతూ బళ్లారిలోని బసవన్నకుంట నుంచి బయల్దేరిన తాము కర్నూలు పట్టణం దాటిన తర్వాత అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఒక హోటల్ వద్ద కుటుంబ సభ్యులంతా భోజనం చేశామని చెప్పారు. అప్పుడే రైలులో వెళ్తున్న వారు కాల్ చేసి ఎక్కడి వరకు వచ్చారు.. నిద్ర వస్తే.. హైవేపై ఉన్న పెట్రోల్ పంపులో ఆగి కొద్దిసేపు నిద్రించి తెల్లవారుజామున బయల్దేరాలని సూచన చేశారు. కానీ, ఆలస్యం అవుతుందని భావించి భోజనం తర్వాత మళ్లీ బయల్దేరామని, కునికిపాటు రావడంతో కారు పక్కకు వెళ్లినట్లు గుర్తించలేదని, ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు చెట్టును ఢీకొట్టడం, కారులోని అందరం చెల్లాచెదురుగా పడిపోవడంతో మేలుకువ వచ్చిందని వాపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించినవనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి ఇది మూడో ఘటన.. 2009లో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే మిత్రులు ప్రమాణ స్వీకారం చూడాలనే ఉద్దేశంతో మారుతీ వ్యాన్‌లో హైదరాబాద్‌కు వెళ్తుండగా.. తెల్లవారుజామున వాహనం అదుపు తప్పడంతో చోటుచేసుకున్న సంఘటనలో నలుగురు మృతి చెందారు. ● 2020లో మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్తుండగా క్లూజర్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణం కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదంతో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంఘటనా స్థలంలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృత్యువాతపడ్డారు. ● తాజాగా ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జాగ్రత్తలు పాటించాలి అర్ధరాత్రి ప్రయాణాల విషయంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని వనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి అన్నారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసే అనుభవం లేనివారు వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రించడం, అతివేగంగా కారు నడపడమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. మృతుల్లో 95 ఏళ్ల వృద్ధురాలు.. ఏడు నెలల పసికందు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురిలో 95 ఏళ్ల సలీమాబీ, 7 నెలల పసికందు వాసీఫారిఫత్ అనే చిన్నారితోపాటు 39 ఏళ్ల అబ్దుల్ రహమన్, రెండేళ్ల రుమానా, నాలుగేళ్ల రోషిణి ఉన్నారు. మరో ఆరేళ్ల చిన్నారి సుమేర ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం గమనార్హం. -
ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!
Richest woman Roshni Nadar Malhotra: దేశంలో ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరం అంత్యంత ధనవంతులైన భారతీయ మహిళలకు నిలయంగా మారింది. ముంబైతో సహా మరే ఇతర నగరాలకంటే ఢిల్లీలోనే రిచెస్ట్ విమెన్ (ముగ్గురు) ఎక్కువ ఉండటం విశేషం. 2022 కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ ప్రముఖ సంపన్న మహిళల జాబితా ప్రకారం, ఢిల్లీలో అత్యంత సంపన్న భారతీయ మహిళగా టాప్ ర్యాంక్ సాధించారు. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్, రోష్నీ నాడార్ మల్హోత్రా దేశవ్యాప్తంగా అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. ఆమె నికర విలువ 2022 నాటికి రూ. 84,330 కోట్లు.(ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వ్యాపార దిగ్గజం, హెచ్‌సీఎల్ ఫౌండర్ శివ్ నాడార్ ఏకైక కుమార్తె రోష్నీ. దాదాపు రూ. 3,00,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఐటీ రంగంలో మూడవ అతిపెద్ద కంపెనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు మల్హోత్రా నాయకత్వం వహిస్తున్నారు. కంపెనీ అన్ని వ్యూహాత్మక నిర్ణయాలకు ఆమెదే బాధ్యత. ఆమె నాయకత్వంలోనే హెచ్‌సిఎల్ కంపెనీ రూ13,740 కోట్ల విలువైన ఏడు ఐబీఎం ఉత్పత్తుల కొనుగోలు చేసింది. ఇది కంపెనీ చరిత్రలో అతిపెద్దది. ఆమె సంపద సంవత్సరానికి 54శాతం పెరిగింది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే) ఢిల్లీలో పుట్టిన పెరిగిన రోష్నీ వసంత్ వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు. నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి రేడియో/టీవీ/ఫిల్మ్‌పై దృష్టి సారించి కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. 1976లో ఆమె తండ్రి శివ్ నాడార్చే స్థాపించిన్ హెచ్సీసఘెల్ ఎదగడంలో ప్రధాన పాత్ర పోషించారు. మల్హోత్రా జూలై 2020లో తన తండ్రి వారసత్వంగా హెచ్‌సిఎల్ చైర్పర్సన్ పాత్రను తీసుకున్నారు. 2017-2018, 2019 సంవత్సరాల్లో ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళగా చోటు సంపాదించుకున్నారు. కాగా కేవలం వ్యాపారవేత్తగానేకాదు రోష్ని నాడార్ శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ కూడా. భారతదేశంలోని కొన్ని ఉన్నత కళాశాలలు, పాఠశాలలను స్థాపించారు. అంతేకాదు మల్హోత్రా వన్యప్రాణుల సంరక్షకురాలు. 2018లో బాలల చిత్రం 'హల్కా' ను నిర్మించారు. 2019లో "ఆన్ ది బ్రింక్" అనే టీవీ సిరీస్‌ని రూపొందించారు. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన జాతుల దుస్థితిపై తీసిన సిరీస్ 2022లో ఉత్తమ భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.రోష్నీ భర్త శిఖర్ మల్హోత్రా హెచ్‌సీఎల్ కంపెనీలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు. -
విదేశాల్లోనూ దూసుకెళ్తాం,ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్!
ముంబై: గత రెండేళ్లుగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి (ఐటీ) డిమాండ్ భారీ స్థాయిలోనే ఉందని ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయంగా క్లయింట్లు డిజిటల్ వైపు మళ్లడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించగలదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. క్లౌడ్, డిజిటల్ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు కొత్త మార్కెట్లలోకి కూడా విస్తరించడంపై హెచ్‌సీఎల్ టెక్ దృష్టి సారిస్తున్నట్లు రోష్నీ తెలిపారు. ‘అయిదేళ్ల తర్వాత చూస్తే మేము మరిన్ని మార్కెట్లలోకి విస్తరిస్తాం. మరింత మంది కస్టమర్లు ఉంటారు. సీఈవో విజయ్‌కుమార్ చెప్పినట్లుగా మేము రెండంకెల స్థాయిలో వృద్ధిని కొనసాగిస్తాం‘ అని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం ఉత్తర ఆసియా, సెంట్రల్ అమెరికా, తూర్పు యూరప్, ఆఫ్రికా దేశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. యూరప్, అమెరికా వంటి పెద్ద మార్కెట్లలో క్లయింట్లతో మాట్లాడినప్పుడు వారు మరింత వేగంగా డిజిటలీకరణను ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తున్నట్లు వెల్లడైందని రోష్నీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 22,597 కోట్లకు చేరింది. నికర లాభం రూ. 1,102 కోట్ల నుంచి రూ. 3,593 కోట్లకు ఎగిసింది. -
హెచ్‌సీఎల్ టెక్.. భేష్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 3,214 కోట్లను తాకింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,925 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 12.5 శాతం పుంజుకుని రూ. 20,068 కోట్లకు చేరింది. గతంలో రూ. 17,841 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. పూర్తి ఏడాదికి ఆదాయంలో రెండంకెల వృద్ధిని అందుకోగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. ఇబిట్ మార్జిన్లు 19–21 శాతం మధ్య నమోదుకాగలవని ఆశిస్తోంది. ఈ కాలంలో నికరంగా 7,522 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించింది. క్యూ2(జూలై–సెప్టెంబర్)లో కొత్తగా మరో 6,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నట్లు పేర్కొంది. పూర్తి ఏడాదికి 20,000–22,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు మానవ వనరుల ముఖ్య అధికారి వీవీ అప్పారావు వెల్లడించారు. ఈ నెల 1 నుంచి వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు. బుకింగ్స్ స్పీడ్ ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ త్రైమాసిక వారీగా పటిష్ట వృద్ధిని సాధించగలమని హెచ్‌సీఎల్ టెక్ ప్రెసిడెంట్, సీఈవో సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. క్యూ1లో బుకింగ్స్ వార్షిక ప్రాతిపదికన 37 శాతం జంప్‌చేసినట్లు తెలియజేశారు. క్లౌడ్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ డీల్స్ ఇందుకు దోహదపడుతున్నట్లు వివరించారు. కాగా.. కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ ఎమిరిటస్, వ్యూహాత్మక సలహాదారుగా కొత్త బాధ్యతలు స్వీకరించినట్లు కంపెనీ పేర్కొంది. ప్రధాన వ్యూహాల అధికారి, ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీటికి రాజీనామా చేసినట్లు కంపెనీ తెలియజేసింది. కొత్త పదవులలో ఐదేళ్లపాటు కొనసాగనున్నట్లు వివరించింది. విజయ్ కుమార్ ఇకపై సీఈవో, ఎండీగా వ్యవహరించనున్నారు. గతేడాది జూలైలో నాడార్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోగా.. ఆయన కుమార్తె రోష్నీ నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తద్వారా లిస్టెడ్ దేశీ కంపెనీకి తొలి మహిళా చైర్‌ఉమన్‌గా ఎంపికయ్యారు. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 0.3 శాతం నీరసించి రూ. 1,002 వద్ద ముగిసింది. ఇతర హైలైట్స్ ► క్యూ1లో కొత్త డీల్స్ 37 శాతం ఎగశాయి. వీటి విలువ(టీసీవీ) 166.4 కోట్ల డాలర్లు. ► డాలర్ల రూపేణా నికర లాభం 12.8 శాతం బలపడింది. 4.3 కోట్ల డాలర్లకు చేరింది. ► గత క్యూ1తో పోలిస్తే ఆదాయం 15.5% ఎగసి 271.96 కోట్ల డాలర్లను తాకింది. ► వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండును బోర్డు ఆమోదించింది. ► మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు ఈ నెల 28 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ► జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 1,76,499కు చేరింది. ► వార్షిక ప్రాతిపదికన ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 11.8 శాతంగా నమోదైంది. ► ఐబీఎం మాజీ ఎగ్జిక్యూటివ్ వనితా నారాయణన్ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ
ఆమె భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ... హెచ్‌సిఎల్ కంపెనీ సిఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. విద్యాజ్ఞాన్ చైర్పర్సన్... ఆమె రోష్నీ నాడార్ మల్హోత్రా... శివ్ నాడార్ ఏకైక కుమార్తె. భారతదేశంలో విజయాలు సాధించిన మహిళల గురించి మాట్లాడుకునేటప్పుడు రోష్నీ నాడార్ మల్హోత్రా గురించి తప్పక చెప్పాలి. కోవిడ్ – 19 మహమ్మారి సమయంలో సమర్థమైన నాయకత్వ లక్షణాలు చూపించిన 25 మంది పారిశ్రామిక వేత్తలలో రోష్నీ పేరు కూడా ఉంది. 38 సంవత్సరాల రోష్నీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ అయ్యారు. అంతకు ముందు భారతీయ ఐటీ కంపెనీని నడిపించిన మొట్టమొదటి మహిళగా మరో విజయం సాధించిన గుర్తింపు పొందారు. చిన్నతనంలోనే... సాంకేతిక దిగ్గజం, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అయిన శివ్ నాడార్కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్నీ వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కెలాగ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్‌లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా కెరీర్ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్‌సిఎల్‌లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ సిఈవో బాధ్యతలు కూడా చేపట్టారు. విచిత్రమేమిటంటే, ఆమెకు సాంకేతిక రంగం మీద అస్సలు ఆసక్తి లేదు. వార్తా మాధ్యమం నుంచి ఆమె ప్రయాణం సాంకేతిక రంగం వైపుకి మళ్లింది. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలంటే, పని మీద పూర్తిగా దృష్టి పెట్టాలని అర్థం చేసుకుని, తన రంగాన్ని అలా మార్చుకున్నారు. తక్షణం భారతదేశానికి తిరిగివచ్చి తన ఫ్యామిలీ బిజినెస్ మీద పనిచేయటం ప్రారంభించారు. సాంకేతిక రంగం మీద అవగాహన లేకపోయినప్పటికీ, రోష్నీ చూపిన శ్రద్ధ, అంకితభావం కారణంగా ఆ కంపెనీ ఆర్థికంగా, పరిపాలనా పరంగా బాగా ఎదిగింది. తండ్రి శివ్ నాడార్‌తో రోష్నీ నాడార్ మల్హోత్రా సంగీత సేవా కార్యక్రమాలలో.. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు, యోగా మీద ఆసక్తి ఎక్కువ. హెచ్‌సిఎల్‌లో చేరటానికి ముందు రోష్నీ ‘శివ నాడార్ ఫౌండేషన్’లో ట్రస్టీగా సేవలు అందించారు. ఈ సంస్థ లాభాపేక్ష లేకుండా ‘శ్రీశివసుబ్రమణ్య నాడార్ ఇంజినీరింగ్ కాలేజీ’ ని చెన్నైలో నడుపుతోంది. విద్యాజ్ఞాన్ సంస్థకు అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు రోష్నీ. ఈ సంస్థలో.. ఆర్థికంగా వెనుకబడినవారికి, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ ప్రజలకు మాత్రమే ప్రవేశం. గ్రామీణ భారతం నుంచి నాయకులను తయారు చేయాలనేదే ఆమె కోరిక. వన్యప్రాణి పరిరక్షణ రోష్నీ నాడార్కు వన్యప్రాణి సంరక్షణ అంటే చాలా ఇష్టం. వాటిని సంరక్షించటంతోపాటు పరిరక్షించటమంటే మరీ ఇష్టం. 2018లో హ్యాబిటేట్స్ ట్రస్ట్‌ను స్థాపించి, ఈ సంస్థ ద్వారా భారతదేశానికి చెందిన ప్రాణులను పరిరక్షిస్తుంటారు. వివిధ వన్యప్రాణి సంస్థలతో కలిసి వన్యప్రాణి సమతుల్యతకు కృషి చేస్తున్నారు. హోండా కంపెనీలో పనిచేస్తున్న శిఖర్ మల్హోత్రాను 2009లో వివాహమాడారు. వివాహానంతరం హెచ్‌సిఎల్‌లో చేరి, ప్రస్తుతం ‘హెచ్‌సిఎల్ హెల్త్‌కేర్’లో వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం అర్మాన్, జహాన్. ఆమె సాధించిన విజయాలకు అనేక అవార్డులు అందుకున్నారు. -
సంపన్న మహిళల్లో రోష్ని నాడార్ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా అత్యంత సంపన్న మహిళల జాబితాలో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆమె సంపద రూ. 54,850 కోట్లు. రూ. 36,600 కోట్ల సంపదతో బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా రెండో స్థానంలోనూ, రూ. 11,590 కోట్లతో రాధా వెంబు (జోహో) మూడో స్థానంలో ఉన్నారు. హురున్ ఇండియా, కోటక్ వెల్త్ సంయుక్తంగా రూపొందించి 100 మంది భారతీయ సంపన్న మహిళల జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో చోటు దక్కించుకున్నారు. అపోలో హాస్పిటల్స్‌కి సంబంధించి ఏకంగా నలుగురు ఉన్నారు. లిస్టులోని మహిళల సంపద సగటు విలువ సుమారు రూ. 2,725 కోట్లు. కనీసం రూ. 100 కోట్ల సంపద గలవారిని జాబితాలో పరిగణనలోకి తీసుకున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో (వెల్త్ మేనేజ్మెంట్) ఓషర్యా దాస్ తెలిపారు. అత్యధికంగా ముంబైలో 32 మంది, న్యూఢిల్లీలో 20, హైదరాబాద్‌లో 10 మంది సంపన్న మహిళలు ఉన్నారు. -
‘స్వగ్రామం నుంచే సాఫ్ట్వేర్’ మోడల్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: ‘స్వగ్రామం నుంచే సాఫ్ట్వేర్’ విధులు నిర్వర్తించే వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టనున్నట్లు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. స్టార్టప్‌లకు ఏపీ చిరునామాగా మారనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం ప్రఖ్యాత ఐటీ కంపెనీ 'హెచ్‌సీఎల్ టెక్నాలజీస్' చైర్పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రాతో మంత్రి మేకపాటి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్మోహన్రెడ్డి ఆలోచన ప్రకారం విశాఖపట్నంలో అత్యున్నత స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఐటీ వృద్ధితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తరహా అత్యాధునిక కోర్సులకు చిరునామాగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్శిటీలో తోడ్పాటునందించాలని మంత్రి కోరడంతో హెచ్ల్‌సీఎల్ చైర్పర్సన్ సానుకూలంగా స్పందించడమే కాక ఆసక్తి చూపారు. (చదవండి: నైపుణ్యమే యువత భవితకు ఆయుధం) ఇతర రాష్ట్రాలలో స్టార్టప్‌ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అంకురాల ఏర్పాటుకు అనుకూలమని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఏపీలో చాలా తక్కువ ఖర్చుకే హబ్‌ల ఏర్పాటుకు అవసరమైన భూములు, ప్రతిభగల యువత పుష్కలంగా ఉందన్నారు. ప్రస్తుతం హెచ్‌సీఎల్ సంస్థ చేపడుతున్న 'టెక్ బీ' కార్యక్రమం ద్వారా ఇంటర్ చదివిన యువతకు 18 ఏళ్లు నిండేసరికే ఉద్యోగాలు పొందేలా వివిధ కోర్సులు నేర్పడం, శిక్షణ అందించడం, ప్లేస్ మెంట్ల ద్వారా ఉద్యోగాలివ్వడం వంటి అంశాలను మంత్రి మేకపాటికి ఛైర్ పర్సన్ రోష్ని వివరించారు. పదవతరగతి పూర్తి చేసిన బాలికలకు కూడా ఇదే తరహా కార్యక్రమం ద్వారా స్వశక్తితో నిలిచేలా చేయడానికి యత్నిస్తున్న హెచ్సీఎల్ను మంత్రి మేకపాటి అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈవో శివశంకర్ కూడా పాల్గొన్నారు. -
ఐటీ క్వీన్.. రోష్ని!
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగంలో కొత్త క్వీన్ అరంగేట్రం చేసింది. పురుషాధిక్యత అధికంగా ఉన్న ఐటీ రంగంలో తొలిసారిగా ఒక ఐటీ కంపెనీ పగ్గాలు ఒక మహిళ చేతికి వచ్చాయి. దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చైర్‌పర్సన్‌గా రోష్ని నాడార్ మల్హోత్ర నియమితులయ్యారు. హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ స్థానంలో ఆయ న ఏకైక సంతానం, రోష్ని నాడార్ చైర్పర్సన్ బాధ్యతలను శుక్రవారమే స్వీకరించారు. కాగా కంపెనీ ఎమ్డీ(చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్)గా శివ్ నాడార్ కొనసాగుతారు. దేశంలోనే అత్యధిక సంపద ఉన్న మహిళగా రికార్డులకు ఎక్కిన ఈమె. స్టాక్మార్కెట్లో లిస్టైన ఐటీ కంపెనీ చైర్‌పర్సన్‌గా పగ్గాలు చేపట్టిన తొలి మహిళ అనే ఘనతను కూడా సాధించారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ: శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన రోష్ని నాడార్ 2013లోనే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. హెచ్‌సీఎల్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తున్న హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ వసంత్ వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించిన రోష్ని నాడార్ ఢిల్లీలో కమ్యూనికేషన్స్ విభాగంలో డిగ్రీ చదివారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎమ్బీఏ పట్టా పొందారు. 2009లో హెచ్‌సీఎల్ కార్ప్‌లో చేరారు. ఏడాదిలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎదిగారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ అయ్యారు. మహిళా కుబేరుల్లో టాప్ రోష్ని నాడార్ 2010లో హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రను వివాహమాడారు. వారికి ఆర్మాన్, జాహాన్... ఇద్దరు కుమారులు. హురున్ సంస్థ తాజా కుబేరుల జాబితాలో రూ.36,800 కోట్ల సంపదతో రోష్ని నాడార్ భారత్‌లోనే అత్యధిక సంపద గల మహిళగా అగ్రస్థానంలో నిలిచారు. -
ఊరంతా తీపి
రవంత పిల్ల ర్యాంకర్ అయింది! ఆ సైకిల్ మీద వెళ్లొచ్చే అమ్మాయేనా! మన పురుషోత్తం కూతురు కదా. ప్రెస్సోళ్లు కూడా వచ్చిపోతున్నారు. ఊరికి ఎప్పుడూ ఇంత పేరు లేదు. ఊళ్లోవాళ్లంతా కూడలికి చేరారు. ఊరి నోరంతా తీపి చేశారు. ఒక తునక రోష్నీ నోటికీ అందించారు. మధ్యప్రదేశ్, భింద్ జిల్లాలోని అజ్నోల్ గ్రామంలో అంతా కలిపి 1200 మంది వరకు ఉంటారు. శనివారం సాయంత్రం ఆ ఊరికి ఉన్న ఒకే ఒక కూడలిలో గ్రామస్థులలోని కొందరు.. పనుల మధ్యలో తమ దుకాణాల బయటికి వచ్చి, ఒక కుర్రాడి చేతిలో ఉన్న స్వీట్ బాక్సులోని తమ వంతు లడ్డూలు తీసుకున్నారు. అందరికి కన్నా ఎక్కువ లడ్డూలు తిన్నది రోష్నీ. తీసుకున్న లడ్డూలోంచి ప్రతి ఒక్కరూ చిన్న తునక తీసి మొదట రోష్నీకి పెట్టి తర్వాత తాము తిన్నారు మరి. ఆమె ఇక చాలంటున్నా, గ్రామానికి ఆమె సాధించిన పెట్టిన గొప్ప ప్రతిష్టను వారంతా దాదాపు ఒక ఉత్సవంగా జరుపుకున్నారు. ఆ మధ్యాహ్నమే వచ్చిన టెన్త్ ఫలితాలలో 98.5 శాతం మార్కులు సంపాదించి, స్టేట్‌లోనే 8 వ ర్యాంకులో నిలబడింది రోష్నీ. ఆమె నిలబడటం కాదు. ఊరిని నిలబెట్టింది. అజ్నోల్లోనే కాదు, భింద్ జిల్లాలో కూడా ఏ ఆడపిల్లా ఇప్పటి వరకు ఇంతటి ఘనతను స్కూల్ నుంచి మోసుకురాలేదు. రోష్నీకి మేథ్స్‌లో, సైన్స్‌లో వందకు వంద మార్కులు వచ్చాయి! స్వీట్లు పంచిన కుర్రాడు రోష్నీ అన్న. ఇంటర్ చదువుతున్నాడు. పక్కనే రోష్నీ తమ్ముడూ ఉన్నాడు. అతడు నాలుగో తరగతి. గ్రామస్థులంతా మెచ్చుకుంటూ ఉంటే తమ ముగ్గురు పిల్లల్ని చూసుకుని మురిసిపోయారు రోష్నీ తండ్రి పురుషోత్తం, తల్లి సరితాదేవి. నిజానికిది భింద్ జిల్లా మొత్తం మురిసిపోవలసిన సందర్భం. ఆ జిల్లాలో ఒక్కేడాదైనా ‘బాలికలే ముందంజ’ అనే మాట వినిపించలేదు. జనాభా నిష్పత్తిలోనూ ఆడవాళ్లు తక్కువ ఉన్న జిల్లా భింద్. 2011 లెక్కల ప్రకారం బాలురు వెయ్యిమంది ఉంటే బాలికలు 837 మందే ఉన్నారు. మహిళల్లో అక్షరాస్యత 64 శాతం మాత్రమే. రోష్ని తల్లి సరితాదేవి ఇంటర్ వరకు చదివారు. ఆమె చదువుకునే రోజుల్లోనైతే ఈ శాతం 55 మాత్రమే. ఆడపిల్లలు మధ్యలోనే బడి మానవలసిన పరిస్థితులు అత్యధికంగా ఉన్న భింద్ జిల్లాలో రోష్నీ విజయం ఇక ముందు స్ఫూర్తిగా పనిచేయవచ్చు. అయితే రోష్నీని మరొకందుకు కూడా.. ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం కూడా ప్రేరణగా తీసుకోవాలి. ఆ అమ్మాయి చదువు అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. రోష్నీ వాళ్లండే అజ్నోల్ గ్రామం నుంచి ఆమె స్కూల్ ఉన్న మెగావ్ గ్రామం 12 కి.మీ.లు. రానూపోను 24 కి.మీ. రోజూ సైకిల్ మీద స్కూల్‌కి వెళ్లొచ్చేది. ఎర్రటి ఎండల్లో, ఎడతెరిపి లేని వానల్లో కూడా ఏ రోజూ రోష్నీ స్కూలు మానలేదు. వరదల్లో దారి మూసుకుపోయినప్పుడు మోగావ్లోని చుట్టాల ఇంట్లో ఉండి స్కూలుకు వెళ్లొచ్చింది. ఇంటికి రాకుండా మెగావ్లోనే ఉండిపోయిన రోజులూ ఉన్నాయి. గ్రామాల్లో ఇది మామూలే అయినా.. ఎండకు, వానకు, గడువు తేదీలోపు ఫీజు కట్టలేని పరిస్థితులకు, స్కూలుకు వెళ్లలేని శారీరక అననుకూలతలకు చదువును వదిలేయకపోవడం మామూలు సంగతైతే కాదు. రాక్షసిలా చదువును పట్టేసుకుంది రోష్నీ. ఆ రాక్షసి ఇప్పుడు రోష్నీని పట్టేసుకుంది. ఐ.ఎ.ఎస్. చదువుతాను అంటోంది రోష్నీ. కలెక్టర్ అవాలని తను చిన్నప్పుడే నిర్ణయించుకుంది. ఎవరో చెప్పారట.. కలెక్టర్ అయితే పేద వాళ్లందరికీ మంచి చెయ్యొచ్చని. ఇంటర్లో మేథ్స్ తీసుకోబోతోంది. మెగావ్లో కాలేజ్ కూడా ఉంది. రోష్నీని రోజూ మేమే కాలేజ్ దగ్గర దింపి వస్తాం అని బంధువులు ఇప్పటినుంచే పోటీలు పడి మాట ఇస్తున్నారు. రోష్నీ తండ్రి రైతు. నాలుగెకరాల పొలం ఉంది. పొలంతోనే కుటుంబ పోషణ. రోష్నీకి ర్యాంకు రావడంతో ఆయనకు పట్టలేనంత సంతోషంగా ఉంది. ఊరి మొత్తం మీద ఇప్పుడాయన ప్రయోజకుడైన తండ్రి! ‘‘నా ముగ్గురు పిల్లల చదువుల గురించి గర్వంగా చెప్పుకోగలను. రోష్నీ ఇప్పుడు ఊరికే గర్వ కారణం అయింది’’ అంటున్నారు ఆయన. ‘‘నా కూతురు పెద్ద డిగ్రీలు చదవాలి. పెద్ద కంపెనీల్లో పని చేయాలి. పెద్ద నగరాలలో తిరగాలి’’ అని కూడా. -
నాకే ఎందుకిలా..!
మూడు నెలల కింద ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి హుస్సేన్‌సాగర్‌లో దూకాడు. లేక్‌పోలీసులు గమనించి అతన్ని కాపాడారు. తాను చాలా కష్టాల్లో ఉన్నానని, తనను ఆదుకొనేందుకు ఎవరూ లేరని గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నెల 10వ తేదీన ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా డిప్రెషన్‌పై ప్రత్యేక కథనం.. నెల రోజుల కింద 18 ఏళ్ల వయసు కూడా లేని ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగానే తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థకు కాల్ చేసి తాను చనిపోబోతున్నానని చెప్పాడు. ప్రేమ విషయంలో మోసపోయిన తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆవేదన చెందాడు. చివరకు స్వచ్ఛంద సంస్థ కౌన్సెలింగ్ సాయంతో ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. వైమీ సిండ్రోమ్ అనే కుంగుబాటుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఎందరున్నా డిప్రెషన్‌తో కుంగిపోతున్నారు. ప్రపంచంలో ఎవరికీ లేని బాధలు, కష్టాలు తమకే ఉన్నాయని, తామే ఎందుకిలాంటి దుర్భరమైన స్థితిలో బతకాల్సి వస్తోందనే డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు ఏటికేటికీ పెరుగుతున్నారు. ఏటా వారి సంఖ్య 250 నుంచి 300 వరకు నమోదవుతున్నట్లు ఆత్మహత్యల నివారణ సంస్థ రోష్ని అధ్యయనంలో వెల్లడైంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు యువత 50 శాతం వరకు ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత మహిళలు, వయోధికులు, తదితర కేటగిరీలకు చెందిన వారున్నారు. అన్ని వర్గాల్లోనూ ఎక్కువ శాతం డిప్రెషన్ కారణంగా ఒంటరితనానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారానికి సుమారు ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. సగటున నెలకు 30 మందికి పైగా బాధితులు తమకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదంటూ ఫోన్ ద్వారా ‘రోష్ని’ని సంప్రదిస్తున్నారు. బంధాలు తెగిపోతున్నాయి.. కుటుంబాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇంట్లో అందరూ ఉన్నా ఎవరికీ ఎవరూ ఏమీ కాని ఓ చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి ప్రపంచంలోకి మరొకరు తొంగి చూడట్లేదు. ఎవరికి వారు ఒంటరిగానే బతికేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా జీవన శైలి బాగా వేళ్లూనుకుపోతోంది. ఒకరి సమస్యలను ఒకరికి చెప్పుకొని పరిష్కరించుకొనే స్నేహపూరితమైన వాతావరణం లోపిస్తోంది. ఇంటా బయటా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వారు చివరకు డిప్రెషన్‌తో ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్, ర్యాంకులు వంటి అంశాల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు ‘వైమీ సిండ్రోమ్’తో బాధపడుతున్నారు. చివరకు చావును పరిష్కారంగా భావిస్తున్నారు. కుటుంబ హింస, అనారోగ్యం.. మోసపోయిన వారు, కుటుంబ హింస ఎదుర్కొంటున్న మహిళలు కూడా తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతున్నారు. అనారోగ్యంతో బాధపడే వృద్ధులు పరిష్కారంగా చావును వెతుక్కుంటున్నారు. చివరకు ఖరీదైన మొబైల్ ఫోన్ లేదనే కారణంతో డిప్రెషన్‌కు గురై ‘వైమీ సిండ్రోమ్’బారిన పడుతున్నట్లు అంచనా. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం.. కుంగుబాటు మనిషిలో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తుంది. నిద్రలేమి.. విపరీతమైన కోపం, తీవ్రమైన బాధ, అకారణమైన దుఃఖం, ఎవరికీ భారం కావొద్దనే భావన వెంటాడుతాయి. తరచుగా జీవితంపై విరక్తి ప్రకటిస్తారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు గుర్తించి భరోసా ఇవ్వాలి. డిప్రెషన్ బాధితుల బాధను ఓపిగ్గా వినాలి. గ్రేటర్లో ఇలా.. ► రోష్ని స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 250 మంది డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ► ఏటా 350 నుంచి 400 వరకు ఈ తరహా కేసులు నమోదువుతున్నాయి. ► తాము ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రతి నెలా 30 మందికి పైగా ‘రోష్ని’ని సంప్రదిస్తున్నారు. గతేడాది ఆత్మహత్యల్లో 20 ఏళ్లలోపు వారు: 62 21 నుంచి 30 ఏళ్ల వయసు వారు: 140 31 నుంచి 40 ఏళ్ల వయసు వారు: 91 41 నుంచి 60 ఏళ్ల వయసు వారు: 38 60 ఏళ్లు దాటినవారు: 31 మీ కోసం మేమున్నాం జీవితంలో సమస్యలు రావడం సహజం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రపంచంలో ఎవ్వరికీ లేని బాధలు తమకు మాత్రమే ఉన్నాయనుకోవడం సరికాదు. డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లు నేరుగా సికింద్రాబాద్, సింధ్ కాలనీలోని రోష్ని సంస్థను సంప్రదించొచ్చు. లేదా 040–6620 2000, 040–6620 2001 నంబర్లకు ఫోన్ చేసి పరిష్కారం పొందొచ్చు. మీ కోసం మేమున్నామనే విషయాన్ని మరిచిపోవద్దు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు రోష్ని పని చేస్తుంది. - మాలతీరాజి, డైరెక్టర్, రోష్ని ఓదార్పు ఎంతో ముఖ్యం సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపవుతుంది. బాధను పంచుకుంటే సగమవుతుంది. బాధలో ఉన్నవారు చెప్పేది ఓపిగ్గా వింటే చాలు వారికి ఎంతో ఊరట లభిస్తుంది. భరోసాను, మానసిక ధైర్యాన్ని అందజేస్తే డిప్రెషన్ నుంచి బయటపడతారు. - ఆనంద దివాకర్, రోష్ని ప్రతినిధి – సాక్షి, హైదరాబాద్ -
బీటెక్ బాబుల కథ!
ఆ నలుగురూ అప్పుడే కాలేజీ అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు.ఆ తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులేమిటనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘బి.టెక్ బాబులు’. శార్యా, రోషిణి, అశ్విని, షకలక శంకర్ ముఖ్యతారలుగా మధు వర్మ, రవి మామిడి, జమ్ముధన, సత్యనారాయణ కాజా, ప్రవీణ్ బూడి, కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శీను ఇమండి దర్శకుడు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఆద్యంతం నవ్వించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నెలాఖరులో పాటలను, చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతలు తె లిపారు. సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, కథానాయికలు రోషిణి, అశ్విని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కాలిపోయిన వెన్నెల
నిజాలు దేవుడికెరుక జూన్ 1, 2013... ముంబై హాస్పిటల్... అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎమర్జెన్సీ రూమ్ బయట ఉన్న బెంచీ మీద ఓ యాభయ్యేళ్ల వ్యక్తి, నలభయ్యేళ్లు దాటిన మహిళ ఉన్నారు. ఆమె కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. దుఃఖం పొంగుకొస్తుంటే ఆ శబ్దం బయటకు రాకూడదని చీర చెంగును నోటిలో కుక్కుకుంటోంది. ఆమె పక్కనే కూచున్న వ్యక్తి చూపులు శూన్యాన్ని కొలుస్తున్నాయి. బాధను దిగమింగుతున్నట్టుగా గొంతు దగ్గర నరాల కదలిక చెబుతోంది. అంతలో ఎమర్జెన్సీ రూమ్ తలుపులు తెరచుకున్నాయి. నర్స్ బయటకు వచ్చింది. వాళ్లవైపు చూసి, ‘‘లోపలికి రండి’’ అనేసి లోనికి వెళ్లిపోయింది. వణుకుతోన్న కాళ్లను అతి కష్టమ్మీద నేలకు అదిమి పెడుతూ ఇద్దరూ లోనికి నడిచారు. మంచమ్మీద ఓ ఇరవై మూడేళ్ల అమ్మాయి ఉంది. ఒళ్లంతా తెల్లని దుప్పటి కప్పేశారు. ముఖం మాత్రమే కనిపిస్తోంది. చూడలేనంత దారుణంగా ఉందా ముఖం. చర్మం కాలిపోయింది. కండరాలు ఉడికి పోయి, రక్తం ఉబికి వచ్చి దయనీయంగా ఉంది. ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు ఆమెను పరీక్షిస్తున్నారు. గబగబా వారి దగ్గరకు వెళ్లారు ఆ భార్యాభర్తలిద్దరూ. ‘‘ఏం జరిగింది’’ అనడిగారు కంగారుగా. ‘‘తను మీతో మాట్లాడాలనుకుంటోంది’’ అనేసి వెళ్లిపోయాడు డాక్టర్. నర్సులు దూరంగా జరిగి నిలబడ్డారు. ఆ మహిళ మంచం దగ్గరగా నడిచి, వంగి ఆ అమ్మాయి ముఖంలోకి చూసింది. సగం తెరిచిన కళ్లు... ఆ కళ్ల నుంచి జాలువారుతోన్న కన్నీళ్లు... కన్నబిడ్డను ఆ స్థితిలో చూడలేక ఆ తల్లి ఘొల్లుమంది. తండ్రి గుండె చిక్కబట్టుకున్నాడు. ‘‘ఏదో మాట్లాడాలన్నావంట, ఏమైనా కావాలా తల్లీ?’’ అడిగిందామె. ఆ అమ్మాయి బలవంతాన మాట కూడదీసుకుంది. పలుకులు మూటగట్టుకుంది. గొంతు పెగల్చుకుని చిన్నగా అంది... ‘‘ఎందుకిలా జరిగిందమ్మా? నేనేం పాపం చేశాను?’’ అంతే... మరుక్షణం ఆ మాట మూగబోయింది. ఆమె శ్వాస ఆగిపోయింది. ‘ప్రీతీ’ అన్న కేకతో ఆ ఆసుపత్రి దద్దరిల్లింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసి వైద్యులు, నర్సుల కళ్లు సైతం చెమ్మగిల్లాయి. అసలు ఎవరీ ప్రీతి? తనకేం జరిగిందో కూడా తెలియని స్థితిలో నిస్సహాయంగా ఎందుకు మరణించింది? మార్చ్ 28, 2013. బీబీఎంబీ కాలనీ (ఢిల్లీ)... రోషిణి వంట గదిలో ఉంది. ఆమె భర్త అమర్‌సింగ్ రాఠీ హాల్లో కూచుని ఏదో పత్రిక చదువుతున్నాడు. హితేష్ (21), తనూ (19) టీవీలో ఏ చానెల్ చూడాలా అని కొట్లాడుకుంటున్నారు. అప్పుడే బయటి నుంచి సుడిగాలిలా వచ్చింది ప్రీతి. చేతిలో ఉన్న కవర్ని చూపుతూ గంతులేయడం మొదలెట్టింది. ‘‘ఏంటక్కా అది’’... ఆతృతగా అడిగింది తనూ. ‘‘చెప్పనుగా. ముందు నాన్నకే చూపిస్తాను’’ అంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తి ఆయన పక్కనే సోఫాలో కూర్చుంది. చేస్తున్న పని ఆపి కూతురివైపు మురిపెంగా చూశాడు అమర్‌సింగ్. ‘‘ఏంట్రా అది’’ అన్నాడు కవర్ని అందుకుంటూ. దాన్ని తెరచి చూసిన అతడి కళ్లు ఆనందంతో, ఆశ్చర్యంతో అరమోడ్పులయ్యాయి. కూతురి ముఖంలోకి నమ్మలేనట్టుగా చూశాడు. ప్రీతి నవ్వింది. ‘‘నాకు మిలిటరీలో నర్స్‌గా ఉద్యోగం వచ్చింది నాన్నా. ఇంకో నెల రోజుల్లో ముంబై వెళ్లి జాయినవ్వాలి’’ ఆ మాట వింటూనే హితేష్, తనూలు అక్క దగ్గరకు వచ్చేశారు. ‘‘వావ్ అక్కా... కంగ్రాట్స్’’ అన్నాడు హితేష్ ప్రీతిని పట్టి ఊపేస్తూ. ‘‘మరి నా పార్టీ సంగతేంటి’’ అంది తనూ చేతులు రెండూ నడుముకు ఆన్చి, డిమాండ్ చేస్తున్నట్టుగా. ‘‘ఇస్తాలేవే’’ అంటూ చెల్లెలి నెత్తిమీద మొట్టింది ప్రీతి. ఈ సందడికి వంటింట్లోంచి వచ్చిన రోషిణి కూతురి ప్రయోజకత్వాన్ని చూసి పొంగిపోయింది. ‘‘నాకు తెలుసురా నువ్వు అనుకున్నది సాధిస్తావని’’ అంది కళ్లొత్తుకుంటూ. ‘‘అమ్మో... అమ్మ మళ్లీ ట్యాప్ తిప్పింది’’ అన్నాడు హితేష్ భయం నటిస్తూ. అందరూ ఫక్కుమన్నారు. ఆ రోజంతా ఆ ఇంట నవ్వుల పువ్వులు విరబూశాయి. మే 2, 2013... ముంబై రైల్వేస్టేషన్. గరీబ్థ్ ్రవచ్చి ప్లాట్‌ఫామ్ మీద ఆగింది. ఎస్ 2 బోగీలోంచి ప్రీతి జింక పిల్లలా చెంగున దిగింది. ఆ వెనుకే ఆమె తల్లిదండ్రులు, బాబాయ్ వినోద్, పిన్ని సునీత దిగారు. అందరూ కలిసి ‘ఎగ్జిట్’వైపు నడవడం మొదలు పెట్టారు. కబుర్లు చెబుతూ హుషారుగా అడుగులు వేస్తోన్న ప్రీతి... తన భుజాన్ని ఎవరో తట్టినట్టు అనిపించడంతో ఆగి వెనక్కి చూసింది. ఎవరో వ్యక్తి. ముఖానికి గుడ్డ కట్టుకున్నాడు. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అతడెవరో పోల్చుకుందామని ప్రయత్నిస్తుండగానే అతడి చేయి పైకి లేచింది. ప్రీతి శరీరం భగ్గుమంది. ‘అమ్మా’ అంటూ ప్రీతి అరిచిన అరుపు కొన్ని కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. నేలకూలింది ప్రీతి. ఒళ్లంతా మైనంలా కరిగిపోతోంది. రక్తం ఉబికి వస్తోంది. ఒళ్లు కాలిన వాసన గుప్పుమంటోంది. ‘‘ఎవరో యాసిడ్ పోశారు’’ అరిచాడో వ్యక్తి. అమర్‌సింగ్, రోషిణిల గుండెలు అదిరిపోయాయి. ‘ప్రీతీ’ అంటూ కూతురి దగ్గరకు పరుగులు తీశారు. ఒళ్లంతా మంటలు పుడుతోంటే తాళలేక హృదయ విదారకంగా ఏడుస్తోంది ప్రీతి. ‘‘నా బిడ్డని కాపాడండి’’... కేకలు పెట్టింది రోషిణి.అంతలో రైల్వే పోలీసులు వచ్చారు. ప్రీతిని బ్లాంకెట్‌లో చుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ‘‘మీ అమ్మాయికి ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా?’’... ఆ ప్రశ్న వింటూనే ఇబ్బందిగా కదిలాడు అమర్‌సింగ్. రోషిణి మాత్రం... ‘‘మా అమ్మాయి అలాంటిది కాదు సర్’’ అంది ఆవేశంగా. ‘‘ప్రేమించడం తప్పేమీ కాదమ్మా. సాధారణంగా యాసిడ్ దాడులకు పాల్పడేవాళ్లు ప్రేమికులో, ప్రేమిస్తున్నామని వెంటబడే రోమియోలో అయివుంటారు. పోనీ మీ అమ్మాయిని ఎవరైనా వేధిస్తున్నారా?’’ ‘‘లేదు సర్. అలాంటిదేమైనా ఉంటే తను మాకు చెప్పేది.’’ తల పంకించాడు ఇన్స్పెక్టర్. ‘‘సరే... మేం ఇన్వెస్టిగేట్ చేస్తాం’’ అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అతడి దృష్టి మొత్తం ప్రీతికెవరైనా బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా అన్నదాని మీదే ఉంది. ఆ దిశగానే ఎంక్వయిరీ మొదలు పెట్టాడు. విచారణలో ప్రీతికి ముగ్గురు అబ్బాయిలతో స్నేహం ఉందని తెలిసింది. కానీ ఆ ముగ్గురూ ఆమెకి మంచి స్నేహితులని నిరూపణ కూడా అయ్యింది. పైగా సంఘటన జరిగినప్పుడు వారిలో ఎవ్వరూ ముంబైలో కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ లేరు. దాంతో వారిని తన లిస్టు లోంచి తీసేశాడు. పలు కోణాల్లో పరిశోధించాడు కానీ ఫలితం లేకపోయింది. అంతలో ప్రీతి పరిస్థితి విషమించింది. ఒక కన్ను పోయింది. ముఖం, చెవులు, మెడ, మిగతా శరీరమంతా బాగా కాలిపో యింది. లోపలి అవయవాలు సైతం బాగా దెబ్బతినడంతో నెల రోజుల తర్వాత కన్నుమూసింది. చనిపోయే వరకూ ఆమె ఒక్కటే ప్రశ్న అడిగింది... ‘నాకెందుకిలా జరిగింది, నేనేం పాపం చేశాను’? ఆ ప్రశ్నకు సమాధానం దాదాపు 9 నెలల తరువాత తెలిసింది పోలీసులకు. గుర్గావ్ నుంచి రవి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రీతి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలుసన్నాడు. అతడిచ్చిన వివరాలను బట్టి, ప్రీతి పక్కింటి అబ్బాయి అంకుర్ పన్వర్ (21)ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రీతిని అంకుర్ ప్రేమించాడేమో అన్న ఆలోచనతో ఉన్న పోలీసులకు అతగాడు చెప్పిన కారణం విని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.అంకుర్ ప్రీతిని ప్రేమించలేదు. అతడికసలు ఆ ఆలోచన కూడా లేదు. అయినా కూడా ప్రీతిని చంపేయాలనుకున్నాడు. అందుకు కారణం... అసూయ. అంకుర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. కానీ దాని మీద శ్రద్ధ లేదు. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో తిరుగుతాడు. పార్టీలంటూ టైమ్ వేస్ట్ చేస్తాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కోప్పడుతూ ఉండేవారు. ‘ప్రీతిని చూసి నేర్చుకో, ఎంత చక్కగా చదువుతుందో’ అంటూ క్లాస్ పీకేవారు. వాళ్లు అలా అన్న ప్రతిసారీ ప్రీతి మీద కోపం ముంచుకొచ్చేది. అది కాస్తా ఆమెకు ఉద్యోగం వచ్చేసరికి హద్దులు దాటింది. ‘ప్రీతి అనుకున్నది సాధించింది, నీకు సెటిల్మెంట్ గురించి టెన్షనే లేదు’ అని ఇంట్లోవాళ్లు అనగానే రక్తం మరిగిపోయింది. ఆ ఆవేశంలోనే ప్రీతిని చంపేందుకు స్కెచ్ వేశాడు. ఆమెతోపాటు ముంబై బయలుదేరాడు. రైల్లోనే యాసిడ్ పోయాలనుకున్నాడు కానీ అందరూ ఉండటంతో కుదరలేదు. రైలు దిగాక తాను అనుకున్నది చేశాడు. తన పైశాచికత్వానికి ఆ బంగారు తల్లిని బలి తీసుకున్నాడు. ప్రీతి ఏ పాపం చేయలేదు. అంకుర్ అసూయ జ్వాలలకు ఆహుతైపోయింది... అంతే. కేవలం ద్వేషంతో అంకుర్ చేసిన పని... ఆమె కలల్ని మొదలంట నరికేసింది. ఆమె జీవితాన్నే అంతం చేసింది. ఆమెని అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రుల కడుపులో చిచ్చు పెట్టింది. ఓ క్షణం ఆలోచిస్తే... ఆవేశం చల్లారిపోతుంది. వాస్తవం స్ఫురిస్తుంది. కర్తవ్యం బోధపడుతుంది. మంచీ చెడుల విచక్షణ తెలుస్తుంది. ఆ ఒక్క క్షణం.. చాలా విలువైనది. అది... కొన్ని జీవితాలను నిలబెడుతుంది. కొన్ని జీవితాలను కూలదోస్తుంది. అందుకే ఏదైనా చేసేముందు ఒక్క క్షణం ఆలోచించండి. అప్పుడు మరో అంకుర్ తయారవ్వడు. మరో ప్రీతి బలవ్వదు. మరే తల్లీ కడుపుకోతతో విలవిల్లాడదు! - సమీర నేలపూడి -
నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో యువతకు రోష్నీ
2013- జాతీయం ప్రాణాధారమైన నీటి సంరక్షణకు భారత్ నడుంబిగించింది. జాతీయ జల విధాన కార్యాచరణలో భాగంగా 2013ను జల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించేందుకు మేలో కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. దేశ వ్యాప్తంగా నగదు బదిలీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 20 జిల్లాల్లో జనవరి 1న ప్రారంభించింది. తొలుత ఈ పథకాన్ని 51 జిల్లాల్లో ప్రారంభించాలని నిర్ణయించినా.. లబ్ధిదారులకు ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు లేకపోవడం వంటి కారణాలతో 20 జిల్లాలకే పరిమితం చేశారు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 12న ప్రత్యేక తపాలా బిళ్ల (పోస్టల్ స్టాంప్)ను న్యూఢిల్లీలో విడుదల చేశారు. కేరళలోని కోచిలో 11వ ప్రవాసీ భారతీయ దివస్‌ను జనవరి 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు నిర్వహించారు. ఇదే వేదికపై ‘గదర్ ఉద్యమం’ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జనవరి 8న ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్‌కు భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డును బహూకరించారు. ‘ఎంగేజింగ్ డయాస్పొరా-ది ఇండియన్ గ్రోత్ స్టోరీ’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ జనవరి 19న పార్టీ ఉపాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. రాహుల్‌కు పార్టీలో నెం.2 స్థానాన్ని కట్టబెడుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మేఘాలయ, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్తగా మూడు హైకోర్టులను ఏర్పాటు చేసింది. త్రిపుర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి నలుగురు న్యాయమూర్తులు.. మేఘాలయ, మణిపూర్ హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తితో కలిపి ముగ్గురు న్యాయమూర్తులు ఉంటారు. ఈ మూడు కొత్త హైకోర్టులతో కలిపి దేశంలో హైకోర్టుల సంఖ్య 21 నుంచి 24కు పెరిగింది. దేశంలో 2002-09 మధ్య పాఠశాలల సంఖ్య 27 శాతం పెరిగినట్లు 8వ ఆలిండియా ఎడ్యుకేషన్ సర్వే (ఏఐఈఎస్‌టీ) పేర్కొంది. అదే సమయంలో ఉపాధ్యాయుల సంఖ్య కూడా 30 శాతానికిపైగా పెరిగినట్లు తెలిపింది. ఈ సర్వేను జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) జనవరి 22న విడుదల చేసింది. బాలల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ‘రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య పథకాన్ని’ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఫిబ్రవరి 6న మహారాష్ట్రలోని ఫాల్ఘార్‌లో ప్రారంభించారు. ఈ పథకం కింద జననానికి ముందే వైకల్యానికి కారణమయ్యే వ్యాధులు, లోపాలు, ఇతర సమస్యలను గుర్తించడానికి చర్యలు తీసుకుంటారు. దేశంలో మొదటి జియో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), ఛత్తీస్‌గఢ్ పునర్వినియోగ ఇంధన అభివృద్ధి సంస్థల మధ్య ఫిబ్రవరి 16న ఒప్పందం కుదిరింది. లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి ఎన్నికలకు పోటీ చేసిన 2,171 మందిని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 15న అనర్హులుగా ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజులలోపు ఎన్నికల వ్యయం లెక్కలను సమర్పించకపోవడంతో వారిని అనర్హులుగా గుర్తించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద అనర్హత వేటు పడినవారు మరో మూడేళ్లపాటు ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదు. కావేరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది తీర్పును కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న నోటిఫై చేసింది. దీని ప్రకారం కర్ణాటక విధిగా తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. జస్టిస్ ఎన్.పి. సింగ్ చైర్మన్‌గా, ఎన్.ఎన్.రావు, సుధీర్ నారాయణ్‌లు సభ్యులుగా ఉన్న ట్రిబ్యునల్ 2007 ఫిబ్రవరిలో కావేరీ జలాల పంపిణీపై ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. సముద్ర జలాలను తాగు నీరుగా మార్చేందుకు ఉద్దేశించిన నిర్లవణీకరణ ప్రాజెక్ట్‌ను తమిళనాడు కాంచీపురం జిల్లాలోని నెమిలి వద్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఫిబ్రవరి 22న ప్రారంభించారు. దీన్ని రూ. 871 కోట్లతో 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నిత్యం 265 మిలియన్ లీటర్ల సముద్ర నీటిని 100 మిలియన్ లీటర్ల తాగు నీరుగా మార్చుతారు. దీనివల్ల చెన్నైలోని వేలాచ్చారి, పళ్లిపట్టు, తిరువాన్మయూరులలో నివసిస్తున్న సుమారు 15 లక్షల మందికి మంచి నీరు అందనుంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఫిబ్రవరి 28న వెల్లడించింది. త్రిపుర: అధికార లెఫ్ట్‌ఫ్రంట్ విజయం సాధించి వరుసగా ఐదోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 60 సీట్లకు గాను 50 స్థానాల్లో లెఫ్ట్‌ఫ్రంట్ (సీపీఎం-49 స్థానాలు, సీపీఐ-1 స్థానం) గెలిచింది. నాగాలాండ్: నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 59 అసెంబ్లీ స్థానాలకు గాను 37 సీట్లలో గెలుపొందింది. మేఘాలయ: మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 29 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 8 స్థానాల్లో యునెటైడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) గెలిచింది. ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంపై భారత్-భూటాన్‌లు న్యూఢిల్లీలో మార్చి 4న సంతకాలు చేశాయి. ఆర్థిక మంత్రి చిదంబరం, భూటాన్ ఆర్థిక మంత్రి లింపో వాండే నోర్బూలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆదాయపు పన్ను ఎగవేతను, ద్వంద్వ పన్నులను ఈ ఒప్పందం నివారిస్తుంది. అత్యాచార నిరోధక బిల్లుకు మార్చి 19న లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు -2013’ పేరుతో ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లు ప్రకారం అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడితే దోషికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష, అవసరమైతే చనిపోయేంత వరకు జైలుశిక్ష విధిస్తారు. రెండోసారి అదే నేరానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. పరస్పర ఆమోదంతో శృంగారానికి వయోపరిమితిని 18 ఏళ్లుగా నిర్ణయించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వర్ణోత్సవాలు ఏప్రిల్ 6న న్యూఢిల్లీలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి ప్రణబ్.. సుపరిపాలన లేకపోవడం సమాజంలో రుగ్మతలకు కారణమని, అవినీతి.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో 19.57 లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 4.87 లక్షల హెక్టార్లు, అస్సాంలో 3.30 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 2.57 లక్షల హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైంది. 2013ను జల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించేందుకు కేంద్ర కేబినెట్ మే 9న ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబర్లో ఆమోదించిన జాతీయ జలవిధాన కార్యాచరణలో భాగంగా జల సంరక్షణ సంవత్సరానికి పచ్చజెండా ఊపింది. చైనా ప్రధానమంత్రి లీ కెకియాంగ్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య మే 20న ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో ైైైద్వైపాక్షిక వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు, జలవనరుల రంగంలో సహకారం, మాంసం, మత్స్య ఉత్పత్తుల వాణిజ్యంలో పరస్పర సహకారం, మురుగునీటి నిర్వహణలో సహకారం వంటివి ఉన్నాయి. 45వ భారత కార్మిక సదస్సు ఢిల్లీలో మే 17న జరిగింది. ఈ సదస్సును ప్రధాని మన్మోహన్సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2004 నుంచి 2010 వరకు ప్రభుత్వం 20 మిలియన్ల అదనపు ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఇదే కాలంలో నిరుద్యోగిత రేటు 8.3 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గిందన్నారు. క్రీమీలేయర్ (సంపన్న శ్రేణి) వార్షిక ఆదాయ పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచాలని కేంద్ర కేబినెట్ మే 16న నిర్ణయించింది. ఓబీసీ కోటా కింద రిజర్వేషన్లు పొందేవారికి ఇది వర్తిస్తుంది. నాలుగేళ్లకోసారి క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని సవరిస్తారు. హర్యానాలోని గుర్గావ్లో బినోలా వద్ద ఏర్పాటు చేస్తున్న తొలి జాతీయ రక్షణ విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మే 23న శంకుస్థాపన చేశారు. ఐఐటీ, ఐఐఎం స్థాయిలో ఇండియన్ నేషనల్ డిఫెన్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం 2018 నాటికి పనిచేయడం ఆరంభిస్తుంది. మలయాళం భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ మే 23న నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 3.33 కోట్ల మంది మలయాళం మాట్లాడేవారున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన నాలుగో భాష మలయాళం. ఇప్పటికే తమిళం, కన్నడం, తెలుగు భాషలకు ఈ హోదా దక్కింది. భారత్‌లోని నికోబార్ దీవులను యునెస్కో వరల్డ్ బయోస్పియర్ రిజర్వ్‌గా మే 30న ప్రకటించింది. స్థానిక సమాజ చర్యలాధారంగా సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమంలో (మాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్) భాగంగా యునెస్కో, నికోబార్ దీవులను గుర్తించింది. ప్రకృతి, మానవ కార్యకలాపాలను నిర్వహించే కొత్త విధానాలను ఈ ప్రాంతంలో పరీక్షిస్తారు. నికోబార్ దీవులు 1800 జంతు జాలాలకు, అంతరిస్తున్న గిరిజన తెగలకు ఆవాసంగా ఉన్నాయి. భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ థాయ్‌లాండ్ పర్యటనలో మే 30న ఇరుదేశాలు నేరస్తుల అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఉగ్రవాద, ఆర్థిక, ఇతర అంతర్జాతీయ నేరాలతో సంబంధమున్న నేరస్థు ల అప్పగింతకు ఈ ఒప్పందం చట్టబద్ధత కల్పిస్తుంది. రాజకీయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జూన్ 3న కీలక తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలు కూడా ప్రజా సంస్థలేనని, సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అవి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఆరు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు కేంద్ర ప్రభుత్వం నుంచి పరోక్షంగా పెద్ద ఎత్తున నిధులు పొందుతున్నాయని తెలిపింది. ప్రజా సంబంధిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున.. ఆర్టీఐ చట్టంలోని ప్రజా సంస్థల లక్షణం పార్టీలకున్నట్లేనని చెప్పింది. దేశంలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని యువత కోసం రోష్నీ పేరిట కొత్తగా నైపుణ్య అభివృద్ధి పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ జూన్ 7న ఢిల్లీలో ప్రారంభించారు. దేశంలోని అత్యంత సమస్యాత్మకమైన 24 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లా ఇందుకు ఎంపికైంది. యువతలో నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడమే రోష్నీ పథకం లక్ష్యమని మంత్రి చెప్పారు. భారత్‌లో సింగపూర్ సైన్యం శిక్షణ, విన్యాసాల సౌకర్యాలు ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్- సింగపూర్లు జూన్ 4న సంతకాలు చేశాయి. భారత రక్షణ మంత్రి ఏకే ఆంటోని సింగపూర్ పర్యటనలో ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఇటువంటి ఒప్పందాలు ఇరుదేశాల మధ్య 2007, 2008లో కుదిరాయి. ప్రస్తుత ఒప్పందం ప్రకారం సింగపూర్ సైనిక శిక్షణ కార్యక్రమాలు ఐదేళ్లపాటు సాగుతాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశం జూన్ 5న న్యూఢిల్లీలో జరిగింది. నక్సల్ సమస్య ప్రధానంగా చర్చకు వచ్చింది. భారత విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్ జూలై 31న బాధ్యతలు చేపట్టారు. చోకిలా అయ్యర్, నిరుపమారావు తర్వాత ఈ పదవిని చేపట్టిన మూడో మహిళ సుజాతాసింగ్. జాతీయ ఆహార భద్రత ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 5న ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ జూలై 3న ఆమోదించింది. భారత సైన్యంలో అత్యంత వుుఖ్యమైన వ్యక్తిగత కార్యదర్శి హోదా పొందిన తొలి వుహిళగా లెఫ్టినెంట్ గనీవ్ లాల్జీ చరిత్ర సృష్టించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలును పర్యవేక్షించే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల (డీఆర్డీఏ)ను రద్దు చేస్తున్నట్టు కేంద్రం జూలై 9న ప్రకటించింది. దేశంలో టెలిగ్రామ్ సేవలను జూలై 14 నుంచి పూర్తిగా రద్దు చేశారు. 1854 నుంచి టెలిగ్రామ్ సేవలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (జేఎంఎం) జూలై 13న ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి.సదాశివం జూలై 19న ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నూతన చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి శరద్ కుమార్ నియమితులయ్యారు. 2012 కంపెనీల బిల్లుకు రాజ్యసభ ఆగస్టు 8న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు గత డిసెంబర్లో లోక్‌సభ ఆమోదం పొందింది. 1956 కంపెనీల చట్టం స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కార్పొరేట్ గవర్నెన్స, పెట్టుబడిదారుల భద్రత, కార్పొరేట్ సామాజిక బాధ్యత మోసాలను అరికట్టడం వంటి ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును తీసుకొచ్చారు. ఆహార భద్రత పథకాన్ని ఢిల్లీలో ఆగస్టు 20న సోనియా గాంధీ ప్రారంభించారు. ఢిల్లీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాయి. భూసేకరణ బిల్లు-2012కు లోక్‌సభ ఆగస్టు 29న ఆమోదం తెలిపింది. 1894 చట్టం స్థానంలో కొత్త బిల్లును తెచ్చారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానంపై తన ప్రత్యేక దూతగా మాజీ రాయబారి రాకేశ్ సూద్‌ను సెప్టెంబర్ 1న నియమించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) బిల్లు-2011ను లోక్‌సభ సెప్టెంబర్ 4న ఆమోదించింది. వృద్ధాప్య ఆదాయ భద్రతను ప్రోత్సహించే అథారిటీ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ భారత్ పర్యటనలో సెప్టెంబర్ 11న నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ సంస్థ (ఎస్ఈఏఆర్ఓ) రీజనల్ డెరైక్టర్‌గా భారత ప్రతినిధి డా.పూనమ్ ఖేత్రపాల్ సింగ్ సెప్టెంబర్ 12న ఎన్నికయ్యారు. జాతీయ సమగ్రతా మండలి (ఎన్ఐసీ) సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలో సమావేశమైంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే తిరస్కరించే హక్కును కల్పిస్తూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న తీర్పునిచ్చింది. దీంతో పోటీచేస్తున్న అభ్యర్థిని వ్యతిరేకించడం గాని లేదా అందరిని తిరస్కరించే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇందుకోసం బ్యాలెట్ పత్రాలు, ఓటింగ్ యంత్రాల్లో ‘పై వారెవరూ కాదు’ (నన్ ఆఫ్ ది అబౌ) అనే బటన్ ఉండాలని కోర్టు పేర్కొంది. ఓటర్లకు తిరస్కరించే హక్కు ఉండాలంటూ ‘పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు పై తీర్పునిచ్చింది. భారత సుప్రీంకోర్టుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక పిన్‌కోడ్ - 110201ను సెప్టెంబర్ 26న ప్రవేశపెట్టింది. వివిధ కేసుల్లో దోషులుగా నిర్ధారితులైన ఎంపీలు, ఎంఎల్ఏలు తక్షణమే అనర్హులు కాకుండా రక్షణ కల్పిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ అక్టోబర్ 2న ఉపసంహరించుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు సెప్టెంబర్ 24న కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 3న ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షాభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 3న ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్‌లో పాకిస్థాన్ కొత్త రాయబారిగా సయ్యద్ ఇబ్నే అబ్బాస్ నియమితులయ్యారు. క్రిమినల్ కేసుల్లో రెండేళ్లకుపైన శిక్ష పడిన ప్రజాప్రతినిధులు (ఎంపీ, ఎంఎల్ఏలు) వెంటనే తమ సభ్యత్వం కోల్పోతారని జూలై 10న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. తిరునల్వేలి జిల్లాలోని ఈ కేంద్రం యూనిట్-1 నుంచి విద్యుత్‌ను అక్టోబర్ 22న దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) సొంత 3జీ సేవలను అక్టోబర్ 25న ప్రారంభించింది. దీంతో ఐఏఎఫ్ సిబ్బందికి దేశమంతా కమ్యూనికేషన్ సేవలు వేగంగా, సకాలంలో అందేందుకు అవకాశం ఏర్పడుతుంది. భాక్రానంగల్ డ్యామ్‌ను నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 22న హర్యానాలోని నంగల్‌లో స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు. గుజరాత్‌లోని నర్మదా డ్యామ్ సమీపంలో భారత మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణానికి ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 31న శంకుస్థాపన చేశారు. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తై స్మృతి చిహ్నం కానుంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పేరు పెట్టిన ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు (597 అడుగులు). చైనాలోని హెనాన్‌లో గల ‘స్ప్రింగ్ టెంపుల్ ఆఫ్ బుద్ధ’ 128 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో ఎత్తై విగ్రహంగా గుర్తింపు పొందుతోంది. 60,000 చ.కి.మీ. పరిధిలో విస్తరించిన పశ్చిమ కనుమల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేయాలని కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నవంబర్ 14న కోరింది. ఇందులో భాగంగా మైనింగ్, క్వారీయింగ్, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వంటివాటిని నిషేధించింది. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ భారత్ పర్యటనలో నవంబర్ 14న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. బీహార్‌లోని తూర్పుచంపారన్ జిల్లాలోని కేషరియా వద్ద నిర్మించనున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఆలయానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ నవంబర్ 13న శంకుస్థాపన చేశారు. 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ విరాట్ రామాయణ్ మందిరాన్ని నిర్మిస్తున్నారు. క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండ్కూలర్ యునిసెఫ్ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రాంతీయ ప్రచార కార్యకర్తగా నవంబర్ 21న నియమితులయ్యారు. సహజీవనం నేరం కాదని సుప్రీంకోర్టు నవంబర్ 28న తీర్పులో పేర్కొంది. సహజీవనం చేస్తున్న మహిళలకు, వారికి పుట్టే పిల్లలకు భద్రత, రక్షణకు చట్టాన్ని రూపొందించాలని పార్లమెంటును కోరింది. అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం దక్కింది. గతేడాది కూడా భారత్ ఇదే స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అవినీతి దేశాల జాబితాలో సోమాలియా అత్యంత అవినీతి దేశంగా మొదటి స్థానంలో ఉంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 177 దేశాల జాబితాను డిసెంబర్ 3న విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత తక్కువ అవినీతి దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్ ఉన్నాయి. స్వలింగ సంపర్కం నేరం కాదన్న 2009 నాటి ఢిల్లీ కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్వలింగ సంపర్కం శిక్షించదగ్గ నేరమన్న భారతీయ శిక్షాస్మతిలోని సెక్షన్ 377ను కోర్టు సమర్థించింది. ఈ సెక్షన్ కొనసాగుతున్నంతవరకూ స్వలింగ లైంగిక సంబంధాలను చట్టబద్ధమైనవిగా పరిగణించలేమని కోర్టు డిసెంబర్ 11న తన తీర్పులో అభిప్రాయపడింది. రాజకీయ ఒత్తిళ్ల నుంచి ఉద్యోగస్తులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రవర్తనా నియమావళికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 12న ఆమోదం తెలిపింది. అత్యున్నత స్థాయిలో అవినీతిని నిర్మూలించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటు బిల్లు - 2011కు పార్లమెంట్ డిసెంబర్ 18న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాజ్యసభ డిసెంబర్ 17న, లోక్‌సభ డిసెంబర్ 18న ఆమోదించాయి. ఈ బిల్లు ప్రకారం కేంద్ర స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోక్‌పాల్‌ను ఏర్పాటు చేస్తారు. లోక్‌పాల్ ఏర్పాటైన ఏడాదిలోగా రాష్ట్రాలు లోకాయుక్తలను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా సుష్మాసింగ్ డిసెంబర్ 19న బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి వీకే దుగ్గల్ డిసెంబర్ 23న మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణపై ఏర్పాటైన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో దుగ్గల్ సభ్య కార్యదర్శిగా ప్రముఖ పాత్ర పోషించారు. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక, మతపరమైన వేడుకగా పేరొందిన మహా కుంభ మేళా జనవరి 14న పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమమైన ప్రయాగ (అలహాబాద్)లో ప్రారంభమైంది. ప్రపంచంలో ఒక కార్యక్రమం కోసం అత్యంత ఎక్కువ మంది ఒక్కచోట చేరే వేడుకగా ఇది ఇప్పటికే రికార్డు సృష్టించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వరుసగా ఐదోసారి అసోం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. మొత్తం 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీలో 49 తొలి ప్రాధాన్యత ఓట్లతో ప్రధాని ఎన్నికైనట్లు మే 30న ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రాజస్థాన్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 21న నిర్ణయించింది. రాజధాని జైపూర్‌కు సమీపంలోని సాంబార్ సరస్సు వద్ద 23 వేల ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ ప్రాజెక్ట్ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం సమర్పించిన నివేదికను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013ను డిసెంబర్ 5న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఐదు రాష్ట్రాల శాసనసభలకు నవంబర్, డిసెంబర్లలో జరిగిన ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ (మొత్తం సీట్లు-70): బీజేపీకి 31 స్థానాలు, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి 28 స్థానాలు, కాంగ్రెస్‌కు 8 స్థానాలు దక్కాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ మద్దతుతో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ (సీట్లు-230 ): బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీకి 165, కాంగ్రెస్‌కు 58, ఇతరులకు 7 స్థానాలు దక్కాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఛత్తీస్‌గఢ్ (మొత్తం సీట్లు-90): బీజేపీకి 49, కాంగ్రెస్‌కు 39, ఇతరులకు 2 స్థానాలు లభించాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ డిసెంబర్ 12న వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజస్థాన్ (మొత్తం సీట్లు-200): బీజేపీకి 162, కాంగ్రెస్ 21, ఇతరులు 16 స్థానాలు దక్కాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. మిజోరం (మొత్తం సీట్లు-40): కాంగ్రెస్ పార్టీ 33 సీట్లు, మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) 5 స్థానాలు, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ ఒక స్థానం లభించాయి. మిజోరం సీఎంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లాల్ తన్వాహ్లా డిసెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేశారు.